
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
7. బిడ్డనే కద నాన్నా !
7. బిడ్డనే కద నాన్నా !
#రచన – పెబ్బిలి హైమావతి గారు
#మీ బిడ్డనే కద నాన్నా !
పద్మకి మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. నెల్లాళ్ల తన కష్టార్జితాన్ని పదే పదే చూసుకొని మురిసిపోయింది. మొదటిసారిగా అందుకున్న ఆ జీతం ఎంతో అపురూపంగా తోచడమే కాదు, అంతులేని ఆనందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది ఆమెలో. మొదటి జీతం అందుకున్న శుభవేళ ఆఫీసులో స్టాఫ్ అంతా పార్టీ ఇమ్మని గొడవ చేయడంతో స్వీటు, హాటు, కూల్‌డ్రింక్స్‌తో చిన్న పార్టీ ఇచ్చింది అందరికీ.
స్వీటు కొనుక్కొని హుషారుగా ఇంటికి వచ్చింది పద్మ. అప్పటికే ఆమె తండ్రి నారాయణరావు ఆఫీసు నుండి వచ్చి కాఫీ తాగుతూ ఉదయం పేపరులో చదవగా మిగిలిన విశేషాలను చదువుతున్నాడు రిలాక్సవుతూ.
తండ్రిని చూడడంతోనే ఆనందంగా నవ్వుతూ పరుగులాంటి నడకతో దగ్గరకు వెళ్లి ‘నాన్నగారూ, ఈవేళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసాండీ?’ అంటూ తనకు వచ్చిన జీతం కవరుని తండ్రి చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించింది.
నారాయణరావు కూతురి వంక మురిపెంగా చూస్తూ ‘గాడ్ బ్లెస్ యూ రా తల్లీ!’ అంటూ ఆదరంగా కూతురి తల మీద చెయ్యి వేసి లేవనెత్తాడు. పద్మ గొంతు విని లోపల పని చేసుకుంటున్న రమణమ్మ ఉత్సాహంగా వచ్చింది అక్కడకు.
‘అమ్మా, నాకు శాలరీ ఇచ్చారమ్మా ఈరోజు!’ అంటూ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి గిరగిరా తిప్పేసింది, చిన్నపిల్లలా సంబరపడిపోతూ.
‘ఆగవే తల్లీ. ఏంటిది?’ అంటూ కూతురి బుగ్గ మీద మురిపెంగా ముద్దు పెట్టుకుంది రమణమ్మ.
ఆ తరువాత తాను తెచ్చిన స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి తల్లిదండ్రుల నోటికి స్వీట్ అందించింది. రమణమ్మ తాను సగం తిని మిగతాది కూతురి నోట్లో పెట్టింది.
స్వీట్ తిన్నాక ‘సంతోషం రా తల్లీ, ఇంద జీతం తీసి జాగ్రత్త చేసుకో!’ అంటూ ఆ జీతం కవరు తిరిగి పద్మకు ఇవ్వబోయాడు నారాయణరావు.
అది చూసి ‘అదేంటి నాన్నగారూ నాకిస్తున్నారు. నేనేం చేసుకోను?’ అంది పద్మ తెల్లబోయి చూస్తూ.
‘నీ దగ్గరే ఉండనివ్వమ్మా. ఇది నీ సంపాదన. నీ ఫ్యూచర్‌కి పనికి వస్తుంది’ అన్నాడు నారాయణరావు నిదానంగా కూతురి వంక చూస్తూ.
‘ఇదేంటి నాన్నా, ఈ రోజు మీదీ, నాదీ అంటూ వేరు చేసి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ డబ్బు మనందరిదీ కాదా. ఏంటమ్మా, నాన్నగారు ఇలా అంటున్నారు?’ అంది పద్మ నీరసపడిపోతూ.
అంతవరకూ ఆనందంతో పరవళ్లు తొక్కిన పద్మ మనసు తండ్రి మాటలతో నీరు కారిపోయింది.
‘అదెలా వీలవుతుందమ్మా, ఆడపిల్ల సంపాదన ఆడపిల్లకే. దాని మీద తల్లిదండ్రులుగా మాకెలాంటి హక్కూ ఉండదు!’ అన్నాడు నారాయణరావు ఖండితంగా.
‘ఇది చాలా అన్యాయం నాన్నగారు. ఎప్పుడూ లేనిది ఆడపిల్లనని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇంతకాలం నన్నూ, తమ్ముడినీ ఒక్కలాగే పెంచారు. ఇప్పుడేంటి కొత్తగా ఈ మార్పు?’ అంది పద్మ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా.
‘మీ ఇద్దర్నీ సమానంగా పెంచడం తల్లి దండ్రులుగా మా బాధ్యత. అంతే తప్ప, నీ సంపాదన మీద మాకు ఏ హక్కూ ఉండదమ్మా!’ అన్నాడు.
‘అయితే తమ్ముడు జీతం తెచ్చి ఇచ్చినా, ఇలాగే మాట్లాడుతారా నాన్నా, మీరు?’ అంది పద్మ తీక్షణంగా చూస్తూ.
‘అదెలా అవుతుంది, వాడు మగపిల్లాడు. ఈ ఇంటి వారసుడు!’ అన్నాడు నారాయణరావు.
‘బాగుంది నాన్నా, మీరు కని పెంచి పెద్ద చేసిన బిడ్డల పట్ల ఇంత వివక్ష చూపిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఆటపాటలలో ప్రైజులు గెల్చుకుని తెచ్చి సంతోషంగా మీకు చూపించిన నాడు ఎంతో మురిసిపోతూ నన్నెంతో ఎప్రిషియేట్ చేశారు. ఈరోజు కూడా అలా చేస్తారని కొండంత ఆశతో వచ్చిన నన్ను ఇలా నిరాశపరుస్తున్నారు. సరే, మీకు అక్కరలేని ఈ డబ్బు నాకూ వద్దు! రేపే జాబ్‌కి రిజైన్ చేస్తాను!’ అంటూ బాధగా లోపలికి వెళ్లిపోయింది పద్మ.
అంతవరకూ జరిగిందంతా నిశ్చేష్టురాలై చూస్తున్న రమణమ్మ కూతురు అలా బాధగా వెళ్లడం చూసి ‘ఏమిటండీ, మీరు చేసిన పని ఈ రోజు. ఎందుకు దాని మనసు ఇలా నొప్పించారు. పాపం అది ఎంత బాధపడుతుందో గమనించారా?’ అంది మంద లిస్తున్నట్లుగా.
‘నిజం నిష్ఠూరంగానే ఉంటుంది రమణా. ఈరోజు కాకపోతే రేపైనా అది ఆడపిల్లే కానీ, ఈడపిల్ల కాదు కదా. దాని డబ్బు నాకెందుకు? కూతురికి ఆమాత్రం తిండి పెట్టలేని హీనస్థితిలో ఉన్నానా నేను?’ అన్నాడు నారాయణరావు విసురుగా.
భర్త మాటలను ఎలా అర్ధం చేసుకోవాలో బోధపడలేదు రమణమ్మకి. అందరూ సంతోషంగా ఉండవలసిన సమయంలో చాదస్తంగా ఎందుకు ఇలాంటి ప్రస్తావన తెచ్చినట్లు? అనుకుంది మనసులో.
లోపలున్న పద్మకు తండ్రి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తానేం చెప్పినా, ఏం చేసినా తండ్రి వినిపించుకోడని, ఆ డబ్బు తీసుకోడని అర్ధమైపోయింది ఆమెకు. అన్ని విషయాల్లో తండ్రి స్వభావాన్నే పుణికి పుచ్చుకున్న పద్మ కూడా నా డబ్బు ఎలా తీసుకోరో చూస్తాను అనుకుంది పట్టుదలగా. వెంటనే చరచరా గదిలో నుండి హాళ్లోకి వచ్చి జీతం కవరు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది.
ఆ మర్నాడు ఆఫీసు నుండి వస్తూ, ఇంట్లో అందరికీ బట్టలూ, వాటితో పాటు తల్లి చాన్నాళ్లుగా ముచ్చట పడుతున్న ఎల్.ఈ.డి. టి.వి కొనేసి ఇంటికి తీసుకువచ్చింది.
పద్మ చేసిన పని చూసి నారాయణరావుకి నోట మాట రాలేదు. కూతుర్ని మెచ్చుకోవాలో, తిట్టాలో అర్ధం కాలేదు అతడికి. రమణమ్మ మాత్రం ‘మీ నాన్నగారు చాదస్తం కొద్దీ ఏదో అన్నారని, డబ్బంతా ఇలా వృధా చేసావా?’ అంది మందలిస్తున్నట్లుగా.
‘ఏం కాదు, సద్వినియోగమే చేశాను. నిన్న నాన్నగారు నన్ను పరాయిదానిగా వేరు చేసి మాట్లాడారు. అలాగే నేనివాళ బట్టలు తెస్తే తీసుకుంటారో లేదో అనుకున్నాను. తీసుకున్నారు కదా, అదే చాలు!’ అంది పద్మ జీరబోయిన గొంతుతో.
కూతురి మాటలు విన్న నారాయణరావు మనసు కరిగిపోయింది. అనవసరంగా పద్మ మనసు కష్టపెట్టాను అని లోలోపలే బాధపడుతున్నాడు నిన్నటి నుండీ అతడు. ఈరోజు పద్మ ఆ మాట అనడంతో అతడిలో అపరాధ భావం రెట్టింపు అయింది.
‘సారీ తల్లీ. అనవసరంగా నిన్ను బాధపెట్టాను. కాని, నిన్ను నొప్పించాలని కాదమ్మా, నా ఉద్దేశం. ఈ కాలంలో మగపిల్లలతో పాటు ఆడపిల్లల్ని కూడా సమానంగా కష్టపడి చదివిస్తున్నాము. వాళ్ల సంపాదన విషయానికి వచ్చేసరికి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆమె సంపాదనపై ఏ హక్కూ లేకుండా పోతున్నదమ్మా! ఎంతో ప్రేమతో పెంచి, పెద్దచేసిన మాకు మీ పెళ్లిళ్లయ్యాక నిన్నా మొన్నటి సంపాదన గూర్చి లెక్కలు అడుగుతున్నారు వియ్యాలవారు. మా ఆఫీసులో అలాంటి కేసులు రెండు, మూడు చూశాను నేను. పిల్ల పెళ్లి చేసిన ఆనందం లేకుండా ఎంతో అవమానాన్ని ఎదుర్కుంటున్నారు వాళ్లు. నేను అలా కాకూడదని ముందు జాగ్రత్తగా అలా అన్నానే కాని, నిన్ను బాధపెట్టాలనే ఉద్దేశం నాకు లేదమ్మా!’ అన్నాడు వివరణ ఇస్తున్నట్లుగా.
