ఆరోగ్య ప్రదాత
కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఏడాదితో శత సంవత్సరంలోకిi అడుగుపెడుతున్నారు.
స్వామివారు పీఠాధిపత్యం వహించగానే, స్వామివారు వేద వ్యాప్తికి, వేద ప్రచారానికి కార్యోన్ముఖులై ఎన్నో పాఠశాలలను పునరుద్ధరించి, ఎంతోమంది వేదపండితులకు జీవితాంతం ఆర్ధిక స్వావలంబన చేకూర్చే దిశగా నిమగ్నమయ్యారు. వేద భాష్య పరీక్షలు నిర్వహించి, యువ పండితుల్లో ఎంతో ఆసక్తిని పెంచారు. ఉత్తీర్ణులైన వారిని తగు విధంగా సత్కరించారు.
ఒకసారి స్వామివారు యాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చినప్పుడు, “న్యాయ శాస్త్రంలో ఎంతో పాండిత్యాన్ని గడించిన నీవు ఇక అద్వైత వేదాంతం తత్వంలో అత్యుత్తమ గ్రంథమైన అద్వైత - సిద్ధిని చదువు” అనడంతో మరలా నా అధ్యయనం మొదలైంది.
స్వామివారు సన్యసించగానే ఆహారం విషయంలో సన్యాసి పాటించాల్సిన నియమాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మనస్సు మరియు జ్ఞాపకశక్తి విషయంలో అది దోహదకారి అన్న సూత్రం ఆధారంగా స్వామి వారు తమ ఆహార అలవాట్లను కఠినతరం చేశారు.
సన్యసించిన తరువాత సన్యాసి ఇతరములైన సంభాషణలను విడిచిపెట్టాలి అనే అర్థమిచ్చే “అన్యో వచో విమున్చత అత ముని” అన్న శృతి వాక్యాన్ని అనుసరించి స్వామివారు ఎప్పుడో నాలుగు మాటలు మాత్రమే మాట్లాడుతూ, తక్కిన సమయం అంతా మౌనంగానే ఉండేవారు.
స్వీయ క్రమశిక్షణ పాటించడం వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు, కోరికలను ఈడేర్చే శక్తిని కూడగట్టుకున్నారు.
1992 జూన్ నుండి నేను చాలా నీరసించిపోయి, పూజాదికాలు, విద్యార్థులకు పాఠం చెప్పడం వంటి రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా స్వరం కూడా బలహీనంగా, పేలగా మారిపోయింది. అప్పుడు నేను ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యాలపై భారతీయ తర్క పధ్ధతిపై ఆధారంతో చిన్న వ్యాఖ్యానం వ్రాసే పనిలో ఉన్నాను. ‘శంకర భక్త జన సభ’ వారి ఆధ్వర్యంలో దాన్ని ముద్రించాలని శ్రీ వైద్యనాథ ఆయర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.
1992 సెప్టెంబర్ 6 నుండి కంచిలో జరుగుతున్న అద్వైత సభలో పాల్గొంటున్న పండితులకు, పరమాచార్య స్వామివారికి ఈ పుస్తకాన్ని ఇవ్వదలచి కంచికి బయలుదేరాను. ఆరోజు నేను ఇంకా నీరసించిపోయి, నేను ఇచ్చిన వాక్యార్థము జీర గొంతుకతో చెప్పడం వల్ల అక్కడున్నవారెవరికి సరిగ్గా వినబడి ఉండదు. సాయంత్రం నేను పరమాచార్య స్వామి వద్దకు వెళ్లాను. ఆ పుస్తకాన్ని స్వామివారికి ఇచ్చి, ప్రదక్షిణ నమస్కారం చేసి, స్వామివారి దివ్య పాద కమలాలను అత్యంత భక్తితో నా తలపై ఉంచుకున్నాను. మనోహరమైన చిరునవ్వుతో స్వామివారు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించారు. అంతసేపూ, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా అక్కడే ఉన్నారు. స్వామి వారు నన్ను ఆశీర్వదించి, “చాలా కాలం తరువాత, మేము ఈరోజు పరమాచార్య స్వామివారి నవ్వును చూశాము” అని చెప్పారు.
