Tuesday, 23 May 2017

ప్రాంజలి ప్రభ .. శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) సవశతి 
  ...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము
*దృతరాష్ట్రుని ప్రశ్న*
ఉ. ధర్మజు తోడఁ  దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్
కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్
ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా
నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్  (01)
*సంజయ వ్యాఖ్యానము*
ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్
తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్
గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,    
ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్                   (02)...

ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్
బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో 
సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్
యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్      (03)

ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్,
అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్ 
దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్
వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్             (04)

శా .  ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్
సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్ 
భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్ 
ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్            (05)

ఉ. పాండు కుమారులున్ తమరి పాశమునేమది జూపనుండగన్  
పాండవ మధ్యముండు మరి బాల ప్రవీరులు ధర్మ యుద్ధమున్      
కండబలంబునన్ గలిగి గమ్యనిజంబగు ధైర్య వాక్కులన్
నిండుగ యుద్ధవీరులకు నిర్ణయ లక్ష్యము పోరుయేయగున్         (06 )

ఉ. ఎందరు భూసురుల్ కలసి వెల్గుల నెత్తగ జోరుగుండగన్,              
అందరిలోను మిన్నగన నాద్యుగ నీవన విజ్ఞతేయగున్   
సందడి యుద్ధకారణమె సంజయ! యీవిధిఁ జేరగా నగున్
గందర గోళమున్ బడితి గావఁగ నాయకు లౌను సైన్యమున్         (07 )

ఉ. కేరున, భీష్మ, కర్ణ, శృత కీర్తి శతానుడు కుంతి భోజడున్
వీర వికర్ణ విశ్వస వివేకులు మీరును మాన్యు లేయగున్
భూరి శ్రవుండు నీదుసుత భూసుర శ్రేష్ఠులు వీరతేజమున్
వీరులు యేకమై సమయ విద్దెలు గాకురు క్షేత్రయుద్ధమున్            (08)

ఉ. ఇంకను పెక్కుమంది బల హేతుక విద్యల యుద్ధ కౌశ మున్ 
జంకక నన్నుఁ గోరి తమ జాడలుఁ దెల్పియు దేహమొడ్డియున్
వంకలు లేని యుద్ధకళ వాలుగ సిద్ధముఁ దీరి యుండగన్
సంకట మేమిలేకనటు సాయముఁ జేయగ శూర సైనికుల్              (09)

చం. అపరి మితమ్ము సేన తతి యాశయ లక్ష్యముగాను కౌరవుల్
అపజయమేయెరుంగనిటు యర్జును భీష్ముల నిల్వరించగన్
నిపుణత మేలు జూపుచు వినిర్మల పాండవ మూక గెల్వగన్
అపజయమౌను సత్యముయు నాదిగ వాక్కులు నమ్ముసైన్యమున్  (10)

ఉ.కావున మీరు ధైర్యము సకాలము తోడుగ నుండ గల్గగన్
కావగ భీష్ము వెంట నని కార్య విశిష్టత లందు తోడుగన్
నావిజయమ్ములే మొదట నాదగు ధైర్యము సంపదేయగున్
కావున విశ్వసించ గల కార్యము యుద్ధము నిర్ణయమ్ముగన్             (11)

ఉ. భీష్మ సుయోధనా పలుకు ప్రీతిగ నెంచియు యుద్ధ భేరితో 
భీష్మ నినాద విస్మయ విభేద్యము తెల్పగ ధైర్యమే బలమ్
భీష్ముడు సింహనాదమను భీకర శంఖము పూరణార్థముల్  
భీష్ముడు తాను సర్వులకు ప్రేరణ నివ్వగ వ్యూహ మెంచగన్          (12 )

ఉ. అప్పుడె శంఖనాదపు మహారవ తప్పెట శబ్ద భేరులన్
చప్పుడు వాద్యముల్ విను ప్రచారపు భీతినిఁ గల్గఁ జేయగన్
డప్పుల చప్పుడే వినుము డంగగు యుద్ధ కళా సమర్ధతే
గొప్పగ గెల్పుఁ గోరికల కొండలు పిండిగ చేయఁ దల్చగన్                 (13 )

