*ఇతరులను నిందించడం ద్వారా ఏమీ సాధించలేము.
*పాశ్చాత్య ప్రపంచపు మోజులో భారతీయ సంస్కృతిని విస్మరించకండి. భారతీయులంతా ఇతర దేశాల వేషభాషలను, ఆహార అలవాట్లను, ఆచారవ్యవహారాలను అనుకరిస్తే మంచిదని క్షణమైనా అనుకోకండి.
*దేవుడు మీ ప్రార్ధనలకు బదులు పలకడం లేదంటే , దానికి కారణం మీకు తగినంత శ్రధ్ధలేకనే. ఒకరిని అనుకరిస్తూ చేసే శుష్క ప్రార్ధనల వల్ల దేవుని గుర్తింపును పొందలేరు. దేవుని చేరే ఏకైక మార్గము పట్టుదలతో క్రమబధ్ధంగా గాఢమైన శ్రధ్ధతో చేసే ప్రార్ధన ఒక్కటే. భయము, ఆందోళన, క్రోధము వంటి ప్రతికూల భావాలు లేకుండా మీ మనస్సుని ప్రక్షాళన చేసుకోండి. అప్పుడు దానిని ప్రేమ, సేవ, ఆనందమయ ప్రతీక్ష భావాలతో నింపుకోండి. మీ హృదయ మందిరంలో ఒకే శక్తి , ఒకే ఆనందం, ఒకే శాంతి ఉండాలి ----- అదే భగవంతుడు.
2) మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్| యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ ||
ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్యభావనను మనసులో నింపుకొనుము.స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము.
🕉️🌞🌏🌙🌟
🕉️🌞🌏🌙🌟
🧘♂️రామాయణ వైభవం🧘♀️
రామ శబ్దం రం అనే ధాతువునుండి ఏర్పడింది. దీని అర్థం రమించుట, ఆనందపడుట, హాయినిచ్చుట. అయనం అనగా కదలుట, నడచుట, పయనించుట. కాబట్టి రామాయణం అంటే రాముని చలనం, గమనం, స్పందనం అని అర్థం. కాబట్టి రామాయణం అంటే కేవం రాముని కథ కాదు, రాముని నడవడికను సూచించేది అని తేలింది. రామ శబ్దంలోని రమణీయతకు ఆయన శబ్దం కమనీయమైన గమనాన్ని, వేగాన్ని జోడిస్తుంది.
రామాయణంలో ప్రపంచంలో రెండు విధాలైన భౌతిక శక్తుల సమ్మేళన మనకు స్ఫురిస్తుంది - స్థితిజ (potential), గతిజ (kinetic). తదేజతి, తన్నైజతి - అది చలిస్తుంది, చలించదు అనే ఉపనిషత్సూక్తి రామాయణంలో ధ్వనిస్తుంది. నిజానికి రాముడు పుట్టింది మొదలు పట్టాభిషేకం వరకు ఆయన జీవితంలో అయనత్వం, నిరంతర నిర్విరామ నియమనిష్ఠ కనిపిస్తుంది. రాముని జననాన్ని వర్ణించగానే వాల్మీకి మహర్షి అదే సర్గలో విశ్వామిత్రుని ఆగమనాన్ని సూచిస్తాడు. పదహారేండ్లు కూడా నిండని పసివయస్సులో క్రూర రాక్ష సంహారం, యాగ సంరక్షణ, అహల్యా శాపవిమోచనం, శివ ధనుర్భంగం, సీతా స్వయంవరం, పెండ్లి చేసుకు రాగానే అడవులకు పయనం, నానా బాధలు, మహర్షుల మన్ననలు, నెలకో నెలవు. చివరకు పర్ణశాల అంటూ ఒకటి ఏర్పడితే కలలో కూడా ఊహించని సీతాపహరణం, తదుపరి అన్వేషణం, సేతుబంధనం, రావణ సంహారం. ఇలా, ఒక్క క్షణం కూడా జీవితంలో స్థాయి, హాయి లేకుండా సత్య ధర్మాలను మాత్రం వదలకుండా సాగిన రాముని జీవన యాత్ర ఒక గొప్ప ఆయనం. అదే రామాయణం. ఇంతటి సంచలనం, సంక్షోభం జరుగుతున్న రాముడు చలించడు, హిమవత్పర్వతంలా ధైర్యంగా నిలబడి అన్నిటినీ సమర్థించుకుంటాడు. అదే రామాయణంలోని రమణీయత.