మరుసటిరోజు నుండే నా ఆరోగ్యంలో మార్పు కనబడి త్వరలోనే స్వస్థత చేకూరింది. నేను ఇప్పుడు మంచి స్వరంతో పాఠాలు చెప్పగలుగుతున్నాను, చిన్న చిన్న దూరాలు కూడా నడవగలుగుతున్నాను.
“శ్రీ చంద్రశేఖర గురో శతాబ్ది అంతర జీవనే కార్యో అనుగ్రహ ఇతి ఏవ శంకరం ప్రార్థయే సదా”
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గురుదేవులకు మరో వంద సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాలని శ్రీ ఆదిశంకర భగవత్పాదులని వేడుకుంటున్నాను.
--- జి. సుబ్రహ్మణ్య శాస్త్రి. “kamakoti.org” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
*****
*శుద్ధ భక్తికి ముగ్ధుడైన పురి జగన్నాథుడు*
[కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల]
బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక , కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని , వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను , తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి.
భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు
*''ఏడ్చకు. నాకు పురి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''*.
ఒకరోజు భార్య
*''మనం మీ స్నేహితుడి దగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు ''*
అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కి.మీ. దూరం లో వున్న పురి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది.
1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది.
*''ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం''*
అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే
*''ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు''*
అని అంటే అపుడు బంధు
*''చూడు , మనం ఇపుడు పురి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం"*
అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది :
*''ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను.అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు ' నాకో స్నేహితుడున్నాడు , అతను మనకు సహాయం చేస్తున్నాడు ' అని చెపుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు , ఏ సహాయం అందలేదు అనుకో , ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం !''*
వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు.బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి
*'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు'*
అని చెప్పింది. బ్నధు అన్నాడు
*'నేను చెప్పాను కదా , నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు'*
ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు.
కథ అయిపోయిందా ? లేదు . ఇపుడు మొదలౌతుంది.
తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో
*'నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన , నీపై నాకున్న నమ్మకం పోతుందా ? నీవు వున్నావు , ఇదంతా చూస్తున్నావు'*
అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ
*'ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు'*
అని అంటూన్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది.
రాత్రి అయ్యింది. పురి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది.
*''అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే''*
అని స్పష్టంగా ఎవరో చెప్పారు.
ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?
ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథమందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు , బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పురి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.
*---నమ్మక బాగుపడినవారు లేరు. నమ్మి చెడినవారు లేరు---*
*****
నేటి మనసులోని
మాటల ముత్యాలు.
సహనం కొండంత సమస్యను కూడా క్రిందికి తెస్తుంది..
కోపం సమస్య చిన్నదైనా కొండంతపెద్దది చేస్తుంది..
సహనం మనిషికి గుర్తింపునిస్తే కోపం మనిషిని మనసుకి దూరం చేస్తుంది...
ఒక్కసారి ఆలోచించండి.
ప్రతి మనిషి కి సమస్య వుంటుంది.
ఓడిపోయామని,
జీవితంలో ముందుకు వెళ్ళలేక పోతున్నామని అధైర్యపడకండి.
మనసుంటే మార్గం వుంటుంది,
అలాగేసహనం వుంటే సర్దుబాటు వీలవుతుంది.
అలోచించే ఆయుదాన్ని కోల్పోకండి.
మీమ్మల్ని కష్టకాలంలో కూడ ముందుకు నడిపించేది అదే...
ప్రశాంతంగా ఉన్న..
జీవితమనే కొలనులో ఎవరైనా, అన్యాయంగా అబద్దాలతో నిందలనే రాయిని వేసినప్పుడు
ఆరోపణలు చేసినప్పుడు
కేవలం ఆ సమయంలో
అప్పుడు మాత్రమే అక్కడ ఉన్న ఆ నీటి ప్రశాంతతను ఆ రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు
కానీ, కాసేపు తరువాత,
నీరు తేరుకుని నిర్మలంగా,
శుభ్రంగా, స్వచ్ఛంగా,
ప్రశాంతంగా కనబడుతుంది..
ఉంటుంది కూడాకానీ,
నిందలు వేసినవారు,
అందరి దృష్టిలో, మనస్సులో,
ఆ రాయిలా,
ఆ నీటి కొలనులో
శాశ్వతంగా ఎప్పటికీ అడుగునే
ఉండిపోతారు!
