Tuesday, 7 May 2024

 వయసు పెరిగితే మనకేమీ కొత్తగా కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.

”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.

చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.

అప్పడు చలం…  “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు.     ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో  కొంత విజయం సాధించాలి.

వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.

ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?

మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.

కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా   ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు….            శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.

మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ.

ఏం వదిలివేయాలో చూద్దాం.

”అమ్మాయీ గ్యాసు కట్టేసావా....
గీజర్ ఆఫ్ చేసావా...
ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..
పాలు ఫ్రిజ్ లో పెట్టావా....
...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.

”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు
వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..
కష్టనష్టాలు కూడా వాళ్ళవే.

ఎవరితో ఏపనీ చేయించుకోకుండా  ప్రతీపనీ మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా..

నా అభిప్రాయం ఏమిటంటే…  అని అనటం తగ్గించి.. నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.

నాకూ తెలుసు తో పాటు. నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ  నాకంటే ఎక్కువ తెలుసు  కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.

మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు.  ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్ కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. బాబోయ్.. ఎందుకు అడిగామా  అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.

కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం.

పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.

అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...జిహ్వచాపల్యం  తగ్గించుకుని.అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించటంలేదు అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.

ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.

హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.

రోజూ అనుకుందాం ఇలా...
I love my self.
I respect my self.
మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.

మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా...

మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య. అనే  భావం కనిపించాలో...లేక అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా.. అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.
             🙏🙏🙏
…..రూపాయ్ ….

మొన్నామధ్య మా మిత్రులు విశ్రాంత ఉపాధ్యాయులు ( మంచికవి,అష్టావధాని)  వొకరు మాయింటికి వొచ్చారు. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం.  వాళ్ళు ఈమధ్య చూసిన కర్ణాటకలో వున్న హరిహరేశ్వర (శివుడు, నారాయణుడు) దేవాలయం గురించి చెప్పారు. ఆ ఫోటో కూడా చూపించారు.అచ్చు అర్ధనారీశ్వర (శివుడు, నారాయణి) రూపంలా వుంది. అప్పుడు
శైవం, వైష్ణవం..మధ్య చెలరేగిన స్పర్ధలు, అటుపై ఆదిశంకరులు పంచాయతనం పద్ధతి ప్రవేశపెట్టి అటు శైవ, వైష్ణవులకే కాకుండా సౌర, గాణపత్య, శక్తేయులకు ఆమోదయోగ్యం చేసి వాళ్ళ వాళ్ళ మధ్య వున్న స్పర్ధలని తొలగించడంగురించి మాట్లాడు కున్నాం.

మాటల్లో ఈ రోజుల్లో వొచ్చిన  కొత్త కొత్త పీఠాలు, పీఠాధిపతుల, స్వాముల పద్ధతులు చర్చించు కుంటోంటే ఆయన అన్నారు.. అసలు శివ కేశవుల మధ్య ఈ భేదాన్ని ఎందుకు తీసుకువస్తున్నారో తెలియటంలేదు.. ఇన్ని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు చదివి, వాటిపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పే   పీఠాది పతులు, స్వాములు కూడా…ఓపక్కని

"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః.
యధాశివమయో విష్ణు రేవ్వం విష్ణుమయశ్శివః,
యధాంతరం న పశ్యామి తధామే స్వస్తిరాయుషి."
(శివుడు విష్ణురూపము. విష్ణువు శివరూపము. శివుని హృదయం విష్ణువు. విష్ణు హృదయం శివుడు. శివుడు విష్ణుమయము. విష్ణువు శివమయము. వీరిమధ్య భేదము చూడని నా ఆయుస్సునకు భద్రముండుగాక. భేదమును చూచానో నా ఆయుస్సునకు ముప్పే" అని అర్థము.)

అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నా…అని చాలా వాపోయారు. నా బుర్రలో వొక ఆలోచన వొచ్చింది. మాస్టారు మళ్ళీ యింకోసం అనండి ఆ శ్లోకం అన్నా. అన్నారు. అప్పుడు అన్నా ఆ శ్లోకంలో  common గా వున్నది చూసారా.. “రూపాయి”...అదే ఇప్పుడు కొంపముంచుతోంది. శివ,కేశవుల  రూపాలకు తిలోదకాలు ఇచ్చేసి రూపాయి చుట్టూ తిరుగుతూ  ” పైసామే పరమాత్మ “ అన్నది నిజం చేస్తున్నారని అనుకుని నవ్వుకున్నాం.