‘కాని నాన్నగారూ, నిన్నటి నుండీ నా మనస్సు ఎంతగా కలతపడిందో తెలుసా మీకు ? ఇంకెప్పుడూ నన్నలా వేరు చేసి మాట్లాడ కండి!’ అంటూ తండ్రి భుజం మీద తలవాల్చి ఏడ్చేసింది పద్మ.
‘పిచ్చిపిల్లా!’ అంటూ ఓదార్పుగా కూతురి తల నిమురుతూ ఉండి పోయాడు నారాయణరావు.
అప్పటి నుండీ నేరుగా తన జీతం తండ్రికి ఇస్తే తీసుకోడని, ఇంట్లోకి అవసరమైన అధునాతన పరికరా లన్నింటినీ ఒక్కొక్కటిగా కొని అమర్చ సాగింది. మొదట్లో నారాయణరావు వ్యతిరేకించినా, క్రమేపీ అలవాటు పడిపోయాడు.
చూస్తూండగానే కాలచక్రం గిర్రున తిరిగి పోయింది. పద్మ తమ్ముడు సునీల్‌కు కూడా చదువయిపోయి, ఉద్యోగం వచ్చేసింది. నారాయణ రావు సర్వీసులో ఉండగానే పిల్లలిద్దరికీ పెళ్ళిళ్లు జరిపించేశాడు.
పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడి ఎవరి బతుకులు వాళ్లు బతుకుతూండడంతో నిశ్చింతగా కాలం గడుపుతున్న వారి జీవితాల్లో అనుకోని విషాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా రమణమ్మ గుండెపోటుతో మరణించింది. భార్య వియోగం నారాయణరావుని బాగా కుంగదీసింది.
మామగారు సర్వీసులో ఉండగా, అత్తగారు బతికి ఉండగా సునీల్ భార్య కోమలి అత్త చాటు కోడలుగా ఇంట్లో అందరికీ తలలో నాలుకలా మసలుకునేది. మామగారి పట్ల ఎంతో వినయ, విధేయతలు కనబరచేది.
అత్తగారు పోయాక, ఇంటి పెత్తనమంతా చేతికి చిక్కాక ఆమె తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. స్వార్థం తప్ప మరేమీ లేకుండా పోయింది ఆమెకు.
ఒక రోజు ఉదయం పేపరు చదువుకుంటున్న నారాయణరావు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సునీల్.
ఏదో చెప్పాలని తటపటాయింపుగా ఆగిపోయిన కొడుకుని గమనించాడు అతడు. ‘ఏంట్రా, ఏమైనా చెప్పాలా నాతో?’ అని అడిగాడు ఆదరంగా.
‘మరేం లేదు నాన్నా. నా ఫ్రెండ్సంతా ఏమంటున్నారంటే.. ఈ ఎదుగూ, బొదుగూ లేని ఉద్యోగం ఎంత కాలం చేస్తాము. ఈ జాబ్‌కి రిజైన్ చేసి మనందరం కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటున్నారు. వాళ్లకి పెట్టుబడికి లోటు ఏమీ లేదు. మన వాటాకి పెట్టుబడి కావాలి కదా. ఎలాగా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు సునీల్.
‘అదేంట్రా, బంగారం లాంటి గవర్నమెంటు ఉద్యోగం వదిలేస్తానంటున్నావు? అదీగాక, మనకు ఏమాత్రం అనుభవం లేని ఈ బిజినెస్‌లవీ ఎందుకు?’ అన్నాడు ఆదుర్దాగా.
అతడికి సునీల్ అంటే విపరీతమైన మమకారం. ఈ బిజినెస్ పేరుతో కొడుకు ఎక్కడ చిక్కుల్లో ఇరుక్కుంటాడోనని అతడి భయం.
‘ఏం ఫర్వాలేదు నాన్నా. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉంటాము? పెట్టుబడి కోసమే నా ఆలోచనంతా. మీరేమీ అనుకోనంటే, మీ పేరున ఉన్న ఈ ఇల్లు నా పేరున పెడితే బ్యాంకులో దీన్ని సెక్యూరిటీగా పెట్టి ఓ పాతిక లక్షలు లోను తీసుకుందామని ఉంది’ అన్నాడు సునీల్.
‘పాతిక లక్షలా? అయినా ఇల్లు నా పేరున ఉంటే ఏమవుతుందిరా? మా ఫ్రెండ్స్ పిల్లలంతా విదేశాలు వెళ్లేటప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ తండ్రి ప్రోపర్టీ మీదే కదా తీసుకున్నారు?’ అన్నాడు నారాయణరావు ఆలోచనగా.
‘అలా కాదు నాన్నగారు, ఇల్లు నా పేరున ఉంటే పక్కాగా ఉంటుంది అంటున్నారు మా వాళ్లంతా!’ అన్నాడు.
‘సరే అయితే, అలాగే చేద్దాంలే!’ అని కొడుక్కి హామీ ఇచ్చాడే గాని, ఆ విషయాన్ని లోతుగా ఆలోచించలేకపోయాడు నారాయణరావు.
ఇల్లు ఎప్పుడైతే సునీల్ పేరు మీదకు మారి పోయిందో అప్పుడే ఆ ఇంట్లో నారాయణరావు పరిస్థితి తారుమారయిపోయింది. నారాయణరావుకి పెట్టే తిండి దండగగా భావించసాగింది కోమలి. ఒకటో తేది నాడు మామగారి పెన్షన్‌ను ఎంతో లాఘవంగా తీసుకునే కోమలి అతడి అవసరాలు తీర్చే విషయంలో పూర్తి అలసత్వం వహించసాగింది.
సునీల్‌కి భార్య చేసేది తెలుస్తూనే ఉన్నా, ఏమీ మాట్లాడలేకపోయేవాడు. మాటకు ముందే ఈ ఇంట్లో తాను చేసే సర్వీస్‌కి ఎవరూ ఖరీదు కట్టలేరు అంటూ విరుచుకు పడేది అందరిమీదా.
తండ్రి విషయంలో మరదలు అనుసరిస్తున్న తీరు. అది చూస్తూ కూడా ఏమాత్రం ఖండించని తమ్ముడి వైఖరి గురించి తెలుసుకున్న పద్మ ఒకరోజు ఇంటికి వచ్చి గట్టిగా మందలించబోయింది.
‘నువ్వు మాకేమీ నీతులు చెప్పనక్కరలేదు. మా సంగతి మాకు తెలుసు. మాకు చెప్పేముందు మీ అత్తమామల్ని ఎలా చూస్తున్నావో గుర్తు చేసుకో!’ అంది కోమలి పెడసరంగా.
‘మా అత్తమామలకి మేము ఏం లోటు చేశాము. వాళ్లా పల్లెటూరు వదిలి రామంటే, అక్కడ వారికి ఏ లోటూ లేకుండా అన్నీ అమర్చి వచ్చాము. నెలకో సారి అక్కడికి వెళ్లి వాళ్ల మంచి, చెడ్డలు, మందూ, మాకు సంగతి చూసి వస్తున్నాము. నీలాగా కాదు మేము. మా నాన్నగారు కష్టపడి కట్టుకున్న ఇంటిలో ఆయన్నే ఒక పనికిరాని పాత వస్తువులా జమకట్టి చూస్తున్నారు మీరు. ఆయన పెన్షన్ అంతా తీసుకునే నువ్వు నాన్నగారికి కనీస అవసరాలైన మందులు కొనివ్వడానికి కూడా ఇష్టపడవు. ఇదేమైనా బాగుందా నీకు?’ అంది పద్మ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.
‘అంత బాధ్యత గల దానివైతే ఆయన్ను తీసుకువెళ్లి నువ్వే చూసుకో. కాదన్నదెవరు?’ అంది కోమలి దురుసుగా.
‘ఈ ఇంట్లోంచి కదలవలసి వస్తే, కదల వలసింది ఆయన కాదు, మీరు. ఈ ఇల్లు మా నాన్నగారి స్వార్జితం. తనెక్కడికి వెళ్తారు?’ అంది పద్మ నిలదీస్తున్నట్లుగా.
ఆ మాట విని వేళాకోళంగా నవ్వుతూ ‘ఇంకా ఆయనదెక్కడుంది. ఈ ఇల్లు మీ తమ్ముడి పేరున ఎప్పుడో రాసేశారు!’ అంది కోమలి నిర్లక్ష్యంగా.
ఆ మాట విని ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తూ ‘నిజమా, నాన్నగారు ఇల్లు తమ్ముడు పేర రాసేశారా? రాసేముందు నాకొక్క మాటైనా చెప్పలేదు ఎందుకని?’ అంది పద్మ బాధగా.
‘ఏం.. చెప్తే నువ్వు వాటాకొచ్చేద్దామనా?’ అంది కోమలి ఎగతాళిగా.
‘ఏమిటి నాన్నా ఇదంతా?’ అంది పద్మ తండ్రి వైపు నిస్సహాయంగా చూస్తూ. నారాయణరావు దోషిలా తల వంచుకున్నాడు ఏమీ మాట్లాడలేక.
చివరికి పద్మ ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా ‘పదండి నాన్నా వెళదాం!’ అంది లేచి నిలబడి.
‘వద్దమ్మా, ఇప్పటికి జరిగింది చాలు. ఆడపిల్లవని నీ పట్ల చిన్న చూపుతో, వాడు మగపిల్లాడు, వంశోద్ధారకుడు అనే మూర్ఖత్వంతో చాలా వివక్షగా వ్యవహరించాను. మీ తమ్ముడు ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టుకుంటాను అని చెప్పి ఇల్లు తన పేర రాయించుకున్నాడు. నేను వాడి మీద గల గుడ్డి ప్రేమకో, నమ్మకానికో వాడేం చేయబోతున్నాడో ఏమాత్రం విచారించకుండా ఇల్లు వాడి పేరు మీద రాసేశాను.
నీకు తెలిస్తే పడనివ్వవని నీకు చెప్పలేదు. అలా రాశాక వాడు వ్యాపారం ఏమీ పెట్టకుండా, ఉద్యోగంలో కొనసాగడం చూశాక గానీ, వాడు, వాడి భార్య కలిసి నన్నెంత మోసం చేశారో గ్రహించలేక పోయాను. దాని ఫలితంగా ఇప్పుడు ఇదిగో ఇలా నిరాధారంగా, నిరాదరణకు గురై జీవచ్ఛవంలా బతుకుతున్నాను. ఇప్పుడు ఇంత జరిగాక మీ ఇంటికి ఏ ముఖం పెట్టుకొని రాగలనమ్మా! అలా వస్తే మీ అత్తమామల దగ్గర నాకెంత నగుబాటు?’ అన్నాడు నారాయణరావు.
