*వందే మాతరం -1*
💪
రచన : గొల్లపూడి మారుతీరావు
కనుచూపు మేరలో ఈశాన్య సరిహద్దు ప్రాంతంలోని భారత సైనికస్థావరం. ఎడమ వైపు మహోన్నతమైన మంచు శిఖరాలు. శత్రు స్థావరాలు-చైనావి- కనిపిస్తున్నాయి. 40 కోట్ల ప్రజల నిశ్చయానికి ధైర్యసాహసా లకు ప్రతినిథులుగా నిలిచి పోరాడే కొన్ని పదుల సైనికులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ముందున్న భారత స్థావరం దగ్గర యుద్ధం జరుగుతోంది. అక్కడికి దాదాపు మైలు దూరంలో ఉంది ఆ మొదటి స్థావరం. అది కూలిపోతే రెండవస్థావరానికి శత్రు సైన్యాలు చేరుతాయి. అక్కడ పోరాటం జరుగుతోంది తీవ్రంగా. పరిస్థితి విషమంగా ఉంది. ఆశల నిరాశల మధ్య, రెండవ స్థావరంలో నిలిచిన వ్యక్తుల మనస్సులు రెపరెపలాడుతున్నాయి.
ఈ స్థావరంలో కుడివైపు ఆయుధాలను వుంచే చిన్న గది ఉంది. ఎడమవైపు హిమాలయశ్రేణి, శత్రుసైన్యాలు, మొదటి స్థావరం. ఎడమవైపు ఒక పక్కకి టేబులు ఉంది. ఏవో రెండు మూడు ఫైళ్ళు మాత్రం ఉన్నాయి. ఎదురుగా గోడకు ఈశాన్య సరిహద్దు ప్రాంతపు పటం ఉన్నది. టేబులు ముందు ఒక పాత కుర్చి. అక్కడక్కడా చెదిరిన రెండు బల్లలు-ఓ మూల ప్రథమ చికిత్సకు ఉపయోగపడే మందుల పెట్టె ఇంతే అక్కడి సామగ్రి. టేబులుకు ఆనించి రెండు తుపాకులు ఉన్నాయి. టేబులు మీద ఓ తుపాకీ పరిచివుంది. గోడకు ఆనుకుని మరొకటి ఉంది.
ప్రతిక్షణం మొదటిస్థావరం నుంచి వార్తలు తెలిసే ఏర్పాట్లు చేసుకున్నారు. అంచీలు మీద అక్కడికి వార్తలు అందుతున్నాయి. ఈ స్థావరంలోని సైనికులంతా మొదటి స్థావరానికి తరలిపోయారు. ఆయుధాలూ, మందుగుండు సామగ్రి కూడా అవసరాన్ని బట్టి ముందుకు పోతున్నాయి. ఇక్కడ మిగిలినవాళ్ళు నలుగురూ కమిషన్ ఆఫీసర్స్-కల్నల్ ఆర్. కె. రావ్, మేజర్ రాంసింగ్, కెప్టెన్ హిరెన్ రాయ్, లెఫ్టినెంట్ కృష్ణన్ నాయర్, దేశంలో నాలుగు ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నారు.
రావు వయస్సు నలభై పైన, దాదాపు 50
మేజర్ వయస్సు 40. కెప్టెక్ రాజ్ కి 35 ఉంటాయి. నాయర్ అందర్లోకి చిన్నవాడు వయస్సులోనూ, పదవిలోనూ. యువకుడు, ఉద్రేకి, అందర్లోకి కల్నల్ అనుభవంగల ఉన్నతోద్యోగి. మిగతా వారంతా అతని క్రింది ఉద్యోగులు. ఉత్తరవులు ఇవ్వడానికీ, ఆదేశాలు ఇవ్వడానికి అన్నిటికీ అతనే అధికారి, బాధ్యుడు.
ఆ స్థావరంలో టేబులు మీద ఓ పెట్రోమాక్స్ దీపం వెలుగుతోంది. అప్పుడు రాత్రి 8-30. మరొక దీపాన్ని కుడివైపుమీది నుంచి వేలాడ దీశారు. నాలుగు పెద్ద టార్చిలైట్లు టేబులుమీద ఉన్నాయి.
నలుగురూ పూర్తి యూనిఫారంలో ఉన్నారు. అంతకన్నా వాళ్ళకి మరో దుస్తులు లేవక్కడ. నిద్రపోవడం, భోజనం చేయడం, ఉద్యోగం అంతా వాటితోనే. అందుకని బాగా నలిగిపోయి ఉన్నాయి. కొన్ని రాత్రిళ్ళుగా వాళ్ళకి నిద్దర్లు లేవు. ఒక దేశపు పూర్తి బాధ్యతను వహించే అలసట, ఆతృత, ఆందోళన, నిశ్చయం, సాహసం అన్ని వారి ముఖాలలో ద్యోతకమవుతున్నాయి.
అక్కడికి రెండు మైళ్ళ దూరంలో చిన్న ఊరు వుంది. అక్కడి గ్రామీణుల కోలాహలం, ఎప్పుడన్నా ఇక్కడ నిశ్శబ్దం ఏర్పడినప్పుడు వినిపిస్తుంది. ఒక రెడ్ క్రాస్ యూనిట్ 24 గంటలూ పనిచేస్తోంది. రెడ్ క్రాస్ కార్యకర్తలు స్ట్రెచెర్లతో నిర్విరామంగా పనిచేస్తున్నారు, దేశం కోసం ప్రాణాలర్పించి న మృతవీరుల కళేబరాలను, క్షతగాత్రుల ను ఎప్పటికప్పుడు అంబులెన్స్‌లలో సమీప ప్రాంతాలకు, ఆసుపత్రులకు చేరుస్తున్నారు.
📖
దేశభక్తితో వణికే ఓ పెద్ద గొంతు గుర్తు చేస్తోంది ఇట్లా :
*జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’
మళ్ళీ నిశ్శబ్దం. దగ్గరలో ఉన్న పట్టణం వైపు నుంచి పెద్ద కోలాహలం. 'వందే మాతరం', 'భారత్ జవానొంకీ జై' అని నినాదాలు చేస్తున్నారు. అందరూ ఏక కంఠంతో 'వందేమాతరం' జాతీయ గీతాన్ని పాడుతున్నారు.
హఠాత్తుగా ఎడమవైపు పెద్ద తుపాకులు పేలిన శబ్దం - వెంటనే వరసగా గ్రెనేడ్లు ప్రేలాయి. శబ్దం దూరమయింది. ఏదో కంఠం ఇలా చెస్తోంది "భారతదేశపు ఈశాన్య సరిహద్దు. దూరాన మహెన్నత మయిన మంచు శిఖరాలు-ఎన్నో దశాబ్దాల క్రిందటి మాట అదీ. శబ్దం ఘనీభవించి, నీరుగా ప్రవహించే ఆ మంచు శిఖరాల మధ్య అప్పట్లో కొందరు పసుల కాపర్లు సంచరించేవారు. శిఖరాల పాదాల వద్ద పెరిగే పచ్చికలను పశువులకు మేపుకో డానికి అక్కడికి వచ్చేవారు. వ్యాపారులు ఆ మార్గాలలో సంచరించేవారు. మనస్సు లలో సరిహద్దులు నిర్ణయించుకోవడం తెలీని అమాయకులు వారు. కాని కాలం మారింది. రాజ్యాలు మారాయి. మంచికి చెడుకీ, మానవత్వానికీ అమానుషత్వానికీ కాక, మంచికీ మంచికీ కూడా అవధులు నిర్ణయించే వింత మానవులు వచ్చారు. 'పంచశీల'ను పరమార్ధంగా బోధించి, అంగీకరించిన దేశమే, 'హిందీ చీనీ భాయ్ భాయ్' అని నినాదాలు చేసిన దేశమే ఎదురు తిరిగింది. ఇప్పుడా ప్రాంతంలో పశుల కాపర్లు కనిపించరు. గొర్రెలు పశువులు తిరగవు. పచ్చికబయళ్ళు పెరగవు. హృదయాల్ని చీల్చే తుపాకుల ప్రేలుళ్ళు వినిపిస్తాయి. శాంతి, సహనం, అహింసా సిద్ధాంతాలను సవాలుచేసే వింత జంతువులు కనిపిస్తాయి.
📖
ఆ రోజు మొట్టమొదటిసారిగా శాంతిని కాంక్షించే భారతావని గుండెల్లోకి తుపాకులు పేలాయి. మానవులు నిర్మించిన సరిహద్దుల్ని మానవులే కాదన్నారు. 40 కోట్ల ప్రజ మేలుకొంది. శాంతం, కరుణను వర్ణించిన భారతీయుల నేత్రాలలొ ఆవేశం. ఆవేగం నిండింది. భారతదేశం కోసం అనేక దేశాలు వెనక నిలిచాయి. రాక్షసత్వాన్ని ఎదిరిస్తూ - సత్యం అహోరాత్రాలు పోరాటం సాగిస్తోంది”.
ఇటు తుపాకులు మళ్ళీ పేలుతున్నాయి. మళ్ళీ నిశ్శబ్దం. ప్రధానమంత్రి దేశానికేదో సందేశం ఇస్తున్నారు. గొంతు వినిపిస్తోంది. సైరన్ హఠాత్తుగా వినిపించింది. ప్రధాని గొంతు నిలిచిపోయింది. సైనిక వాద్యాలు మ్రోగుతున్నాయి. వందలాదిమంది సైనికులు దూరాన కదిలి వస్తున్నారు. ఎవరో ఆఫీసర్ల ఆర్డర్లు ఇక్కడికి చెవులు చిల్లులుపడేలాగు వినిపిస్తున్నాయి.
🇮🇳
*సశేషం*
*వందే మాతరం -2*
💪
రచన : గొల్లపూడి మారుతీరావు
(తెర ఇప్పుడు తొలిగింది. సైనికుల బూట్ల చప్పుడు యింకా వినిపిస్తోంది.)
నలుగురు ఆఫీసర్లూ అక్కడే ఉన్నారు. అంతా కుడివైపు మూడవ స్థావరం వైపు చూస్తున్నారు. అక్కడికి కనుచూపుమేరలో కనిపిస్తోంది స్థావరం. టేబిలుకు ఆనుకు నిలబడ్డాడు సింగ్, బల్లమీద కూర్చున్నాడు రాయ్. నాయర్ పచార్లు చేస్తున్నాడు. రావ్ అటు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఇప్పుడిక సైనికుల బూట్ల చప్పుడు ఆగింది
కల్నల్ రావ్:- (సైన్యాలను చూశాక తాత్కాలికమైన సంతోషం కనిపించింది.)
వచ్చేసింది. ట్వంటీ టూ ఇన్ఫంట్రీ ప్లాటూన్ మూడో స్థావరానికి వచ్చేసింది. ఇక దానికేం బాధలేదు.