అవును మరి కాలం మారినా, దేశం మారినా, దేశస్థులు మారినా మారనిది పరమేశ్వరుని రూపంకాదు.. రూపాయి..

ఈ జరిగినది ఆలోచిస్తోంటే.. పోతన గారి పద్యం గజేంద్రమోక్షంలో ది గుర్తుకు వొచ్చింది

“లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.”

ఆ ఏకాకృతిని వెలిగేది మన భాషలో అదే రూపాయ్ అనుకుంటా…ఈ హడావిడిలో పాపం శివ, కేశవులు మాయమై పోయారు.😃😃😃😃

మీ
ఆకెళ్ళ శ్రీనివాసరావు
17-02-2024.
పాడ్యమి: అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత – వినాయకుడు.
వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత – నాగ దేవత.
వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత – సూర్య భగవానుడు.
వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత – అష్టమాత్రుకలు.
వ్రత ఫలం – దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత – దుర్గాదేవి.
వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత – కుబేరుడు.
వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత – విష్ణువు.
వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత – ధర్ముడు.
వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత – రుద్ర.
వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు – పితృదేవతలు.
వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత – చంద్రుడు.
వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
******
64 విద్యలు(కళలు)అంటే ఏవి.......!!
మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో
64 కళలు లేక 64 విద్యలు ఉన్నాయని.
అవేమిటో ఇప్పుడు చూద్దాం.

మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం....

వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన

కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న
పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ,

మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద,

రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష,
వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన

వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక
యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ

చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా
చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన

వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య
చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య
విద్వజ్ఞాన విద్యోతితే.

అర్థము:

1. వేదములు..


ఋగ్వేదము,
యజుర్వేదము,
సామవేదము
అధర్వణవేదము అను నాల్గు.

2. వేదాంగములు-..


వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు

1. శిక్షలు


2. వ్యాకరణము


3. ఛందస్సు


4. జ్యోతిషము


5. నిరుక్తము


6. కల్పములు


అని వేదాంగములు. ఆరు శాస్త్రములు.

3. ఇతిహాసములు -


రామాయణ,
మహాభారత,
భాగవతం...పురాణాదులు

4. ఆగమశాస్త్రములు-


1. శైవాగమము


2 పాంచరాత్రాగమము

3. వైఖానసాగమము


4 స్మార్తాగమము
అని ఆగమములు నాల్గు.

5. న్యాయము:..


తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు :


సాహిత్యశాస్త్రము

7. నాటకములు

8. గానము (సంగీతం)

9. కవిత్వము..


ఛందోబద్ధముగ పద్యమును గాని శ్లోకమునుగాని రచించడము

10. కామశాస్త్రము

11. ద్యూతము (జూదమాడడము):


జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి.
వీనికే అక్షసూక్తమనియునందురు.
కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములు గలవు.
ఇదియు నొకకళ,

12. దేశభాషాజ్ఞానం

13. లిపికర్మ=


దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.

14. వాచకము =


ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు

15. సమస్తావథానములు:


అష్టావధాన,
శతావధాన,
నేత్రాథానాది,
అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము=


ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై
ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,

17. శకునము=


ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు,
ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి,
గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము

18. సాముద్రికము=


హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి
శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము

19. రత్నపరీక్ష=


నవరత్నాల గురించి వాటి ప్రభావం,
వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం

20. స్వర్ణపరీక్ష=


బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము=


గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము

22. గజలక్షణము=


ఏనుగులకు సంబంధించిన జ్ఞానము

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము

24. పాకకర్మ= వంటలు

25. దోహళము=వృక్షశాస్త్రము

26. గంధవాదము =


వివిధములైన సువాసన వస్తువులు అత్తరు
పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు

27. ధాతువాదము =


రసాయన వస్తువులు నెరుంగు విద్య

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .

29. రసవాదము -


పాదరసము మొదలైన వానితో బంగారు
మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.

31. జలస్తంభన -


నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య

33. ఖడ్గస్తంభన -


శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు
విద్య

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.

40. కాలవంచనము -


కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు
గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పు.