నీకు ఏమి ఇవ్వాలో
తెలిసిన ఆ దేవుడికి
ఎలా ఇవ్వాలో కూడా తెలుసు
నీకు ఆయువును పోసిన
ఆ దేవుడికి
నీ ఆపదను తొలగించడం
కూడా తెలుసు అందుకే...
కష్టం వచ్చిందని కంగారుపడకు
సుఖాలు రాగానే సంబరపడకు
నీలో భక్తి పెరిగితే...
దేవుడిని చూడాలనే...
కోరిక ఉంటుంది.
నీలో దానగుణం పెరిగితే...
ఆ దేవుడికే..
నిన్ను చూడాలన్న
కోరిక ఉంటుంది.
****
ఆత్మ సాక్షాత్కారం.
ఆగమములలో ‘ సర్వజ్ఞానోత్తర ఆగమము ‘ సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు. తెలుగులో శ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మగారు వ్రాసిన వ్యాఖ్యాన సహాయంతో, మనం చెప్పుకుందాం.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి. శ్రద్ధగా, నిదానంగా రోజుకు కొంత మననం చేసుకుందాం.
శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.
శ్లో. ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ /
ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య తు నిష్కళం // 1 .
గుహా ( సుబ్రహ్మణ్యా ) ! సూక్ష్మమై అంతటా వ్యాపించివున్న ఆత్మ అగ్రాహ్యం. అనగా తెలుసుకోలేనిది. అయినప్పటికీ, దానిని వున్నది ఉన్నట్లు గ్రహించడానికి నిష్కళమైన ఇంకొక ఉపాయము చెబుతున్నాను.
వివరణము : కుమారస్వామికి గుహుడు అనే పేరుకూడా వున్నది. గుహనమనగా రక్షించుట. గుహుడనగా రక్షించేవాడు. జ్ఞానోపదేశం చేత సంసారభీతినుండి ముముక్షువులను రక్షించేవాడు అని కూడా గ్రహింపవచ్చును.
అణుశక్తి కన్నా సూక్ష్మంగా ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. దానిని ఇంద్రియముల చేత, మనస్సు చేత గ్రహించుటకు వీలుకాదు. అందువలన అది అగ్రాహ్యము. మరి ఏ ఉపాయంతో గ్రహించాలి ?
బహిర్ముఖమై ప్రపంచములోని దృశ్యములను, విషయములను గ్రహించి ప్రవర్తించే ఇంద్రియాలకు, మనస్సుకు అది అగ్రాహ్యమే. అదే మనస్సును ఇంద్రియములనుండి వెనుకకు మరల్చి శుద్ధమై ఏకాగ్రమై ఉంచితే, అప్పుడు మనస్సు గ్రహించే స్థితిలో వుంటుంది.
కళలు ప్రదర్శించనిది నిష్కళము. కళ అనగా అంశము లేదా అంగము. యోగసాధనలో యమము, నియమము మొదలైన అంశములు సాధనకు ఉపయోగ పడతాయి. జపము, ధ్యానము, పూజ, సంకీర్తన మొదలైన అంగములు భక్తి మార్గంలో ఉపయోగపడతాయి. అయితే, ఆత్మ గురించి తెలుసుకోవాలంటే, నిర్దిష్టమైన అంగములు అనగా కళలు ఏవీ లేవు. అందుకని ఈ ఉపాయము నిష్కళము.
స్వస్తి.
శివానుగ్రహంతో, మరికొంత రేపు.
******
ప్రాంజలి సుమాంజలి కథలు
సేకరణ.. మల్లాప్రగడ
మోక్షం అనే పదం దాదాపు అందరూ వినేఉంటారు. ఏదో ఒక సందర్భంలో హమ్మయ్య మోక్షం కలిగిందని అనుకుంటారు. ఇంతకీ మోక్షం అంటే ఏంటి..అదెలా లభిస్తుందో??
మోక్షం ఎవరికి తొందరగా లభిస్తుంది!
త్రిలోకసంచారి అయిన నారదుడు ఓసారి భూమ్మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు వెళ్లాడు. ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు...వారిలో మొదటి వ్యక్తి ఓ ముని..
నారదుడు-ముని
నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునిదగ్గరకు వెళ్లాడు. నారదుడిని చూసిన ముని...‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు. స్పందించిన నారదుడు శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు, వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటానని బదులిచ్చారు నారదులవారు.‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు.సరేనని ముందుకు సాగిన నారదుడు ఆ తర్వాత చెప్పులుకుట్టే వ్యక్తికి కనిపించాడు.
