మహాభారతం ఆదిపర్వం ప్రధమాశ్వాసం
_______________________________
ప్రియమైన మిత్రులందరికీ శుభ స్వాగతం మనం భారత కథలోనికి వెళ్లేముందు ఇద్దరి పూజనీయుల గూర్చి తెలుసుకోవాల్సి ఉంది ఒకరు శౌనకుడు మరియొకరు పురాణ వక్త అయినటువంటి సూతుడు. వీరిద్దరి ద్వారానే మహాభారత్ అది సమస్త పురాణాలు వెలుగులోకి వచ్చాయి
ముందుగా శౌనక మహర్షి గురించి తెలుసుకుందాం ఈయన శునక మహర్షి కుమారుడు.
ఈ శునక మహర్షి రురుని (ప్రమతి)కుమారుడు. ఈ ప్రమతి చ్యవన మహర్షి కుమారుడు
చ్యవన మహర్షి భృగు మహర్షి సంతతికి చెందినవాడు.
చ్యవన మహర్షి వృత్తాంతం మహాబారతం లోనే గాక దేవీ భాగవతం, అష్టాదశ పురాణములో చెప్పబడింది. చ్యవన మహర్షి సూర్య కుమారులైన అశ్వనీదేవతలకు యజ్ఞాలలో హవిస్సులు సోమరసాన్ని ఇప్పించాడు. ఈతని భార్య సుకన్య. మామ గారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైన శర్యాతి. వీరి కుమారులు ప్రమతి, దధీచి, ఆప్రవానుడు.
శర్యాతి వన నిహారం - చ్యవన మహర్షి చూపు పోవడం
శర్యాతికి ఒక కుమారుడు, కుమార్తె ఉండేవారు. కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి. ఒక రోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబసమేతంగా చేరు కొంటాడు. ఆ సరొవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక వైవిధ్య పశు పక్ష్యాదులు ఉండేవి. ఆక్కడే ఉండే అడవిలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకొంటుండేవాడు. దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీదకు చలి చీమల పుట్ట చేరుతుంది. ఆ పుట్ట చుట్టు చేరడం వలన చ్యవన మహర్షి ఒక మట్టి ముద్ద వలే కనిపించేవాడు. శర్యాతి కుమార్తె సుకన్య కూడా వన విహారం జరుపుతూ చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చ్యవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిణుగురు పురుగు వలే సుకన్యకు కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలే ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన చ్యవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకొంటున్నానని తనని పుల్లతొ పొడవద్దని వారిస్తాడు. కాని ఆ విషయం గ్రహించక సుకన్య పుల్లతొ చ్యవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది, చ్యవనుడి కంటి చూపు పోతుంది. కంటి చూపు పోవడంతో చ్యవన మహర్షి కోపించి, శర్యాతి సైనికులకు, మంత్రులకు, శర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించేశాడు. మలమూత్రాలు బంది అవడంతో తాను చింతుడై ఉన్న శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెబుతుంది. అప్పుడు విషయం గ్రహినంచిన శర్యాతి సకల పరివారంతో అడవి వెళ్లి మహర్షి కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమంటాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంతి చిత్తుడై ఉండి తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్య అని తనకిచ్చి వివాహం జరపమంటాడు. దానికి శర్యాతి సంకోచిస్తుంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని ఆ అపచార నివృత్తి చ్యవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారా నే తీరుతుందని తండ్రితో తన వివాహం చ్యవన మహర్షితో జరపమని చెబుతుంది. వివాహం జరిగాక చ్యవన మహర్షి ఆశ్రమానికి నార చీరలు కట్టుకొని చేరుతుంది. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకొంటుంటుంది.
ఇంకా ఉంది .... ... 2
కాలము గడుచుచుండగా ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి ఏవరీ నవయవ్వన సుందరాంగి అని అనుకొని పరిచయం అడుగగా సుకన్య చ్యవన మహర్షి భార్యనన్ని చెబుతుంది. అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు. ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడాడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు. అప్పుడు చ్యవనుడు తన తపశ్శక్తిని దార పోసి వారికి సోమరసాన్ని ఇప్పించాడు
ఈయన కుమారుడే రురు మహర్షి
రురుడు లేదా రురు మహర్షి భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి. చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పుత్రుడు (రురు )ప్రమతి. ప్రమతి మహాతపస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస ఆతనిని వలచి ఆశ్రమమునకు వచ్చి సేవ చేయుచుండగా కొంతకాలమునకు వారి మధ్య అనురాగము జనించి ఆతడు ఘృతాచి యందు ప్రమతి యొక సుపుత్రుని గాంచెను. అతడు రరుడు అనే పేరున పెరుగుచు ధర్మాత్ముడు, తపశ్శాలి, విద్యావంతుడు, మన్మదోపముడు అయి అలరారుచుండెను.
మహాతపస్వి అయిన స్థూలకేశుడను మహర్షి ఆశ్రమము పరమ పవిత్రమై ప్రశాంత నిలయమై వుండెను. విశ్వావసుడను గంధర్వరాజు, అప్సరస యగు మేనక ఈ ముని ఆశ్రమ ప్రాంతమున విహరించి, మిథునకృత్య మొనరించి తమ కోరికలను తీర్చుకొనిరి. కొంతకాలమునకు మేనక గర్భవతి అయి చక్కని కూతుర్ని కని ఆమెను ఆశ్రమ ప్రాంతమున విడిచిపెట్టి వెడలిపోయెను. స్థూలకేశ మహర్షి ఆ బిడ్డను చేరదీసి, ప్రమద్వర అని నామకరణం చేసి, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దెను.