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి

45. లాపుకర్మ -


పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.

47. మృగయా - వేటాడు నేర్పు

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.

49. అద్మశ్యకరణీ -


పరులకు కానరాని రితిని మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.

51. చిత్ర - చిత్రకళ

52. లోహా - పాత్రలు చేయి నేర్పు

53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.

54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు

55. దారు - చెక్కపని

56. వేళు - వెదరుతో చేయు పనులు

57. చర్మ - తోళ్ళపరిశ్రమ.

58. అంబర - వస్త్ర పరిశ్రమ

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము

63. దృష్టివంచన - అంజనవంచన -


చూపులతో ఆకర్షణము

64. పాదుకాసిద్ధి -


ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి
ఇంద్రజాలములనెడు గారడీవిద్యలు..!
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

TGHC:  తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు
తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్‌, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్‌,  కంప్యూటర్‌ అపరేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ పోస్టుల కోసం  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 1673, వాటిలో 1277 టెక్నికల్, 184 నాన్-టెక్నికల్ , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద 212 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు - ఖాళీలు
తెలంగాణ హైకోర్టు పరిధిలో

1. కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌:  12


2. కంప్యూటర్‌ అపరేటర్‌: 11


3. అసిస్టెంట్: 42


4. ఎగ్జామినర్‌: 24


6. టైపిస్ట్: 12


7. కాపిస్ట్: 16


8. సిస్టమ్‌ అనలిస్ట్: 20


9. ఆఫీస్‌ సబార్డినేట్ : 75


మొత్తం పోస్టుల సంఖ్య: 212
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో
☞ నాన్‌ - టెక్నికల్: 1277
☞ టెక్నికల్: 184
మొత్తం పోస్టుల సంఖ్య: 1461
మొత్తం ఖాళీలు: 1673
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 34 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష,  మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్‌ ఇంగ్లిష్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-01-2025
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31-01-2025
పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్‌ టెక్నికల్ పోస్టులకు జూన్‌ 2025

*🔱 అంతర్యామి 🔱*

*# ప్రాణస్నేహితులు*

సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు. కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతఃకాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.

🍁స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడగలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.

🍁స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహసౌదానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించేవారే ప్రాణ స్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతోమందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తుల తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.

# " నీకు నేనున్నాను. నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్టవంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.

🍁నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు.
మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.

🍁తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచుకోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.🙏
*****
🙏🙏🙏🌹🌹🌹
మహాకుంభమేళా 2025 లో జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే.....

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా ఏఏ ప్రాంతాల్లో ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నిర్వహించారు.

పుణ్యస్నానాలు- తేదీలు

మొదటి పుణ్యస్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.

జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు.

జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.

ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్యస్నానాలు చేయనున్నారు.

ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు చేయున్నారు.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు.

మహాకుంభమేళాలో పుణ్యస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్‌లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణిసంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

పుణ్యస్నానాలు- ప్రాంతాలు

ప్రయాగ్‌రాజ్‌....
యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.

హరిద్వార్....
కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగానది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్‌ను తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.

నాసిక్....
నాసిక్‌లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

ఉజ్జయిని...
ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన ఉంది.
🌹🌹🌹🙏🙏🙏

539. 'శ్రుతిః' 

వేదరూపిణి శ్రీమాత అని అర్ధము. వేద మనగా తెలియదగినది. ఏది తెలిసిన మరి తెలియ వలసిన దేదియు వుండదో దానిని వేద మందరు. అట్టి వేదమును ఒక రూపముగ నూహించినచో వేదమాత అనగా నేమో తెలియును. వేదరూపిణి అనగా నేమో తెలియును. తెలియకోరువాడు, తెలియ వలసినది, తెలుసుకొను కార్యము మూడునూ దేనినుండి దిగివచ్చుచున్నవో అది వేదము. కర్త కర్మ క్రియలకు మూలము వేదము. మూల ప్రకృతికి, కాలమునకు కూడ మూలము వేదము. సమస్తము పుట్టుకకు మూలము వేదము. దానినే తత్ అనిరి. బ్రహ్మము అనిరి. వేదము అనిరి.