నారదుడు-చెప్పులు కుట్టేవాడు
‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. స్వామివారు ఎలా ఉన్నారు,వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు. ‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అన్నాడు. సరేనన్న నారదుడు వైకుంఠానికి తిరుగుపయనమయ్యారు.
శ్రీమహావిష్ణువు-నారదుడు
వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్లిన నారుదులవారు..తాను భూలోకంలో కలసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు ముందుంచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారనంటే ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు. ఆశ్చర్యపోయిన నారదుల వారు .. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ జీవనం గడుపుతున్న చెప్పులుకుట్టే వ్యక్తికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటనే సంశయంలో ఉండిపోయారు. ఇది గమనించిన శ్రీహరి..ఈ సారి నువ్వు వారిద్దరినీ కలసినప్పుడు ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారని చెప్పు..వారిలో ఎవరు గొప్ప భక్తులో తెలుస్తుందంటారు.
భూలోకానికి తిరిగి బయుదేరి వెళ్లిన నారదుడు మళ్లీ ఆ ఇద్దర్నీ కలుస్తారు. ఎప్పటిలానే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే..శ్రీహరి చెప్పమన్న సమాధానమే చెబుతారు నారదులవారు. అప్పుడు ఎవరి స్పందన ఎలా ఉందంటే...
ముని:‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో.
చెప్పులుకుట్టేవ్యక్తి : ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు.
నారదుడు: స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!
చెప్పులుకుట్టేవ్యక్తి: ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేల గింజలున్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా’
పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం చెప్పులుకుట్టే వ్యక్తికే ఎందుకు ముందుగా వస్తుందో నారదుడికి అర్థమైంది...
ఇక్కడ మోక్షం అంటే..భగవంతుడు-భక్తుడు అని కాదు..మీరు నమ్మిన సిద్ధాంతం కావొచ్చు, మీరు చేస్తున్న పని కావొచ్చు. దానిపై పూర్తిస్థాయిలో విశ్వాసం ఉంటే వారు అందులో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతారు (మోక్షం పొందుతారు) అని అర్థం.
మనుషుల్లో మూడు రకాల వాళ్లుంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా రుషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి. ఈ జీవితంలో చేసే అవిరళ కృషీ ఉండాలి.
భారతీయ దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది. మోక్షప్రాప్తికి సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం, సమ్యక్ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది.
మోక్షం నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన విధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టమూ, అశుభమూ చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది.
సాంఖ్య-యోగ దర్శనాలను అనుసరించి మోక్షమంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది. మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.
స్థూలంగా మోక్షం అంటే సమర్పణభావం. ఇది అంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముణ్ని ఆత్మసమర్పణ చేసుకొమ్మంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు.
అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడు, మహాపాపి. పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కద! అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం.
'ఇది నాది' అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. 'ఇది నాది కాదు' అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాన్ని ఆచరణతో సమన్వయపరచుకోవాలి. దాన్ని జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం!
****
అమరశిల్పి #జక్కన్న 🙏🙏🙏
మనకు సినిమా ద్వారా పరిచయమైన పేరు... ఇతని గురించి ఏ చరిత్ర పుస్తకమూ మనకు పాఠాలు నేర్పలేదు....పాశ్చాత్యులు కళ్ళు తెరువక ముందే... విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో ... డ్రిల్ బిట్ లేకుండా ఇంత అద్భుతాన్నీ సుసాధ్యం చేసిన మన అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు మనకు ఎన్నో విషయాలు తెలుపుతున్నాయి.