రురుడు ఒకసారి స్థూలకేశ మహర్షి ఆశ్రమమునకు విచ్చేసి మనోహరముగ దేవకన్య వంటి సౌందర్యము మూర్తీభవించిన ప్రమద్వరను చూచి ఆమెపై అనురాగము కలిగెను. తండ్రి ప్రమతికి విషయము విన్నవించగా ఆ కన్యామణి వృత్తాంతము విని అంగీరించగా, కన్య దానం చేయడానికి స్థూలకేశుడానందించెను. వివాహము కొలది దినములుండగా ప్రమద్వర వనములో పూలుకోయడానికి వెళ్లగా పాముకాటు వలన మరణించెను. అందరూ దుఃఖిస్తుండగా రురుడు మిక్కిలి రోదిస్తూ, ఏకాంతమున తీవ్రముగా వాపోవుచుండెను. అదిచూచిన దేవదూత జాలిపడి నీ ఆయువులో సగము ఆమెకు ఇచ్చిన ఈమె మరల జీవింపగలదు అని పలికెను. వెంటనే రురుడు తన జీవితకాలంలో సగము ఆమెకు ధారపోసెను. అనంతరము రురువునకు ప్రమద్వరకు కళ్యాణము చేసిరి.
నిజ తపశ్శక్తి వలన, త్యాగము వలన, వలచిన కాంత మరణింపగా పునర్జీవింపజేసికొని ఆమెను ధర్మపత్నిగా పరిగ్రహించిన రురుడు, తనకొరకై చూపిన నిష్కల్మష ప్రేమ, నిరుపమాన త్యాగము నెంతయే మెచ్చుకొని పునర్జీవితయై అపూర్వ సౌందర్యము నందిన ప్రమద్వర ఉత్తమోత్తమ దాంపత్య ధర్మమును పాటించుచు గృహస్థాశ్రమమును నిర్వర్తించుచు చిరకాలము జీవించిరి. కాలక్రమమున ఆతని దయవలన ప్రమద్వర గర్భము ధరించి నవమాసములు నిండిన పిదప పుత్రుని పొందెను. అతడే శునక మహర్షి. శునకుడు పెరిగి పెద్దవాడై భృగు వంశీయుల కందరికి ఆనందదాయకుడై, సత్త్వగుణసంపన్నుడై తీవ్రతపస్సు సలిపి శాశ్వత యశస్సును సంపాదించెను. ఆతని కుమారుడే శునక మహర్షి. ఇతని కుమారుడు శౌనకుడు.
ఇక మనం తెలుసుకోవలసిన అటువంటి రెండో వ్యక్తి ఈ మహానుభావుని పేరు సూతమహర్షి. ఇతడు రోమహర్షణు కుమారుడు
(ఉగ్రశ్రవసుడు ) మహాభారతం, భాగవత పురాణము, హరివంశం, పద్మ పురాణం వంటి అనేక పురాణాలను ప్రవచించిన కథకుడుగా కనిపిస్తాడు. ఇతనికి సూతుడు, శౌతి అనే పేర్లు కూడా ఉన్నాయి. నైమిశారణ్యంలో ఋషులు గుమిగూడి వింటూండే కథలను ఉగ్రశ్రవసుడే చెబుతూంటాడు. అతను రోమహర్షణుడి కుమారుడు. మహాభారత కర్త వ్యాసునికి శిష్యుడు.
సూతుని వృత్తాంతం
ఏల్చూరి మురళీధరరావు “భారతీయ సంస్కృతిలో నైమిశారణ్యం” అనే వ్యాసం నుంచి) దీనిని నేను స్వీకరించాను
నైమిశారణ్యంలో పురాణేతిహా సాల కథకుడుగా కీర్తిగన్న సూత పౌరాణికునికి భారతీయ సంస్కృతిలో అవిస్మరణీయమైన స్థానం ఉన్నప్పటికీ, ఆయనను గురించి ఆస్తికులలో చాలా మందికి ఇప్పటికీ అంతగా ఏమీ తెలియదంటే ఆశ్చర్యం గా ఉంటుంది. ఆయన తండ్రి పేరు రోమహర్షణుడు. సంస్కృతంలో రేఫ – లకారాల కు ఉన్న అభేదవ్యవహారం వల్ల లోమహర్షణుడని కూడా అంటారు. రోమహర్షణుడన్న ఆ పేరే (వెంట్రుకలు నిక్కబొడు చుకొనేంత ఉత్కంఠను కలిగిస్తూ శ్రోతలను ఆనందింప జేసేవాడు) ఆయన కథాకథన కౌశలాన్ని సూచిస్తున్నది.
“లోమాని హర్షయాంచక్రే శ్రోతౄణాం యత్ సుభాషితైః
కర్మణా ప్రథిత స్తేన లోకేస్మిం ల్లోమహర్షణః.”
అని వాయు పురాణ వచనం.
ద్వైపాయన మహర్షి పురాణా లను నేర్పుతుంటే తనువు పులకరించినందువల్ల కూడా ఆయనకు రోమహర్షణుడని పేరు కలిగిందట.
“తస్య తే సర్వరోమాణి వచసా హర్షితాని యత్
ద్వైపాయన స్యానుభావా త్తతోఽభూద్రోమహర్షణః.”
అని స్కాంద పురాణం ఈ విషయాన్ని చెప్పింది.
నైమిశారణ్యంలో శౌనకాది మునులకు అగ్ని, కూర్మ, గరుడ, బ్రాహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ,వామన, స్కాంద పురాణాలను, శ్రీమద్భాగవతా న్ని, శ్రీ దేవీ భాగవతాన్ని బోధించినది ఈయనే. ఈయన కొడుకు ఉగ్రశ్రవుడు కూడా ప్రసిద్ధ పౌరాణికుడే. నైమిశారణ్యంలోనే ఈయన శౌనకాదులకు శ్రీ మహాభారతా న్ని వినిపించాడు. రోమహర్ష ణుని కొడుకయినందువల్ల ఈయనకు రౌమహర్షణి అని, సూత సుతుడైనందువల్ల సౌతి అని పేర్లున్నాయి. భారత కథానంతరం దాని పర్యంత భాగమైన హరివంశం కూడా ఈయన చెప్పినదే.