(అటూ యిటు తిరుగుతున్నాడు. వాక్యం పూర్తయేలోగా అతనికో ఘోరమైన దృశ్యం కనిపించింది. ఇతని వైపు తిరిగి ఉండడం వల్ల మిగత ముగ్గురు ఆఫీసర్లు దానిని గుర్తించలేదు, ఇతను హఠాత్తుగా ఆగిపోవడం చూసి అంతా ఆటు తిరిగారు. చచ్చిపోయిన సైనికుణ్ణి స్ట్రెచర్‌లో ఉంచి ఇద్దరు రెడ్ క్రాస్ వర్కర్స్-(A., B.) తీసుకు వస్తున్నారు. కలల్న్ని చూసి ఆగారు)
A: నాయక్ 203506-ప్లాటూన్ 18, పేరు బలదేవ్-(రావ్ దగ్గరికి వచ్చాడు.)
రావ్. చచ్చిపోయాడా?
B. యస్ సార్.
ఒక్కసారి స్ట్రెచర్ మీద ఉన్న వ్యక్తి ముఖాన్ని కదిపాడు. అటు నుంచి యిటు తల వాలిపోయింది. దుప్పటి పూర్తిగా కప్పేశాడు. స్ట్రెచెర్ కుడివైపు వెళ్లిపోయింది. రావ్ మాపు దగ్గరికి వచ్చాడు. చచ్చి పోయిన సైనికుడిని చూశాక అందరిలో ఓ విధమైన Stiffness వచ్చింది. ఏమీ తోచనట్టు అటూ యిటూ కదుల్తున్నారు. నాయక్, రాయ్ ఆతృతగా రావ్‌ను చూస్తున్నారు.
నిశ్శబ్ధం.
సింగ్: ఎనిమిది నలభై అయింది.
నిశ్శబ్దం.
రాయ్: ఇంకా మొదటి స్థావరంలో షూటింగ్ జరుగుతుంది.
నిశ్శబ్దం.
నాయక్: (ఆ నిశ్శబ్దాన్ని భరించలేక పోయాడు) ఇప్పుడేం చేయాలి కల్నల్ సాబ్?
(అందరూ తలెత్తి రావ్ వైపు చూశారు ఏంచెప్తాడోనని)
రావ్: ఇప్పుడేకాదు, ఎప్పుడూ మనం చేసేదీ, చెయ్యవలసింది, చెయ్య గలిగేది ఒకటే. (అందరిలో ఆతృత)-యుద్ధం- అందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. మొదటి స్థావరం నుంచి యింకా వార్తలు రాలేదు. డిస్పాచ్ రైడర్ రావాలి...... మేజర్ ఒకసారి చూడండి-
మేజర్ ఎడమ వైపుకి వచ్చి చూస్తున్నాడు. (నిశ్శబ్దం )
రాయ్: మొదటి స్థావరానికి ప్రమాదం తప్పకపోతె ఏం చెయ్యాలి కల్నల్ సాబ్?
రావ్: దానికి ఆలోచించాలా? తుపాకులు (తుపాకులు చూపి) అవి మన కోసం ఎదురు చూస్తూన్నాయి. (టేబిలుమీద hand stick తీసుకొని) మొదటి స్థావరం...... (ఏమిటో చెప్పబోతే.)
సింగ్: (గుమ్మం దగ్గర రెండు చేతులూ నోటి దగ్గర పెట్టి) డిస్పాచ్ రైడర్ ... పోస్ట్ ... వన్, ... (అరిచాడు. దూరాన ఎవరో 'డిస్పాచ్ పోస్ట్...... వన్...... అని తిరిగి అరిచారు) సజ్జన్ సింగ్, (సంతోషంతో, ఆతృతతో వెనక్కి తిరిగాడు సింగ్) వస్తున్నాడు కల్నల్ సాబ్.
(అందరూ ఎడమ వైపుకు ఆతృతగా వచ్చి నిలబడ్డారు. నిశ్శబ్దం. వెనక నుంచి (కుడివైపు నుంచి) ఖాళీ స్ట్రెచర్లతో A, B లు వచ్చారు. 'సార్' అని A అనే సరికి అంతా తుళ్ళిపడి యిటు తిరిగారు. స్ట్రెచెర్ను చూసి పక్కకి తప్పుకొని తోవ యిచ్చారు. స్ట్రెచెర్ వెళ్లిపోయింది. డిస్పాచ్ రైడర్ (D. R.) లోపలికి వచ్చేశాడు. పరిగెత్తుకు వచ్చినట్టున్నాడు అలసట తెలుస్తోంది. వస్తూనే కల్నల్ కి సెల్యూట్ చేశాడు.
రావ్: యస్. ఏమయింది?
డి. ఆర్. సార్. మన వైపు అయిదుగురు పోయారు. శత్రువులు ముమ్మరంగా యుద్ధం ప్రారంభించారు. మరికొంత మందు గుండు కావాలట. మేజరు కుడి భుజం లోంచి గుండు దూసుకుపోయింది. పెద్ద బులెట్.
(అంతా ఒకరి ముఖం ఒకరు చూచుకొన్నారు)
రావ్: వేంటనే స్ట్రెచర్ అతనికి పంపించండి. అతన్ని ఆంబులెన్ కి స్ చేరవెయ్యాలి. క్విక్.
డి. ఆర్. కాని వెనక్కు రావడానికి మేజర్ ఇష్టపడడం లేదుసార్! ఎలాగో తుపాకీ పట్టుకుంటున్నారు. మందుగుండు త్వరగా వెళ్లాలి.
రావ్: మనుషుల్ని పంపాలా?
డి. ఆర్: ఆక్కర లేదన్నారు.
నాయక్: స్థావరం నిలుస్తుందా?
డి ఆర్. (అతన్ని చూసి నవ్వాడు ఆ నవ్వు అందరికీ అర్థమయింది.)
రాయ్: పొనీ, ఎంతసేపటివరకు నిలుస్తుంది?
డి. ఆర్: అర్థరాత్రి వరకూ నిలపగలమని మేజర్ చెప్పమన్నారు సార్.
సింగ్: అటు వైపు బలం ఎలా వుంది?
డి. ఆర్: అయిదువందలు పైన. మంచూరియన్ సోల్జర్స్ వచ్చారని తెలిసింది. ఒక చైనా సైనికుడి శవం దొరికింది దానిని బట్టి గుర్తించారు. అటు వైపు 100 మంది పైగా పడిపోయారు. రాత్రి ఆగేటట్టులేదు. వెన్నెల తోడుగా ఉంది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
రాయ్: (పొడి పొడిగా చెప్పారు) మూడో స్థావరానికి ట్వెంటీటూ ఇన్ఫంట్రీ ప్లాటూన్ వచ్చింది. దాదాపు 500 మంది సైనికులు. మేజరు కి నా best wishes చెప్పు. అవసరమైనవన్ని వెంటనే పంపిస్తాం. (నిర్ధారణగా) ఇంకో స్థావరం సిద్ధంగా ఉందని చెప్పు.
రాయ్: (ఆశ్చర్యంతో) కాని కల్నల్ —
రావ్: షటప్! (మళ్ళి) రెండో స్థావరం సిద్ధంగా ఉందని చెప్పు. ప్రధాన మంత్రి దగ్గర్నుంచి ఓ పావుగంట క్రితం సందేశం అందింది. దేశం మన ధైర్య సాహసాలకు ప్రశంసల్ని యిస్తోందని చెప్పమన్నారు. దట్సాల్, టీ కావాలా?
డి. ఆర్. యస్ సార్. (తన వీపుకి ఉన్న సంచిలోనుంచి 'మగ్' తీసి పట్టుకున్నాడు')
రావ్: నాయక్! (పిలిచాడు)
నాయక్: (కుడివైపు నుంచి వచ్చి) యస్ సార్?
రావ్: టీ
నాయక్: యస్ సార్. (వెళ్ళి ఒక్కక్షణంలో టీ కెటిల్ తో వచ్చాడు.. డి. ఆర్. చేతిలోని మగ్ లో పోశాడు. రెండు కప్పుల టీ తాగి 'మగ్'ను బాగా దులిపి మళ్ళీ సంచిలో పడేసుకున్నాడు).
రావ్: త్వరగా వెళ్ళు. Good luck! (సెల్యూట్ అందుకున్నాడు. డి.ఆర్. వెళ్ళిపోయాడు).
నాయక్: (తిరిగివెళ్తూ కల్నల్ ) టీ సార్?
రావ్: Please! ఒక్కసారి ఆ మూగ షెర్పాను పిలువు. క్విక్ (నాయక్ వెళ్ళాడు, రావ్ మాప్ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తూ నిలబడ్డాడు. నిశ్శబ్దం).
రాయ్: పన్నెండు వరకూ మొదటి స్థావరం నిలబడుతుంది.
నాయర్: పన్నెండు-అంటే (వాచీ చూసుకొని) దాదాపు మూడు గంటలు.
సింగ్: (ముందుకు వచ్చి) కల్నల్ సాబ్- నేను మొదటి స్థావరానికి వెళ్తాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
రావ్: (మాపు చూస్తున్నవాడు యిటు తిరిగి) ఊఁ. వెళ్లనవసరం లేదు. సమయం వస్తే చెప్తాను.
నాయర్: మన ప్రోగ్రాం ఏమిటో చెప్పండి కల్నల్ సాబ్ !—ఈలోగా సిద్ధపడవచ్చు దేనికైనా?
రావ్: (కాస్సేపటికి మాప్ ని చూపుతూ చెప్పాడు) Now gentlemen, (చూపుతూ) ఇది మొదటి స్థావరం. ఇక్కడ రెండు, అంటే ఇది (తాము ఉన్న ప్రాంతం); మూడవది మరి రెండు ఫర్లాంగుల క్రింద. మొదటి రెండు స్థావరాల మథ్య దూరం మైలు. మొదటి స్థావరం పన్నెండు వరకూ నిలబడుతుందని మేజర్ చెప్పారు. (వాచీ చూచుకొని) అవును, మరి మూడు గంటల్లో శత్రుసైన్యాలు యిక్కడికి వస్తాయి.
నాయర్: (nervous గా) వస్తే—
రావ్: (నవ్వి, అతని పరిస్థితిని గమనించి దగ్గరికి వచ్చాడు) లెప్టనెంట్!
నాయర్: (attention కి వచ్చి) యస్సార్.
రావ్: వస్తే ఏంచెయ్యాలో మీరు నాలుగేళ్ల క్రిందటే నేర్చుకువుంటారు. మీరు ఏ బెటాలియన్?
నాయర్: సిక్స్-ఏ. కేప్టన్ రాయ్- బెటాలియన్ (రావ్ అతడివైపు చూస్తే అతనూ attention లోనికి వచ్చాడు).
రావ్: పెళ్లయిందా?
నాయర్: (నవ్వేడు)
రావ్: నవ్వుకి అర్థం మరచిపోయి చాలా రోజులయింది, లెప్టనెంట్! పెళ్లయిందా?
నాయర్: లేదు సార్.