మరి రాముడి అయనం రామాయణం కదా? అయితే సీతమ్మదేమీ లేదా అని ప్రశ్నించే వారికి సమాధానం. రామాయణం అన్న దానికి రామస్య అయనం, రామాయాః అయనం అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. రామా అనగా సీతమ్మ. ఇదే రామాయణ శబ్దంలోని చమత్కారం. వాల్మీకి తన రచనకు పెట్టుకున్న పేరులోని పరమరహస్యం కూడా ఇదే. మరి సీతమ్మను రామా అని ఎందుకు పిలవరు? అన్న ప్రశ్నకు సమాధానం, స్వయంగా వాల్మీకే రామాయణంలో అనేకమార్లు రామా అన్న శబ్దాన్ని అమ్మను సంబోధించటం ద్వారా తెలిపారు. సుమంత్రుడు దశరథునికి సీతాదేవి గురించి చెప్పిన సందర్భంలో:
బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
రామా రామేహ్యదీనాత్మా విజనేऽపి వనే సతీ
బాలచంద్రునివంటి ముఖముతో శోభిల్లుతున్న సీతమ్మ పసిపిల్లలా (బాలాత్రిపురసుందరిలా) మహారణ్యంలో కూడా దైన్యత లేకుండా నిబ్బరంగా సంతోషంగా ఉంది అంటాడు. ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? రామ పక్కన రాముడుండగా దిగులెందుకు అంటాడు వాక్యవిశారదుడైన వాల్మీకి. ఇక్కడ రామ శబ్దం రామా శబ్దం వెంట వెంటనే జంటగా కనిపిస్తాయి. అందులో కూడా రామ, తరువాత రాముడు. నిజానికి రామాయణానికి వివరణ రామారామయోరయనం రామాయణం (రామా రాముల అయనమే రామాయణం) అని చెప్పటమే సరైనది.
సీతాదేవికి రామచంద్రుని పేరులోనే కాదు, ,తీరులో కూడా సామ్యముంది. హనుమంతుడు లంకనంతా గాలించి చివరకు అశోకవనంలో సీతాదేవి రూపలావణ్యం చూచి నివ్వెరపోతాడు. కారణం ఆమె అతిలోక సుందరి అయినందుకు కాదు, ఆమె ముమ్మూర్తులా రామచంద్రునిలా కనిపించటం వల్ల. ప్రపంచంలో తోబుట్టువులు, తల్లీ పిల్లలు, తండ్రీ బిడ్డలు ఒకలా ఉండటం సహజం. కానీ, ఇక్కడ భార్యాభర్తలు ఒకే రూపున ఉండటం అనేది విశేషం. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే ఆ రాముడే స్త్రీ రూపంలో ఉన్నట్లు గమనించిన ఆంజనేయుడు మనస్సులో ఇలా అనుకున్నాడు:
అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం
రమస్య చ యథారూపం తస్యేయమసితేక్షణా!
ఆ దేవి నిజరూపం - పోలికలు, అవయవములు, వాటి సౌష్టవం అన్నీ ఆ రాముని రూపానికి ప్రతిరూపంగా అన్నట్టుగా ఉంది.
ఎంత అద్భుతం కదా? ఇది ఎలా సాధ్యమైంది? అదే రామాయణంలోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపంలోనే కాదు, గుణగణాల్లో, ఆలోచనల్లో, ఆనందంలో, ఆవేదనలో దేనిలో కూడా వ్యత్యాసం లేదు.
అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం
ఆమె మనస్సు ఆయనలో లీనమైనట్టుగానే ఆయన మనస్సు ఆమె మనస్సులో లయించి ఉన్నదట. ఇలా ఒకరికొరికరు బింబ ప్రతిబింబంగా ఉన్న సీతారాముల ఆత్మ మనశ్శరీర సామరస్యాన్ని చూసి హనుమంతుడు స్థంభించిపోతాడు. సీతారాముల మధ్య ఉన్న ఈ అన్యోన్యతను, అభిన్నతను, అనుబంధాన్ని అక్షరరూపంలో నిరూపించటమే రామాయణ పర్మావధి. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడైతే సీతాదేవి పరమాత్మ యందలి పరమ కళ. ఈ కళ ముల్లోకాలకూ మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.
రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయావాప్నుయాత్ కలాం!
వాల్మీకి మహర్షి యొక్క అంతర్దృష్టి, అంతరార్థం, రామాయణం మహత్తు, సీతారాముల అభేద్య తత్త్వం ఇంతకన్నా విప్పిచెప్పేదేముంది?
***
🧘♂️కొంగుబంగారం – శ్రీరామ నామం🧘♀️
సకల లోకాలలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అంటే రామని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి. రామ నామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం. రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి.
లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ వుంది. రాయిపై ‘రామ’ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ వుంది. ఇదంతా చూస్తూ వున్న రాముడిలో ‘నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే’ అనే ఆలోచన కలిగింది. అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి వేసాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు
అందుకు హనుమంతుడు “రామ” అనే నామం రాసివున్న రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం రాయలేదు కదా! అందుకే మునిగిపోయింది” అని సమాధానం యిచ్చాడు.
అంటే రాముడికంటే కూడా రామనామం మహా శక్తి వంతమైందన్నమాట!
రామాయణం కంటే బలమైన రామనామం
రావణాసుర సంహారానంతరం అయోధ్యనగరం చేరుకుని శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై “రామా! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం ప్రారంభించాడు. ఈ విషయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడికి పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయ్యాడు.
ఇంతలో నారదమహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించడమా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. యిప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో పలికాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.
దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని సృష్టమవుతూవుంది. యుగయుగాలను, సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం – ‘రామనామం’.
అందుకే-
‘రామత్తత్వో అధికం నామ
మితి మన్యా మహేమయమ్
త్వయై కాతౌతారి తాయోధ్యా
నామ్నుతు భువన త్రయమ్
అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం!
‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రంలోని ‘రా’ అనే ఐదవ అక్షరం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ అనే రెండవ అక్షరం కలిస్తే ‘రామ’ అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనామం!
రామ’ అనే పదాన్ని గమనిస్తే ర, మ,లు కలిస్తే (అమ్మ) ‘రామ’ అవుతుంది ‘ర’ అంటే అగ్ని. ‘ఆ’ అంటే సూర్యుడు. ‘మ’ అంటే చంద్రుడు అని అర్థం. అంటే ‘రామ’ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు వున్నాయని చెప్పబడుతూ వుంది. అంతేకాకుండా ‘రామ’ అనే నామంలోని ‘రా’ అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ ‘మ’ అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా ‘రామ’ అనే పదంలోని ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, ‘మ’ అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని ఇందులోని అంతరార్థం.
అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు-
‘శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనాయ తత్తుల్యం
రామనామ వరాననే’
అని పేర్కొన్నాడు. ‘రామ రామ రామ’ అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీ విష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం ‘య’ వర్గంలో ‘రా’ రెండవ అక్షరం కాగా ‘ప’ వర్గంలో ‘మ’ అయిదో అక్షరం. అంటే 2 X 5=10. దీనిని బట్టి ‘రామ’ అనే పదం పది సంఖ్యకు సంకేతం. ఇక మూడుసార్లు అంటే (10 X 10 X 10 = 1000) వెయ్యికి సమానమవుతుంది. అందుకే శివుడు ‘రామ’ అనే నామం మూడుసార్లు పలికితే సహస్త్రనామంతో సమానమని చెప్పినట్లు కథనం.
అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.
కిరాతకుని వాల్మీకిగా మార్చిన రామనామం
వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా’మారా’ అనే మాటకు జపం చేస్తూ కొంతకాలానికి ‘మరా’ అనే పదం ‘రామ’ గా మారింది. ఆయనపై వాల్మీకం(పుట్ట) పెరిగింది. చివరికి నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామ నామ గొప్పదనాన్ని తెలుసుకుని ‘వాల్మీకి’ అయి రామయాణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామ నామం గొప్పది.
శనిబాధలు చేరనివ్వని రామనామం
పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుని సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను వెలిబుచ్చగా “నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగి వున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు” అని సమాధానం యిచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి... నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడిని దరి చేరనీయని శక్తివంతమైన నామం – ‘రామనామం!’ కాబట్టి ‘రామ’ నామాన్ని జపించేవారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్తున్నారు. హనుమంతుని రక్షగా వుంచే రామనామం
‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలి
బాష్ప వారి పరిపూర్ణలోచనం
మారుతీం సమత రాక్షసాంతకం’
అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమల లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం ‘రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది రామనామ సంకీర్తన
‘రామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామనామము రామనామము రామనామము
శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము
దారి నొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామ నామము...’
ఇలా ప్రారంభమై సాగే రామనామ సంకీర్తనను ప్రతిరోజూ ‘ఉభయ’ సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుకుంది. ఎటువంటి సమస్యల నుండి అయినా గట్టెక్కే ధ్యైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.
నామమంత్రం
‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లసార్లు జపించి శ్రీరాముడి దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామ రక్ష!
రామకోటి
‘చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం’
అంటే ‘రామ’ నామాన్ని కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. ‘రామకోటి’ రాయడం అనాది నుంచి మనదేశంలో వున్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటిని రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమినాడు ముగిస్తారు.
🕉🌞🌏🌙🌟🚩
🧘♂️శ్రీరామనవమి శుభాకాంక్షలు🧘♀️
ఈ రోజు శ్రీరామనవమి. అనగా శ్రీరాముడు జన్మదినం. మరియు వివాహం అయిన రోజు,మరియు పట్టాభిషేకం జరుపుకున్నకున్న దినం.
శ్రీరాముడు దశరథుని పుత్రుడు. దశరథునికి పుట్టిన సంతానమే శ్రీరాముడు.
దశరథుడు అంటే అర్ధం :-
దశ అంటే 10. రధుడు అంటే ఎక్కిన వాడు. ఏమి ఎక్కిన వాడు? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి 10. అంటే తాను ధ్యాన స్థితిలో ఉంటూ తనయొక్క 10 ఇంద్రియాలను నియంత్రించి సాధించిన వరమే శ్రీరాముడు. అంటే పరమాత్మను పొందగలిగినాడు..... ప్రతీ ఒక్కరం ఆ స్థితికి రావాలి.
సీతమ్మ అంటే ఆత్మ పదార్థం. తాను ధ్యాన స్థితిలో ఉండి పరమాత్మను అంటే భగవంతుడుని శ్రీరాముని రూపంలో పొందగలిగినది.
ఆత్మ పరమాత్మల కలయికే సీతారాముల కలయిక. పరమాత్మ లేకుండా ఆత్మ ఉండలేదు, ఆత్మ లేకుండా పరమాత్మ ఉండలేడు.