‘ఈ ఫాల్స్ ప్రిస్టేజ్‌లే మనలాంటి వారి జీవితాలను చిందరవందర చేసి శాసిస్తున్నాయి నాన్నా. నా ఉన్నతికి కారకులైన మీకు ఆ మాత్రం చేయకూడదా? ఒకవేళ చేయవద్దని ఎవరైనా అన్నా, నేను లెక్క చేయను. ఎందుకంటే, మా అత్తమామలను ఎంత బాధ్యతగా చూసుకుంటున్నానో, మీ పట్ల కూడా నాకు అంత బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. బయలుదేరండి నాన్నా!’ అంది పద్మ గంభీరంగా చూస్తూ.
‘సారీ అమ్మా. ఎంతయినా నేను ఆడపిల్ల ఇంట్లో ఉండలేనమ్మా. చావైనా, రేవైనా నా బతుకు ఇక్కడే తెల్లారిపోవాలి’ అన్నాడు నారాయణరావు కన్నీళ్లను అదిమి పెట్టి.
‘ఏమిటి నాన్నా ఈ మొండితనం. ఆడపిల్లనయినా, నేను మీ బిడ్డనే కద నాన్నా! నా కన్నతండ్రిని ఈ స్థితిలో ఇక్కడ వదిలి అక్కడ నేను స్థిమితంగా ముద్ద నోట పెట్టగలననే అనుకుంటున్నారా? ఎందుకు నాన్నా, మాట్లాడితే ఆడపిల్లనంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతారు?’ అంటూ దోసిట్లో ముఖం ఇముడ్చుకుని కదిలి కదిలి ఏడ్చింది పద్మ.
అది చూసి నారాయణరావు మనసు కదిలి పోయింది. తన ఆలోచనా విధానం తప్పు అని తెలుసుకున్నాడు. వెంటనే, ఆగలేనట్లుగా నిలుచున్న చోట నుండి లేచి పద్మ దగ్గరకు వెళ్లి ‘వద్దమ్మా, వద్దు. ఇక నిన్ను ఎన్నటికీ అలాంటి భావనతో చూడను. పద వెళ్దాం!’ అంటూ కూతురి భుజం మీద చేయి వేశాడు అనునయంగా.
--((**))--
6. కొత్త వెలుగు*
రచన - తమిరిశ జానకి
జనవరి ఒకటవతేదీ వస్తోంది. కొత్తసంవత్సరం వచ్చేస్తోంది ఈ ఆలోచన భాస్కర్ మనసులో చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. దానికి ఋజువు అతని కళ్ళల్లో కనిపిస్తోంది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా చూసేకళ్ళు ఇప్పుడేమో దిగులంటే ఏమిటో మాకు తెలియదన్నట్టు చిద్విలాసంగా నవ్వుతున్నాయి.
డిగ్రీ వరకూ చదువుకున్నాడుగానీ పైచదువుకి ఆసక్తి లేదు పోనీ ఏదన్నా ఉద్యోగం వెతుక్కుని బతుకుతెరువు చూసుకుందామన్న ఆలోచనా లేదు భాస్కర్ కి.
తన భవిష్యత్తు బావుండాలన్న కోరిక మాత్రం ఉంది.
మానవస్వభావమే చిత్రమైనది అందులో భాస్కర్ లాంటి మనుషుల తీరు మరింతవిచిత్రం. కృషి పట్టుదల వెనక్కినెట్టి కోరికని ముందుకినెట్టి గాలిలో దీపం పెట్టే వ్యక్తుల తీరు విచిత్రంకాక మరేమిటి ?
బాధ్యతారాహిత్యంగా నడుచుకునే కొడుకుని చూస్తూ కుమిలిపోయేది కన్నతల్లితండ్రులేగా !
శంకరయ్యకీ సావిత్రికీ కొడుకుని దారిలో పెట్టడం సాధ్యం కావట్లేదు. ఓపికగా చెప్తుంటే చెవిని పెట్టడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. మరీ గట్టిగా చెప్తే విసుగుచూపిస్తూ చిరాగ్గా ఇంట్లోంచి వెళ్లిపోయి ఊరినపడితిరిగి ఎప్పటికో ఇల్లు చేరతాడు.
దాంతో భయపడి లోపల్లోపల బాధపడుతూ మంచిరోజులకోసం ఎదురుచూస్తున్నారు.
రెండువేలపదహారునించీ నీకు మంచిరోజులొస్తాయని తన చెయ్యిచూసి సోమయాజులుగారు చెప్పినప్పటినించీ కొత్తసంవత్సరం కోసం ఎదురుచూస్తున్నాడు భాస్కర్. అందుకే జనవరి ఒకటవతేదీ వచ్చేస్తోందని ఆనందతాండవం ఆడుతోంది అతగాడి మనసు.
ఆరోజు శంకరయ్య చాలా హడావిడిగా వచ్చాడు ఇంటికి.
అమ్మయ్య నువ్వు ఇంట్లోనే ఉన్నావుకదా ఒక్కసారి చంద్రశేఖర్ గారి దగ్గిరకి వెళ్లివద్దాం పద అన్నాడు కొడుకువంక చూస్తూ.
ఎందుకూ ?
అడిగిన తీరులోనూ ఆ గొంతులోనూ తెలిసిపోతోంది అయిష్టత నిర్లక్ష్యం కూడా.
ఆయన ఆఫీసులో ఖాళీలున్నాయిట. నీకు ఉద్యోగం ఇప్పించమని అడుగుతాను. డిగ్రీ చదివినవాడు కావాలిట. నా స్నేహితుడొకడు చెప్పాడు.
చంద్రశేఖరంగారి ఆఫీసులోనా ఇష్టంలేదు నాకు.
వేళకానివేళ పడుకున్నదేకాక మంచమ్మీద కాస్తకూడా కదల్లేదు భాస్కర్.
పోనీ ఎక్కడైనా ప్రయత్నిస్తున్నావా సంతోషమే అలా అయితే తండ్రిమాటలకి చటుక్కున లేచి కూచున్నాడు మంచమ్మీద.
ఎక్కడా ప్రయత్నించక్కర్లేదు నాన్నా. ఉద్యోగం అదే వస్తుంది.
చిన్నగా నవ్వాడు శంకరయ్య.
అసలు ప్రయత్నమే చెయ్యకపోతే ఎలా వస్తుంది ఉద్యోగం ?
అదే వస్తుంది. కొత్త సంవత్సరంలో నాకు మంచిరోజులొస్తాయని నా చెయ్యి చూసి సోమయాజులుగారు చెప్పారు. ఇంక నేను వాళ్ళచుట్టూ వీళ్ళచుట్టూ తిరగడం ఎందుకూ?
తెల్లబోయి చూశాడు శంకరయ్య.
మంచిరోజులొస్తాయని చెప్పినప్పుడు సంతోషంగా మరింత శ్రద్ధగా మరింత పట్టుదలతో ఏఅవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రయత్నాలు చెయ్యాలికదా భాస్కర్. నిమ్మకి నీరెత్తినట్టు కూచుంటే ఎలా ? ఆయన చెప్పినమాట నీలో ఉత్సాహాన్ని పుట్టించి మంచిరోజుల్ని మెళకువలతో నీ ముంగిట నిలబెట్టుకునే కృషికి బీజం వెయ్యాలి. అంతేగానీ చేతులు ముడుచుకుని కూర్చోమని కాదు.
అబ్బబ్బా..! నాన్నా నీకు మరీ చాదస్తం ఎక్కువైంది. మంచిరోజులు ముందున్నాయని తెలిసినప్పుడు హాయిగా కాలిమీద కాలేసుకుని కూచోక నేనెందుకు శ్రమపడాలి...? నన్నిలా వొదిలెయ్యి. అప్లికేషన్లకి ఇంటర్వూలకి డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు.
నిక్కచ్చిగా చెప్పేశాడు భాస్కర్.
ఆ రోజు భాస్కర్ జ్వరంతో పడకేశాడు. ఏమీ తినలేదు, కాఫీ కూడా నోటికి సయించలేదు. రెండోరోజుకి ఇంకా ఎక్కువైందే తప్ప తగ్గలేదు. డాక్టర్ తో చెప్పి తన తండ్రి మందులు తీసుకొస్తాడేమోనని ఆశతో ఎదురుచూశాడు. ఉహూ ఆప్రయత్నమే కనిపించలేదు. అమ్మకి ఒంట్లో బాగులేనప్పుడు డాక్టర్ దగ్గిరకి తీసికెళ్ళాడు కదా మరి తన సంగతి పట్టించుకోవట్లేదేమిటి డాక్టర్ దగ్గిరకి వెళ్దామా అన్నమాటే ఆయన నోటినించి రాలేదే!
తనే నోరు తెరిచి అడిగేశాడు ఆ మర్నాడు డాక్టర్ దగ్గిరకి వెళ్తానని.
తల అడ్డంగా ఊపాడు శంకరయ్య అవసరం లేదంటూ... వింతగా చూశాడు భాస్కర్. ఇదివరకెప్పుడైనా తనకి కాస్త నలతచేసినా ఎంతో కంగారుపడిపోతూ కూడా ఉండి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళేవాడు. అటువంటిది ఇప్పుడిదేమిటి ఇంత జ్వరంగా ఉంటే కూడా నిమ్మకి నీరెత్తినట్టున్నాడు.
తండ్రి మీద బాగా కోపం వచ్చింది బాస్కర్ కి. తల్లికి పిర్యాదు చేశాడు. ఆవిడ సమాధానం చెప్పలేదు భర్త ముఖంలోకి చూసింది.
కొడుకు నోటినించి ఆమాట కోసమే ఎదురు చూస్తున్న శంకరయ్య చాలా మామూలుగా మృదువుగా అన్నాడు
"అదికాదు బాస్కర్ నీకు జనవరి ఒకటినించీ మంచిరోజులొచ్చేస్తాయని సోమయాజులు గారు చెప్పారు కదా. ఎల్లుండేగా ఒకటవతేదీ రేపొక్కరోజే మధ్యలో. ఆమాత్రానికి డాక్టరూ మందులూ అంటూ తిరుగుడెందుకు ? డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పు".
గబుక్కుని మంచమ్మీదనించి లేచాడు భాస్కర్.
మంచిరోజులొస్తాయని వైద్యం చేయించుకోకుండా కూచుంటారా ఎవరైనా ? తగ్గించుకుందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించరా ?
చిరాకు ధ్వనించింది ఆ గొంతులో.
చిన్నగా నవ్వాడు శంకరయ్య జాలిగా కొడుకు వంక చూస్తూ.
మంచిరోజులొస్తున్నాయని అసలు ఉద్యోగ ప్రయత్నాలే చెయ్యకుండా కూచున్నావుకదా ! ఆనమ్మకం ఉన్నప్పుడు అనారోగ్యానికి మందులెందుకు..? మంచిరోజులు ఎలాగో వస్తున్నాయిగా... తగ్గించుకునే ప్రయత్నం నువ్వెందుకూ చెయ్యడం?