వేదము నుండియే ప్రథమ సంకల్పము ఏర్పడును. కాలము ఏర్పడును. ప్రకృతి పురుషులు ఏర్పడుదురు. మహదహంకారము, త్రిగుణములు యేర్పడును. త్రిగుణముల నుండి సృష్టిజీవులు, లోకములు యేర్పడును. పంచభూతాత్మక సృష్టి యేర్పడును. ఇట్లు అన్నిటికి మూల మేదియో తెలియుట వేదములు తెలియుట, బ్రహ్మమును తెలియుట, తత్త్వమును తెలియుట. ఈ తత్త్వము ఏమియూ లేనట్లుగ యుండును. చోటువలె యుండును. అందుండి క్రమముగ అన్నియూ యేర్పడును. ఏర్పడిన వాటి కన్నిటికినీ కాలపరిమితి యుండును. కాని ఆ తత్త్వము మాత్రము కాలమునకు కూడ మూలమై యుండును.

తత్త్వమును యెట్లుండునో తెలియ గోరువారు దానిని గూర్చి తపస్సు చేసి, తపస్సు ద్వారా దాని లోనికి కరిగిపోవుదురు. తిరిగి తాముగ నేర్పడినపుడు దానిని వివరించలేరు. తాము దానియందు కరగిపోయినపు డది యెట్లుండునో తమకునూ తెలియదు. యిట్లుండునని యెవరును వర్ణింపలేరు. అట్టి వేదమును నిర్వచించుట దుర్లభము. అది అనిర్వచనీయము. దానికి నామము లేదు. రూపము లేదు. లింగము లేదు. అనగా చిహ్నము లేదు. అది స్త్రీ కాదు. పురుషుడు కాడు. నపుంసకుడునూ కాడు. సృష్టిలో తెలియబడు ఏ వస్తువుతోనైననూ దానిని పోల్చలేము.

తత్త్వమును వివరించ లేమని, దానిని గూర్చి తర్కించ లేమని, దాని నుండి దిగి వచ్చిన వారిని గూర్చి తెలియుట, వివరించుట నుండునని పెద్దలు పలుకుదురు.  దాని యందు యిమిడి యుండుట సాధ్యమని అంతకు మించి ఏదియూ సాధ్యము కాదని కూడ తెలుపుదురు. అట్టి అనిర్వచనీయము, అవిజ్ఞేయము, అప్రతర్క్యము, అనామకము, అరూపకము, అయిన తత్త్వమునకు రూప మిచ్చునది శ్రీమాత. అనగా ఆ తత్త్వమే తన రూపముగా గలది శ్రీమాత అని తెలియవలెను. సృష్టి యందు దైవము ఆమెయే. సృష్టికావలి దైవము వెలుగై రూపము ధరించినపుడు శ్రీమాతగ దర్శన మిచ్చును.

విశ్వవ్యాప్తమై కోటానుకోట్లు సూర్యకాంతిగ వర్ణింపలేని అందముతో, శోభలతో, శక్తులతో నుండు శ్రీమాత రూపమే తుది దర్శనము. అటుపై దర్శనము లేవు. అట్టి శ్రీ తత్త్వము సంకల్పముగను, ప్రాణ స్పందనముగను, క్రియా రూపముగను అవతరించు చుండును. వీనినే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అందురు. ఆమె సంకల్ప వివరమే ఋగ్వేదము. ఆమె స్పందనాత్మక గానమే ప్రాణము. అదియే సామవేదము. ఆమె క్రియా చాతుర్యమే యజుర్వేదము. ఇచ్ఛా, జ్ఞాన, క్రియల ఫలమే అధర్వణ వేదము.

జీవుల యందు కూడ సంకల్పము లేర్పడును. అది ఋగ్వేద ఫలము. ప్రాణ స్పందనముగ సామగానము సాగుచుండును. అది జీవుల యందలి సామవేదము. జీవులు క్రియాధీనులై కార్యములు చేయుచుందురు. ఇది వారొనర్చు యజుర్వేదము. ఇట్లు మూడు వేదములు నిత్యము నిర్వర్తింపబడుతున్నవి. ఈ మూడింటి నిర్మలత్వమును బట్టి అధర్వ వేదముగ వారి జీవితము లేర్పడుచుండును. మూడునూ నిష్కల్మషము లైనపుడు, జీవితము దివ్య వైభవముతో కూడి యుండును. కల్మషములు హెచ్చుతగ్గులను బట్టి వైవిధ్యము లేర్పడు చుండును.