ఆత్మ పదార్థమైన సీత పరమాత్మ ఎక్కడ ఉంటే ఆత్మ అక్కడే ఉండగలదు. అందుకే పరమాత్మ అడవులకు వెళ్ళేటప్పుడు ఆత్మ స్వరుప మైన సీత రాముని వెంట వెళ్లగలిగినది.కానీ ఆత్మ స్వరూపమైన సీత మనస్సుతో కలిసి మాయలో పడి బంగారు లేడి కావాలని కోరింది. అంటే ఇక్కడ పరమాత్మ నుండి దూరం అయింది. మాయకు లోబడింది... కోర్కెల సంకెళ్ళలో చిక్కుకుంది. పరమాత్మను ప్రక్కకు పంపింది.మాయలో చిక్కుకుంది., దశకంఠుడు చేతికి చిక్కింది.
ఇక్కడ దశకంఠుడు అంటే రావణాసురుడు.ఇతను మాహా జ్ఞాని, మాహా శివ భక్తుడు, బ్రహ్మ నుండి వానరం, మనిషి తప్పా ఇక దేని నుండి చావు ఉండకూడదు, అని వరం కోరుకున్నాడు.
ఇక్కడ అతని దృష్టిలో వానరం, మనిషి ఒక్కటే... వాటివల్ల అతనికి హాని కలగదు, అని భ్రమించినవాడు. అందుకే అలా వరం కోరుకున్నాడు. ఇక దశకంఠుడు అంటే 10 ముఖములు కలిగినవాడు అని అర్థం.దశకంఠుడు అంటే 10 ఇంద్రియములు గల 10 ముఖములు కలిగినవాడు. యోగులు తమ 10 ఇంద్రియములను , తాబేలు తన తలను తనలోనికే ఎలా ముడుచుకుని ఉంటుందో ,
యోగులు తమ ఇంద్రియములను అదుపులో ఉంచుకుని ఉంటారు.ఇక్కడ దశకంఠుడు తన ఇంద్రియములను బాహాటంగా బయట పెట్టి తాను పొందవలసిన ఆనందాన్ని పొందుతూ,అహాన్ని ప్రదర్శిస్తూ, అందరినీ భాదపెడుతు జీవించేవాడు. అటువంటి వాని చేతిలో ఆత్మ స్వరూపమైన సీత చిక్కుకుంది.
పరమాత్మను దూరం చేసుకుంది.
ఆత్మ స్వరూపమైన సీత వంటరిగా అశోక వనంలో అశోక వృక్షం క్రింద కూర్చుని తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహిస్తూ, తన యొక్క పరమాత్మ కోసం తాను పరితపిస్తూ, నిరంతర ధ్యానంలో ఉండగా,,, పరమాత్మ తన ఆత్మ స్వరూపం కోసం పరితపిస్తూ, వానరం అయిన హనుమను సీత జాడ తెలుసుకుని తనకోసం వస్తున్నాను , తనని సిద్ధంగా ఉండమని , కార్యం అప్పగించగా సీత జాడ తెలుసుకుని సీతకు భగవంతుని పొందే మార్గంలో సహాయం చేయగా శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి సీత వద్దకు రాముడే వచ్చి సీతను అగ్నిప్రవేశం చేయించి తనతో అయోధ్యకు తీసుకు వెళ్ళడం జరిగింది.
ఇక్కడ హనుమ వాయు పుత్రుడు. వాయువు అంటే గాలి... హనుమ వానరం. ఇక్కడ మనస్సు కూడా వానరమే ... ఎక్కడ ఒక్క చోట నిలబడదు. అటువంటి వానరాన్ని సహాయం చేసుకుని సీత తనలో తాను శ్వాస మీద ధ్యాస పెట్టీ, ధ్యానం చేయగా అంటే అదే పనిగా శ్వాస సహాయంతో భగవంతుని పొందడం జరిగింది.