‘సూత శబ్దానికి రథచోదకుడని ఒక అర్థం. కర్ణుని పెంపుడు తండ్రి సూతుడే. వర్ణసాంకర్యం వల్ల జన్మించిన సూతులు పదకొండు విధాలట:
కరణుడు (వైశ్యునికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు), అంబష్ఠుడు (బ్రాహ్మణునికి వైశ్యస్త్రీ యందు జన్మించిన వాడు), ఉగ్రుడు (క్షత్రియునికి శూద్రస్త్రీ యందు జన్మించిన వాడు), మాగధుడు (వైశ్యునికి క్షత్రియస్త్రీ యందు జన్మించిన వాడు), మాహిష్యుడు (క్షత్రియునికి వైశ్యస్త్రీ యందు జన్మించినవాడు), క్షత్త (శూద్రునికి క్షత్రియస్త్రీ యందు జన్మించినవాడు), సూతుడు (క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించినవాడు), వైదేహకుడు (వైశ్యునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించి నవాడు), రథకారుడు (మాహిష్యునికి కరణ స్త్రీ యందు జన్మించినవాడు), పారశవుడు (బ్రాహ్మణునికి శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడు), చండాలుడు (శూద్రునికి బ్రాహ్మణస్త్రీయందు జన్మించినవాడు) అని.
మత్స్యదేశపు రాజు విరాటుని బావ కీచకుడు కూడాసూతుడే. వేదాధ్యయనం అన్నది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన రోజులలో వేద విజ్ఞానానికి అనర్హులుగా భావింపబడిన బ్రాహ్మణేతర వర్గాల వారిలో ధర్మప్రచారం చేయటానికి క్షత్రియ-బ్రాహ్మణ ప్రతిలోమ వివాహ సంజాతులై న సూత పౌరాణికులు బయలుదేరి, తమ విద్వత్తు మూలాన పురాణ వక్తలుగా గుర్తింపును పొందారని పెద్దలంటారు. జన్మతః బ్రాహ్మణులైన శౌనకాది మహా మునులు పవిత్రమైన యాగ దీక్షామధ్యంలో ఈ సూత పౌరాణికుని నుండి విజ్ఞాన వివేకాలను అభ్యసించటానికి వెనుకాడలేదు. ఆ ప్రకారం ఆలోచించి చూస్తే శౌనకుడు తన కాలానికంటె ఎంతో ముందుచూపు కల సమచిత్తు డని, కులాల పట్టింపులు అంతగా లేనివాడని తోచక మానదు. అంతే కాదు. శూద్రులకు విద్యాధికారం లేదని,కులబాహ్యులైనందు వల్ల వారికి సంతానం లేనప్పుడు దత్తస్వీకారానికి సైతం అధికారం లేదని, ఎందుకంటే దత్తస్వీకారం సమయంలో పఠించే స్మార్త మంత్రాలను వారు వినకూడ దని, ఆ స్వీకార మంత్రాలను వారి యెదుట ఉచ్చరింపకూడ దని ఆ రోజుల్లో ఉండిన విశ్వాసాన్ని త్రోసిరాజని శౌనకుడు తన శౌనక స్మృతిలో వారికి ఆ అధికారాన్ని అంగీక రించాడు. శూద్రుడు కూడా బ్రాహ్మణుని పౌరోహిత్యానికి కుదుర్చుకొని దత్తస్వీకారం చేసుకోవచ్చునని అనుమతిం చాడు. నైమిశారణ్యంలో భగవత్కథలను వింటూ సమచిత్తాన్ని, స్థితప్రజ్ఞతను అలవరచుకొన్న శౌనకుడు ఆ విధంగా భారతీయ సంస్కృతి లో పెక్కు మార్పులకు ఆద్యు డయ్యాడని భావించటంలో తప్పుండకూడదు. ఆ విశాల కథితకథంతకు పీఠభూమి నైమిశారణ్యమే అన్న విషయాన్ని మనము విస్మరింపకూడదు.
నైమిశారణ్యంలో ఋషులు తనను పెద్దల ముందు పెద్దను చేసి గౌరవించినప్పటికీ, ఆనాటి జనారణ్యం ప్రభావం వల్ల కాబోలును, సూత పౌరాణికునికి ఆ పెద్దల ముందు కొంత జంకు ఉన్నట్లే కనబడుతుంది. ఋషులు తనను భగవన్మహిమను వర్ణించి చెప్పమని అడిగినప్పు డు బృహన్నారదీయంలో స్వయంగా సూతుడే –
“విలోమజోఽపి ధన్యోఽస్మి య న్మాం పృచ్చథ సత్తమాః”
అన్నాడు. “
నాబోటి విలోమజాతుడిని చెప్పమని అడిగారే, ఓ మహాత్ములారా! నా జన్మ ధన్యమయింది” అని. తర్వాత తర్వాత ఆయన పాండిత్యాని కి ముగ్ధులైన పురాణశ్రోతలు ఆయన గోస్వామితను అంగీక రించి, ఆయనను ద్విజునిగానే పరిగణించినట్లు కనబడు తుంది. అందుకే గర్గసంహితా కారుడు “సూతాః పౌరాణికాః ప్రోక్తాః” అని మెచ్చుకొన్నాడు. అగ్నిపురాణమైతే ఆయన విద్యావివేకాతిశయాన్ని మరీ మరీ ప్రశంసించింది:
“పృషదాజ్యసముత్పన్నః సూతః పౌరాణికో ద్విజః
వక్తా వేదశాస్త్రాణాం త్రికాలానలధర్మవిత్”
– అని ఆయన వైదుష్యాన్ని తలకెత్తింది.