ఉ. తెల్లని వెల్గులన్ రథము తీర్చిన సాధ్యము యుద్ధమేయగున్,
ఉల్లమునన్ కిరీటిగనుచుండగ ధైర్యము పెచ్చరిల్లగన్
నల్లని ధాత కృష్ణుడు సనాతన ధర్మము నిల్ప గల్గగన్,                              
గొల్లున శంఖ రావముల ఘోరనినాదము యుద్ధ విద్యగన్                (14 )

ఉ. కృష్ణుడు  పాంచజన్యమున కృత్యముఁ జేసెను శంఖరావమున్
కృష్ణుని తోడు నర్జునుడు కృత్యకఠోరపు శంఖమూదగన్ 
కృష్ణుని వెంట భీముడును కృత్య మొనర్చగ పౌoడ్ర శంఖమున్
జిష్ణుడితోను పాండవులు చిన్మయ చేష్టల శంఖమూదగన్                (15)

శా . కుంతీపుత్రుడు ధర్మరాజు జయమే కోరాడు భావమ్ము లన్
శాంతమ్ముల్ కదనాంత సాధ్యములనన్ సద్యమ్ము ఘోషించగన్
సాంతమ్మున్ సహదేవుడంతమణిపుష్పాశంఖ మున్ నింపగన్   
కుంతీపుత్రులమేయవిజ్జయములన్ కూర్మిన్ రొదల్ జేయగన్        (16 )

మ. శరవిద్యావిధి నేర్పు పాటవ మహా శౌర్యున్ శిఖండీయనన్
వరపుత్రాదులు సాత్యకీ భుజబలుల్ వారైన కాశీప్రభున్
ధరమాహాత్మ్యములెన్న జేసెడి సుభద్రాపుత్రుడేమార్చగన్
ధరణీతత్త్వముఁ దెల్పగన్ దృపదు శ్వేతాంబాద్య శంఖాలిడెన్     (17)

చం. అపజయమే నెరుంగనిట సాత్యకిసేవ మహా ప్రభున్ సుధీ
ద్రుపద మహాప్రభున్ యపర దూకొను యుద్ధ సమర్ధతల్ సుధీ
స్వపరము యుద్ధ కౌశలము సాగెడి విద్యలుగాను యుద్ధమున్, 
అపర సుధీరమందునను యాసలుగానిటు శంఖమూదగన్             (18)

ఉ ll పాండవ యోధులిట్లనెడి పాటవముల్ పెను శంఖనాదముల్
మెండుగ మిన్నుముట్టిన ప్రమేయపు రోదన భీకరమ్ముగన్
మొండి సుయోధనుం డడరి మూకల వ్యూహము మార్చుచుండగన్
గుండెలు ముక్కలైనసమ గుర్తుగ యుద్ధ నినాదచేష్టలన్...              (19)

ఉ. సోద మనస్కుడై  తెలియు చోద్యములన్ ధృత రాష్ట్రు డీ విధిన్ 
మోదము తోడ పార్ధుడు సమూహముతోడుగ సైన్యమంతటన్
నాదముఁ జేయుచూ ధనుసు నారిబిగించిసమూల మెల్లెడల్  
మీదగు సేన నిల్వలను మీసుతు లెల్లర వీక్ష జేయగన్                    (20)

శా . హేకృష్ణా యనుచున్ కిరీటి పలుకుల్ హెచ్చైన చోద్యమ్ములన్
హేకృష్ణా యెవరెవ్వరీ మొనలనన్ హేయంపు వీక్ష్యమ్ము లన్ 
హేకృష్ణా కదనమ్ముమధ్య నిలుపన్, ఇంపార వీక్షించగన్
హా కృష్ణా మనవీరులన్ యెదుటి వీ రావేశులన్ యుద్ధమున్            (21 )