అలా అనడం కంటే పరమాత్మే తన ఆత్మ వద్దకు వచ్చాడు, అని చెప్పవచ్చు. భక్తుని వద్దకు భగవంతుడే దిగి వస్తాడు... ఎవరైతే యోగం చేసి యోగిగా మారుతాడో అటువంటి వాని వద్దకు భగవంతుడే దిగి వస్తాడు.
ఇక్కడ సీతను అగ్ని ప్రవేశం చేయించడం అంటే సీత యొక్క యోగ స్థితిని ప్రపంచానికి చూపడం...
ఈ విధంగా రామాయణ గాథ ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉంది.
రామాయణాన్ని చదవడం, అర్థం చేసుకోవడం భగవంతుని సాన్నిధ్యంలో ఉండడం , ప్రతీ మనిషి చేయవల్సిన కార్యం.మానవులంతా ఏదో ఒక రోజుకి ఈ విషయం తెలుసుకోవాలి... ఎప్పుడో చేయవలసినది, ఇప్పుడే చేస్తే అందరికీ ఎంతో మేలు జరుగుతుంది.
అంతే కానీ గుడికి వెళ్ళడం, కొబ్బరికాయ, కొట్టడం, పానకం త్రాగడం, వడ పప్పు తినడం కాదు ఈ రోజు చేయవలసినది....
ఈ రోజుని నిజమైన రోజుగా మార్చుకుందాం... పరమాత్మ స్వరూపమైన శ్రీరామునితో కూడి ఉందాము.
***
🧘♂️శ్రీరామ కవచం 🧘♀️
అగస్తిరువాచ:-
ఆజానుబాహుమరవిందదళాయతాక్ష- -మాజన్మశుద్ధరసహాసముఖప్రసాదమ్ ।
శ్యామం గృహీత శరచాపముదారరూపం
రామం సరామమభిరామమనుస్మరామి ॥ 1 ॥
అస్య శ్రీరామకవచస్య అగస్త్య ఋషిః అనుష్టుప్ ఛందః సీతాలక్ష్మణోపేతః శ్రీరామచంద్రో దేవతా శ్రీరామచంద్రప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
అథ ధ్యానం:-
నీలజీమూత సంకాశం విద్యుద్వర్ణాంబరావృతమ్ ।
కోమలాంగం విశాలాక్షం యువానమతి సుందరమ్ ॥ 1 ॥
సీతాసౌమిత్రి సహితం జటాముకుట ధారిణమ్ ।
సాసితూణధనుర్బాణపాణిం దానవమర్దనమ్ ॥ 2 ॥
యదా చోరభయే రాజభయే శత్రుభయే తథా ।
ధ్యాత్వా రఘుపతిం క్రుద్ధం కాలానలసమప్రభమ్ ॥ 3 ॥
చీరకృష్ణాజినధరం భస్మోద్ధూళిత విగ్రహమ్ ।
ఆకర్ణాకృష్టవిశిఖ కోదండభుజ మండితమ్ ॥ 4 ॥
రణే రిపూన్ రావణాదీంస్తీక్ష్ణమార్గణవృష్టిభిః ।
సంహరంతం మహావీరముగ్రమైంద్రరథస్థితమ్ ॥ 5 ॥
లక్ష్మణాద్యైర్మహావీరైర్వృతం హనుమదాదిభిః ।
సుగ్రీవాద్యైర్మాహావీరైః శైలవృక్షకరోద్యతైః ॥ 6 ॥
వేగాత్కరాలహుంకారైర్భుభుక్కారమహారవైః ।
నదద్భిః పరివాదద్భిః సమరే రావణం ప్రతి ॥ 7 ॥
శ్రీరామ శత్రుసంఘాన్మే హన మర్దయ ఖాదయ ।
భూతప్రేతపిశాచాదీన్ శ్రీరామాశు వినాశయ ॥ 8 ॥
ఏవం ధ్యాత్వా జపేద్రామకవచం సిద్ధిదాయకమ్ ।
సుతీక్ష్ణ వజ్రకవచం శృణు వక్ష్యామ్య నుత్తమమ్ ॥ 9 ॥
అథ కవచం:-
శ్రీరామః పాతు మే మూర్ధ్ని పూర్వే చ రఘువంశజః ।
దక్షిణే మే రఘువరః పశ్చిమే పాతు పావనః ॥ 10 ॥
ఉత్తరే మే రఘుపతిర్భాలం దశరథాత్మజః ।