రావ్: ఆల్ రైట్ (మళ్ళా అంతా పటము దగ్గరికి వచ్చారు) రెండేరెండు మార్గాలు ఉన్నాయి మనకు. ఒకటి: ఇక్కడే, ఇక్కడే నిలిచి మనం నలుగురం శత్రు సైన్యాలను అర్ధరాత్రి ఎదిరించడం. రెండు: వెళ్ళి మూడో స్థావరం చేరుకోవడం.
రాయ్: (తొందరపడి) రెండవ స్థావరాన్ని నిలపడానికి వృధాగా ప్రయత్నించడం కంటే, వెళ్ళి మూడవ స్థావరం బలపరచడం మంచిదికాదా కల్నల్ సాబ్. రావ్ తనవైపు ఒక్కసారి తల తిప్పాడు, తన అసందర్భపు ప్రసంగాన్ని గుర్తించి) excuse me!
రావ్: That's alright
నిశ్శబ్దం
🇮🇳
*సశేషం*
꧁•━┅┉━━☆꧂
*వందే మాతరం - 3*
💪
రచన : గొల్లపూడి మారుతీరావు
సింగ్: కల్నల్ సాబ్! నేను మొదటి స్థావరానికి వెళ్తాను.
రావ్: (అతన్ని చూసి) ఊఁ. ( మళ్లి మాపు దగ్గర నిలిచి చెపుతున్నాడు). మనకున్న రెండు మార్గాల్లో దేన్ని అనుసరిస్తే ఏ ఫలితాలు ఉంటాయో తేల్చుకోవడం మంచిది. ఒకవేళ మొదటి స్థావరం పడిపోతే, ఇక్కడే మనం శత్రువుల్ని ఎదుర్కోవడం వల్ల ఒక లాభం ఉంది. ఈ వ్యవధిలో మూడవ స్థావరం బలం కూడదీసుకుంటుంది. అక్కడికి తెల్లవారే లోగా మన దళాలూ, మందుగుండు చేరుతుంది. రెండో స్థావరాన్ని మనం నలుగురం తెల్లవారేవరకు నిలిపితే మూడవ స్థావరంలోని ప్రయత్నాలకి కొంత వ్యవధి ఇచ్చినట్టవుతుంది. మనం నలుగురం ఎలాగూ శత్రువుల్ని ఓడించలేం. మనం చెయ్యగల్గినదల్లా వీలయినంత ఎక్కువసేపు ఇక్కడ వాళ్ళని ఆపగలగడం.
నాయర్: మూడో స్థావరానికి ఇప్పుడేవెళ్ళి చేరితే?
రావ్: చాలా నష్టాలున్నాయి. మనంతట మనం శత్రుబలానికి ఈ స్థావరాన్ని తొలగిస్తే అవకాశం ఇచ్చినట్టవుతుంది. తుపాకులు చంకన పెట్టుకొని నడిచివస్తారు మూడో స్థావరానికి. అక్కడి బలం కూడు కొనేలోగానే దాడి ప్రారంభమవుతుంది. వీటన్నిటికంటె మరో బలమైన కారణం ఉంది (ఆగాడు)
సింగ్: ఏమిటది?
నాయర్ ఏమిటది కల్నల్ సాబ్?
రావ్: మనంతట మనమే మన ధైర్యలోపం వల్ల శత్రువు చేతుల్లో ఈ మైలు భూ భాగాన్ని ఉంచినట్టవుతుంది. లెఫ్టనెంట్ అండ్ ఫ్రండ్స్ ! అక్కడ కనిపించేపర్వతాలు అడవుల వెనక ఒక దేశం తనని తాను పునర్నిర్మించుకొంటుంది. మరికొద్ది కాలం లో అక్కడొక కొత్త ప్రపంచం మనకు దర్శనమిస్తుంది. కాని ఆ మహెూజ్వల నిర్మాణాలకు పునాదులు ఈ మూల, ఈ మంచు శిఖరాల దగ్గర ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం వదులుకొనే ప్రతి అంగుళం భూభాగంతో పాటు కొద్ది కొద్దిగా మన స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, శ్రేయస్సును, సర్వస్వాన్ని వదులుకుంటు న్నామన్నమాట. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని జాతి ఎప్పటికి మేల్కొనదు. బానిసత్వం మనిషిని ఎట్లా నాశనం చేస్తుందో మనకు తెలుసు. ఫ్రెండ్స్- మనం రెండవ స్థావరాన్ని వదలి పోవడం వల్ల శత్రువులకి అనాయాసంగా ఇన్ని గజాల భూభాగం అధీనమవుతుంది. అంతే కాదు, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వాళ్ల అధీనమవుతాయి. మన దేశ సౌభాగ్య శ్రేయస్సులు వాళ్ల చేతుల పాలవుతాయి. మన ప్రాణాలు ముఖ్యమో, దేశ రక్షణ ముఖ్యమో ఈ క్షణంలోనే తేల్చుకోవాలి. వ్యక్తి ముఖ్యమో, దేశం ముఖ్యమో ఇప్పుడే ఇక్కడే నిర్ణయించుకోవాలి. ఇప్పటి మన నిర్ణయంమీద ఒక దేశపు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు చెప్పండి మనమేం చేయాలో ?
(వాళ్లు మాట్లాడే లోపున స్ట్రెచర్ లో మరొక వ్యక్తిని రెడ్ క్రాస్ వర్కర్స్ తీసుకువెళ్తున్నారు.)
హవల్దార్ 60672. కాలులోంచి రెండు బులెట్స్ దూసుకుపోయాయి.
కల్నల్ రావ్: ప్రాణం ఉందా ?
ఎ: యస్ సార్.
రావ్, (దగ్గరికి వచ్చి) మిస్టర్ రాం, (స్ట్రెచర్‌లో ఉన్న వ్యక్తి కదిలాడు) దెబ్బ బాగా తగిలిందా ? (లేదని తలూపాడు) భయపడకు. త్వరగా కోలుకుంటావు. కంగ్రాచ్యులేషన్స్- (A తో) Please take him (స్ట్రెచర్ వెళ్లిపోయింది. ఇటు తిరిగేసరికి ముగ్గురూ nervous గా అతని వైపు చూస్తున్నారు) ఏమంటారు?
సింగ్: ఇక ఇప్పుడు మనకి ముందు వెనకల ప్రసక్తి లేదు కల్నల్. ఇప్పుడూ, ఎప్పుడూ మేం సిద్ధమే, ముందుకు వెళ్లమన్నా మేం సిద్ధం.
రావ్: థాంక్స్. ఏమంటావు లెఫ్టనెంట్ ?
నాయర్: (నీళ్ళు మింగాడు. attention కి వచ్చాడు) నేను రెడీ సార్. మీ ఆర్డర్స్ కి సిద్ధంగా ఉన్నాను. (కాని గొంతులో సంశయం, ఓ విచిత్రమయిన సందిగ్ధత తెలుస్తోంది.)
రావ్: కేప్టెన్ రాయ్!
రాయ్: కల్నల్ సాబ్! మీ అభిప్రాయం అర్ధమయింది. ఎప్పుడు తుపాకీ ఎత్తమన్నా మేం సిద్ధమే. కాని మరొక్కసారి ఆలోచించండి. మనం నలుగురం. అటువైపు నాలుగు వందలో, ఎనిమిది వందలో తెలియదు. అటువైపు టాంకులు కూడా వచ్చాయని విన్నాం. మనం బలాలు కూడదీసుకునే వరకూ ఆగడం, సమయాన్ని చూసి ఎదుర్కోవడం మంచి ఎత్తుగడ అవుతుంది. ఇప్పట్లో మూడో స్థావరానికి తరలిపోతే— (సింగ్ బయటికి చూస్తున్నవాడల్లా ఇటు తిరిగాడు హఠాత్తుగా)
సింగ్: కల్నల్ సాబ్, మళ్లీ డిస్పాచ్ రైడర్.
డి.ఆర్: (ఊపిరి తిరగకుండా వచ్చాడు. సెల్యూట్ చేశాడు.) ఆరుగురు పోయారు సార్. (టోపీ తీసి చేత్తో పట్టుకొని) మేజర్ పోయారు. కుడివైపు బులెట్ బలంగా తగిలింది. (అందరూ టోపీలు తీశారు. నాయర్ ముఖంలో భావం చెప్పడం సాధ్యం కాదు. మొదట సింగ్ తేరుకున్నాడు)
సింగ్: ఇప్పుడెవరు నడుపుతున్నారు సైన్యాల్ని ?
డి.ఆర్: కేప్టెన్ దౌలత్య్రం, కేప్టెన్ శేఖర్.
రాయ్: అటువైపు పరిస్థితి ఏమిటి?
డి.ఆర్: మూక ఉమ్మడిగా మీదపడుతు న్నారు. అయితే మనవారి తాకిడికి చాలామంది కూలిపోతున్నారు.
రావ్: మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
డి.ఆర్: 12
రావ్: మందుగుండు ఇంకా కావాలా?
డి.ఆర్: వద్దన్నారు సార్.
రావ్: ఎంతకాలం పోస్ట్ నిలుపుతామన్నారు?
డి.ఆర్: రెండు గంటలని కేప్టెన్ చెప్పమన్నారు. కాని ఇంకా దళాలు అటువైపు చేరుతున్నట్టు తెలుస్తోంది.
రావ్: That's alright. మరో రౌండు వెళ్లగలరా?
డి.ఆర్: (విరామం) యస్ సార్.
రావ్: Please.
డి.ఆర్: ఏమైనా చెప్పాలా సార్ ?
రావ్: (అందర్నీ చూసి ఏమిలేదు. (డి.ఆర్. వెళ్లబోయాడు) చూడు. (ఆగాడు) ఇది నీ చివరి Trip.
డి.ఆర్: థాంక్యూ సార్. (తొందరగా వెళ్ళాడు)
(దూరంగా తుపాకుల శబ్దం వినిపించింది ఒక్కక్షణం నిశ్శబ్ధం. నాయక్ వచ్చి అందరికీ టీ పోస్తున్నాడు. అక్కడున్న అందర్లోకీ అతనే ముసలివాడు)
రావ్: (తన దగ్గరికి వచ్చి టీ పోస్తూంటే) నాయక్ ! మా అందర్లోకీ నువ్వే పెద్దవాడివి. ఎన్ని యుద్ధాలు చూశావు నువ్వు?
నాయక్: (attention కి వచ్చి) ఇవి మూడవది సార్?
రావ్: దేశంకోసం చచ్చిపోయిన వాళ్లని చూశావా నాయక్ ? (అందరూ తుళ్లిపడి చూస్తున్నారు)
నాయక్: (నవ్వి) యస్ సార్.
రావ్: ఎలా వుంటుంది ఆ అవకాశం?
నాయక్: ఆ అదృష్టం అందరికీ వస్తుందా సార్-ఇక్కడికి వచ్చే ప్రతీ వ్యక్తి గర్వంతో, మహదానందంతో ఉంటాడు. నాకు 50. నా చేతుల్లో అయిదుగురు నవ్వుతూ ప్రాణం వదిలారు. టీ సార్!