జక్కన్న ఎందుకు అమరశిల్పి అయ్యాడో #బేలూర్ #హలెబీడు దేవాలయ శిల్పాలు చూసాక కానీ అర్థం కాలేదు..మనకు తెలిసినంత వరకు ఒక శిల్పం అంటే… ఒక దేవతా మూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక ఆర్చి లాంటిది పెట్టేస్తే సరి… ఇక శిల్పం పూర్తయినట్టే. హలేబీడు , బేలూరు లోని శిల్ప సంపదను చూస్తే అవి ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైన డిజైన్లతో నిండి ఉండడం స్పష్టంగా చూడవచ్చు. ఆ స్త్రీ మూర్తుల మెడలో అలంకరించిన హారాలు, చెవి రింగుల్లోని పూసలతో సహా… చేతి వేళ్ళకు వుండే గోళ్ళను, ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే… మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పనే కాదు... ఒక చిన్న పొరపాటు జరిగినా చెక్కిన శిల్పం అంతా వృథా అయిపోయే శ్రమ తీసుకుని, పొరపాటుకు తావు లేకుండా కొన్ని వందల కొద్దీ శిల్పాలు ఎలా చెక్కగలిగారో ఆ రోజుల్లో... … అవి కూడా ఇంకెవరికీ అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేథస్సు, సాధన, కళా నైపుణ్యం, అంకితభావం అనిర్వచనీయం... 🙏🙏
దేవలోకంలో నివసించే ఏ యక్షుడో, గంధర్వుడో శాపవశాన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి... ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై, ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మడానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్లిపోయాడని అనిపిస్తుంది. మొనాలిసాను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు డావిన్సి గురించి ప్రపంచమంతా డబ్బా కొడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు... పికాసోను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మరి మనలో కలిసి తిరిగిన ఒకడు... మన ఊరి చావిట్లో పడుకుని, మన ఇంట్లో చద్దన్నం తిని, మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు ఇంతటి అసామాన్యుడని ఈ రాళ్ళకు కూడా అర్థమై అతనికి దాసోహం అన్న తరువాత కూడా మన మట్టి బుర్రలకు ఎందుకు తెలియడంలేదు..?ఒప్పుకున్న ఒప్పుకోకున్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని... ఎలుగెత్తి చాటరా జక్కన్న శిల్పాల్ని👌🙏🙏
జక్కన్న ఆచారి (Jakkanna) క్రీ.శ. 12వ శతాబ్దంలో కర్ణాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం.
జక్కనాచారి కర్ణాటకలోని తుముకురు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. వీరి జీవితం అంతా ప్రేమ మరియు కళలకు అంకితం చేసిన ధన్యజీవి. ఇతడు నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్న అనతికాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను మరియు కుటుంబాన్ని మరిచిపోయాడు.
జక్కనాచారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది; అతడే ఢంకనాచారి. చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం మీద వెళతాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు. కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది. ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీకొడుకులని గుర్తిస్తారు. ఢంకనా తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధిపొందుతాడు.
అనంతరం జక్కనాచారికి క్రిడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది. అది పూర్తయిన తరువాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ సంఘటన ప్రకారం, క్రిడాపురను కైడల అని వ్యవహరిస్తున్నారు. కన్నడంలో 'కై' అనగా చేయి అని అర్థం.
ఇంతటి ప్రసిద్ధిచెందిన కళాకారుని జ్ఞాపకార్ధం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జక్కనాచారి అవార్డులు ప్రదానం చేస్తుంది.
సేకరణ
*🌻ధర్మం - విధి🌻*
* ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.
* అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు. అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు. వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు,అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకపోయింది.చివరి ప్రత్యామ్నాయంగా దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ! దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే అని వేడుకున్నాడు.
* వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోని ఉన్న ఒక ఋషి ని చూశాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. ఆ ఋషి ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు అని అతనికి తెలియజేశాడు.
* ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.
* అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేక పోయాడు, దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.
* అతను మూడవసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై, అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు.వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను. దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.
* దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.
* ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను.
* ఋషి ఇలా అన్నాడు మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!
* ఆ వ్యక్తి ఆసక్తిగా ఎలా మహానుభావా?" అని అడిగాడు.
* దానికి ఋషి నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరి ఉండేది. ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.అని ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.
* ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు.స్వంత బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.
* మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి , మార్గదర్శనం చేయాలి!
* ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే
******
పుల్లని దానిమ్మ పళ్ళు
అది నవంబర్ 1963. జగద్గురు శ్రీ కంచి కామకోటి పరమాచార్య తిరువిడైమరదూర్ దగ్గరలోని, కావేరీ ఉత్తర తీరాన ఉన్న కళ్యాణపురం అన్న చిన్న గ్రామంలో ఇరవైఅయిదు రోజులపాటు మకాం చేశారు.