భ్రువోర్దూర్వాదలశ్యామస్తయోర్మధ్యే జనార్దనః ॥ 11 ॥
శ్రోత్రం మే పాతు రాజేంద్రో దృశౌ రాజీవలోచనః ।
ఘ్రాణం మే పాతు రాజర్షిర్గండౌ మే జానకీపతిః ॥ 12 ॥
కర్ణమూలే ఖరధ్వంసీ భాలం మే రఘువల్లభః ।
జిహ్వాం మే వాక్పతిః పాతు దంతపంక్తీ రఘూత్తమః ॥ 13 ॥
ఓష్ఠౌ శ్రీరామచంద్రో మే ముఖం పాతు పరాత్పరః ।
కంఠం పాతు జగద్వంద్యః స్కంధౌ మే రావణాంతకః ॥ 14 ॥
ధనుర్బాణధరః పాతు భుజౌ మే వాలిమర్దనః ।
సర్వాణ్యంగులి పర్వాణి హస్తౌ మే రాక్షసాంతకః ॥ 15 ॥
వక్షో మే పాతు కాకుత్స్థః పాతు మే హృదయం హరిః ।
స్తనౌ సీతాపతిః పాతు పార్శ్వం మే జగదీశ్వరః ॥ 16 ॥
మధ్యం మే పాతు లక్ష్మీశో నాభిం మే రఘునాయకః ।
కౌసల్యేయః కటీ పాతు పృష్ఠం దుర్గతినాశనః ॥ 17 ॥
గుహ్యం పాతు హృషీకేశః సక్థినీ సత్యవిక్రమః ।
ఊరూ శారంగధరః పాతు జానునీ హనుమత్ప్రియః ॥ 18 ॥
జంఘే పాతు జగద్వ్యాపీ పాదౌ మే తాటకాంతకః ।
సర్వాంగం పాతు మే విష్ణుః సర్వసంధీననామయః ॥ 19 ॥
జ్ఞానేంద్రియాణి ప్రాణాదీన్ పాతు మే మధుసూదనః ।
పాతు శ్రీరామభద్రో మే శబ్దాదీన్విషయానపి ॥ 20 ॥
ద్విపదాదీని భూతాని మత్సంబంధీని యాని చ ।
జామదగ్న్యమహాదర్పదలనః పాతు తాని మే ॥ 21 ॥
సౌమిత్రిపూర్వజః పాతు వాగాదీనీంద్రియాణి చ ।
రోమాంకురాణ్యశేషాణి పాతు సుగ్రీవరాజ్యదః ॥ 22 ॥
వాఙ్మనోబుద్ధ్యహంకారైర్జ్ఞానాజ్ఞానకృతాని చ ।
జన్మాంతరకృతానీహ పాపాని వివిధాని చ ॥ 23 ॥
తాని సర్వాణి దగ్ధ్వాశు హరకోదండ ఖండనః ।
పాతు మాం సర్వతో రామః శారంగబాణధరః సదా ॥ 24 ॥
ఇతి శ్రీరామచంద్రస్య కవచం వజ్రసమ్మితమ్ ।
గుహ్యాద్గుహ్యతమం దివ్యం సుతీక్ష్ణ మునిసత్తమ ॥ 25 ॥
యః పఠేచ్ఛృణు యాద్వాపి శ్రావయేద్వా సమాహితః ।
స యాతి పరమం స్థానం రామచంద్ర ప్రసాదతః ॥ 26 ॥
మహాపాతకయుక్తో వా గోఘ్నో వా భ్రూణహా తథా ।
శ్రీరామచంద్రకవచ పఠనాచ్ఛుద్ధిమాప్నుయాత్ ॥ 27 ॥
బ్రహ్మహత్యాదిభిః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః ।
భో సుతీక్ష్ణ యథా పృష్టం త్వయా మమ పురాః శుభమ్ ।
తథా శ్రీరామకవచం మయా తే వినివేదితమ్ ॥ 28 ॥
ఇతి శ్రీమదానంద రామాయణే మనోహరకాండే సుతీక్ష్ణాగస్త్యసంవాదే శ్రీరామకవచమ్ ॥
**
#ఎందరోమహానుభావులు
తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి సందర్భంగా💐✒️
జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు. తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి,అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు........