రావ్: థాంక్స్. మేజర్ శివప్రసాద్ చచ్చిపోయారు.
నాయక్: (విని, టోపీ తీశాడు) చాలా అదృష్టవంతుడు సార్.
రావ్: ఇక మరో గంటలో శత్రువులు ఇక్కడ ఉంటారు. మాకింకా టీ ఇస్తావా నాయక్?
నాయక్: చివరి క్షణం వరకూ ఉండమన్నా సిద్ధం సార్.
రావ్: (నవ్వి, లేచి అతని భుజం తట్టాడు) వద్దులే. నువ్వు మూడో స్థావరానికి వెళ్ళు. ఈ కెటిల్ లో టీ చాలు మాకు. వెళ్లి రెండో స్థావరం తెల్లవారే వరకు నిలబడుతుందని అక్కడివాళ్లతో చెప్పు. బహుశా వస్తే కేప్టెన్ రాయ్ వాళ్లలో చేరుతారేమో.
రాయ్: (ఆ మాట వినడంతోటే ఉద్రిక్తుడై, చటుక్కున లేచి నిలబడ్డాడు) కల్నల్ సాబ్ ! క్షమించండి. నేనూ ఈ స్థావరంలోనే ఉంటాను. నేను వెళ్ళను.
రావ్: ఐసీ-మిష్టర్ నాయర్ !.మీరో-
నాయర్ : మీతో కలిసి పనిచేయడం నా అదృష్టం కల్నల్ సాబ్-నేనూ వెళ్ళడంలేదు.
రావ్ : వెళ్ళాలన్నా వెళ్ళలేరు మీరు- (నాయక్ వైపు తిరిగి) ఇది నువ్విచ్చిన చివరి టి నాయక్. వెళ్ళి మూడవ స్థావరములో చేరు. పగటి వెలుగును మళ్ళీ చూస్తే నిన్ను కలుస్తాం. ఇక్కడున్న నలుగురి శరీరాల్లో చివరి రక్తంబొట్టు నిలిచే వరకూ మూడో స్థావరం వైపు శత్రువు తలెత్తి చూడలేడని చెప్పు అక్కడి వాళ్ళతో..
నాయక్ : యన్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్.
🇮🇳
*సశేషం*
꧁┅┉━━☆꧂
*వందే మాతరం - 4*
💪
రచన : గొల్లపూడి మారుతీరావు
నాయక్ : యన్ సార్. ఐవిష్ యూ గుడ్ లక్.
(చెయ్యి జాస్తాడు. కల్నల్ తో కరస్పర్శ చేశాడు. సింగ్ దగరికి వెళ్ళి) ఐ విష్ యూ సక్సెస్ సార్. ( కెప్టెన్ దగ్గరికి వచ్చికరస్పర్శ) గుడ్ కెప్టెన్-(తరువాత నాయర్ చెయ్యి పుచ్చుకొని భుజం తట్టాడు. తరువాత కల్నల్ వైపు తిరిగాడు.)
నాయక్ : అందులో మరి నాలుగు కప్పుల టీ ఉంది సార్!
రావ్: థాంక్యూ-
(సెల్యూట్ చేసి కుడివైపు వెళ్ళిపోయాడు నాయక్. అటువైపు అందరూ చూస్తున్నారు. ఖాళీ స్ట్రెచర్ ఎడమవైపు వెళ్ళింది.)
సింగ్ : (ఉన్నట్టుండి) Excuse me, Sir, నేను మొదటి స్థావరానికి వెళ్తాను.
రావ్: (తలెత్తి) ఊఁ.
నిశ్శబ్దం.
రావ్: (సిగరెట్టు వెలిగించి మీకు పిల్లలా కెప్టెన్?
రాయ్: ముగ్గురు సార్. నిన్ననే కొడుకు పుట్టాడని తెలిసింది.
రావ్ : ఓహ్ ! కంగ్రాచ్యులేషన్స్.
రాయ్: థాంక్స్. నవ్వాడు. ఆ నవ్వులో అర్థం అందరికీ బోధపడింది.
రావ్: మీకు, మేజర్ ?
సింగ్: నాకెవ్వరూ లేరు సార్. దేశం తప్ప 'నాది' అని చెప్పుకోదగ్గది ఏమీ లేదు.
రావ్: ఐసీ.
సింగ్ : బ్రతకడానికి, చచ్చిపోవడానికీ నాకున్నంత స్వేచ్ఛ, అధికారం ఇక్కడ ఉన్న ఎవరికీ లేదనుకుంటాను. భార్యా, పిల్లలు, ప్రేమ, అభిమానం- ఇవన్నీ నాకు తెలీని కొత్త పదాలు.
రావ్ : నాయర్ ! మీరు ?
(అందరూ అతన్ని చూశారు.)
నాయర్: (నవ్వాడు)
రావ్ : (టేబులు దగ్గరికి వచ్చి, ఒక ఉత్తరం తీసి) ఈ ఉత్తరం మీదే కదూ ?
నాయర్ : (ముఖం ఎరుపెక్కింది) యస్ సార్.
రావ్ : ప్రేమ గురించి మాకేం తెలీదు- (నవ్వుకొని) యుద్ధం ముగిస్తే పెళ్ళి చేసుకుంటారా?
(నాయర్ : (నవ్వి) యుద్ధం ముగిస్తే కాదు సార్-ఈ రాత్రి గడిస్తే—
(అందరూ తుళ్ళిపడ్డారు ఆ మాటకి. రావ్ కి ఒక్కసారిగా ఆ మాటల్లో అర్థం తెలిసివచ్చింది.)
రావ్ : వెల్, థాంక్యూ ! (అన్నారు)
(మొదటిసారి డి ఆర్. వచ్చి వెళ్ళాక మూగ షెర్పా మందు మందుగుండు ఇచ్చేశానని సంజ్ఞ చేశాడు. 'యుద్ధం జరుగుతోందా?' గుండు పట్టుకు ఎడమవైపు కెళ్ళాడు. అతనిప్పుడు తిరిగివచ్చాడు అని కల్నల్ అడిగాడు. చైనా సైనికులు వందలాది మంది మీదపడుతున్నారని, మనవాళ్ళు తుపాకులు గురి చూసి కాలుస్తున్నారని సంజ్ఞలతో చెప్పాడు. అది చెప్పేటప్పుడు అక్కడ ఉన్న ఒక తుపాకీ ఎత్తి కల్నల్ వైపు గురి చూసి ఉంచాడు. అంతే. హఠాత్తుగా బయట ఎక్కడో గ్రెనెడ్ ప్రేలింది. ఆ శబ్దానికి అంతా ఉలికిపడ్డారు. కల్నల్ రావ్ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. మూగ షెర్పా నుంచి కోపంగా రాయ్ తుపాకీ లాగుకొన్నాడు. ఒక కప్పులో టీ పోసి రావ్ వాడికి అందించాడు. వాడు వంగి సలాంలు చేస్తూ కుడివైపుకి వెళ్ళాడు)
సింగు: (ఇదంతా గమనిస్తున్నాడు) ఈ షెర్పాను క్వార్టర్ మాస్టర్ పంపలేదు కల్నల్ సాబ్-అది మరిచిపోతున్నారు మీరు.
రాయ్: అవును కల్నల్ సాబ్. మన దగ్గరికి వచ్చి రెండు నెలలే అయింది.
నాయర్: కాని వాడి పట్టుదల, ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పాపం, ఎక్కడి వాడో తెలీదు. ఇక్కడ మనతో పాటు ఈ చలిలో, ఈ మూల ప్రాణాలకు తెగించి పాటుపడుతున్నాడు.
(రావ్ నవ్వి ఏదో చెప్పబోయేలోగా డి.ఆర్. పరిగెత్తుకు వచ్చాడు. అంతా లేచి నిలబడ్డారు. అతని నుదుటిమీంచి రక్తం కారుతోంది. ఆతను మాట్లాడే సమయానికి ఇటువైపు షెర్పా కూడా వచ్చి టీ తాగుతూ నిలబడ్డాడు. కల్నల్ కి సెల్యూట్ చేశాడు డి.ఆర్.)
రావ్: యస్.
డి.ఆర్: ఇక నలుగురు మాత్రం ఉన్నారు కల్నల్ సాబ్. కేప్టెన్, మరి నలుగురు హాండ్ గ్రెనేడ్ తాకిడికి కూలిపోయారు. వెనక నుంచి హఠాత్తుగా పేలింది.
నాయర్ మీతల కేమిటి ?
రావ్ : షటప్... Proceed
డి.ఆర్: మరి అరగంటవరకూ స్థావరం నిలబడవచ్చునని కెప్టెన్ ప్రసాద్ చెప్పమన్నారు మిమ్మల్నింక సిద్ధం కమ్మన్నారు. రెండవ స్థావరానికి చైనా దళాలు బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాయి. రాత్రి యుద్ధం ఆగేటట్టు లేదు.
రావ్: ఎంతసేపు పడుతుంది సైన్యాలు రావడానికీ ?
డి.ఆర్: చాలా త్వరగా వస్తున్నారు. 20 నిముషాలు లేదా 30 మించదు.
రావ్ : ఆ నలుగురూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుస్తారా?
డి.ఆర్: వెనక్కి రామన్నారు.
రావ్: వెనక్కి వస్తే అక్కడి స్థావరాన్ని మొదట ధ్వంసం చెయ్యమని చెప్పావా?
డి.ఆర్: యస్ సార్.
రావ్: మందుగుండు అక్కడేం మిగల్లేదా ?
డి.ఆర్: లేదు సార్.
రావ్: ఇంకా ఓపిక ఉందా ?
డి.ఆర్: (నీరసంగా ఉన్నాడు. అయినా విధి నిర్వర్తింపు గుర్తుంది) యస్ సార్ (ముఖంమీద రక్తం ఇప్పుడు తుడుచుకొన్నాడు)
రావ్: (రాయ్ వైపు తిరిగి) aid please.
(ఇప్పుడొక చిన్న చీటీ కల్నల్ కి అందించాడు డి. ఆర్. రాయ్, నాయర్ కలిసి అతనికి first aid box తీసి కట్టు కడుతున్నారు. రామ్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. చురుకుగా ఉత్తరువులు చేస్తున్నాడు.)
రావ్: డిస్పాచ్ రైడర్ ! మొదటి స్థావరానికి వెళ్లే డ్యూటీ అయిపోయింది. శత్రువును ఎదుర్కోడానికి రెండవ స్థావరం ఇక సిద్దంగా ఉంది. ఈ రాత్రంతా రెండవ స్థావరం నిలుస్తుందని మూడో స్థావరానికి వెళ్లి చెప్పు. వెంటనే మొదటి స్థావరం వివరాలు హెడాక్వార్టర్స్ కి వెళ్ళాలి. 22 మంది చివరి క్షణం వరకూ పోరాడిన వర్తమానం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ కి తెలియపరచాలి. మాకు ఇక్కడ ఉన్న మందుగుండు చాలు. మూడో స్థావరం బలం మాకు ఎప్పటికప్పుడు తెలియాలి. (షెర్పాను ఇప్పుడు చూసి ఒక్క క్షణం ఆగాడు) ఈ షెర్పా మాతోటే ఉంటాడు. ఏదైనా అవసరమయితే ఇతని ద్వారా పంపవచ్చు.
