Sunday, 23 March 2025

 



ప్రాంజలి ప్రభ -- కీర్తన 


రాగదీపార్చిలో - రాజీవ నేత్ర రమ్ము

యోగ్యతే నీకృపా - యోగమ్ము నీ దయార్ద   

వేగ నాకిప్పుడే - పీయూష పాత్ర నిమ్ము 

మూగనై నేనుంటి - ముఖ్యమ్ము నీ దయార్ద

మూఁగ డెందమ్ములో - మోదమ్ము పొంగిపోవు

భాగమై నేనున్న - బాధ్యాత నీ దయార్ద  

భావనావీథిలో - భాసిల్లు తార నీవు 

సేవలే నాయిచ్చ - సీఘ్రమ్ము నీ దయార్ద

నమో వెంకటేశాయ నమో నమో నమః 

నమో శ్రీనివాసాయ నమో నమో నమః    

*

రావేల నను జూడ - రమణీయముగ నాడఁగా 

సేవల్లె కథలాగా  - శీఘ్రమే మదిభక్తిగా  

భావాల నవగీతి - స్వరయుక్తముగ పాడఁగా

కావడి కలలాగ - కావ్యమే మదిభక్తిగా    

జీవమ్మునకు స్ఫూర్తి - చెలువమ్ముగను వచ్చుఁగా

నవలా కదలికలు - నటనలా మదిభక్తిగా  

రేవెల్గు చిఱుకాంతి - ప్రియమార సుగమిచ్చుఁగా 

నావాక్కు నీకుగా  - నయనాల మదిభక్తిగా

నమో వెంకటేశాయ నమో నమో నమః 

నమో శ్రీనివాసాయ నమో నమో నమః    

*

జీవన మది యొక్క - చెఱసాల బంది నేను  

ఈవన మది యొక్క - యెడవేమొ లేవలేను 

త్రోవయు కనరాదు - తుది లేని యానమయ్యె 

దేవుని దయ నాదు - దిశయందు+ తోఁచదయ్యె 

నమో వెంకటేశాయ నమో నమో నమః 

నమో శ్రీనివాసాయ నమో నమో నమః    

*

రాగదీపము: ఇం/ఇం - ఇం/చం

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

****

*మా_బాల్యం*

ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే!

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..

వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..

రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు.
ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ..

నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..

కట్ చేస్తే..

ఇప్పుడు...
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..??

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు.. 

ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి.

ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ


*****



No comments:

Post a Comment