ఉ. వైరులు నేనుగాగనెద వైనము యేమియు తేల్చగల్గగన్
పోరున నెవ్వరో ననగ బుద్ధిగ నెంచెడి యుద్ధవీరులన్
వారల నెంచ శక్తిగను వాలును వీలును కల్గఁ జేయగన్
సారధి మధ్యనే రథము సాచుము జూచెద నెవ్వరెవ్వరో -              (22)

చం. ఒకపరిచూచెమానసము నొక్క విధమ్మును గాంచ యుద్దమున్
సకల సుయోధనా ప్రియులు సఖ్యపు రాజుల గాంచ యుద్దమున్
నికరపు బుద్దిగూర్చుటకు నిక్కువ మైనది యుద్ధ క్షేత్రమున్
మకతిక రాజులేకలరు మానసమేనుసమమ్ము గాంచెదన్                (23 )

ఉ. దివ్య శతాంగ మెక్కిసువిధేయసుయోధను భీష్మ ద్రోణులన్ 
భవ్య పథమ్మునన్ మలిపి బంధన నీతిని రాజులియ్యడన్
నవ్య పథమ్మునన్  గదలి నమ్మిన వీరుల నెంచగల్గగన్
సవ్యరథమ్మునన్  నిలుపు సాధ్యము జేయుము ముందుగా నిటన్   (24 )

మ. పరికించన్ కదనాంతరమ్మునిటు సంప్రాప్తమ్ము లెన్నన్గడున్                                 
కురువీ రుల్ జయకాంక్షలన్ తలపగా కూర్పౌను నేస్తమ్ములన్
తరుణమ్మే పరమావిధిన్ విజయమే తత్త్వమ్ము వైనమ్ములీ
మరులందే పడి పాండు మధ్యముడు సామర్థ్యమ్ము లెక్కించ గన్   (25 )

ఉ. పిమ్మట పార్ధుడే యుభయ బిందము లందున మేనమామలున్
ముమ్మరసేనలందు గురుమూర్తులు, తండ్రులు, తాతలుండగన్ 
నమ్మిన పౌరులెంచగవినమ్రులు మిత్రులు బంధులుండగన్            
చెమ్మగిలంగ యర్జునుడు చింతన జేయుచు పల్కెనిట్టులన్            (26 )

చం. గురుజన, మేనమామలును, గుర్తుకుఁ దెచ్చెడి బంధు వర్యులన్
వరుసకుసోదరుల్ సుతులుబావలు మామలు, మిత్రులెందరో 
పరిచయనేస్తులన్ గనుము పాశము బంధముగాను చూడగన్
సరిగమ యుద్ధ వీరులనుసారధు లౌను ప్రయుక్త బారులన్              (27 )
*పార్ధుని ప్రార్ధన*
చం.  సమరము సేయ వచ్చిన సుసాధ్య జయమ్మును గోరు రాజులున్
తమతమబంధుమిత్రులు కదాయని నెమ్మ మనమ్ము  క్రుంగగన్ 
మమతను వీడ విజ్ఞతలు మాయగ కయ్యము జేయగాఁ గనన్ 
సమతను జూపలేనివిధి సంగమసాధ్య విషాద హేతువుల్              (28)

మ.  సహబంధాఢ్యుల పోరు సల్ప జయముల్ సాధ్యమ్ము సిద్ధించగన్
సహధాయమ్ముల శోకమేయగుటలో సామ్యమ్ము లేదెందుకో 
సహదేహమ్ము విధేయిగా వణకగా సాగే విశేషమ్ముగన్
సహవాక్కుల్ విన ధైర్యముల్ సడలగా సంగ్రామ మందున్ గనన్ ....  (29)

ఉ. మర్మము తెల్పలేనిగతిమాయల విస్తృత తత్త్వమే యనన్
శర్మద సాక్షిగా మనసు సంగర మార్పుల చిత్తమందగన్
ధర్మపు యుద్ధమే స్థిరము, దారులు వేరుగ లేక నిల్వగన్ 
కర్మల తోడుగా చలన కాలము వ్యర్థము జేయకుండగన్                        (30)