ఒకరోజు ఉదయం తంజావూరు ఆనంద లాడ్జి యజమాని కె.యస్. గోపాలస్వామి అయ్యర్ నా వద్దకు వచ్చి, తనతో పాటుగా వచ్చిన మద్రాసు వ్యక్తితో కలిసి కళ్యాణపురంలో ఉన్న పరమాచార్య స్వామివారి దర్శనానికి రాగలవా అని అడిగారు. నేను వెంటనే ఆ అవకాశాన్ని కాదనకుండా వాళ్ళతో బయలుదేరాను.
మద్యాహ్నం మూడుగంటలప్పుడు మా కారు తిరువిడైమరదూర్ దగ్గరలోని విరకోలన్ నది వంతెన దాటగానే, దరిపక్కగా పెద్ద దంతాలతో ఉన్న శ్రీమఠం ఏనుగు కొబ్బరి ఆకులను తింటూ కనబడింది. శ్రీమఠం గోవులను నదిలో స్నానానికి తీసుకునివెళ్తున్నారు. పూజ సేవకులు ముందర ఉన్న ఇంటి అరుగుపై సేదతీరుతున్నారు. అక్కడ ఎక్కువ హడావిడి ఏమి లేదు. మఠం మేనేజరు మమ్మల్ని స్వాగతించి, దగ్గరలోని ఇంటిలో ఉన్న మఠం కార్యాలయానికి తీసుకునివెళ్లాడు.
అక్కడ మాతోపాటు వచ్చిన మద్రాసు పెద్దమనిషి మేనేజరుకు వంద రూపాయల నోట్ల కట్ట ఇచ్చి, దానికి సరిపడా రూపాయి చిల్లర తీసుకుని పెద్ద చెక్క తట్టలో పెట్టుకున్నాడు. కొన్ని బుట్టల్లో పళ్ళు, బెల్లం, చిన్ని డబ్బాల్లో మంచి కుంకుమపువ్వు, పెద్ద గంధపు చెక్క, కొన్ని స్వచ్చమైన కర్పూరం పొట్లాలు కూడా తెచ్చాడు. మేము అన్నిటిని రెండు వెదురు పళ్ళాలలో సర్దాము. అతను తీర్చిదిద్దిన కచ్చపంచలోకి మారి, నుదుటిపై, ఎదపై, చేతులపై వీబూధి రేఖలు దిద్దుకుని సిద్ధమయ్యాడు. ఇదంతా అతనికి అనుభవం లేనిదని తెలిసిపోతోంది.
అందరమూ పూజ జరిగే చోటుకి వెళ్ళాము. ఆ ఇంటి వెనుకవైపున ఉన్న గోశాలలో పరమాచార్య స్వామివారు ఉన్నారు. నేను ముందుగ వెళ్లి వీరి గురించి స్వామివారికి తెలిపాను.
స్వామివారు మౌనంగా తల ఊపారు. ఆ మద్రాసు పెద్దమనిషి, కె.యస్.జి ఇద్దరూ వచ్చి తెచ్చినవాటిని స్వామివారికి సమర్పించి, ముగ్గురమూ సాష్టాంగం చేశాము. స్వామివారు కె.యస్.జి ని గుర్తుపట్టి ఒక చిరునవ్వు నవ్వి, మహామహోపాధ్యాయ మన్నార్గుడి రాజు శాస్త్రి గారి మునిమనవడైన వై. మహాలింగ శాస్త్రి గారితో మరలా మాట్లాడడం మొదలుపెట్టారు. స్వామివారు, రాజు శాస్త్రి గారి దుర్జనోక్తినిరాస (చెడ్డవారి మాటలకు దండన) గురించి మాట్లాడుతున్నారు. అందులోని కొన్ని వాక్యాలను చెబుతూ మహాలింగ శాస్త్రి గారు సంభాషణను కొనసాగిస్తున్నారు. ఇలా ఒక అరగంట పాటు జరిగింది.