మిత్రులందరికీ శుభరాత్రి
సుబ్బరాజు భట్టు
🌼🙏🙏🙏🌼
మహాభారతం రెండో భాగం నైమిశారణ్య ప్రవేశం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
🙏🙏🙏
మహాభారత కథ అంతా కూడా నైమిశారణ్యంలో ప్రస్తావించబడింది ఇక్కడ సూత మహర్షి శౌనకాది మహా మునులకు ఈ కథ చెప్పాడు కనుక నైమిశారణ్యం గురించి తెలుసుకోవడం, అది మన బాధ్యత గా భావిస్తున్నాను మిత్రులు సహకరించగలరు గూగుల్ వికీపీడియా ఆధారంగా వివరిస్తున్నాను
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
భౌగోళికాంశాలు :
రాష్ట్రం:
Uttar Pradesh
ప్రదేశం:
Naimisaranya
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:
Deva Rajan
(Vishnu)
ప్రధాన దేవత:
Pundarikavallai
(Lakshmi)
పుష్కరిణి:
Chakra
కవులు:
Tirumangai Alvar
నైశారణ్యం
నైమిశారణ్యం (Naimisha Forest) వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి నైమిశారణ్యానికి దాదాపు 100 కి.మీ. దూరం ఉంటుంది.
ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.
ఇది ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఉంది.
ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో "నైమిశ" మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.
వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాం చింది. చక్రం ఆగిన ప్రదే శం చక్రతీర్థం అయింది. నిమి అంటే చక్రకైవారం, అరణ్యం - అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురు లను ఈ ప్రాంతంలో సం హరిస్తాడు. నిమి (లిప్త) (సెకండు) లో అసురుల్ని సంహరించిన ఈ అర ణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొన బడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలి తాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.
నైమిశారణ్యము కొన్ని విశేషాలు
నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు.
సరళ (తెల్ల తెగడ)
, కొండగోగు, ధన (ఉమ్మెత్త), దేవదారు, చండ్ర, మామిడి, నెరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, పాటల (కలికొట్టు), నకుల (పొగడ), సప్తవర్ణ (ఏడాకుల పొన్న), పునాగ, సురపొన్న, నాగకేసర (నాగకింజల్కము), శాల, తాల (తాటి), తమాలము (చీకటిమాను), అర్జున (మద్ది ), చంపక (సంపెంగ).
నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక్త ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.
నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలా రణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాం చాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.
ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు.
బలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆస్రమంలో యాత్రీకులకు బస, భోజన వసతులు లభిస్తాయి.
శ్రీరాముడు సవరించు
శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.
మిత్రులందరికీ శుభోదయం
మహాభారతం ఆదిపర్వం మూడో భాగం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
లోక పాలకుడైన ఈశ్వరునకు నమస్కారం
లోకమునందు అంతటా వ్యాపించి ఉన్న విష్ణువుకు నమస్కారం
లోకమనే నాటకాన్ని తన మనసు చే సృష్టించిన వాడు కళాతపస్వి యగు బ్రహ్మయ్య కు నమస్కారము
త్రిమూర్తులను కన్నతల్లి యగు జగన్మాతకు నమస్కారము
🌼🙏🙏🙏🙏🙏🙏🙏🌼
కలియుగ ప్రభావం నుండి సజ్జనులను రక్షించుటకై మహాత్ముడైన శౌనకుడు తన ఎనభై నాలుగు వేల మంది శిష్యులతో నైమిశారణ్యం నందు సత్రయాగం చేస్తూ ఉంటాడు. ఈ మహనీయుని ఆహ్వానం మేరకు సకల పురాణ దర్శి మరియు ప్రజ్ఞాశీలి అయినటువంటి సూతమహాముని అచ్చటికి విచ్చేశాడు.
ఎటువంటి ధర్మ సమస్యనైనా విప్పడం లోను ఏ పురాణమైన అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పడంలోను అత్యంత నిపుణులైన అతని రాకతో యజ్ఞవాటికొక క్రొత్త కళ వచ్చింది.
ఆయన రాకతో అక్కడి మునులందరూ ఎంతగానో సంతోషించారు. ఆయనను కుశల ప్రశ్నలతో ...వినయ పూర్వకంగా..... అర్ఘ్యపాద్యాదు లతో గౌరవించారు..రవ్వంత బడలిక తీరి అతడు సుఖాసీనుడైన పిదప, అనేక మంది ఋషులు ఆయనను పరివేష్టించి కూర్చుని ఆప్యాయంగా మాట్లాడ సాగారు.
ఓ రోమహర్షణి ! యజ్ఞ ప్రారంభ ముహూర్తానికి మీరు వస్తారని మేము ఎంతగానో ఎదురు చూశాం ఇంత ఆలస్యం గా వేంచేశారు , మా ఆహ్వానం లో ఏదైనా లోపం ఉందా లేక ఆహ్వానం అందలేద అని వినయంగా ప్రశ్నించారు.