మ.  కనుచుండన్ విభవమ్ము సూచనలనన్ కాలమ్ము కర్మమ్ము గన్
రణరంగాన మదీయ సైన్యము లిలన్ రంజిల్లగా నెల్లెడన్
మనమేగెల్పుల లాభమంద గలుగన్ మాత్రాద్య ప్రశ్నేయగున్
మనసేమాన్యగుణమ్ముగాసకలమున్ మాయాను సారమ్ములన్             (31 )

ఉ. కోరను నేనుగా జయము కూర్మిని బాపెడు యుద్ధమందునన్
కోరను రాజ్యభోగములు కుచ్చిత సౌఖ్యములెన్న హీనముల్ 
కోరను భాగ్యముల్ కదన కోరిక లేదన వాదమెందుకో
పోరును చేయనే ననుచు పూర్తిగ మారితి నేనునేనుగన్                           (32 )

మ. సుకమేధ్యాసగ నెంచుపోరులెనయన్ సూత్రమ్ము లన్ యుద్ధముల్ 
సకలమ్మే భయమేమిలేక నిటులన్ సంగమ్ములన్ బోరగా 
వికసించేయువవీరులేపెనవులన్ విద్యార్థులై తీరగన్
ప్రకటించే పలు వీరులే సమరమున్ ప్రావీణ్య ముల్ నేర్పగన్              (33)

చం. కలహపు యాస లందున వికాస విభావ విజేయముల్గనన్ 
గలరిటమేధసంపదల గమ్యముజూపు మనస్సు శ్రేష్ఠతల్
గలరిట శక్తిమంతులు సగౌరవమొంది రణమ్ము జేయఁగన్
గలరిట నిల్ప యుద్ధపు సకార్య వివేక సుధర్మ కార్యముల్                    (34)

శా . ముల్లోకా లొకటై నఘోర సమరమ్ముల్ ముఖ్య సాధ్యమ్ముగా  
ముల్లోకాలను ధిక్కరించదలచన్ ముప్పేట పోరాటముల్ 
కల్లోలమ్ము విధించు యుద్ధమిదియే కష్టమ్ము లెచ్చించ గన్ 
ఉల్లమ్మున్ కదిలించు రక్త సెలయేరుల్ గుర్తు తెచ్చేవి గా                      (35)

ఉ. చంపుట పాపమంచు మన చెంతన జేరగ బంధు వీరులన్ 
జంపు తలంపులన్ వలదు సంగర మెంచగ దుఃఖమే కదా
తంపులు మానినన్ మనకు దక్కును  బంధుజనమ్ము ప్రాణముల్ 
రంపున ధార్త రాష్ట్రులది రాజ్యము దోచిన పాపమే యగున్                    (36 )

ఉ. చుట్టములౌను కౌరవలు చోద్యము వారిని కయ్యమందునన్
మట్టును బెట్టగా వలదు మానెద యుద్ధపు హింససంగతుల్  
జట్టుల వీరులన్ ప్రతిగ జంపుట మంచిది కాదుపోరునన్  
పట్టున సౌఖ్యముల్ కదన పాటున కోరగ నేలనోఁ గదా  (37 )

ఉ. వీఱ కులక్షయమ్ములగు విగ్రహ విద్యల జేయ మానగన్
శూరుల ధ్యాస రోషముల జూపెడి దుర్బల మానసమ్ములన్
వారి విశేషబంధముల వాద్యపు బుద్దుల మార్పులేక యే 
ఘోరమనన్ రణాంతర నిగూఢ విధానపు కృష్ణతత్త్వమున్    (38 )