నోరెళ్ళబెట్టి చూశాడు భాస్కర్. తన తప్పు అర్ధమైంది. తన ఆలోచనా విధానంలో పొరపాటు గ్రహించగలిగాడు.
ప్రేమగా కొడుకు భుజమ్మీద చెయ్యివేశాడు శంకరయ్య.
భవిష్యత్తు బావుందని చెప్పినా లేదా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినా మనం చేయవలసిన ప్రయత్నం చెయ్యకుండా గాలిలో దీపం పెట్టి గాలిని తిట్టుకోవడం హాస్యాస్పదం కాదంటావా ?
నన్ను క్షమించండి నాన్నా!
మనస్ఫూర్తిగా ఆ మాట అనడానికి అరక్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు
--((**))--
5. ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒక భక్తుడు ఏడుస్తూ " స్వామి ! నేను మహా పాపిని ; తమ పాదాల దగ్గిరికి చాలాకాలం నుంచి వస్తున్నాను ; కాని నాలో ఏ మార్పు లేదు ; నేను బాగుపడేది ఎట్లా ... ? ఎన్నటికి ... ? ఇక్కడ ఉన్నంతకాలం యోగ్యుణ్నే , కాని ఇక్కడ నుంచి వెళ్లిన మరుక్షణం నేను మనిషిని కాదు , మహా పాపిని ” అని అన్నారు .
మహర్షి : నువ్వేమైతే నాకేం ! నా ముందు ఎందుకు ఏడుస్తావు ! నీకూ , నాకు ఏం సంబంధం !
భక్తుడు : మీరే నా గురువు ; మీరే గతి ; మీరే అట్లాఅంటే , నేనేమైపోను ! నాకింక దిక్కేమిటి !
మహర్షి : నేను నీ గురువునా ! ఎవరు చెప్పారు , నేను నీగురువునని నేను అన్నానా !
భక్తుడు : మరి మీరు కాకపోతే , నా గురువు ఇంకెవరు !ఈ లోకంలో నాకింక దిక్కెవరు ! మీరు
కరుణించి నన్ను పావనుణ్ని చేస్తావనే కదానేను బతుకుతోంది !
మహర్షి : నేను నీ గురువునైతే నాకు గురుదక్షిణఏమి ఇచ్చావు !
భక్తుడు : మీరు ఏమీ తీసుకోరు గదా !
మహర్షి : నీ కెట్లా తెలుసు నేను తీసుకోనని ! నేనుచెప్పానా , నాకు గురుదక్షిణ అక్కర్లేదని !
సరే, ఇప్పుడడుగుతున్నాను ఇయ్యి. ఇస్తావా !
భక్తుడు : ఏమి కావాలో తీసుకోండి .మహర్షి : ముందు నీ పుణ్యం నాకు ధారపొయ్యి .భక్తుడు : నాకేమన్నా పుణ్యమనేది వుంటేగా ,మీకు ఇవ్వడానికి !
మహర్షి : ఆ సంగతి నీ కెందుకు ... ?
ఉన్న పుణ్యమేదో నాకిచ్చెయ్యి , ఇచ్చేస్తావా !
భక్తుడు : ఎట్లా ఇయ్యను .... ?
ఇయ్యడం ఎలాగో మీరే చెప్పండి ఇస్తాను.”
మహర్షి : నా పుణ్యంతో నాకేమి నిమిత్తం లేదు . దానివల్ల వచ్చే ఫలితం నా కక్కరలేదు . అంతా
మీకిచ్చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పు .
భక్తుడు : అట్లాగే స్వామీ ! గురుదక్షిణ కింద నాపుణ్యమంతా సంతోషంగా అర్పిస్తున్నాను .
మహర్షి : సరే ; ఇప్పుడు గురుదక్షిణ కింద నీ పాపంఅంతా ఇవ్వు.
భక్తుడు : అయ్యో ! మీకు తెలీదు స్వామీ ; నేనెటువంటిపాపాలు చేశానో ! తెలిస్తే ఆ మాట మీరు
అనరు . నా పాపాలు తీసుకున్నారా, వాటిఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది .వద్దు , వద్దు . నా పాపాలు కోరకండి .”
మహర్షి : ఆ సంగతి నేను చూసుకుంటాను . ఇచ్చెయ్యి .
భక్తుడు : నేను చేసిన పాపాలు నావి కావు .వాటిఫలితమూ అంతా రమణులదే.”
మహర్షి : సరే ; ఇక నుంచి నీకు పాపపుణ్యాలు లేవు .పుణ్యపాపాలు లేని పరిశుద్ద ఆత్మవి నీవు .
నువ్వు నీలాగనే వుండిపో .
భక్తుడు : మీరే నా గురువు ; మీరే గతి ; మీరే అట్లాఅంటే , నేనేమైపోను ! నాకింక దిక్కేమిటి !
మహర్షి : నేను నీ గురువునా ! ఎవరు చెప్పారు , నేను నీగురువునని నేను అన్నానా !
భక్తుడు : మరి మీరు కాకపోతే , నా గురువు ఇంకెవరు !ఈ లోకంలో నాకింక దిక్కెవరు ! మీరు
కరుణించి నన్ను పావనుణ్ని చేస్తావనే కదానేను బతుకుతోంది !
మహర్షి : నేను నీ గురువునైతే నాకు గురుదక్షిణఏమి ఇచ్చావు !
భక్తుడు : మీరు ఏమీ తీసుకోరు గదా !
మహర్షి : నీ కెట్లా తెలుసు నేను తీసుకోనని ! నేనుచెప్పానా , నాకు గురుదక్షిణ అక్కర్లేదని !
సరే, ఇప్పుడడుగుతున్నాను ఇయ్యి. ఇస్తావా !
భక్తుడు : ఏమి కావాలో తీసుకోండి .మహర్షి : ముందు నీ పుణ్యం నాకు ధారపొయ్యి .భక్తుడు : నాకేమన్నా పుణ్యమనేది వుంటేగా ,మీకు ఇవ్వడానికి !
మహర్షి : ఆ సంగతి నీ కెందుకు ... ?
ఉన్న పుణ్యమేదో నాకిచ్చెయ్యి , ఇచ్చేస్తావా !
భక్తుడు : ఎట్లా ఇయ్యను .... ?
ఇయ్యడం ఎలాగో మీరే చెప్పండి ఇస్తాను.”
మహర్షి : నా పుణ్యంతో నాకేమి నిమిత్తం లేదు . దానివల్ల వచ్చే ఫలితం నా కక్కరలేదు . అంతా
మీకిచ్చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పు .
భక్తుడు : అట్లాగే స్వామీ ! గురుదక్షిణ కింద నాపుణ్యమంతా సంతోషంగా అర్పిస్తున్నాను .
మహర్షి : సరే ; ఇప్పుడు గురుదక్షిణ కింద నీ పాపంఅంతా ఇవ్వు.
భక్తుడు : అయ్యో ! మీకు తెలీదు స్వామీ ; నేనెటువంటిపాపాలు చేశానో ! తెలిస్తే ఆ మాట మీరు
అనరు . నా పాపాలు తీసుకున్నారా, వాటిఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది .వద్దు , వద్దు . నా పాపాలు కోరకండి .”
మహర్షి : ఆ సంగతి నేను చూసుకుంటాను . ఇచ్చెయ్యి .
భక్తుడు : నేను చేసిన పాపాలు నావి కావు .వాటిఫలితమూ అంతా రమణులదే.”
మహర్షి : సరే ; ఇక నుంచి నీకు పాపపుణ్యాలు లేవు .పుణ్యపాపాలు లేని పరిశుద్ద ఆత్మవి నీవు .
నువ్వు నీలాగనే వుండిపో .
మహర్షి మాటలతో గొప్ప శాంతిని పొంది ఆనందంతో వెళ్లిపోయారు ఆ భక్తుడు ; ఏమైనాడో తెలియదు ; మళ్ళీ ఆశ్రమానికి తిరిగి రాలేదు .
4. కొన్ని పదాలు మనకు అర్థం తెలియకుండానే వాడేస్తాం...అందులో "ససేమిరా" ఒకటి...
ఇప్పుడు పిల్లలకి తెలియదు, వాడటం కూడా లేదు... అక్కడక్కడా పుస్తకాలలోనూ, న్యూసు పేపర్లకి పరిమితం అయింది.
ఓ వారం రోజుల బట్టీ రకరకాలుగా గూగుల్ లో గిల గిల గిల కొడితే ఇదిగో ఈ వెన్న దొరికింది....
మీ అందరికీ కూడా తెలుస్తుందని ఇలా పంచుతున్నాను.
శ్రీ పంతుల గోపాల కృష్ణ గారి బ్లాగ్ "అపురూపం" నుండి గ్రహించినది
ససేమిరా... ససేమిరా... ఏమిటీ ససేమిరా కథ...?
ససేమిరా..కథ..ఏమిటీ ససేమిరా?
ఆ మధ్య వచ్చిన ఒక సినిమాకి టాగ్ లైన్ చిత్రంగా ఉంది. ఆ సినిమా పేరు “సీతయ్య”. టాగ్ లైన్ ఏమో...”ఎవరి మాటా వినడు..” ఈ సినిమా వచ్చేక మా వాళ్ళలో ఎవరైనా మొండిగా ఎవరి మాటా వినని వాడిని వాడో సీతయ్య అనడం ప్రారంభించేము.
మరి ఈ సినిమా రాకముందు ఆంధ్ర దేశంలో ఎవరైనా తన మాట తప్ప వేరొకరి మాట వినని వారిని “ససేమిరా గాళ్ల”నే వారు. ఇంతకీ ఈ ససేమిరా ఏమిటి?
దీనర్థం ఏమిటి?
ఇది ఎలా వాడుకలోకొచ్చింది?
అంటే దీనికి చాలా పెద్ద కథుంది.
అది చెబ్తాను. కొంచెం ఓపిగ్గా వినండి మరి.
పూర్వం విశాల అనే నగరాన్ని నందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడట. అతని ఏకైక కుమారుని పేరు విజయపాలుడు, అతడు కడు దుర్మార్గుడు. అతడొక నాడు వేటకు పోయి కారడవి లో వేటపందిని తరుముతూ అలసిపోయి ఒక చెరువు గట్టున విశ్రమిస్తాడు, ఇంతలో అక్కడికి ఒక బెబ్బులి గాండ్రించుకుంటూ వస్తుంది. అతడి గుర్రం కట్టు తెంచుకుని పారిపోతుంది. అతడు పరుగెత్తి దగ్గర్లోని ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అంతకు ముందే ఆ చెట్టు మీద ఒక ఎలుగ్గొడ్డు ఎక్కి కూర్చుంది. కిందికి దిగి పారి పోదా మంటే పెద్దపులి అక్కడే మాటు వేసి కూర్చుంది. భయంతో వణుకుతున్న రాజకుమారుణ్ణి చూసి ఆ ఎలుగ్గొడ్డు ప్రాణ భయంతో తన వద్దకు వచ్చిన వానిని తాను చంపనని అభయమిస్తుంది. రాజకుమారుడు మనసు కుదుటపడిన వాడై, అలసిపోయి ఉన్నాడు కనుక అక్కడే చెట్టు కొమ్మమీదే నిద్ర కుపక్రమిస్తాడు... అతడు పడిపోకుండా ఎలుగ్గొడ్డు కాపలా కాస్తుంటుంది.