కల్మషములు యొక్క హెచ్చుతగ్గులను బట్టి వైవిధ్యము లేర్పడు చుండును. ఇట్లు నాలుగు వేదములు సృష్టి యందు, జీవుల యందు నిర్వహింప బడుచున్నవి.  దీనిని తెలియుట వేదములను తెలియుట.  ఇవి ఎచ్చటి నుండి పుట్టుచున్నవో తెలియుట వేదము తెలియుట.  ఈ వేదమునే శ్రుతి యందురు. ఈ మాత శ్రుతిరూపిణి. ఈ వేదములను వివరించుటకే వేదాంగములు, ఉపనిషత్తులు యేర్పడినవి. వేదాంగములు ఆరు. అవి వరుసగా 1) ఛందస్సు, 2) కల్పము. 3) శిక్ష, 4) వ్యాకరణము, 5) నిరుక్తము, 6) జ్యోతిషము. వీని వలన సృష్టి స్వరూప స్వభావములు కొంత తెలియ వచ్చును.

ఉపనిషత్తులు బ్రహ్మమును చేరుటకు తెలుపబడిన మార్గములు. వేద వేదాంగములను, ఉపనిషత్తులను వివరించునవే పురాణ ములు, ఇతిహాసములు. పదునెనిమిది పురాణములు, రెండు ఇతిహాసములు కలవు. ఈ మొత్తమును వేద వాఙ్మయ మందురు. ఇదియే శ్రుతి. ఇది ప్రమాణమగు వాఙ్మయము. ఈ శ్రుతియే వేద ప్రమాణము. ఈ మొత్తము శ్రుతిని గురుముఖముగ విని నేర్చుకొనుట శ్రుతి విద్య అనబడుచున్నది.

***

540. 'స్మృతి'

శ్రవణము, స్మరణము వలన యేర్పడు జ్ఞానము శ్రీమాత అని అర్ధము. ముందు నామములో తెలిపిన వాఙ్మయమును వినుట వలన, మరల మరల స్మరించుట వలన జీవులయందు మేధోవికాసము కలుగును. ఇట్లు వికాసము కలిగించు జ్ఞాన రూపమున శ్రీమాత యున్నది. ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది గాథలు, వేదాంగ ములు వినుచూ, స్మరించుచూ నేర్చుకొనుట స్మృతి విద్య. శ్రుతిని స్మృతి ద్వారా నేర్చుకొనుట సదాచారము. నేర్చిన వానివద్ద నేర్చుట విదితమగు విషయమే కదా! నేటికినీ వేదములు మంత్రములు, స్తోత్రములు నేర్చినవారు పలుకుచుండగా విని నేర్చుకొనుట సదాచారముగ జరుగుచున్నది. స్వంతముగ నేర్చుకొనుట సదాచారము కాదు. అది స్వతంత్ర బుద్ధికి చిహ్నము. అట్టి వారియందు విద్య రాణించుట కష్టము.

అహంకారము కారణముగ విద్యలు రాణింపవు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారమూర్తులు కూడ సద్గురువుల నాశ్రయించిరి. శుశ్రూషలు చేసిరి. వినయము గలవారికే విద్య అని తెలియవలెను. సంపదలలో వినయ సంపద చాల గొప్పది. శ్రీమాతయే స్మృతి, శ్రుతి రూపము గనుక ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయువారు సర్వవిద్యల సారమును పొందగలరు. భక్తులీ మార్గముననే సర్వవిద్యలను నేర్చిరి. శ్రీమాత సర్వవిద్యా స్వరూపిణి కదా! ఆమెను గూర్చిన శ్రవణము, స్మరణము వలన కూడ జీవులు పూర్ణ వికాసము చెందుదురు. ఇదియునూ సదాచారమే. శ్రుతి స్మృతులు జీవుల మేధస్సును క్రమముగ వృద్ధి పరచుచూ తరింపజేయును. తరువాత నామము దీనినే ప్రతిపాదించును.