అప్పుడా ఉగ్రశ్రవసుడు మహాత్ములార ! మీ ఆహ్వానం చేరింది అందులో లోపం అనేది లేదు కానీ అంతకు పూర్వమే జనమేజయ మహారాజు చే నిర్వహించబడిన సర్పయాగానికి ఆహ్వానించ బడి ఉండడంచేత అక్కడకు వెళ్లి ఇలా వస్తున్నాను అదే ఆలస్యానికి కారణం అని బదులిచ్చిన ఉగ్రశ్రవసుడిని ఆశ్చర్యంగా చూస్తూ
రోమహర్షిణి ! మీరు చెబుతున్న ఈ సంగతి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జనమేజయుడు చాలా ధర్మాత్ముడు. అటువంటి రాజు ఆచరించదగ్గ ఎన్నో గొప్ప యాగాలు ఉండగా ఈ సర్పయాగం ఎందుకు చేసినట్లు ? ఎంతో బలమైన కారణం లేనిదే అటువంటి యాగం ఎవరు చేయరు కదా దయచేసి ఆ కారణం చెప్పవలసిందిగా మనవి అని ఆ తాపసులు అడిగారు..
కారణం లేక పోవడం ఏమిటి జనమేజయ మహారాజు యొక్క తండ్రి పరీక్షిన్నరపాలుడు పన్నగ ప్రభువైన తక్షకుని చే దష్టుడై మరణించాడు . అప్పుడు ఆ రాజు పసివాడు కావడం వల్ల ఆ విషయాన్ని వివరంగా ఎరుగడు ఇప్పుడు ఉదంకుడనే బ్రాహ్మణుడు వచ్చి ఆ కథలన్నీ కదిపి ఆ రాజును కాద్రవేయేష్టికి ప్రేరేపించాడు " అని అన్నాడు సూతమహర్షి.
ఇంతకూ ఈ ఉదంకుడు ఎవరు స్వామి రాజు ని వక్ర మార్గాన్ని పట్టించారు అని బ్రాహ్మణులు అడిగారు
ఉదంకుడి వృత్తాంతం
వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడు.
ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. . ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు. ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటాడక అలాగే చేసాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి " నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను " అని అడిగాడు. ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు " మహాత్మా ! నాభార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి " అని బదులిచ్చాడు.
ఉదంకుడు అలాగే పౌష్యమహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు " వద్దకు వచ్చి " మహారాజా ! నాకు ఆమెకనిపించ లేదు. కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి. " అన్నాడు. మహారాజు ఆమె మహాత్మా ! ఆమె మహా పతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి." అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గామయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యా దేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ " ముని కుమారా ! ఈ కుండలములు " కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకుని పో" అని చెప్పింది.
ఉదంకుడు పౌష్యుడు శాపప్రతిశాపాలు ఇచ్చుకొనుట సవరించు
కుడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి " ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షా. నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను. నీవు సంతాన హీనుడవు కమ్ము" అన్నాడు. . తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు " అని కోరగా పౌష్యుడు " మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం. క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు" అన్నాడు. అందుకు ఉదంకుడు " కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.
తరువాత అతడు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదకుండు అనుష్టానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు. అతనిని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తానూ ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ " వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంతా ! నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బారినుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకికి వందనం. సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి. కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకా నన్ను అనుగ్రహించు" అని ప్రార్థించాడు......
అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, పన్నెండు ఆకులుగల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులు. మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి " ఉదంకా నీ భక్తికి మెచ్చాను. ఏమి కావాలో కోరుకో " అన్నాడు. ఉదంకుడు " ఈ నాగలోకం నాకు వశం కావాలి " అని కోరాడు. అలాగే అని వరమిచ్చిఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లి పోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి తెచ్చిచ్చాడు.
అటు తరవాత ఉదంకుడు అక్కడ నుండి బయటపడే మార్గం కాన రాక తను గురుకులం ఎలా చేరుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయాడు. అయోమయంలో పడగా దివ్యపురుషుడు " ఉదంకా ! ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు " వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుండలాలను గురుపత్నికి సమర్పించాడు.
గురువు ఉదంకునితో " ఉదంకా ! సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయ్యింది " అని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు " ఉదంకా ! నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత. నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు. పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాల చక్రం. వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది " అని పలికి ఆశీర్వదించాడు గురుదేవుడు
ఉదంకుడు గురుకులం వదిలి వెళ్ళాడు కొన్నాళ్ళు తపస్సు చేశాడు కానీ అతని అంతరాంతరాలలో అలనాటి తక్షకుడి మీద పగ ....పాము పగ లాగ అభివృద్ధి చెందిందే గాని తగ్గలేదు తక్షకుడు అని కాదు పాములంటేనే మంటగా ఉంది అతడికి .తన వల్ల కాని పని సమర్థుల చేత చేయించాలనుకున్నాడు. అతని దృష్టిలో మహారాజైనా జనమేజయుడు మెదిలాడు. వెంటనే రాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు.
మిత్రులందరికీ శుభోదయం
మహాభారతం ఆదిపర్వం నాలుగవ భాగం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
సమస్త గురువుల రూపంలో ప్రకాశిస్తున్న
మహనీయులగు నరనారాయణ ఋషులకు నమస్కారం
గ్రంధరూపంలో ప్రకాశిస్తున్న జ్ఞాన రూపిని యగు సరస్వతి మాత కు నమస్కారం
అపారమైన దయతో వేద విజ్ఞానాన్ని మహాభారత మనే కథ రూపంలో సమస్త మానవాళికి ప్రసాదించిన కృష్ణ ద్వైపాయనునికి నమస్కారం
🌼🌼🌼🙏🌼🌼🌼
మహాత్ముడగు జనమేజయుడు ధర్మబద్ధముగా రాజ్యపాలన సాగిస్తున్న రోజులవి కానీ కలి ప్రభావం వలన ఆయన రాజ్యంలో సామంతరాజులు అవిధేయులు గా మారి తిరుగుబాటు చేస్తున్నారు అటువంటి తిరుగుబాటుదారులను సమూలంగా అణిచివేసి గెలుపు తాలూకు ఉత్సాహంతో ఆనందంగా ఉన్నాడు జనమేజయుడు.