చెట్టు కింద నున్నపులి రాజకుమారుడు నిద్ర పోవడం చూసి, ఎలుగ్గొడ్డుతో “మనం మనుష్యులను నమ్మ వచ్చా అందులోనూ ఈ మనిషి మహా మోసగాడులా ఉన్నాడు, ఎంతైనా మనం మనం ఒకటి, ఈ అడవిలో పుట్టి పెరిగిన వాళ్లం. కలసి బతకాల్సిన వాళ్లం అతడ్ని కిందికి తోసేయి చంపి చెరిసగం పంచుకు తిందాం" అన్నది.
ఎలుగ్గొడ్డు దానికి ఒప్పుకోక పోవడంతో పులి అలాగే చెట్టుకిందే తిష్ట వేసి కూర్చుంది.
కాసేపటికి రాజకుమారుడికి తెలివి వచ్చింది. ఎలుగ్గొడ్డుకి రాజకుమారుని మనసు పరీక్షించాలని బుధ్ధి పుడుతుంది. రాజకుమారుడితో “ఇంతసేపు నేను నీకు కాపలా కాసేను. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది, నీ తొడమీద కాసేపు విశ్రమిస్తాను” అంటుంది. రాజకుమారుడు సరేనంటాడు. ఎలుగ్గొడ్డు అతడి ఒళ్లో తల పెట్టుకుని నిద్ర నటిస్తుంది. ఇది చూసిన పులి అతడితో “ఎలుగ్గొడ్డుని ఎవరైనా నమ్ముతారా.. అది నేను వెళ్లి పోయిన తర్వాత నిన్ను చంపి తింటుంది, నా మాట వినిదానిని కిందకు తోసేయి. దానిని చంపి తినేసి నేను వెళ్లి పోతాను. ఆ తర్వాత నువ్వు హాయిగా వెళ్ళి పోవచ్చు” అంది. దుర్మార్గుడైన రాజకుమారుడు విశ్వాసం లేకుండా ఎలుగ్గొడ్డుని కిందకు తోయబోతాడు, కాని నిజంగా నిద్రపోని ఆ ఎలుగు చెట్టు కొమ్మని పట్టుకుని ఉండడంవల్ల కింద పడకుండా ప్రాణాలు దక్కించుకుంటుంది, ఇంతలో తెల్లవారిపోవడంతో పులి నిరాశతో వెళ్లి పోతుంది. రాజకుమారుడింక తనకు చావుమూడిందనే అనుకుంటాడు, కాని మంచిదైన ఆ ఎలుగ్గొడ్డు అతనితో “నిన్ను చంపను, కానీ నీకు తగిన శాస్తి జరగాలి. కనుక నీద్రోహ బుధ్ధి జనానికి తెలిసేంత వరకూ పిచ్చి వాడిలా “ససేమిరా..ససేమిరా..” అంటూ ఈ అడవిలో తిరుగుతూనే ఉండు. నీ ద్రోహ బుధ్ధి ఎవరైనా బట్టబయలు చేసి నప్పుడు నీకు శాప విముక్తి కలుగు తుంది.”అంటూ శపించి అతనిని వదలి వెళ్లి పోతుంది. విజయపాలుడు ఆ అరణ్యంలోనే ససేమిరా.. ససేమిరా అంటూ పిచ్చి వాడిలా తిరుగుతూ ఉంటాడు.
రాజకుమారుడు వేటకై ఎక్కి వెళ్ళిన గుర్రం తిరిగి వచ్చినా రాజకుమారుడు రాక పోవడంతో కలవర పడ్డ రాజు గారు వానికోసం వెతికించి అడవిలో పిచ్చివానిగా తిరుగు తున్న తన కుమారుణ్ణి నగరానికి తీసుకు వస్తాడు.
ఎన్ని రకాల వైద్యాలు చేయించినా, ఎందరికి చూపించినా రాజకుమారుడు ససేమిరా అంటూ పిచ్చివాడిగానే మిగిలి పోతాడు. అప్పుడు ఆ దేశపు మంత్రిగారికి ఈపిచ్చిని కుదర్చగల శక్తి వారి రాజగురువైన శారదా తనయునికి మాత్రమే ఉందని చెప్పి, వారిని బ్రతిమాలుతాడు. ఆ రాజగురువు తన దివ్యదృష్టితో అడవిలో జరిగిన దంతా గ్రహించిన వాడై, రాజ సభలో అందరి ముందరా, ఆ అడవిలో జరిగిన సంఘటనను సూచించే పద్యాలు ఇలా చదువుతాడు. మొదటి పద్యం-
సజ్జన భావము కల్గు సు
హృజ్జనులను మోసపుచ్చుటది నేరుపె నీ
పజ్జం దొడపై గూర్చిన
యజ్జంతువు జంప జూచుటది పౌరుషమే?
ఈ పద్యం వినగానే రాజకుమారుడు “ససేమిరా” లో “స” వదిలేసి “సేమిరా”అని మాత్రం అంటుంటాడు.
రాజగురువు చదివిన రెండవ పద్యం-
సేతువు దర్శింప మహా
పాతకములు బాసి పోవు, బ్రాణ సఖునకున్
ఘాతుకమతి నొనరించిన
పాతకమే తీర్థ సేవ బాయునె నరునిన్?
ఇది విన్నాక రాజకుమారుడు “సేమిరా”లో “సే” వదిలేసి “మిరా” అని మాత్రం అంటుండేవాడు.
రాజగురువు చదివిన మూడవ పద్యం-
మిత్రద్రోహి, కృతఘ్నుడు,
ధాత్రీసుర , హేమ తస్కరుడు, సురా
పాత్రీ భూతుడు, నిందా పాత్రులు వీరెల్ల నరక భవనా వాసుల్.
ఇదీ విన్నాక విజయ పాలుడు “రా..రా ..” అని మాత్రమే అంటుండే వాడు.
రాజగురువు చదివిన చివరి పద్యం-
రాజేంద్ర విజయపాలుని
రాజిత శుభ మూర్తి జేయ రతిగల దేనిన్
పూజార్హుల వీరెల్లర
బూజింపు మనూన దాన భోజన విధులన్.
స..సే..మి..రా.. అనే మొదటి అక్షరాలతో ప్రారంభమయ్యే ఈ నాలుగు పద్యాలూ వినగానే రాజకుమారునికి శాపం తొలగి పోయి తన పూర్వస్మృతి కలిగి అరణ్యం లో జరిగినది అందరికీ వివరిస్తాడు. ఈ కథ జక్కన వ్రాసిన విక్రమార్క చరిత్రం లోనిది. అంటే చాలా పాతదన్న మాట.
నేటి యువతరం కోసం, భాష లోని నుడికారం వల్ల కలిగే ప్రయోజనమేమిటో చెప్పి ముగిస్తాను.ఎవరైనా ఒక మొండి మనిషికి ఏదైనా విషయం వివరించి వానిని ఒప్పించి రమ్మని ఎవరినైనా పంపించామనుకోండి. అతడు తిరిగి వచ్చాక ఏం జవాబు చెప్పాడని అడిగితే “ససేమిరా” అంటున్నాడని అంటే, జరిగిన దేమిటో ఎన్నో మాటల్లో చెప్పనక్కర లేకుండా మనకి పూర్తి గా అర్థమై పోతుందికదా? భాషకి జీవమైనటువంటి ఇటువంటి నుడులు క్రమేపీ భాషలోంచి జారిపోతుండడం మన దురదృష్టం.
సెలవు.
(శ్రీ గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలతో)
--((**))-
-
3. జీవితం
ఒక వ్యక్తి కాలి నడకన ఎటో వెళ్తున్నాడు. అది అడవిమార్గం. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొద్ది దూరం తరువాత వెనుక నుండి ఏదో అలికిడి వినిపించింది. వెనుదిరిగి చూశాడు. గుండె ఆగినంత పనయింది. వెనుకగా ఓ పెద్దపులి తను వెళ్తున్న వైపే వస్తోంది. ఏం చేయాలో అర్థం కాక పరుగులంకించుకున్నాడు. పులి కూడా తరుముకుంటూ వెంటపడింది. పొదలు, రాళ్లు, ముళ్లు ఏమీ పట్టించుకోకుండా పరుగులు తీస్తున్నాడు. అంతే వేగంగా పులి కూడా తరుముకొస్తోంది. అలా పరుగెడుతూ ఉండగా అతనికి ఓ పాడుబడిన నుయ్యి కనిపించింది. పిచ్చి మొక్కలు, తీగలు అల్లుకుపోయి ఉందా బావి. బతుకు జీవుడా అనుకుంటూ అందులోకి దిగి ప్రాణాలు దక్కించుకుందామనుకున్నాడు.
అదృష్టవశాత్తూ ఒక ఊడ తాడులా లోనికి వేలాడుతోంది. దాని సహాయంతో నుయ్యిలోకి దిగడం మొదలుపెట్టాడు. సగం దూరం దిగిన తర్వాత కిందికి తొంగి చూశాడు. మరోసారి అతడి గుండెలు జారిపోయాయి. ఒక పెద్ద మొసలి ఎప్పుడు పడిందో బావిలో నోరు తెరుచుకొని చూస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
కిందికి దిగితే మొసలికి ఫలహారం కావడం ఖాయం. పైకెక్కితే పులి తినేయడం కూడా ఖాయమే. అంతలో మరో విపత్తు వచ్చి పడింది. తను పట్టుకుని వేలాడుతూ దిగుతున్న ఊడ (తీగ)ను ఎలుకలు కొరకడం మొదలుపెట్టాయి. ఒకటి నల్ల ఎలుక, రెండోది తెల్ల ఎలుక.
ఎప్పుడు కిందికొస్తాడా తిందామని మొసలి నోరు తెరుచుకొని ఎదురుచూస్తోంది.