డి.ఆర్: (కట్టు కట్టించుకుంటూనే) అతని నెంబరు ఎంత సార్ ?
సింగ్: రెగ్యులర్ సర్వీస్ మెన్ కాదు.
రావ్: రెండు నెలల కిందట చేరాడు. క్వార్టర్ మాస్టర్ జనరల్ లిస్టులో పేరుంటుందిలే. ప్రొసీడ్- (ఆ మాట వినగానే ఇంకా పూర్తి కాకపోయినా, కట్టుని ఒక చేత్తో పట్టుకొని, సెల్యూట్ చేసి వెళ్లిపోయాడు డి. ఆర్.)
(సింగ్ లేచి తుపాకీ తీసి కల్నల్ కి ఇచ్చాడు. కల్నల్ దాన్ని నాయర్ వైపుకి విసిరాడు. సింగ్ రాజ్ కి తుపాకీ ఇచ్చాడు. కల్నల్ తనది తీసుకొన్నాడు. ఈ సమయం లో స్ట్రెచెర్ తో రెడ్ క్రాస్ వర్కర్స్ ఎడమ వైపు నుంచి వచ్చారు. దుప్పటి మీద రక్తం మరకలు కనిపిస్తున్నాయి. మనిషి ఆకారంలో కాక, చెదిరిన శరీరపు భాగాలు దుప్పటి మీద తెలుస్తున్నాయి. కల్నల్ ని చూసి ఆగారు.)
రావ్: యస్ ?
ఏ నెంబరో తెలియలేదు సార్ - గ్రెనేడ్ దెబ్బ తిన్న సోల్జర్ శరీరం తునాతునకలయింది. అక్కడక్కడ భాగాలు మాత్రం దొరికాయి. గుర్తింపుకు తీసుకువెళ్తూన్నాం.
(ఆ దృశ్యం చూడలేక అందరూ ముఖం కప్పుకున్నారు. నాయర్ ఏడ్చేస్తాడేమో నన్నంత పనిచేశాడు. కల్నల్ రావ్ వచ్చి వచ్చి భుజం తట్టాడు. తేరుకుని 'యస్ సార్' అన్నాడు. మాప్ దగ్గరికి రావ్ వచ్చి దాని అంచులు చించి జేబులో దోపుకున్నాడు. ఫైళ్లకు అగ్గిపుల్ల తీసి నిప్పంటించాడు. అక్కడ ఉత్తరాన్ని చూపి నాయర్‌ను చూశాడు. నాయర్ నిశ్శబ్ధంగా అక్కడికివచ్చి ఒక్కసారి ఉత్తరం విప్పి చూసుకొని ఫైళ్ల మంటలో పడేశాడు. దూరాన పట్టణంలో ఏవో నినాదాలు వినిపిస్తున్నాయి. పాట తెలుస్తోంది. 'వందే మాతరం' పాడుతున్నారు. అటువైపు ఫిరంగుల మోత గట్టిగా వినిపిస్తోంది. అంతా టోపీలు పెట్టుకొని, బెల్టులు సరిచేసుకున్నారు.)
🇮🇳
*సశేషం*
꧁
*వందే మాతరం - 5*
💪
రచన : గొల్లపూడి మారుతీరావు
రావ్: వెల్? —(అనేసరికి అందరూ attention లో నిలబడ్డారు-సిద్ధంగా, మెల్లగా గొంతు కూడదీసుకొని మాట్లాడాడు) దేశంలో పుట్టిన కోట్లాది మందిలో ఏ కొద్దిమందికో లభించే అరుదైన అవకాశం మనకు లభిస్తుంది. కొన్ని సహస్రాబ్దాల సంస్కృతిని, ఔన్నత్యాన్నీ రక్షించే బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యతను మనం సరిగా నిర్వహించక పోతే, ఈ అశ్రద్ధకి ఏమీ ఎరగని ముందు తరాలు శిక్షను అనుభవించవలసివస్తుంది. మనం ఓడ్చే ప్రతి రక్తపు బొట్టూ మన శ్రేయస్సుకీ మన కుటుంబ శ్రేయస్సుకీ కాదు. ముందు తరాలవారి శ్రేయస్సుకి, అసమాన సమాజ భవిష్యత్తుకి. ఫ్రెండ్స్! మనం ఇక్కడ నలుగురం ఉన్నాం. కొన్ని సంవత్సరాల కర్తవ్య నిర్వహణ, దీక్ష ఫలితంగా ఈ స్థలము, ఈ పదవిలో నిలబడే అర్హత మనకు కలిగింది. ఈ అర్హతను మనం కాపాడుకోవాలి. ముందు తరాలవారు మన ధైర్య సాహసాలకు వారసులు కావాలిగాని, మన పిరికి తనానికి కాదు. మరొక క్షణంలో కొన్ని వందలమంది మనల్ని ఎదుర్కోబోతారు. కొన్ని వందల తుపాకులు మన ధైర్య సాహసాల్ని సవాలు చేస్తాయి. తెల్లవారే వరకూ ఈ స్థావరాన్ని నిలపడం మన బాధ్యత, మనకు తెలిసి, మన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఒక్క అంగుళం భూమి శత్రువుకు దక్కకూడదు. మనం వారినందరినీ జయించలేకపోవచ్చు. కాని మన శవాలమీది నుంచే వారికి ముందడుగు పడాలి. ఒక్క విషయం అందరూ రూఢి చేసుకోండి. ఏ క్షణాన్నయినా మృత్యువుకు సిద్ధపడి, విజయాన్ని దృష్టిలో వుంచుకుని తుపాకులు ఎత్తి వున్నాం మనం. అందుకు సిద్ధమేనా మీరంతా ?
సింగ్: యస్ సార్.
రాయ్: యస్ సార్.
నాయర్: యస్ సార్.
(బయట 'వందేమాతరం' నినాదాలు దగ్గరపడ్డాయి.)
రావ్: గుడ్, జాలీగుడ్!- Now. ఈ స్థావరాన్ని ఎదుర్కోటానికి శత్రువుకు రెండు మార్గాలున్నాయి. (ఎడమ చివరికి అందర్ని తీసుకువచ్చాడు) ఆ రెండు మంచు శిఖరాల మధ్య కనుమ నుంచి సైన్యాలు రావాలి, లేదా వాటిని చుట్టిరావాలి. కాని మధ్య నుంచే వస్తారని మన మ్యాప్ ల ద్వారా, డిస్పాచ్ రైడర్ ద్వారా తెలిసింది. అంటే కనుమ లోంచి ఒకరి తర్వాత ఒకరు రావాలి. అప్పుడు మనం నలుగురమే వాళ్లని ఎదుర్కోవడం సులభం అవుతుంది ఈ మార్గం వాళ్లకి సుగమం కాకుండా చేయ గలిగితే వాళ్లు చుట్టూ తిరిగి రావలసి ఉంటుంది. అందుకు కనీసం 48 గంటలు పడుతుంది. ఈలోగా రెండవ స్థావరాన్నే మనం బలం చేసుకోవచ్చు. రైట్? —
సింగ్: చాలా మంచి ప్రయత్నం కల్నల్ సాబ్!
రావ్: (విరామం. మెల్లగా) మొదట ఈ ప్రాంతానికి—
సింగ్: నేను వెళ్తాను సాబ్.
రావ్: (తలెత్తి) ఊ. మీరేమంటారు కెప్టెన్?
(కెప్టెన్ రాయ్ ఒక్కక్షణం మాట్లాడలేదు. రావ్ సిగరెట్ వెలిగించి కుడిమూల ఉన్న first aid box సర్దుతున్నాడు. షేర్పా ముందుకువచ్చి నిలబడ్డాడు.)
నాయర్: పాపం, నిన్ననే ఆయనకు శుభ వార్త తెలిసింది. పిల్లల విషయం తెలియని వాడిని నేను. పిల్లలే లేనివారు మీరు. మనాలో ఎవరో ఒకరు వెళదాం.
సింగ్ : (నవ్వి) నిజమేనా కేప్టెన్?
(రాయ్ మాట్లాడలేదు. నాయర్ చెప్పింది నిజమేనని రాయ్ ముఖం చెప్తోంది. సింగ్ గ్రహించి దగ్గరికి వచ్చి భుజం తట్టాడు)
సింగ్ : ఎంత ప్రయత్నించినా జీవితంలో తియ్యదనం మరుపుకురాదు. ఆల్ రైట్. మరికొంతసేపు మీరు ఆ తృప్తిని అనుభవి స్తూండండి. మీకు బదులు నేను వెళ్తాను.
(ఎడమవైపు తిరగబోయేసరికి, కల్నల్ తుపాకిని షెర్పాకు గురి చూసి పేల్చాడు. షెర్పా చనిపోయాడు చైనా భాషలో అరుస్తూ. ముగ్గురూ త్రుళ్లిపడి ఇటు తిరిగే సరికి నేలమీద కొట్టుకొంటున్నాడు షెర్పా. అందరూ దిగ్భ్రమతో కల్నల్ ని చూస్తున్నారు. కల్నల్ ప్రశాంతంగా మరొక గుండును తుపాకిలో ఉంచుతున్నాడు.)
రాయ్ : సాబ్ !
సింగ్ : ఏమిటిది కల్నల్ సాబ్ !
(నాయర్ కిందికి వంగి షెర్పా తల ఎత్తాడు. కాని తల వాలిపోయింది. లేచి నిలబడ్డాడు)
నాయర్ : చచ్చిపోయాడు !
రావ్ : (కొంతసేపటికి మెల్లగా మాట్లాడాడు) మనలాంటి కమిషన్ ఆఫీసర్లను ఇంత సుళువుగా ఇతనెలా మోసం చేశాడా అని నా ఆశ్చర్యం. ఇంత నమ్మకంగా మనల్ని అంటిపెట్టుకొని, 24 గంటలు పనిచేస్తున్న ఈ మూగ షెర్ఫా మనకంటే బాగా మాట్లాడ గలడని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పమంటారా ?
సింగ్ : చెప్పండి.
రావ్: ఇతను చైనా గూఢచారి. రెండు నిమిషాల క్రితమే ఆ విషయం రూఢిగా తెలిసింది. నిన్న తుపాకీలు మోసుకుని తీసుకువెళ్తుండగా ఈ విషయం తెలిసింది. ఒక తుపాకీ జారి కాలుమీద పడ్డప్పుడు చైనా భాషలో ఏదో గొణుక్కున్నాడు. ఇతను మాటలాడగానే నాకు దిగ్భ్రమ కలిగింది. వెంటనే హెడ్ క్వార్టర్స్ కి రిఫర్ చేశాను. ముందు స్థావరానికి కూడా చెప్పి ఉంచాను. ఈ రాస్కెల్ మన తుపాకుల తోనే మనల్ని చంపిస్తున్నాడు.