సరిగ్గా అదే సమయంలోనే ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆయన సభకు వచ్చాడు. అతడు పవిత్రమైన వేదమంత్రాలతో రాజును ఆశీర్వదించి ,హే రాజన్ ! ప్రపంచ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరించ తగిన మహారాజువయ్య నీవు ,కానీ నీవు చేయదగిన బృహత్కార్యం ఒకటి విస్మరించి ఉన్నారని తెలియజేయడానికి చింతిస్తున్నాను అని పలికాడు ఉదంకుడు.
జనమేజయుడు ఆశ్చర్యపోయి బ్రాహ్మణోత్తమా ! నా చేత విస్మరించబడిన విధి ఏమిటో వెంటనే విశదపరచడు. అది ఎటువంటిదైనా సరే మీరు సంకోచించాల్సిన పని లేదు వేదమూర్తుల ఆజ్ఞ తిరస్కరించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను అందువల్ల మీరు నిర్భయంగా ప్రసంగించవచ్చు అని తెలియజేశాడు రాజు.
జనమేజయుడు అలా అనగానే " రాజన్ ! ఇప్పుడు నేను చెప్పబోయే పని వల్ల నాకు ఒక వీసయెత్తు లాభం ఉన్న మాట నిజమే అయినప్పటికీ అది నీ స్వకార్యం అని భావించి తక్షణమే మీరు సర్పయాగం చెయ్యండి. ఎందుకంటావేమో... మీ తండ్రి అయిన పరీక్షిత్తును తక్షకుడు అనే నాగరాజు చంపేశాడు. కేవలం ఒక బ్రాహ్మణ వాక్యం అడ్డుపెట్టుకొని ఆ సర్పరాజు ఆచరించిన అకృత్యానికి తగిన గుణపాఠం చెప్పవలసి ఉంది. మీ పితృదేవుల హంతకుడి మీద పగ తీర్చుకోవడం మీకు ఎంతైనా ముఖ్య కర్తవ్యం అని మర్చిపోకు "అని చెప్పాడు ఉదంకుడు.
ఉదంకుని మాటలు విని రాజు " విప్రవోత్తమ ! ఇందులో మీకు ఏదో లాభం ఉంది అన్నారు కదా అది ఏమిటి అని అడిగాడు. ఉదంకుడు తన కథనంతా చెప్పాడు. ఆలనాడు తక్షకుడు చేసిన విఘ్నం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అందువల్ల నా తపో అధ్యయనాదులు సక్రమంగా కొనసాగడం లేదు . మీరు గనక పాముల యాగం చేసి ఆ తక్షకుడు ని వాడి జాతి వాళ్ళని మసి చేసినట్లయితే నేను కుదటపడ్డ మనసుతో వర్ణాశ్రమ ధర్మాలు నిర్వర్తించు కోగలను. ఒక ముక్కలో చెప్పాలంటే నాకు విఘ్నం కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాజు వైనం మీ పై ఉంది , అదే నాకు లాభం అని తెలియజేశాడు.
జనమేజయుడు ఒకక్షణం ఆలోచించి మంత్రుల వంక తిరిగి ";మా పితృదేవుల విషయమై ఈ బ్రాహ్మణుడు చెప్పినది సత్యమేన ?!. నిజమే అయితే ఆ దుర్ఘటన గురించి నాకు పూర్తి వివరాలు తెలియజేయండి " అని ఆజ్ఞాపించాడు.
సభలో ఉన్న కొందరు వృద్ద మంత్రులు పరీక్షిత్తు యొక్క మరణం ఘట్టంగురించి ఇలా చెప్పారు " నరపాల ! నీ తండ్రి అయిన పరీక్షిత్తు ఒక పొద్దున వేటకు వెళ్లి ఒక మృగాన్ని కొట్టాడు . దెబ్బతిన్న ఆ మృగం పారిపోయింది..దానిని తరుముతూ మీ నాన్న గారు శమీక ముని ఆశ్రమం చేరాడు .మీ తండ్రి ధ్యానంలో ఉన్న శమీకుని మంచినీళ్లు ఇవ్వమని కోరాడు. కానీ ఆయన ధ్యానంలో ఉన్న కారణంగా మౌనంగానే వుండిపోయాడు .అందుకు అలిగిన మీ నాన్న చేరువలో కనిపించినా చచ్చిన పాము ని, ఆ ఋషి మెడలో వేసి వచ్చేసాడు. రాజుగారు ఇటు వచ్చాడో లేదో ఆ మునీశ్వరుని కొడుకైనా శృంగి అనేవాడు ఆశ్రమం చేరాడు .తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును చూసాడు. దాని తీరుతెన్నులను బట్టి అది ఎవరో కావాలని చేసిన పని అని గుర్తించాడు. తక్షణమే జలమును ఆచరించి " నా తండ్రి మెడలో పాము కళేబరము వేసి అవమానించిన వాడు...... వాడు ఎవరైనా సరే నేటికి ఏడవ రోజున అతి ఘోరమైన సర్పమగు తక్షకుని చే కాటుపడి మరణించు గాక "అని శపించాడు ఆవేశంగా ఆ ముని కుమారుడు.