***

541. ‘అనుత్తమ’ - 1 🌻

సాటిలేని ఉత్తమ చైతన్యమనియూ, కొలుచువారికి ఎడతెగని ఉత్తమ స్థితిని కల్పించు నదనియూ అర్థము. శ్రీదేవి కంటే ఉత్తమమైనది లేదు. మహా చైతన్యముతో సమానమైన దేమియూ లేదు. అధికమైనదీ ఏమియూ లేదు. ఆమెయే సకల సృష్టికినీ సహజమగు ఐశ్వర్యము మరియు బలము. సకల దేవతల యందును, ఋషుల యందును ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగా శ్రీమాతయే యున్నది. ఆమె అనుగ్రహము లేనివా రెవరైననూ శక్తిహీనులే. కావున ఆమెతో సాటి సృష్టియందు ఏమియును లేదు. శ్రీమాత నారాధించు వారికి క్రమముగ ఉత్తమత్వము ఏర్పడుచునే యుండును. 'అను' అను విశేషము ఉత్తమత్వమునకు చేర్చుటచే ఉత్తమత్వము పెరుగుచునే యుండునని తెలియవలెను. అనూరాధ, అనుశ్యుతము, అనునయ నము, అనుస్మరణము యిత్యాది పదములు నిరంతరత్వమును నొక్కి చెప్పును.

అంతరాయము లేని స్మరణ, అనుసరణ, వృద్ధి, ఉత్తమత్వము అని ఈ పదముల అవగాహన. 'మామనుస్మరా' అని శ్రీకృష్ణుడు పలుకును. అనగా ఎడతెగక నన్ను స్మరింపుము అని తెలిపెను. సాధన నిరంతరము గానపుడు సిద్ధి యుండదు. అనుచింతన, పర్యుపాసన కూడ తెలుపబడినది. కావున ఆరాధన యందు అంతరాయము లుండరాదు. ఫెళ ఫెళ ఫెళమని పది రోజులు ఆడంబరముగ ఆరాధన జేసి పదకొండవ రోజు నుండి ఆరాధన కొనసాగనిచో వృద్ధి కలుగదు. ఏ కార్యము నందైననూ సిద్ధి కలుగవలెనన్నచో నిరంతరత్వము తప్పనిసరి.  ఉత్తమత్వమునకు నిరంతరత్వము విడదీయరాని అనుబంధ గుణము. భూమి క్షణకాలము కూడను తిరుగుట మానదు. అట్లే గ్రహములు. మొక్క పెరుగుటలో విరామము లుండవు. ఉన్న స్థితి నుండి ఉత్తమ స్థితికి చేరుటకు నిరంతర శ్రీమాత ఆరాధన యిచ్చట చెప్పబడుచున్నది.

***

542. 'పుణ్యకీర్తి' - 

శ్రీమాత పుణ్యకీర్తి కలది అని ఒక అర్థము. ఆరాధించువారికి పుణ్యము నిచ్చుచూ కీర్తి కలిగించునని మరియొక అర్థము. శ్రీమాతను అనునిత్యము ఆరాధన చేయువారు క్రమముగ పుణ్య భావములను పొందుచుందురు. ఆ భావములు ఆచరణ రూపము దాల్చినపుడు లోకహితము కలుగును. చేయు కార్యముల వలన లోక హితము కలుగుచున్నప్పుడు చేయువానికి పుణ్య మబ్బుచుండును. లోకమున కీర్తియు కలుగుచుండును. ఇట్లు పుణ్య సుఖమును కలిగించుట, కీర్తి సుఖమును కలిగించుట శ్రీమాత చేయు కార్యమే. పుణ్యకార్యములు చేయువారు శ్రీమాతకు సమర్పణగ చేయవలెను. అహంకారముతో చేసినచో సుఖ ముండదు. కీర్తియు యుండదు.

అట్లే పుణ్యకార్యము చేయువారు పోటీలు పడరాదు. ప్రక్కవాని కన్న ఎక్కువ చేయవలెను, బాగుగా చేయవలెను అను పోటీ భావము కలుషితము.  పుణ్యము చేయువారిని చూసి ఈర్ష్య పడరాదు. విమర్శించ రాదు. చేయుటలో అశ్రద్ధ, అలసత్వము కూడదు. శ్రద్ధా భక్తులతో నిర్వర్తించవలెను. అపుడు మాత్రమే చేయు కార్యముల వలన పుణ్యము లభించును. సుఖము లభించును. అప్రయత్నముగ కీర్తి వరించును. ఈ హెచ్చరిక తగు మాత్రము అవసరము. పుణ్య కార్యములు చేయుచూ దుఃఖపడువారు కలరు.