మ. జనవాంఛా పరిశోధనా పటిమలన్ జాగ్రత్త చోద్యమ్ము గా
మనచిత్తంబున మంచినెంచగనుటే మార్గమ్ము సాధ్యమ్ముగా
మనబంధుత్వములన్ మధించ గలిగే మర్మమ్ము  తీర్పుల్ గనన్
గుణముల్ దోషపు పాడిగా యగుటచే ఘోరాతి పాపమ్ములన్   (39 )

ఉ. ధర్మము సంతరించనగు దానము జేయక పాపమేయగున్
కర్మల బాధ్యతే క్రియగ కాలమనస్సున వక్రబుద్ధితో 
నిర్మలమైన జీవమున నిత్యముగా కమలాక్షు నేస్తముల్ 
మర్మము మాయలై బరగ మాన్యుల బాటల నెంచ నెప్పుడున్ (40 )

కులమున కర్మ ధర్మముల కూటమి జేయు పరిస్థితుల్ గనన్
బలములు లేని బంధములు భారములై మది జంకు జేయగన్                    
కులములనెంచఁ బాపమన కూరిమి చెందు ఘనంపు చోద్యముల్
తలపులు మారి దోషములు తప్పగ వచ్చు సుఖాల పొందులన్  (41 )

మ. కులసౌకర్యము లేకజీవ సుఖముల్ గూలే విధానమ్ము గాఁ 
గులఘాతన్ బ్రతుకే ప్రకారములుగాఁ గూర్చంగ పోరేలనో    
కులకర్మల్ మరిచే విధిన్  మలుపులం గూర్పన్ సజీవమ్ముగా 
కుల బాధ్యాంతర లెల్ల వేద్యలనగన్ కొట్లాట లింకెందుకో   (42 )

ఉ. కౌరవసేన వీరులకు గర్వపు భావము లేచ్చ యుద్ధమున్ 
ధీరము పెంపు క్రూరమున తీవ్రపు దౌష్ట్యము పొంచియుండగన్
బోరులఁ  ద్రోవలన్ రభస పొంగులు రేపిన రౌద్ర రూపముల్ 
వార భయంబునే వరలు వర్తన వైనము లేమి చెప్పగన్              (43)

మ. కులధర్మానికి నష్టముల్ జరుపగా కోరేటి చిత్తమ్ములన్
కులధర్మాలను శాశ్వతమ్ము లను దృక్కోణమ్ము మూలమ్ములన్ 
కలనమ్మే కుల నాశనమ్మగుట సాకారమ్ము సాగించ గన్
కలకాలమ్ములు ప్రాప్తిగా నరకముల్ కామ్యమ్ము క్షేత్రమ్ముగన్     (44 )

శా. మేథావుల్ దిగి చేయు యుద్ధములనన్ మేలైన మోక్షమ్ములన్,  
ఈ ధర్మాలవనీ విధాన గమనా నీమమ్ము పాపమ్ముగాఁ
భూధర్మమ్ము లనన్ నిధాన ములు సంపూజ్యమ్ము రాజ్యమ్ము గన్ 
బాధల్ యుద్ధములన్ పెనంగ ప్రజ సంపాతమ్ము  సంభావ్యముల్      (45 )

ఉ. ఆయుధ హీనుడై మనసు యాశయ మేవిడువంగ సాధ్యమున్
సాయుధ సేనయుద్ధమున శక్యము జేయగ  శస్త్ర మేలనన్,
ఆయువు వీడనున్నమెయి హార్దపు తోడుగ పోరువద్దనన్ 
మాయ వధింపులన్ సకల మాత్రల శస్త్రము లొప్పకుండగన్  (46 )

ఉ. శోకము లేని మాససము  సోద్యము నంతయు జూడగల్గగన్
శోకముచెంద బందుగుల శూరజనమ్ముల గావ లేకనే 
శోకముతోడుగా రధము చోదకముల్ వదిలేయు సామ్యముల్ 
శోకవిలాపమే కలచు సొక్కుల యుద్ధము మాని వేసెదన్      (47 )

అర్జునవిషాద యోగము " మొదటి అధ్యాయము సమాప్తము
మల్లప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
****

No comments:

Post a Comment