ధ్యానానంతరం కళ్ళు తెరిచిన శమీకుడు పుత్రుని ద్వారా పాము సంగతి, అతని మిత్రుల ద్వారా శాపం సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. తన దివ్య దృష్టితో దోషి ఎవరొ, ఎవరు కాదో తెలుసుకోవాలి కదా ! ఇలా ఎందుకు చేసావు ?!.నీ చేత శపించబడినవాడు ఈ దేశాన్ని ఏలే రాజు. రాజు ను శపించడం రాజ్యాన్ని అరాచకం చేయడం మన లాంటి వారికి తగని పని . సరే గతం గతం.కాలాన్ని ఎవరు మరల్చ లేరు అని నిట్టూర్చాడు శమీకుడు. పిదప గౌరముఖుడు అనే తన శిష్యుడి ద్వారా శాపం సంగతి నీ తండ్రికి కబురు చేశాడు, రక్షణ మార్గాలు వెతుక్కోమన్నాడు. శాపం గురించి తెలియ గానే మీ నాన్న కంగారు పడ్డాడు. ఒంటి స్తంభం మేడ లో గాలి కైనా చొరరాని మందిరం లో ఉండి రాజ్యపాలన చేయసాగాడు.
ఇలా ఆరు రోజులు గడిచాయి. ఏడవ రోజున శాప నిర్వహణార్థం తక్షకుడు హస్తినాపురానికి రాసాగాడు. మార్గమధ్యంలో అతనికి కాశ్యపుడు అనే భూసురుడు కనిపించాడు. ఆ కాశ్యపుడు పాము మంత్రం వేయడంలో వుద్దండుడని , తను చంపబోయే రాజు ను రక్షించేందుకు వస్తున్నాడని గ్రహించి, అతనికి అడ్డం పడ్డాడు .తనని తాను ఎరంగించుకున్నాడు. తాను కరచిన వాడిని బ్రతికించడం ఎవరి తరం కాదు అన్నాడు సర్పరాజు. తను మంత్రానికి కూడా తిరుగులేదు అన్నాడు మహీసురుడు. ఆ విషయమై పంతం పట్టిన ,పాపరాయుడు చేరువలో ఉన్న వృక్షాన్ని కాటేశాడు. తక్షణమే ఆ వృక్షం బుగ్గి గా మారిపోయింది . ఆ చెట్టును సజీవం చేయి అని పలికాడు అహిరాజు. కాశ్యపుడు వెంటనే మంత్రోచ్ఛారణ చేశాడు. వెంటనే ఆ చెట్టు సజీవమై పూర్వ ప్రకారం శోభిల్ల సాగింది. ఆశ్చర్యపోయిన సర్పరాజు,, ఆ బ్రాహ్మణుడు ధనార్థియ వస్తున్నాడని తెలిసి .....అతను ఆశించిన దాని కన్నా అధికమైన ధనం ఇచ్చి హస్తినాపురం రాకుండా చేశాడు. అనంతరం తాను కరిపురం చేరి కొందరు నాగులను మానవరూపంలో మీ తండ్రి వద్దకు పంపాడు ." కొన్ని ఫలాలు, దర్భలు రాజు కియ్యండి " అని తన అనుచరులను ఆజ్ఞాపించి ఆ ఫలాల లోని ఒక పండు లో ఒక చిన్న క్రిమి రూపములో ఒదిగి కూర్చున్నాడు . కామ రూపులైన నాగులు నీ తండ్రి వద్దకు వచ్చి ఆ ఫలాలను ఇచ్చారు .నీ తండ్రి ఆ ఫలాలను భుజించే సమయానికి అందులో ఉన్న భుజంగ నాయకుడు నిజరూపంలో బయటపడి నీ తండ్రిని కాటు వేసి చంపేశాడు.
మంత్రులు అలా చెప్పగానే తిరిగి ఉదంకుడు అందుకున్నాడు., తన తండ్రికి జరిగిన అవమానానికి శృంగి శపించాడే అనుకో ఆ ప్రకారం నీ తండ్రిని కాటు వేయడం తక్షకుడి కర్తవ్యమే అనుకో కానీ రాజును బ్రతికించడానికి వచ్చే మంత్రవేత్తను వెనుకకు పంపడంలో అతని ఉద్దేశం ఏమిటి ?!.ఇది ఎంత వరకు ధర్మము... ఆలోచించు అంటే విధి నిర్వాహణ కన్నా పరీక్షిత్తుని చంపడమే ప్రధానమైన ట్లు బోధపడుతుంది కదా ?!.
రాజా ! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ తక్షకుడు మహా క్రూరుడు. మహా గర్విష్టి తన పరాక్రమానికి ఎదురు లేదని పాండవులు ఎవరు బ్రతికి లేరు కనుక తనను ఎవరూ ఏమీ చేయలేరని ధర్మాత్ముడైన మీ తండ్రి గారిని కావలసి చంపేశాడు. ఇటువంటి వాడిని చంపకపోతే మీ వంశానికి గొప్ప కళంకం ఏర్పడుతుంది. నీ తండ్రిని చంపిన వాడిని వాడి జాతి మొత్తం తగలబెట్టు.... ఇక తక్షణ కర్తవ్యం ఏదో మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు ఉదంకుడు.
తక్షకుని నేరానికి సాక్ష్యము.