నేను కొంచం కలవరపడ్డాను. కె.యస్.జి నన్ను కూడా తీసుకువెళ్ళడానికి కారణం నేను స్వామివారికి చాలా దగ్గరని, తన మద్రాసు స్నేహితుణ్ణి స్వామివారికి పరిచయం చేసి వెంటనే పెద్ద పెద్ద ఆశీస్సులు ఇప్పిస్తానని. కాని ఇప్పుడేమో మమ్మల్ని పూర్తిగా విస్మరించారు స్వామివారు. వెనుకనుండి కె.యస్.జి నన్ను పొడుస్తున్నాడు. కాని నేను ఏం చెయ్యగలను. స్వామివారు చేస్తున్న చిన్న చిన్న వ్యాఖ్యలకు కూడా ఆ మద్రాసు వ్యక్తి పెద్దగా నవ్వుతున్నాడు, అలాగైనా స్వామివారు తనను చూస్తారని. మాకు మాత్రం చాలా ఆందోళనగా ఉంది.
గోశాల ద్వారం వద్ద ఎవరో తొంగిచూశారు. “వేదపురి, ఎవరది?” అని అడిగారు స్వామివారు. స్వామివారికి విసనకర్ర వీస్తున్న వేదపురి ద్వారం వద్దకు వెళ్లి, మయూరంలోని వల్లల్లార్ వీధి నుండి వచ్చిన ఒక శ్రౌతి గారిని పిలుచుకునివచ్చాడు. శ్రౌతి గారి చేతిలో ఒక చిన్న వెదురు బుట్ట, అందులో రెండు టెంకాయలు, కొన్ని అరటిపళ్ళు ఉన్నాయి. పెద్ద సామవేద పన్నం ఒకటి చదివి సాష్టాంగం చేశారు. అత్యంత వినయంతో, భక్తితో తన కుమార్తె వివాహం ఒక వేద విద్యార్థితో కుదిరిందని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు కావాలని ప్రార్థించాడు.
వెంటనే స్వామివారు, “మీ అమ్మాయి ఇంకా ఉన్నత పాఠశాలలో చదువుతున్నదని చెప్పావు. మరి ఈ పెళ్ళికి తన అన్గేకారం ఉందా?” అని అడిగారు.
“పెరియవా అనుగ్రహం వల్ల ఇప్పటికి మా ఇంట్లో పూర్వపు ఆచారాలనే పాటిస్తున్నాము” అని చెప్పారు శ్రౌతి.
ద్వారం వద్ద మరలా ఎవరో తొంగిచూశారు. వేదపురి ద్వారం వద్దకు వెళ్లి, మాట్లాడి తిరిగొచ్చాడు. “విల్లైనూర్ నుండి ముసలావిడ. ఆమె పెరియవా కోసం పుల్లని దానిమ్మ పళ్ళు తెచ్చింది. ఇదిగో పెరియవా” అని చెప్పాడు.
“ఇక్కడకు తీసుకుని రా”. వేదపురి ద్వారం వద్దకు వెళ్లి తిరిగొచ్చి, “అక్కడినుండే స్వామివారికి నమస్కారం చేసి తను వెళ్తానంటోంది పెరియవా” అని చెప్పాడు.
“తనను ఇక్కడకు రమ్మని చెప్పు”. ఆమె ద్వారం వద్ద కనబడి, నమస్కారం చేసి వణుకుతూ నిలబడింది.
మహాస్వామివారు చేతిలోకి ఒక పండును తీసుకుని, దాన్ని తిప్పుతూ, వై. మహాలింగ శాస్త్రితో మాట్లాడుతున్నారు.
ఇల్లైనూర్ వైద్యనాథ స్వామి గురించి చెబుతూ, “వైతా నీకు తెలుసా”. “అప్పట్లో ఒకసారి నాకు కడుపులో కొద్దిగా సమస్య వచ్చింది. ప్రముఖులు, మద్రాసు ఆయుర్వేద కళాశాల నటేశ శాస్త్రి నన్ను పుల్లని దానిమ్మ పళ్ళ రసం త్రాగమన్నారు. అది చాలా అరుదైన రకం. అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఎవరూ దాన్ని పెంచరు. ఈ విషయం విన్న వైతా ఎక్కడెక్కడో తిరిగి మూడో రోజు కొన్ని పళ్ళు తెచ్చాడు”
“తరువాత తన ఇంటి మధ్యలో ఆ చెట్టును నాటి జాగ్రత్తగా పెంచాసాగాడు. దాన్ని ఇంటి వెనుకనున్న పెరడులో పెంచలేదు ఎందుకో తెలుసా, అక్కడ నాటితే ఆ చెట్టుకు ఇంట్లోని ఆహార పదార్థాలు అవీ వెయ్యడం వల్ల కలుషితం అవుతుందని, నేను తిననేమో అని. ఆ చెట్టుకు కాచిన కాయలన్నీ నాకే సమర్పించేవాడు. నేను వేరే ప్రదేశాలలో ఉంటే, ఎప్పుడైనా వాటిని ఉపయోగించుకునేలాగా ఈ అమ్మ వాటిని ఒక ప్రత్యెక విధానంలో ఎండబెట్టెది. వైతా లేడు. ఇప్పుడు అతని భార్య అప్పుడప్పుడు పళ్ళు తెస్తుంటుంది”.