నాయర్ : అదెలా తెలిసింది ?
రావ్: తెలుసుకోవడం చాలా సుళువు.
మన బులెట్సును మన తుపాకులతోనే పేల్చాలి. చైనా తుపాకులలో మన బులెట్స్ సరిపోవు. ఇందాక చచ్చిపోయిన ఇద్దరు సైనికుల శరీరాల్లో మన బులెట్సు దొరికాయి. అంటే మన తుపాకులు చైనా వారి దగ్గర ఉన్నాయన్నమాట. అవి ఎలా వెళ్ళాయి? వెంటనే నిన్న పంపిన తుపాకీల విషయం వాకబు చేశాను. వాటిలో కొన్ని అందలేదని డిస్పాచ్ రైడర్ చీటీ తెచ్చాడు. ఇంతకన్న మంచి సాక్ష్యం అక్కర లేదు. మనం చాలా మెలకువతో ఉండడంవల్ల ఈ ఆపద సుళువుగానే తప్పిపోయింది. ఫ్రెండ్స్ ! ఇది చాలా చిన్న విషయం. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మేజర్! ఈ శవం ఇలా వుండడం మంచిది కాదు.
(సింగ్, రాయ్ పట్టుకొని శవాన్ని కుడివైపుకి ఈడ్చుకుపోయారు. రావ్ సిగరేట్లు తీసి ఒకటి నాయర్ కి ఇచ్చాడు. బయట "వందే మాతరం" నినాదాలు దగ్గర పడుతున్నా యి. ఇటువైపు ఫిరంగుల మోత ఎక్కువ వుతుంది. హఠాత్తుగా సింగ్, రాయ్ లు తొందరగా లోపలికి వచ్చారు. )
సింగ్ : కల్నల్ సాబ్! ఏదో ఊరేగింపు దగ్గరికి వస్తోంది.
రావ్ : ఇక్కడికా?
నాయర్: ఈ సమయంలోనా?
రాయ్: చాలామంది ఉన్నారు. దాదాపు వందమందికి పైగా ఉంటారు.
(ఎక్కడో గ్రెనేడ్ ప్రేలింది)
రావ్: ఫ్రెండ్స్! ఇకమనం జాగ్రత్తపడపలసిన క్షణం దగ్గరపడుతుంది.
(బయట 'వందే మాతరం', 'భారత జవాను లకీ జై అన్న నివాదాలు, ఉన్నట్టుండి దాదాపు వందమంది లోపలికి వచ్చారు. “భారతావని వరిల్లాలి" అనే పెద్ద అక్షరాలు వ్రాసిన అట్టను ఇద్దరు రెండు ప్రక్కలా పట్టుకున్నారు. ప్రతి వ్యక్తి పెద్ద ఉన్ని శాలువను కప్పుకున్నాడు. ఒకరి చేతిలో పెట్రోమాక్స్ లైటు ఉంది. వీళ్ళందరికి ముందున్న తలనెరిసిన వ్యక్తి నాయకుడు. అతను చేతులెత్తి వెనుక వస్తున్న గుంపును ఆపాడు).
నాయ: మిత్రులారా! ఆగండి. అక్కడే ఆగండి.
(వాళ్ళు ఇటు తిరిగేసరికి నలుగురు ఆఫీసర్లు నాలుగు వైపులా నిలబడ్డారు. వెనుక నుంచి పదిమంది “భారత జవాను లకీ జై" అని అరిచారు)
రావ్: (మిగతా ముగ్గురి ముఖాలు చూసి, వీలయినంత సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు). ఫ్రెండ్స్! ఎందుకోచ్చా రిక్కడికి?
నాయ: మీకు మా కృతజ్ఞతలు చెప్పడానికి. దేశంలో ఈ మూల ఈ చివర అహో రాత్రాలు దేశ రక్షణకు ఒంటరిగా నిలిచిన మీరు నిజంగా ఒంటరులు కారని నిరూపించడానికి. మిత్రులారా! మీ వెనుక ఎంత బలం, ఎందరి విశ్వాసం అండగా ఉన్నదో చూపడానికి బయలుదేరి వచ్చాం చూడండి.
రావ్: ఇది చాలా విషమ సమయం. ఇలా యుద్ధం జరిగే స్థలానికి మీరు రావడం ప్రమాదం.
నాయ: (నవ్వాడు) దేశానికే ప్రమాదం వచ్చింది. మీరు మీకు వచ్చే ప్రమాదాన్ని లక్ష్యం చేయకుండా పోరాడటానికి సిద్ధపడ్డారు. మాకు తుపాకీ పట్టుకోవటం రాదు. కాని మా సానుభూతి, సహకారాల్ని ఈ విధంగానయినా ప్రదర్శించుకోవడానికి రావడం తప్పా? — (వెనక్కి తిరిగి) బోలో భారత్ జవానోంకీ- (జై అన్నారంతా)
రావ్: ఫ్రెండ్స్! ఈ పరిస్థితి మీకర్థంకాదు. ఇట్లా మీరు రావడంవల్ల, చెడెకాని, మంచి జరగదు. అక్కడ మొదటి స్థావరం కూలి పోతోంది. శత్రువు ఏ క్షణాన్నయినా ఈ స్థావరం మీద పడవచ్చు. వాళ్ళు వేలకొద్దీ మనుషులున్నారు. మీకు ఆయుధం పట్టడం తెలీదు. వాళ్ళు మీదపడితే ఇంత వరకూ మా ప్రాణాలదే మా బాధ్యత' కాని ఇప్పుడు మీ అందరినీ రక్షించవలసిన బాధ్యత మామీద పడుతుంది. దయచేసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోండి.
నాయ: దోస్తో ! — ఒకటి రెండు వాక్యాలు చెప్పి పోవటానికి వచ్చాం. ఇక్కడ మీరు ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న విషయం ప్రతి క్షణం అక్కడ వింటున్నాం. మిమ్మల్ని దేశం ప్రజలూ ఎన్నటికీ మరిచిపోరు. అడ్కడ మీ కుటుంబాలు ఒంటరిగా ఉన్నాయనుకోకండి. కొన్ని కోట్లమంది ప్రజల కోసం మీరు ఇక్కడ పోట్లాడుతున్నారు. అన్ని కోట్లమంది అండ మీ కుటుంబాలకు ఉంటుంది. దేశానికి బానిసత్వం దాపురించకుండా చూసే బాధ్యత మీది. మీవంటి నాయకులు నాయకత్వంలో మనకు అపజయం లేదు. ఎప్పటికయినా విజయం మనదే. బోలో భారత్ మాతాకీ జై — (అంతా జై అన్నారు) — భారత్ జవానోంకీ—
(ఇటుపక్క తుపాకులు పేలాయి. అందరు ఉలిక్కిపడ్డారు. వీళ్ళు ఉంటున్నకొద్దీ అంతా nervous అవుతున్నారు).
రావ్: ఫ్రెండ్స్— మీరు ఇక్కడ ఉంటున్న కొద్దీ భయంతో మా గుండెలు కూడా రెపరెపలాడుతున్నాయి. మా విషయం కాదు, మిమ్మల్ని ఎలా రక్షించాలా అని. దయచేసి వెళ్ళిండి. మీకు నమస్కారం చేస్తాను. త్వరగా వెళ్ళండి.
(ఇంతలో అందరి మధ్య నుంచీ ఓ పదేళ్ళ అమ్మాయి పళ్లెం పట్టుకొని వచ్చింది, అందరి దృష్టి ఆమె వైపు తిరిగింది. ఆమె ఆ నలుగురి ముందూ నిలిచి, పళ్లెం క్రింద ఉంచి నాలుగు మల్లెపువ్వుల దండల్ని నలుగురికి వేసింది. రాయ్ దగ్గరికి వచ్చేసరికి అతనామెను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. 'నీపేరేమిటమ్మా' అనడిగాడు. 'మైధిలి' అంది అమ్మాయి. తరువాత అందరికీ మిఠాయిలు ఇచ్చింది. మళ్లీ అంతా 'భారత్ జవానోంకీ జై' అన్నారు).
🇮🇳
*సశేషం*
*వందే మాతరం -6*
మళ్లీ అంతా 'భారత్ జవానోంకీ జై' అన్నారు.
రావ్: (ఈ చర్యకు కదిలిపోయాడు. ఒక్కసారి కళ్ళు తుడుచుకున్నాడు). ఫ్రెండ్స్- ఈ మీ సహృదయాన్ని ఎప్పటికీ మరిచిపోం. మా చేతిలో ఆయుధాలు నిలిచేవరకు మన దేశం వైపు ఎవరూ తలెత్తి చూడలేరని మాత్రం హామీ ఇవ్వగలం.
(తుపాకులు, గ్రెనేడ్స్ ప్రేలాయి. వెంటనే సింగ్ వైపు తిరిగాడు) మేజర్- It is time – మీరు కనుమ దగ్గరికి వెళ్ళండి. ఒక్కొక్క భారతీయుడు వందమంది చైనావారికి సమాధానం చెప్పగలడని నిరూపించండి. Wish you good luck-(కరస్పర్శ చేశాడు.)
సింగ్—Thanks, Sir (రాయ్, నాయర్ లు కూడ ముందుకువచ్చి అతని కరస్పర్శ చేశారు. పౌర బృందానికి అతను నమస్కారం చేశాడు. వారంతా ఒక్క పెట్టున నినాదాలు చేశారు. సింగ్ ఎడమవైపు వెళ్ళాడు).
రావ్: ఇక మీరు త్వరపడాలి. ప్లీజ్!
నాయ: అవును. మీ పనికి అడ్డురాము. (వెనకకు తిరిగి) మిత్రులారా! పదండి. (మెల్లగా బృందం వెనక్కి తిరిగింది. మళ్ళి దూరంగా పాట వినిపిస్తోంది. బృందం మెల్లగా దూరమవుతోంది. రావ్ ఇంకా వారి సౌహార్ధం, సౌజన్యం నుంచి తేరుకోలేక పోతున్నాడు. మెడలోని మల్లె పువ్వులను వాసన చూసుకున్నాడు).
రావ్: కెప్టెన్— మంచితనం, సౌహార్ధం, మనిషిని ఎంత పిరికివాణ్ణి చేస్తాయి! ఒక్క క్షణంలోనే మామూలు మనిషినైపోయాను.
నాయర్ : (నవ్వి) ఎప్పుడన్నా నేను మీ అంత కఠినంగా, కర్తవ్య దీక్షతో ఉండగలనా అనిపిస్తుంది కల్నల్ సాబ్. ఉండడం కాదు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకు ముందుకు దూసుకుపోవడమే కష్టమనిపిస్తుంది.