“ఇన్ని మంచి కార్యములు చేసితిని, ఏమి ఫలము, ఎవ్వరునూ గుర్తించుట లేదు. ఈ కార్యముల వలన ఎట్టి సుఖమూ లేదు." అని వ్యష్టపడు వారెందరో గలరు. ఆరాధకులు దైవమునకు సమర్పణబుద్ధితో సత్కార్యముల నాచరించవలెను గాని ఫలమునందాశ కలిగి ఆచరింపరాదు. గొప్ప తనమునకై మంచిపని చేయువారికిట్టి దుఃఖములు తప్పవు. కేవలము యితరుల హితముకోరి అదియును దైవ సమర్పణముగ చేయువారికి పుణ్యము, కీర్తి శ్రీమాత అనుగ్రహముగ లభించును.

***

* 543. 'పుణ్యలభ్య’' - *

పుణ్యముల వలన లభ్యమగునది శ్రీమాత అని అర్ధము. పుణ్య కార్యములను శ్రద్ధా భక్తులతో దీర్ఘకాలము నిర్వర్తించు వారిని శ్రీమాత క్రమముగ అనుగ్రహించు చుండును. సాన్నిధ్యము క్రమముగ నిచ్చును. సాలోక్యము కలిగించును. అనగా అడపా దడపా దర్శనము లిచ్చుచుండును. ప్రోత్సహించు చుండును. దాని వలన ఆరాధనల యందు, పుణ్యకార్యముల యందు, ఇనుమడించిన స్ఫూర్తితో భక్తులు నిమగ్ను లగుదురు. అందువలన మరింత సాన్నిధ్య, సాలోక్యములు పెరిగి సామీప్యమును చేరుదురు.

పుణ్యముల వలన క్రమముగ సాయుజ్య మేర్పడును.చివరకు సారూప్య మేర్పడును. సారూప్య మేర్పడుటయే లభ్యమగుట. తన రూపమున శ్రీమాతయే యున్నదని తెలిసి ఆనంద పరవశుడై కీర్తించుచు, దర్శించుచు, సేవించుచూ తాదాత్మ్యము చెందును. ఇది పరాకాష్ఠ. ఈ విధముగ పుణ్యము వలన శ్రీమాత లభించును. కనుక ఆమె పుణ్యలభ్య. ముందు తెలిపిన మూడు నామములు, ఈ నామము ఒక పూర్ణమగు సాధనక్రమము.

***

 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 

పుణ్య విషయములను వినుట, ప్రశంసించుట గలది శ్రీమాత. పుణ్యమగు కథలను వినుట పుణ్య శ్రవణము. శ్రీమద్రామాయణము, శ్రీమద్భాగవతము, శ్రీమహాభారతము కథలను ప్రవచించునపుడు  అచట శ్రీమాత కూడ చేరి వినును. అట్లే తన కథలను భక్తులు ప్రవచించుకొనునపుడు శ్రీమాత వినును. శాశ్వత కీర్తివంతులగు మహాత్ముల కథలను వినునపుడు కూడ ఆమె ఉత్సాహముతో వినును. హరి కథలు, శివ కథలు, దేవతా విజయములు యిత్యాది ఉపాఖ్యానములను వినినపుడు కూడ ఉత్సాహముతో వినును. అనురక్తితో శ్రవణము చేయును. పుణ్య కథలను వినుటయందు శ్రీమాతయే ఉత్సాహపడి నపుడు వాటియం దాసక్తి లేనివారు ఎంతటి దురదృష్టవంతులు.

544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 2 🌻

దేవుని కథల యందాసక్తి లేనివారు అదృష్టహీనులు. వానిని సతతము వినుట, కీర్తించుట, మరల మరల స్మరించుట పుణ్యకార్యము. శౌనకాది మునులు కూడ నిత్యము సూతమహర్షి ప్రవచనములు విను చుందురని ప్రతీతి. ఎచ్చట దివ్యకథల శ్రవణము జరుగుచుండునో అచట శ్రీమాత సాన్నిధ్య ముండునని తెలియవలెను. అట్టి తెలివితో ప్రవచించుట, శ్రవణము చేయుట యుండవలెను. వినిన కథలను ప్రశంసించుకొను చుండవలెను.  పుణ్యకథల విమర్శ, విచికిత్స అహంకార హేతువు. భక్తి శ్రద్దలతో వినుట, కీర్తించుట శ్రీమాత అనుగ్రహమునకు ఒక చక్కని ఉపాయము.





No comments:

Post a Comment