ఎప్పుడు పైకొస్తాడా పంజా విసురుదామని పులి కాచుకొని కూర్చుంది. అంతలో అతని దృష్టి పక్కనే చిన్న కొమ్మకు వేలాడుతున్న తేనె తుట్టెపై పడింది. తుట్టెలోంచి రాలుతున్న ఒక్కొక్క బొట్టును వేలితో నాకడం ప్రారంభించాడా వ్యక్తి. అత్యంత మధురంగా ఉన్న తేనెను గ్రోలడంలో నిమగ్నమైన ఆ వ్యక్తి పైన పులినీ, కింద మొసలినీ మరిచిపోయాడు. చేతిలోని ఊడను కొరుకుతున్న ఎలుకలనూ మరిచిపోయాడు. తేనె మధురిమలో మునిగిపోయాడు. ఇంతలో నల్లి ముద్దు పెట్టిందో ఏమో అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కళ్లు నలుముకుంటూ దిగ్గున లేచి కూర్చున్నాడు. కల కాబట్టి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
తెల్లవారి ఉదయం ఓ పండితుని దగ్గరకు వెళ్లి తన స్వప్న ఉదంతాన్ని వివరించాడు. అప్పుడా పండితుడు, నిను వెంటాడిన పులి నీ మృత్యువు. అనునిత్యం అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నోరు తెరిచి నీ కోసం ఎదురు చూస్తున్న మొసలి నీ సమాధి. నువ్వు బావిలోకి దిగడానికి వేలాడిన ఊడ నీ ఆయుష్షు. దాన్ని కొరుకుతున్న తెల్ల ఎలుక పగలు. నల్ల ఎలుక రాత్రి, ఇక నువ్వు ఇవన్నీ మరిచిపోయి, ఏ కమ్మని తేనె వెనుక పడ్డావో అది ప్రాపంచిక వ్యామోహం స్వప్న సారాంశాన్ని వివరించాడు పండితుడు.
అనుక్షణం మృత్యువు మనల్ని వెంటాడుతోంది. సమాధి మనకోసం ఎదురుచూస్తోంది. మంచులా జీవితం కరిగిపోతోంది. మనం మాత్రం ఇవన్నీ మరిచిపోయి, ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయాం. కాని ప్రపంచాన్ని అవసరం మేరకు పరిమితంగా, ధర్మబద్ధంగా వినియోగించుకుంటూ మరణానంతర జీవితం, శాశ్వత జీవితం, పరలోక జీవితం కోసం పాటుపడాలని చెప్పారు.
దైవం మనందరికీ ధర్మబద్ధమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటూ.
2. మనిషికి మనిషి*
రచన....ఎస్వీ కృష్ణజయంతి
‘#ఏమైంది శ్రీనూ.. కారెందుకు ఆపావ్?’
‘నేనాపలేదు సార్.. అదే ఆగిపోయింది’
‘అదే ఆగిపోయిందా?.. ఎందుకాగిపోయిందీ..?!’
‘అదే నాకూ అర్థం కావడంలేదు సార్..’
మూడ్నాలుగు సార్లు ఇగ్నీషన్ తిప్పుతూ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కాని, ‘క్లచ్చ్‌చ్చ్‌చ్చ్..’ అన్న చప్పుడు వచ్చిందే తప్ప కారు మాత్రం స్టార్ట్ కాలేదు.
‘ఉండండి.. చూస్తాను!’ అంటూ డోర్ తీసుకుని కిందికి దిగి కారు ముందు వైపు వెళ్లి బోయ్‌నెట్ ఎత్తిపెట్టి, లోపలికి తొంగిచూస్తూ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్ చేయసాగాడు.. డ్రైవర్ శ్రీనివాస్.
కారు వెనుక సీట్‌లో కూర్చున్న భూపతి నాయుడు అసహనంగా కదిలాడు. ఓసారి చేతికున్న వాచీ చూసుకున్నాడు. సాయంత్రం ఆరున్నర దాటింది.
కిటికీ అద్దం కిందకి దింపి బయటకి చూశాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. తారురోడ్డుకి రెండు వైపులా ఎత్తుగా పెరిగి వున్న చెట్లు రోడ్డుని మరింత చీకటి చేస్తున్నాయి. మరో యాభై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ‘వెంకటాపురం’ చేరుకోగలమని రోడ్డుపక్కనున్న మైలురాయిని చూస్తే అర్థమయింది.
‘ఉన్నట్టుండి ఈ కారు ఎందుకు ఆగిపోయిందబ్బా..’ అనుకుంటూ నెమ్మదిగా డోర్ తీసుకుని కిందికి దిగిన భూపతి నాయుడు ‘ఏమైంది శ్రీనూ.. ఏమిటి ట్రబుల్?’ అనడిగాడు.
బోయ్‌నెట్ మూసి, దగ్గరికొస్తూ అన్నాడు శ్రీనివాస్ - ‘అన్నీ సరిగ్గానే ఉన్నాయ్ సార్... అయినా కారెందుకు ఆగిపోయిందో, మళ్లీ ఎందుకు స్టార్ట్ కావడం లేదో తెలీడం లేదు..’
‘అయితే ఇప్పుడేం చేయాలంటావ్‌రా?’ ఎటూ పాలుపోనట్లుగా అడిగాడు భూపతినాయుడు.
‘మెకానిక్‌కి చూపిస్తే తప్ప విషయమేంటో అర్థం కాదనిపిస్తోంది సార్!’
‘ఈ టైమ్‌లో మనకి మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు శ్రీనూ? ముందుకైనా, వెనకకైనా కనీసం ఓ పాతిక కిలోమీటర్లు వెళ్తే కానీ ఏ ఊరూ వచ్చేట్లు కన్పించడం లేదు. పైగా, ఈ రోడ్డు మీద గంట నుంచి ఒక్క వెహికిల్ కూడా మనకి కన్పించలేదు కదా!’ అంటూ జేబులోని సెల్‌ఫోన్ తీసి ఎవరికో డయల్ చేయబోయాడు భూపతి నాయుడు. కానీ, దురదృష్టం రెట్టింపయినట్లు సెల్‌ఫోన్‌లో కూడా ఛార్జింగ్ అయిపోయి ‘డిస్‌ప్లే’ లేదు.
‘సార్.. ఇలా ఎంతసేపని ఉంటాం? నేను మెకానిక్ కోసం వెళ్తాను.. ఈలోగా ఏదైనా వెహికిల్ వస్తే మీరు లిఫ్ట్ అడిగి వెంకటాపురం చేరుకోండి..’ అని కారులోంచి టార్చ్‌లైట్ తీసుకొని వెంకటాపురం వైపు కాలినడకనే బయల్దేరాడు శ్రీనివాస్.
చేసేదేం లేక ఉస్సూరుమంటూ కారుకి ఆనుకొని నిల్చున్నాడు భూపతి నాయుడు - ఏదైనా వెహికిల్ వస్తే ‘లిఫ్ట్’ అడుగుదామని. చుట్టూరా చీకట్లు చుట్టుముట్టేస్తున్నాయి...
అలా గంటకు పైగా ఎదురుచూసినా.. ఆ దారిన ఒక్క వాహనమూ రాలేదు.
‘ఏంది సారూ.. ఈడున్నావు? యాడికి బోవాల?’
- అన్న మాటలు విన్పిస్తే తల తిప్పి చూశాడు భూపతి నాయుడు.
వెనె్నల వెలుగులో అతడికి కాస్త దూరంలో సైకిలు మీద వస్తూన్న ఓ పల్లెటూరి ఆసామి కన్పించాడు.
అతడు దగ్గరికి రాగానే విషయం చెప్పాడు - వెంకటాపురంలో ఉన్న తన మిత్రుడి ఇంట్లో జరిగే ఓ కార్యక్రమానికి హాజరవ్వాలని బయల్దేరితే ఇలా మధ్యలో కారు ఆగిపోవడం, మెకానిక్ కోసం డ్రైవర్ వెళ్లటం, వెహికిల్ ఏదైనా వస్తే ‘లిఫ్ట్’ అడుగుదామని తానిలా ఎదురుచూడ్డం..!
అంతా విని, ‘రుూ రేతిరి రుూ రోడ్డు మీద యింక యే వాహనమూ తిరగదు సారూ! నన్ను ‘నారాయణ’ అంటారు. రుూడకి దగ్గర్లోనే మా యిల్లుండాది. రుూ రేతిరికి మా యింట్లో బడుకొని పొద్దునే్న పోదువుగానిలే!’ అన్నాడు.
నిజానికి అతడు రాక ముందే భూపతి నాయుడు అనుకుంటూ ఉన్నాడు. ‘ఈ రాత్రి.. ఈ చలిలో.. ఇలా రోడ్డుపైనే జాగారం చేస్తూ గడపాల్సొస్తుందో, ఏమిటో?’ అని. అలాంటిది - నారాయణ వచ్చి తన ఇంటికి రమ్మనే సరికి కాస్త ఊరట కలిగినట్లనిపించినా - ఓ రెండు క్షణాలు ఆలోచించాడుస. ‘ఈ పల్లెటూరి బైతును నమ్మేదెలా? ఒకవేళ నమ్మినా ఇతనికి ఏ పూరిపాకో, రేకుల ఇల్లో అయితే అక్కడెలా ఉండేట్లు?’ ఎంత రాత్రయినా వెంకటాపురం చేరుకోవడమే మేలుగా అనిపించింది భూపతి నాయుడికి. కానీ, ఆ అవకాశమే దరిదాపులల్లో కనిపించటం లేదు.
‘్ఫర్వాలేదులే నారాయణా! నేను ఎలాగోలా వెళ్తాలే!’ అన్నాడు అన్యమనస్కంగానే.
నారాయణ ఏమనుకున్నాడో, ఏమో.. ‘ఎలాగెల్తావు సారూ? ఈ సీకట్లో, సలిలో ఎంతసేపిట్టా రోడ్డుమీదుంటావు? రేతిరయ్యే కొద్దీ యెముకలు కొరికే సలికి తట్టుకోగల ననుకుంటుండావా? నా మాటినీ.. రా.. కూసో.. మా యింటికెల్దాం!’ అంటూ భూపతి నాయుడు అనుమతి కోసం చూడకుండానే సైకిల్‌ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు.
భూపతి నాయుడు కాసేపు తటపటాయించి సైకిల్ క్యారియర్ మీద కూర్చున్నాడు. ఆటోల్లో, రిక్షాల్లో తిరిగే పరిస్థితి కాదు ఆయనదిప్పుడు.
దారిపొడవునా, నారాయణ ఏదో ఒకటి మాట్లాడుతునే ఉన్నాడు - పెరిగిపోతున్న ఖర్చులూ, దళారుల ఆగడాలూ, తమలాంటి రైతుల పాట్లు, కొండెక్కి కూర్చున్న ధరలూ.. ఇలా ఏవేవో!