“అరుదుగా దొరికేవాటికే విలువ ఎక్కువ. పురావస్తు తవ్వకాల్లో దొరికినవి ఇప్పుడు పనికిరానివైనా వాటికి విలువ ఎక్కువ. దొరికిన దాని కాలం ఎంత పాతదైతే అంత విలువ. ఉదార సంబంధ సమస్యలకు ఇప్పుడు ఎన్నో పరిష్కారాలు వస్తుండడంతో ఇప్పుడు ఈ పళ్లకు విలువ లేదు. కాని ఇది అరుదు కాబట్టి, విలువ ఎక్కువే. ఈ సందర్భంలో నాకు రామాయణం నుండి ఒక విషయం జ్ఞప్తికి వస్తోంది. హనుమంతుడు రావణుని రాజభవనంలో తిరుగుతూ, అక్కడున్న అరుదైన రాత్నాలనూ, అరుదైన కళాఖండాలను చూసి వాటిని రెండు రకాలుగా విభజిస్తాడు”
స్వామివారు కొద్ది క్షణాలు ఆ భాగాన్ని గుర్తుచేసుకోన్నారు.
“అవును. అది ఇలా ఉంటుంది.
య హి వైశ్రవణే లక్ష్మి!
య చ ఇంద్ర హరివాహనే!”
“రావణుడు కుబేరుని సంపదని, ఇంద్రుని సంపదని దోచుకున్నాడు. కుబేరుని సంపదలో ఉన్న బంగారము, వెండి, రత్నాలు మొదలైనవి విలువ కట్టి మొత్తం చెయ్యొచ్చు. కాని ఇంద్రుని సంపదలో ఉన్న వెలకట్టలేని, అరుదైన, పాట వస్తువులను వెలకట్టలేము. ఈ విషయాన్ని ‘హరిఅహన’ అన్న పదంలో అర్థచేసుకోవాలి. ఇంద్రుని గుర్రాలు పచ్చని రంగులో ఉన్నాయి. అవి చాలా అరుదైన రకం. వాటిని వెలకట్టి ఎక్కడా కొనలేము. అవి అపూర్వమైనవి. వాటిని పోలినవి కూడా ఎక్కడా దొరకవు. అటువంటి అరుదైనవే ఈ పళ్ళు కూడా”
అక్కడున్నవారికి ఎవరికీ ఈ ప్రభోదం ఎవరికోసమో అర్థం కావడంలేదు.
స్వామివారు వేదపురి వైపు తిరిగి, “ఇక్కడకు రా! మద్రాసు నుండి వచ్చిన పెద్ద మనసున్న ఈ పెద్ద మనిషి నాకోసం అపరిమితంగా తెచ్చాడు. అది ఒక మంచి పనికి ఉపయోగిద్దాం. లెక్కపెట్టవలసిన అవసరం లేదు. మొత్తం శ్రౌతి పైపంచెలో వెయ్యి. పెళ్ళికోసం అపరిమితమైన ధనం ఖర్చుపెట్టి ఉంటాడు. ఇది అతని అవసరం తీర్చగలదు” అని చెప్పారు.
సాధారణ సంభాషణకు ఎంతటి గొప్ప ముగింపు. మద్రాసు పెద్ద మనిషి గర్వం గాలిలో కలిసిపోయింది. ఒకేఒక చిన్న మాటతో అతణ్ణి స్వామివారు ఎంతో ఎత్తుకు చేర్చారు. కుమార్తె పెళ్ళికి లెక్కలేనంత ధనం సమకూరింది శ్రౌతి గారికి.
అది మహాస్వామి వారు అంటే
--- వి. స్వామినాథ ఆత్రేయ. “kamakoti.org” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