*ఉత్తమమైన కవిత్వం అలవడితే.....*
ఉత్తమమైన కవిత్వం అలవడితే. సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమ పదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.
*కవులకు మీసాలెందుకని......*
తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!
దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
*అష్టావధాన, శతావధానాలు:*
తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.
*సామాన్యులు సైతం పులకించే సాహిత్యం అందించి ప్రజలలో మంచి చైతన్యం నింపిన మహనీయులు తిరుపతి వేంకటకవులు. ఆ కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు.*
*బాల్యం:*
దివాకర్ల తిరుపతి శాస్త్రి ప్రజోత్పత్తి సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి బుధవారం అనగా 1872 మార్చి 26న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.
తిరుపతిశాస్త్రి గారు పోలవరం రాజాగారి ఆస్థానంలో పండితునిగా ఉన్నారు.
*జంట కవులు:*
మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.
*జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.*
*వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.*
చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్న సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.
*కారణజన్ములు..*
ఈ జంటకవులు కారణజన్ములు. తమ కవితాధారా స్రవంతులతో తెలుగు సాహిత్యపు మాగాణములను సస్యశ్యామలం చేసిన మహానుభావులు. “అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యం గల్గు దేశంబునన్....” అంటే తెలుగు నేల నాలుగు చెరగుల అవధాన దిగ్జయ యాత్రలు సలిపిన వారు..
*అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే.....*
అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.
ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!
*అవధానాలలో ప్రత్యేకత:*
వీరి అవధానాలలో అతి ప్రత్యేకమైనఝ విశేషమేమంటే, పద్యంలో మొదటి రెండు పాదాలు ఒకరు చెబితే, చివరి రెండు పాదాలు మరొకరు చెప్పేవారు. భౌతికంగా వారు ఇరువురైనప్పటికీ, మానసికంగా ఒక్కరే, అని అర్ధం చేసుకోవచ్చు! అలా వారు చెప్పిన పద్యాలు, వ్యాకరణ దోషాలు లేకుండా, నాలుగు పాదాలు ఒకరు చెప్పినట్లే అతికేవి. ఒకసారి వ్రాసిన పద్యాన్ని తిరిగి చూసుకుంటే, దానిలో ఎటువంటి తప్పులుండేవి కావు. వీరిద్దరూ బందరులో నిర్వహించిన అష్టావధానాలు, శతావధానాలు తెలుగు సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
*సన్మానాలు:*
ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.
పోలవరం జమీందారు వారి ప్రతిభను గురించి తెలిసికొని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంధాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు.
*పాండవ ఉద్యోగ విజయాలు:*
పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై కూర్చోపెట్టిన ఘనత వీరిదే
సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.
*డాక్టర్ మీగడ రామలింగ స్వామి 1993లో తిరుపతి వేంకట కవుల పాండవ నాటక చక్రం - పరిశీలనాంశం" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు.*
దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మధుమేహం వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించారు.
వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ.వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు,ఎ. కోటేశ్వరరావు మొదలైనవారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.
*బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.*
........

No comments:
Post a Comment