రాయ్: నిజమే కల్నల్ సాబ్ ! లెఫ్టినెంట్ చెప్పింది చాలా నిజం.
(రావ్ ఇటు తిరిగేసరికి ఓ విచిత్రమయిన దృశ్యాన్ని గమనించాడు. అక్కడ కుడివైపు మూలను ఓ సన్నటి వ్యక్తి బిక్కుబిక్కు మంటూ చూస్తూ నిలబడ్డాడు. వీళ్ళ మాటలు వింటూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇప్పుడు రావు తనని చూశాక మరీ భయపడుతున్నాడు. అందరూ అతన్ని చూశారు. ఆశ్చర్యపోయారు.)
రావ్ : ఎవరు నువ్వు?
(మొదట అతను మాట్లాడలేదు. బైటకు చెయ్యి చూపాడు. ఎవరికీ అర్థం కాలేదు. కొందరికి అనుమానం కలిగింది.)
రాయ్: నిన్నే - ఎవరు నువ్వు?
యువ : వాళ్ళతో వచ్చాను.
రావ్ : నీ పేరేమిటి?
యువ : విశ్వనాధ్.
నాయర్ : ఎలా వచ్చావిక్కడికి?
విశ్వ : ఇందాక వచ్చిన ఊరేగింపుతో.
రాయ్ : మరి వాళ్ళతో వెళ్ళిపోలేదేం?
విశ్వ : వెళ్ళలేదు.
రాయ్: ఎందుకని?
విశ్వ : వెళ్ళాలనిపించలేదు.
నాయర్ : అంటే?
విశ్వ : మీతో కలిసి పనిచేయాలని ఉంది. (ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.)
నాయర్ : మాతోటి! ఏం చేస్తావు నువ్వు?
విశ్వ : ఏం చేయమన్నా చేస్తాను. యుద్ధం చేస్తాను. నేనూ తుపాకీ ఎత్తగల్ను. చదువు కొనే రోజుల్లో నేర్చాను. కావలిస్తే—
(చటుక్కున ఎవరిదో తుపాకీ తీసుకోబోయాడు.)
(ఇద్దరూ దూరంగా జరిగారు. కల్నల్ రావ్ అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వాళ్ళు దూరంగా జరిగితే బెదిరిపోయి ఆగిపోయాడు విశ్వనాథ్.)
రావ్: యుద్ధం చేస్తావా ! నువ్వు !
(అతన్ని చూశాడు. సన్నగా వేరులా ఉన్నాడు. అతన్ని చూసి నవ్వాలనిపించి నా నవ్వు రావడంలేదు. ఎందుకంటే ఆ వాక్యాల్ని నమ్మి, విశ్వసించి, నిర్థారణతో అంటున్నాడు విశ్వనాథ్.)
విశ్వ : అవును. యుద్ధం చేస్తాను. చచ్చిపోయినా ఫరవాలేదు. నా కెవరూ లేరు.
రావ్ : ఎవరూ లేనంతమాత్రాన చచ్చిపోవడం అందులోనూ ఇక్కడ చచ్చిపోవడం సుళువుగా సాధ్యంకాదు.
విశ్వ : నేను బలహీనంగా ఉన్నాను. అంతేగా మీ భయం? నేనూ తుపాకీ పట్టుకోగలను.
రావ్ : ఇదిగో నేస్తం నీకి విషయాల్లో ఏమీ పరిచయం లేనట్టు కనిపిస్తోంది. యుద్ధం చేయడం, శత్రువుని ఎదుర్కోవడం ఇలా సులభంగా సాధ్యమయే పనికాదు.
విశ్వ : మరి ఏం చేయాలి?
నాయర్ : మొదట నువ్విక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చేయాలని ఉంటే ప్రభుత్వం శిక్షణ యుద్ధంలో పని ఇస్తుంది. నాలుగైదే ళ్ళకు తరిఫీదు పూర్తవుతుంది. వెళ్లు.
(ఇటుపక్క తుపాకులు పేలుతున్న శబ్దం- ఇంకా దూరంగా నినాదాలు వినిపిస్తున్నాయి.)
విశ్వ: నాకు వెనక్కి వెళ్లాలని లేదు. ఏదో నాకు తోచినట్టుగానే పోరాడనివ్వండి. శత్రువును ఎదుర్కొంటాను.
(ఖాళీ స్ట్రెచెర్ తో రెడ్ క్రాస్ వర్కర్స్ ఎడమ వైపుకు వెళ్లిపోయారు.)
రావ్: ఫ్రాన్సిస్!
A: యస్సార్.
రావ్: ఇక మీరు ముందుకు వెళ్లనక్కర లేదు. మొదటి స్థావరంలో మీ పని అయిపోయింది. మూడవ స్థావరం దగ్గరికి వెళ్లండి. అవసరమయితే పిలుస్తా.
A. యస్సార్. (వెళ్లిపోయారు)
రావ్: ప్రాన్సిన్!
బి. సార్.
రావ్: ఇతన్ని నువ్వెప్పుడయినా చూశావా? (వ్యక్తిని చూపాడు)
A: (గమనించి) లేదు సార్.
రావ్: మీ అంబులెన్సులో ఇతన్ని ఊరికి చేర్చండి. ఇందాకటి ఊరేగింపుతో వచ్చాడు. ఇక్కడ ఉండిపోయాడు.
(ఆ మాటలు వినగానే విశ్యనాథ్ పెద్ద కేకలు పెట్టడం ప్రారంభించాడు.)
విశ: నేను వెళ్లను, నేను వెళ్లను, (కల్నల్ వెనక్కి వచ్చి నిలబడ్డాడు. అతన్ని వదలడు. రాయ్, నాయిర్ తెల్లబోయి ఒక్క ఉదుటున వెళ్లి అతని చేతులు పట్టుకున్నారు. అతనింకా గట్టిగా గుంజు కుంటున్నాడు.) నేను వెళ్లను, నేను వెళ్లను. ఇక్కడే వుంటాను, నన్ను పంపేయకండి. మీకు దండం పెడతాను.
రావ్: (బోధపరచబోతాడు.) నే చెప్పే మాటలు వినిపించుకో ముందు. తుపాకులు పేలితే నిలవలేవు, నువ్విక్కడ ఉండకూడదు. నా మాట విను-(ఇక వినక పోయేసరికి విసుగెత్తి, కోపం వచ్చి బలంగా చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకు యువకుడికి కళ్లంట నీళ్లు తిరిగాయి)
విశ్వ: (అయినా ఆగలేదు) నేను వెళ్లను, నేను వెళ్లను.
రావ్: (ఇటు తిరిగి A.B.లతో) సరే. మీరు వెళ్లండి. (ఇద్దరూ వెళ్లారు. బయట పెద్ద Van కదిలిన శబ్దం. అతన్ని వదిలివేయ మని సంజ్ఞ చేయగానే, రాయ్, నాయర్ వదిలేశారు. వదలగానే విశ్వనాథ్ వచ్చి రావ్ బట్టలు పట్టుకున్నాడు.)
🇮🇳
*సశేషం*
꧁
*వందే మాతరం -7*
💪
విశ్వ: (తొందరగా మాట్లాడాడు) నన్ను పంపెయ్యకండి. నేను వెళ్లిపోవడానికి రాలేదు. వెనక్కి పొమ్మంటే ఆత్మహత్య చేసుకుంటాను. నేనూ మీతో కల్సి దేశ సేవ చెయ్యడానికి వచ్చాను, నాకూ ఓ తుపాకి ఇవ్వండి. నేనూ పోరాడుతాను. నేను చచ్చి పోయినా బాధలేదు, ఎవరికీ బాధ లేదు. (ముగ్గురు నిస్సహాయులైపోయారు. ఏం చేయాలో ఆలోచించే లోగా మేజర్ సింగ్ తూలూతూ ఓ మహా ప్రవాహం లాగ వచ్చి అక్కడ బల్లమీద పడ్డాడు. అందరూ అదిరిపడ్డారు. కల్నల్ రావు చటుక్కున వరిగాడు. అందరూ కిందికి చూశారు.)
రావ్: మేజర్ ! ! ఏమయింది మీకు ? (కిందపడి ఉండే రక్తంతో ఉన్న చేత్తో సెల్యూట్ చేశాడు సింగ్.)
సింగ్: నాకేం పరవాలేదు కల్నల్ సాబ్ !- మీరు త్వరపడాలి. మరి 50 గజాల దూరంలో ఉన్నారు వాళ్లు. బ్రెన్ గన్సు ఉన్నాయి వాళ్ల దగ్గర. జాగ్రత్తపడండి.
(వెంటనే అతన్ని వదిలేసి లేచాడు రావ్, ఇద్దరు ఆఫీసర్లకు క్షణంలో ఆర్డర్లు ఇచ్చాడు.)
రావ్: కెప్టెన్ ! ఎడమ వైపు బి-6 సాండ్ బారియర్ వైపు మీరుండండి. లెఫ్టినెంట్! కుడివైవు మీరు, నేను పోస్ట్ వెనక ఉంటాను. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రాణాల తో శత్రువుకి దొరకకూడదు. ప్రాణం పోయే వరకూ స్థానాన్ని వదలకూడదు. క్విక్ మార్చ్! విష్ యూ దిబెస్ట్-(తనూ త్వరగా తుపాకి తీసుకొని వెళ్లిపోతూండాగా, విశ్వనాథ్ కనిపించాడు. ఇప్పుడు కొంపం
ఎక్కువయింది.) Get out. you fool (అని అతన్ని కుడివైపు ఈడ్చేశాడు. ఎడమవైపు పరిగెత్తాడు. ఇప్పుడు ఆ సమీపంలో తుపాకులు పేలుతున్నాయి. ఏవో చైనాభాషలో ఆర్డర్స్ వినిపిస్తున్నాయి. బల్లమీద ఉన్న సింగ్ ఒక్క క్షణం కదిలి తల వేలాడేశాడు. దూరాన భారత జాతీయ గీతం వినిపించింది.
రెండు క్షణాలు నిశ్శబ్దం.. బయట తీవ్రంగా పోరాటం జరుగుతున్నట్టుంది. మళ్ళీ విశ్వనాధ్ లోపలికి వచ్చాడు. బెదురుగా చుట్టు పక్కల చూస్తున్నాడు. వచ్చి సింగ్ ని చూశాడు. నిర్జీవంగా బల్లమీద ఆతని తల వేలాడుతుంది. కిందికి వంగేలోగా ఎవరో బయట నుంచి త్రోసినట్టు వచ్చి అతని మీద పడ్డాడు. విశ్వనాధ్ గావుకేక పెట్టాడు. తనమీద పడ్డ వ్యక్తి గాయాలతో ఉన్నాడు. కేప్టెన్ రాయ్. అతను నేలకు ఒరిగిపోయే లాగ ఉన్నాడు. విశ్వనాధ్ ను చూడగానే లేచి ఓపిక తెచ్చుకొని నిటారుగా నిలబడ్డాడు. సెల్యూట్ చేశాడు. ఏదో మాట్లాడుతున్నాడు.