నాయుడు ‘ఊఁ..’ కొడ్తూనే ఆలోచిస్తున్నాడు. ఆయన మనసు పరిపరి విధాల యోచిస్తోంది. ‘సమయానికి తన కారు డ్రైవర్ కూడా లేడు. ఈ నారాయణ గాడింట్లో వసతి ఎలాగుంటుందో, ఏమో?! అక్కడ బాత్రూమ్‌లు ఉన్నాయో, లేవో?! ఉదయానే్న ఏ చెరువు కట్టో చూపించడు కదా! అయినా - వీడ్ని ఎంతవరకు నమ్మొచ్చో, ఏంటో?’
బలమైన కుదుపుతో సైకిల్ ఆగడంతో ఇహలోకంలోకి వచ్చాడు భూపతి నాయుడు.
ఓ రేకుల షెడ్డు లాంటి ఇంటి ముందు ఆగి వుంది సైకిల్.
నారాయణ సైకిల్ దిగడంతోనే మూడేళ్లు, ఐదేళ్లు వయసు గల పిల్లలు అతణ్ణి చుట్టేశారు. జేబులోంచి వేరుశెనగ ఉండలు తీసి వాళ్లకిచ్చి, ‘నా మనవలు సారూ!’ అని నాయుడికి పరిచయం చేసి ఇంట్లోకి దారి తీశాడు నారాయణ.
రేకుల ఇల్లయినా ఓ పద్ధతి ప్రకారం ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది వుండడం చూసి ముచ్చటేసింది నాయుడుకి. లోవోల్టేజీతో వెలుగుతున్న కరెంటు బల్బు తన గుడ్డివెలుగుని గది మొత్తం సమానంగా పరచడానికి శాయశక్తులా శ్రమిస్తూ ఉంది. గదిలో ఓ మూల పలుగూ, పారలూ, తట్టలూ బోర్లించి వున్నాయి.
గోడకి ఆనించి పెట్టిన ఓ ఇనుప కుర్చీని తెచ్చి వేస్తూ ‘కూసో సారూ! కాస్త ఉడుకుడుగ్గా నీళ్లు పోస్కుంటే అలసట పోద్ది. ఈలోపల్నే భోజనం తయారవుద్ది!’ అని వంట గదిలోకి వెళ్లబోయిన నారాయణతో -
‘అరెరెఁ.. భోజనం గట్రా ఇప్పుడెందుకులే నారాయణా..’ అని నాయుడు అంటూండగానే-
‘అదేంది సారూ.. యే యేలప్పుడు తిన్నావో, యేందో! యెంతసేపూ.. కాసేపట్లో తయారుగాదూ?’ అంటూ అక్కడ్నుంచి కదిలి, వంటగదిలోకి వెళ్లి భార్యకు కాబోలు - లోగొంతుకతో ఏవో ఆదేశాలు జారీ చేశాడు. పది నిమిషాల్లో భూపతి నాయుడికి ఉతికిన తువావలు, కొత్త సబ్బు అందించి పెరట్లోని మల్లెచెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు.
రెండు బకెట్లలో వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయక్కడ. నాయుడు స్నానం ముగించుకొని వచ్చేసరికి గదిలో గచ్చు నేలపై పీటలు వాల్చి అరిటాకులు పరచి వున్నాయి.
‘మా యింటి బోజనం నీకు నచ్చుతాదో, లేదో?! రుూ పూటకి ఎట్నో సర్దుకో సారూ!’ అంటూన్న నారాయణ మాటల్లోని ఆత్మీయతకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి భూపతి నాయుడికి.
నారాయణ భార్య లక్ష్మమ్మ ‘యింకొంచెం యేసుకో సారూ!’ అంటూ కొసరి కొసరి వడ్డిస్తూంటే.. ఎందుకో - ఆ సమయంలో తన కన్నతల్లే గుర్తొచ్చిందాయనకి.
వేడివేడి అన్నంలో ఆవకాయ, పాలకూర పప్పు, పెరుగుతో భోజనం ముగించి లేచేసరికి నారాయణ మనవడు రెండు అరటి పళ్లు తీసుకొచ్చి అందించాడు.
రేకుల ఇంటి ముందు ఆరు బయట పరచి వున్న నులకమంచంపై కూర్చొని, అక్కడే ఆడుకుంటున్న నారాయణ మనవడూ, మనవరాలినీ చూస్తూ భూపతినాయుడు భుక్తాయాసం తీర్చుకుంటూండగా.. లోపల్నుంచి వచ్చాడు నారాయణ.
నాయుడికి మనసులో మాత్రం ‘్ఫ్యనూ, బాత్రూమ్ లేని ఈ ఇంట్లో ఒక రాత్రి ఎలా గడపాలి?’ అన్న ఆలోచన మెదుల్తూనే ఉంది.
‘రేయ్‌ఁ... పిలకాయలూ... యెంతసేపురా మీ ఆటలూ? పడుకొనేది లేదా? రేప్పొద్దున ఇస్కూలుకి బోవాలి గదా.. పోయి పడుకోండి!’ అని మనవలిద్దరినీ కసిరి ఇంట్లోకి తరిమి, ‘శాన అల్లరోళ్లు సారూ.. ఐనా, సదువులో మాత్రం తోటిపిలకాయల కంటే బాగా సదూతార్లే! వీళ్ల అమ్మా, నాయనా - అదే.. నా కొడుకూ, కోడలూ పనికోసం పక్కూరికి పోయున్నారు. అసలే పనుల్లేవాయె.. ఎక్కడ పని దొరికితే ఆడికి బోవాల గదా! అసలీ మధ్య పనుల్లేక...’
భూపతి నాయుడు చిటికెలు వేస్తూ ఆవులించడం చూసి నారాయణ మాట్లాడ్డం ఆపి - ‘పద సారూ! నువ్వు బాగా అలసిపోయుండావు. నీ పడక రుూడ గాదు. నాలుగిండ్లవతల నా తమ్ముడి కూతురి ఇల్లుండాది. వాళ్లాయన పక్కూర్లో పంచాయితీ ఆపీసులో క్లరకులే! ఆడ నీకు మంచి రూమూ, ప్యానూ ఉంటాది. బాత్రూములూ, అవీ సౌకెర్యెంగా ఉంటాయి. ఈడ నీకు యిబ్బందేలే!’ అని నాయుడుని బయల్దేరదీశాడు.
భూపతి నాయుడుకి ప్రాణం లేచివచ్చినట్లయ్యింది.
అక్కడికి వెళ్లాక నాయుడుని బయటే ఉండమని చెప్పి, వాళ్లింట్లోకి వెళ్లిన నారాయణ అక్కడ ఏం చెప్పి వచ్చాడో ఏమో... ఐదు నిమిషాల్లో నాయుడుకి మేడపైన గదిలో ముచ్చటగా ఏర్పాటు చేసిన పడక, దాని మీదకి ఇస్ర్తి చేసి వున్న దుప్పటి అమర్చబడ్డాయి.
పంచాయితీ ఆఫీసులో ఉద్యోగిగా పరిచయం చేయబడిన రాంబాబుకి నారాయణ మాట వేదవాక్కులా ఉన్నట్లుంది. భూపతి నాయుడుని అభిమానంగా పలకరించి కొత్తదనమూ, బిడియమూ పోయేలా చేశాడు. రాంబాబు పిల్లలు నాయుడికి గాలి తగిలేలా టేబుల్ ఫ్యాన్ అమర్చారు.
వాళ్లతో మాటల్లోకి దిగిన భూపతి నాయుడు ఆ పిల్లలు చెప్పే పద్యాలూ, పాడే పాటలూ వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు.
* * *
కిటికీలోంచి వెచ్చటి కిరణాలు మొహం మీద పడేసరికి మెలకువ వచ్చింది నాయుడుకి.
అప్పటికే బారెడు పొద్దెక్కినట్లుంది. టైమ్ చూసుకొని ఎనిమిదవుతుండటంతో ఉలిక్కిపడ్డాడు. నిన్నటి బడలికతో ఒళ్లెరుగని నిద్ర వచ్చేసిందాయనకి. బయట ఎంతసేపట్నుంచి కాచుకొని వున్నాడో గానీ, నాయుడు మంచం దిగగానే గబగబా దగ్గరికొచ్చేశాడు నారాయణ-
‘సారూ.. మంచి నిద్ర పట్టేసినట్టుంది. సరే.... నేను పన్లోకి పోతావుండా! ఇది మీ యిల్లే అనుకో. స్నానం చేసి, నాష్టా చెయ్యి. ఓపికుంటే మా ఊర్లో రాములోరి గుడికెల్లు.. శానా బాగుంటాది!’ అని, ఇంకా ఏదో చెప్పబోయేంతలో...
నాయుడు తేరుకొని ‘నారాయణా! ఇప్పటికే నీకు చాలా శ్రమ కలిగించాను. నువ్వు నీ పని మీదుండు.. నేనిక బయల్దేరుతాను!’ అన్నాడు.
‘సరే సారూ! నీ కాపీ, పలహారం పూర్తయ్యేసరికి నేను బోజనం చేసుకొని వచ్చేస్తా!’ అని నారాయణ వడివడిగా వెళ్లిపోయాడు.
భూపతి నాయుడికి ఆ రోజు కూడా ఏర్పాట్లు బాగానే జరిగాయి. వేడినీళ్లు, షాంపూ సాచెట్లతో స్నానం చేసి వచ్చేసరికి వేడి పెసరట్లు, మంచి కాఫీ! అన్నీ పూర్తయ్యి పిల్లలతో కబుర్లాడుతూండగా నారాయణ సైకిల్‌తో వచ్చాడు. అక్కడ నుంచి భూపతి నాయుడుని మెయిన్ రోడ్డు దగ్గర దింపాడు.
ఉదయమే ఫోన్‌లో మాట్లాడి వుండటంవల్ల అప్పటికే కారు రిపేరు చేయించుకొని వచ్చి మెయిన్ రోడ్డు మీద ఎదురుచూస్తూ వున్నాడు డ్రైవర్ శ్రీనివాస్.
‘సారూ... మీరు ఊరు చేరేసరికి మద్యాన్నం దాటుతాదేమో! దారి మధ్యలో యెక్కడా బోజనం బాగుండదు. ఈ పెరుగన్నం ప్యాకెట్టు ఉంచండి.. గడ్డపెరుగుతో మా యింట్లో చేయించి తెచ్చాను’ అని బలవంతంగా నాయుడు చేతిలో ప్యాకెట్టు ఉంచాడు నారాయణ.
‘పరిచయస్తులే మనకేదైనా పనిబడితే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో... స్వార్థమే పరమావధిగా సర్వత్రా రాజ్యమేలుతున్న ఈ కాలంలో... ఏదో రోడ్డు మీద సహాయం కోసం చూస్తున్న తన కోసం ఇంత శ్రమపడిన ఈ మహానుభావుడికి తాను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి!’ అనిపించింది నాయుడికి.