రాయ్ : చివరివరకూ...పోరాడుతూనే ఉన్నాను కల్నల్ సాబ్-ఇదిగో తుపాకీ, దీన్ని వదల్లేదు. నేను వెనక్కి పారిపోలేదు కల్నల్ సాబ్-నా పిల్లలకోసం పారిపోలేదు, ఇదిగో తుపాకి. ఇక మాట్లాడలేక నేలకి ఒరిగిపోయే సమయానికి యువకుడు ఆదుకొన్నాడు. అతని చేతుల్లోనే చచ్చిపోయాడు. తుపాకీని తొలగించడాని కి ప్రయత్నించాడు విశ్వనాధ్. అతని చేతుల్లోంచి రాలేదు. నేలమీద పడుకో బెట్టాడు. ఒక్క క్షణం ఆలోచించి అతన్ని మెల్లగా కుడివైపుకు ఈడ్చుకుపోయాడు. మళ్ళీ క్షణం నిశ్శబ్దం—త్వరగా స్ట్రెచర్ తో అంబులెన్సు వర్కర్స్ వచ్చారు. లోపలికి వచ్చి-సింగ్ ని చూచి-అతన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకుపోతుండగా-రాయ్ బట్టలు వేసుకొని విశ్వనాధ్ వచ్చాడు. ఆతన్ని సరిగా చూడకుండానే రెడ్ క్రాస్ వర్కర్స్ సెల్యూట్ చేశారు. అప్రయత్నంగా విశ్వనాధ్ సెల్యూట్ అందుకొన్నాడు.
'మేజర్ రాంసింగ్ సార్' అని చెప్పి వెంటనే స్ట్రెచర్ తో వాళ్ళీద్దరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరిగా మిగిలాడు విశ్వనాధ్. వెనక ఏదో బరువుగా కనిపిస్తే వెదికాడు. రాయ్ బెల్టుకి ఉన్న రివాల్వరు చేతికి తీసుకున్నాడు. ట్రిగ్గర్ మీద చెయ్యివేసి దాన్ని పట్టుకొని ఉండగా కల్నల్ రావ్ వచ్చాడు. ఎదురుగ్గా ఉన్న విశ్వనాధ్ ని చూసి మొదట రాయ్ అనుకున్నాడు.
రావ్: (సంతోషంగా) కేప్టెన్! శత్రువులు ఇవ్వాళకి వెనక్కుపోయారు. సక్సెస్— (ఇప్పుడతన్ని గమనించి) నువ్వా!! —ఆ ఒంటికి రక్తమేమిటి? (రాయ్ శరీరానికి తగిలిన గాయాల రక్తం బట్టలకి ఉంది) కేప్టెన్ ఎక్కడ?
విశ్వ: చచ్చిపోతూ కూడా తుపాకీ వదల లేదని, పిల్లలకోసం పారిపోలేదని చెప్పమన్నారు. ఒక్క క్షణం క్రిందటే... (మాట చెప్తూండగానే రెండు తుపాకులు ఎడమవైపు నుంచి లోపలికి వచ్చాయి. వాటి చివర చైనావారి జెండాలు వేలాడు తున్నాయి. ఇటు తిరిగి ఉండడం వల్ల కల్నల్ కి అవి కనిపించలేదు. కాని విశ్వనాధ్ గుర్తించాడు. పై మాటలంటూ చటుక్కున ఆగి, అసంకల్పితంగా చేతుల్లో ఉన్న పిస్తోలు పేల్చాడు 'ఆగు. ఎవరక్కడ' అంటూ. పిస్తాలు పేల్చిన మరుక్షణంలో కల్నల్ ఒక్కసారి కిందికి వంగి పక్కక దూకాడు. రెండో తుపాకీ పేలి యువకుడికి తగిలింది. కాని మరుక్షణంలో కల్నల్ ఆ తుపాకి పట్టుకున్న చైనా సైనికుడిని కొట్టేశాడు. ఒక్క క్షణంలో రెండు చైనా తుపాకులూ కూలాయి. విశ్వనాధ్ కూలాడు. కల్నల్ నిర్ఘాంతపోయి ఒక్క ఉదుటున వచ్చి యువకుణ్ణి ఒళ్లోకి తీసుకున్నాడు.
రావ్: నేస్తం !(జేబులోంచి విజిల్ తీసి ఊది) ఆంబులెన్స్, ఆంబులెన్స్ ! (అరిచాడు)
విశ్వ : (కొంతసేపటికి కళ్ళిప్పాడు. కల్నల్ ని చూసి నవ్వాడు) చూశారా కల్నల్— నేనూ ఒక్కణ్ణి చంపగలిగాను—
రావ్: ఒకర్ని చంపడంకాదు నేస్తం - ఒకర్ని రక్షించావు. ఎలా వుందిప్పుడు? (విశ్వనాధ్ అసలే అల్పం. తుపాకీ గుండు సూటిగా తగిలింది. వెంటనే ప్రాణం వదిలాడు. అప్పుడు నిజంగా కల్నల్ రావ్ కి బాగా ఏడుపొచ్చింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. బయట తుపాకులు, కాల్పులు పూర్తిగా తగ్గిపోయాయి. ఉన్నట్టుండి ఎడమవైపు నుంచి నాయర్ హఠాత్తుగా పరుగెత్తుకు వచ్చాడు. ఇంకా నేలమీద కూర్చున కల్నల్ కి సెల్యూట్ చేసి—)
నాయర్: కల్నల్ సాబ్ !— సక్సెస్-మన స్థావరం నిలబడింది కల్నల్ సాబ్ ! మరి 48 గంటలవరకూ మనకేం బాధలేదు.
కల్నల్! (ఇప్పుడు అతని చేతుల్లో ఉన్న వ్యక్తిని చూసి) కేప్టెన్ !— పోయారా కల్మల్ సాబ్!
రావ్: (లేచి) కేప్టెన్ కాదు. ఇందాక ఇక్కడ నిలబడ్డ యువకుడు విశ్వనాధ్.
(నాటకం లో విశ్వనాధ్ పాత్రధారి మా మావయ్య నండూరి పార్ధసారధి గారు)
నాయర్: విశ్వనాధ్! (ఇప్పుడు చూశాడు).
రావ్: అవును లెప్టనెంట్. అతను లేకపోతే ఈ స్థావరంలో ఈనాటికి మీరొక్కరే బ్రతికి ఉండేవారు. తుపాకీ పట్టుకోవడం మాత్రం తెలిసిన విశ్వనాధ్ ఓ ఆఫీసర్‌ను రక్షించాడు. ఓ సైనికుడిని చంపాడు.
(తలమీంచి టోపీ తీశాడు. నిర్ఘాంతపోయి నాయర్ కూడా తన తలమీద టోపీ తీసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఊరేగింపు వెనుకకు వచ్చింది. మళ్లీ ఇందాకటి నాయకుడు, మరి కొంతమంది లోపలికి వచ్చారు. అందరి ముఖంలో సంతోషం స్పష్టంగా తెలుస్తోంది).
నాయర్: (ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు) మిత్రులారా! మీకు విజయం లభిస్తుందని మాకు ముందే తెలుసు. అల్లంత దూరంలోనే గ్రహించి వచ్చాం. మీవంటి గొప్ప పుత్రుల్ని కన్నందుకు భారతమాత గర్విస్తుంది. దేశం మీకు జోహార్లర్పిస్తుంది — బోలో భారత్ జవానోంకీ —
(ఇప్పుడు కల్నల్ ఇటు తిరిగాడు. అతని ముఖం చూసి నాయకుడు నిర్ఘాంత పోయాడు. అతని కళ్ళవెంట నీళ్లు కారుతున్నాయి) కల్నల్! మీరు ఏడుస్తున్నారు!
రావ్: విజయం మా వల్ల కాదు లభించింది — ఇదిగో, ఇతని వల్ల (యువకుడి వైపు చూపాడు).
(అంతా చూసారు, 'కేప్టెన్' అన్నారు)
రావ్: కేప్టెన్ కాడు. ఇందాక మీతో వచ్చిన యువకుడు.
నాయర్: మాతో వచ్చాడా?
1 వ్యక్తి: అవును. నాకు గుర్తుంది.
2 : మనతోనే వచ్చాడు.
3 : నాకు ఇతను తెలుసు.
రావ్ : (కిందికి వంగి, అతన్ని చేతుల్లోకి ఎత్తుకొంటూ మాట్లాడాడు) ఒంట్లో ప్రాణం లేకుండా, నీరసంగా ఉన్న ఈ వ్యక్తి వల్ల ఉపయోగం ఏమిటా అని ఇందాక ఇతన్ని వెళ్లిపొమ్మన్నాను. కాని ఇప్పుడు ఇక్కడి విజయానికి సాక్ష్యంగా నేను బతకడానికి కారణం ఇలా ఒక ఇతనే. ప్రతి చిన్న వ్యక్తికీ, ప్రతి బలహీనుడికీ, ప్రతి నిస్సహాయుడికీ దేశ రక్షణ కార్యక్రమంలో పాత్ర ఉందని నిరూపించాడితను. ఇతన్ని తీసుకు వెళ్ళండి. బలహీనుడు సరిహద్దుల్లో తన శాయ శక్తులా పోరాడిన విషయం అందరికీ చెప్పండి. మాకేం బాధలేదు. ఇట్లాంటి వ్యక్తులున్న భారతదేశానికి ఎప్పుడూ అపజయం లేదు-వెళ్ళండి.
నాయకుడు : (అతన్ని నిశ్చేష్టతతో చేతుల్లోకి తీసుకొన్నాడు) బోలో భారత్ జవానోంకీ —అజ్ఞాత వీరునికి— ('జై' అని నినాదాలు చేశారు.)
( మళ్ళీ ఊరేగింపు వెనుకకు మరలింది. నాయర్ భుజంమీద చెయ్యివేసి కల్నల్ వాళ్లని చూస్తున్నాడు. "వందేమాతరం" గీతాన్ని వెయ్యి గొంతులు ఆలాపిస్తున్నా యి. దూరాన సైనికుల బూట్ల చప్పుడు వినిపిస్తోంది. ఎవరో ఆఫీసరు ఆర్డర్లిస్తున్నాడు. )
నాయర్: అదిగో—కొత్త ప్లాటూన్ ఇక్కడికి వస్తున్నట్టుంది కల్నల్ సాబ్ !— (సంతోషంగా అన్నాడు.)
రావ్: (కొంచెం పరాకుగా ఉన్నాడు) వస్తుంది - ఇక విజయం మనదే.
( ఒక పక్క “జనగణమన" గీతం - మరొక పక్క బూట్ల చప్పుడూ, ఆర్డర్లూ వినిపిస్తున్నాయి. )
🇮🇳
*-:జైహింద్:-*
꧁☆•┉┅━•••❀❀•••━•┉┅━┉•☆꧂
*