‘నారాయణా! నీ సహాయం, ఆదరణ నేనెప్పటికీ మర్చిపోలేను. నిన్నట్నుంచి నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను.. ఏమనుకోకపోతే చెప్పు.. నేనెవరో తెలీకపోయినా, ఇప్పటివరకు కనీసం నా పేరు కూడా అడగకుండా, తెలుసుకోకుండా నాకింత సహాయం చేసి, ఆదరించావు, ఎందుకు?’ మనసంతా ఆర్ద్రమై.. కళ్లలో అభిమానం ప్రతిఫలిస్తుండగా అడిగాడు భూపతి నాయుడు.
నారాయణ తేలిగ్గా నవ్వేశాడు - ‘ఇందులో నేను చేసింది ఏముందిలే సారూ! ఐనా... మనిసికీ, మనిసికీ మధ్య ఈ మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే ఎట్టా? ఒక మనిసి కస్టంలో వుంటే ఈ మాత్రం సాయం చేయకపోతే ఇంకోడు మనిసెట్లా ఔతాడు?’
ఆశ్చర్యంగా చూశాడు భూపతి నాయుడు. ‘చదువుకోకపోయినా - సాటి మనిషి పట్ల మనుషులకి ఉండాల్సిన దృక్పథాన్నీ, ‘మనిషితనాన్నీ’ ఎంత తక్కువ మాటల్లో ఎంత స్పష్టంగా చెప్పాడో కదా!’ అన్పించింది.
చదువుకీ - సంస్కారానికీ, విద్యకీ - విచక్షణకీ సంబంధం ఉండి తీరాల్సిన అవసరం లేదనిపిస్తోంది నారాయణని చూస్తూంటే. నారాయణ పట్ల తన మనసులోని ‘కృతజ్ఞత’ని వ్యక్తం చేయాలనుకుంటూ.. పర్సులోంచి రెండు రెండువేల రూపాయల నోట్లు తీసి అతడి చేతిలో పెట్టబోయాడు నాయుడు.
నారాయణ గబుక్కున తన చేతుల్ని వెనక్కి తీసేసుకుంటూ ‘ఏంది సారూ.. యిది? నేనే్జసిందాన్ని డబ్బుతో కొలుస్తున్నావా?’ అన్నాడు నిష్ఠూరంగా.
భూపతినాయుడు నొచ్చుకుంటూ ‘్ఛఛ... నా ఉద్దేశం అది కాదు నారాయణా! నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీక...’ అన్నాడు.
‘చెప్తిని కదా సారూ... సాటిమనిషిగా నేనే్జయగలిగింది చేశా. అట్టాగే కస్టంలో ఉన్నోళ్లకి ఓ మనిసిగా నీకు చేతనైంది చేయి సారూ... అదే ఋణం తీరే దారి!’ అని, ఇంకా భూపతి నాయుడు తన వంటే విస్మయంగా చూస్తూండిపోవటం గమనించి - ‘సరేగానీ, వేరే ఆలోచనేదీ చేయకుండా భద్రంగా పోయిరా సారూ! నేనెల్తాను మరి!’ అంటూ సైకిలు వెనక్కి తిప్పుకొని బయల్దేరాడు నారాయణ.
ఈ రోజు (జనవరి-05) అనుభూతి కవి వేగుంట మోహన్ ప్రసాద్ గారి జయంతి సందర్బంగా చిరు వ్యాసం ........
' * ఐ.చిదానందం *
----------------------------------------------------------------------------
ఆధునిక కవిత్వం లో అనుభూతితో లౌకిక ప్రపంచం వారధి గా రాసిన కవిత్వం అనుభూతి కవిత్వం. అనుభూతి కవిత్వం అనేది ఉద్యమ కవిత్వం కాకపోయిన ఒక ప్రయోగం గా ప్రత్యేకమైనదే. అలాంటి కవిత్వం లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కవి వేగుంట మోహన్ ప్రసాద్ గారు. సాహిత్యం లో అనుభూతి కవిత్వం భావకవిత్వం వ్యక్తికరణ లో ఒకే విధంగా వున్నప్పటికీ భావకవిత్వం లో వుండే స్పష్టత సూటిదనం అనుభూతి కవిత్వం లో లేదు. అందుకే కె.కె.రంగనాధాచార్యులు గారు భావ అనుభూతి కవిత్వాలు రెండు ఒక్కటే అనీ అన్నారు. కానీ సృజత్మకత వ్యక్తికరణ పరంగా అనుభూతి కవిత్వం వేరు అనీ ఇస్మాయిల్ గారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కవిత్వం లో మంచి కవిత్వం రాసారు వెమో.
చూస్తుండగానే చిన్న పిల్లలు పెద్ద పిల్లలవుతారు వాళ్ల హృదయాలు
చిత్రం గా సాలెగూళ్ళలోకి ఇరుక్కుపోతారు నార్వేలోనో స్వీడన్ లోనో డెన్మార్క్ లోనో స్ఖలిస్తారు చూస్తుండగానే చిన్న పిల్లలు పెద్ద తల్లులవుతారు
ఇలా తరం తరం అనే కవిత లో నేటి ఆధునిక యుగ పిల్లలు తొందరగా ఎలా ఎదుగుతారో తాత్వికత తో చెబుతారు వెమో. వీరి కవితా భాష క్రమ రహితం అయినా ఆసక్తికరం వీరి భావప్రకటన అర్దం కానిది అయినా ఆలోచనత్మకం ఈ లక్షణాలే వీరిని మంచి కవిగా నిలబెట్టాయి.
వేమో గారి రచనలు
*కవిత్వం*, * చితి - చింత, * పునరపి. * రహస్తంత్రి, * సాంద్ర భాష
* ఆఖరి ఆశ్రయం * ద్వీపాంతర కవిత * ఒక వేకువ * అనుభూతి పల్లె పట్టిన
* సుప్త చిత్రాలు * స్నానం * ఓ మాతృమూర్తి * నిషాదం
*వ్యాసాలు*
* కర చలనం * నీడలు జాడలు * వెన్నెల నీడలు
*ఇతరములు* * సహపంక్తి (అనువాదం) * బతికిన క్షణాలు (జీవిత చరిత)
వెమో గారి చివరి రచన నిషాదం కు తనికెళ్ళ భరణి సాహిత్య పురస్కారం లభించింది. దీనిలో అన్నారులే...! ; మృత్యుపుష్ప ; పరాగం ; మోషో ; ఏమో 'మో' ; కొలనులో ఓడ ; కలలో వచ్చే పాదరసపు నది ? అపరిచిత స్పర్శ; భగ్నశిల్పి ఇలా నిషాదంలో ఇంచుమించు 71 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ క్రమం మొదలై రెండు దశాబ్దాలు ముగిసాయి. రెండో దశాబ్దంలో తెలుగు సమాజ సంక్షోభం మొత్తం ఈ సంపుటిలో ఉంది. ఒక దశాబ్ది కవిత్వాన్ని నిషాదం గా సంపుటీకరించారు మో.
విషాద కవిగా పేరు తెచ్చుకున్నాడు. వీరి కవితా శైలిని చూసి వీరిని నిరాశవాది అన్నారు. అయితేనేం వీరి కవిత్వం లో ఏదో మార్మికత వుందనీ మెచ్చుకున్నారు. సినారె గారు అన్నట్లు మో కవిత్వం అధివాస్తవికత తో తొలిసారి గా చదివితే ఏమో అనిపిస్తుంది.మరల మరల చదివితే అమ్మో అనిపిస్తుంది. మన మనః క్లేశాల్ని కోసి నిమ్మ నారింజ బత్తాయి పళ్ళుగా
రసం తీస్తే పులుపు రోడ్డు చెడుగుడుడే వాడికీ పాలిపోయే వాడికీ
పండు ముదలిసికీ ఇస్తే కూతపెట్టి రక్తం వచ్చి యవ్వనం తొంగిచూస్తుంది
మాటలు ఒక్కొక్క బొట్టులా పడుతూ ఆడబడుతు పులుపు రోడ్డు వాక్యాలవుతాయి కావ్యాలవుతాయి
ఇలా వీరి కవిత చదవగానే ఒక విధం భావావేశం ఆలోచన సందిగ్ధత అస్పష్టత అన్నీ మనకి గోచరిస్తాయి. ఇలాంటి శైలి నే వీరి ని ప్రత్యేకం గా నిలిపింది. చేరా గారు అన్నట్లు ఆషామాషీ గా చదివితే అర్దమయ్యే కవికాదు.ఇతను మనకు అలవాటైన ధోరణిని భగ్నం చేస్తాడు.కవిత్వం లో కొంచెం తిక్క చూపిస్తాడు. వీరి కవిత్వం ను విశ్లేషణ చేయడం కొన్ని సార్లు కష్టసాధ్యం.ఎందుకంటే కవి హృదయం ను పట్టుకోవడం సామాన్య పాఠకుడికే కాదు. ఉద్దండ విమర్శకుడికీ కూడా అంత సులువేమి కాదు.మొత్తం గా చెప్పాలంటే ఒక్కసారి చదవగానే వీరి కవిత్వం అర్దం కాదు.రెండవసారికీ కొంత...కొందరికి తొందరగానే పూర్తిగా అర్దమయినా మళ్లీ కొన్ని రోజుల తర్వాత చదివితే వీరి కవిత్వం మరో కొత్త అనుభూతిని ఇస్తుంది.
అనంత దూరం లో ఆకాశంలో తళతళ మెరిసే నక్షత్రాలను స్పష్టం గా చూడగలమా.అలాంటిదే వీరి కవిత్వం. కవిత్వం నాకో మాయా లాంతరు అనే వెమో. మనసులో గిలిగింతలు పెట్టే కల్లోలాలు రేపే భావనలు తనదైనా రీతిలో వ్యక్తికరణ చేస్తారు వెమో. వీరి శైలి రసవాద శైలి. వీరి కవిత్వం అర్దమ్ము కాని భావాగీతముల లాంటివి.
ప్రవాహంలో ఒక్కసారి తాకిన నీటిని మళ్లీ మనం తాకలేం. అలాగే ప్రవాహం మళ్లీ వెనక్కి రాదు. అలా వీరి ఒక్కొక్క కవిత ఒక్కొక్క భావం తో ప్రతిసారీ నూతనత్వాన్ని కలిగివుంటుంది. వారి పై వచ్చిన పరిశోధన వేగుంట మోహన్ ప్రసాద్ కవిత్వం - అధివాస్తవికత - జీ.శ్రీనివాస్ రావు .
--((**))--
ప్రాంజలి ప్రభద్వారా ప్రపంచ తెలుగు ప్రజలందరికి అమూల్యమైన కధలను అంతర్జాలముద్వారా అందించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు డిట్లు మీ అభిమాన రచయత: మల్లాప్రగడ రామకృష్ణ .
మంచి కథను చదివించారు. అభినందనలు. ధన్యవాదములుసార్. 🙏🏻
ReplyDelete