---------------------------------
ఉదంకుడు అలా అనగానే మరల జనమేజయుడు అన్నాడు " ధరాసుర ! మీరు చెప్పినట్లుగా చూసిన కాశ్యపుడని తక్షకుడు ప్రలోభ పెట్టడం సహించరాని వంచన అని భావిస్తున్నాను. అయితే మంత్రులు కానీ మీరు కానీ అక్కడ ప్రాంతంలో లేరు కదా ?! మరి మీకు ఆ విషయం ఎలా తెలిసింది సాక్ష్యం ఏదైనా ఉందా ?! అని అడిగాడు జనమేజయుడు . " ఉంది ప్రభు" అంటూ మంత్రులు చెప్పసాగారు " ఆనాడు తక్షకుడు అడవిలో ఏ చెట్టనయితే కరిచాడో, అప్పుడు ఆ చెట్టు మీద ఒక కట్టెలు కొట్టుకునే వాడు ఉన్నాడు. చెట్టు తో పాటు వాడు కూడా కాళహలి చనిపోయి అనంతరం కశ్యపుని మంత్ర బలం తో పునర్జీవితుడయ్యాడు. భుజంగభూసురుల సంభాషణ అంతా కూడా విన్నాడు. కానీ ప్రాణభయంతో వాడు వాళ్ళు నిష్క్రమించే దాకా చెట్లు దిగలేదు. వాళ్ళు ప్రయాణమైన తర్వాత వాడు పరుగుపరుగున వచ్చి ఈ వార్త తెలియజేసే లోపలే జరగకూడనిది జరిగిపోయింది " అని మంత్రులు ఈ విధంగా సాక్షాధారాలు ప్రత్యక్ష పరచడంతో జనమేజయుడు పాముల మీద పగపట్టాడు .సర్పయాగానికి తగిన సంభారాలు సమకూర్చ వలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.
మిత్రులందరికీ శుభోదయం
మహాభారతం ఆదిపర్వం ఐదో భాగం
""""""""""""""""""""""'''''''"""'''''""""""""'''"""""""""""""
నియతి రూపంలో ప్రకాశిస్తున్న నియంత కు నమస్కారం
అన్ని సంకల్పాలకు ఆధారభూతమైన జగన్నాటక సూత్రధారి కి నమస్కారం
క్షమా స్వరూపిణి మాతృదేవి భూమాతకు నమస్కారం
🌼🙏🙏🙏🌼
సర్ప యాగం ప్రారంభం
యజ్ఞ నిర్వహణ దురంధరులు అయినా శాస్త్రవేత్త లందరికీ ఆహ్వానం పంపాడు జనమేజయుడు. ఎప్పుడో పూర్వ కల్పాలలో మినహా - వర్తమాన కల్పాది నుండి ఇప్పటిదాకా ఎవరూ నిర్వహించని పన్నగ యజ్ఞానికి పనిని ప్రారంభించడం చకచకా కొనసాగడం జరుగుతుంది.
దీక్షాకాలం సమీపించగానే జనమేజయుడు తన పట్టమహిషి వపుష్టా దేవి తో కలసి దీక్ష స్వీకరించారు.
ఆహ్వానం అందుకున్న ద్విజులు మహర్షులు ఎందరెందరో మహనీయులు యజ్ఞ కార్య దూర్వహులయ్యారు.
చ్యవన వంశ విఖ్యాతుడైన చంఢభార్గవుడు హోత గాను......
కుత్సకులోద్దీపకుడైన జైమిని ఉద్గాత గాను....
శార్న్గవుడు బ్రహ్మ గాను......
పింగళుడు అద్వర్యువు గాను.........
పుత్రచ్ఛాత్ర సంయుక్తు డైనా వ్యాసుడు, ఉద్దాలక -ప్రమతక- శ్వేత కేత -పింగళ అసితదేవల - నారద, పర్వత, ఆత్రేయ, కుండ జఠర, వత్స గోత్రపు వృద్ధుడైన శ్రుతశ్రవ కోహల , దేవశర్మ మౌద్గల్య, సమసౌరభాది మహోత్కృష్ట పురుషులతో సభ స్థానాలు అలంకృతం అయ్యాయి.సర్ప వ్రతం ప్రారంభం అయ్యింది.
ఒక యజ్ఞం అనేది ఏ ఉద్దేశ్యంతో చేయబడుతుందో తత్ అనుగుణంగా ఋత్వికులు భావ స్వరూపాన్ని పొందుతుంటారు. సౌమ్య యాగాలలో ఋత్వికుల స్వరూపం ఆహ్లాదకరంగా ఉంటే
శత్రు సంహారం కోసం ఆచరించే సర్పయాగాది యజ్ఞాలలో లయకారకులైన రుద్ర స్వరూపంగా ఋత్వికులు గోచరిస్తూ ఉంటారు.
పరమ ధర్మాత్ముడైన జనమేజయుని యొక్క మనోవేదనను అర్థం చేసుకున్నా ద్విజులు సర్పజాతికి అంతకుని లాగా మారిపోయారు.
నల్లని బట్టలు అచ్చా దించుకుని కూర్చుని ఉన్న యాజకుల నేత్రాలు హోమ ధూపాలతో ఎర్రబడి విచిత్ర వాతావరణం ఏర్పడ సాగింది.
హోతలు సమంత్రకంగా...
ఒక్కొక్క సర్పాన్ని ఆవాహనచేసి
" స్వాహా " అంటుంటే
పిలిచిన ప్రతి పాము వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి మలమలమాడిపోతూ ఉన్నాయి.
తుళ్ళుతూ దీనమైన స్వరాలతో సహాయార్థం అయిన వారిని పిలుచుకుంటూ.....
పడగలెత్తి అటు ఇటు మిడిసి పడుతూ... శిరోభాగాలతో...పాల భాగాలతో
ఒకటి నొకటితో వీడలేము అన్నట్లు చుట్టుకుంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ...
తప్పించుకోలేని దుఃఖంతో......
తామేమీ కాబోతున్నామో తెలియక
పడగలు విప్పుకుని .....
అటు ఇటు అయోమయంగా
చూస్తూ వచ్చి.....
హోమం వేడి తగలగానే కంగారుపడుతూ రకరకాల భంగిమల్లో భుజంగాలు
నిప్పుల్లో పడిపోతున్నాయి.............
నల్లవి ...తెల్లవి ..నీలానివి ...బంగారు రంగు వి ముసలివి... పడుచువి... పసివి.... ప్రౌఢత గలవి, రకరకాల కూతలతో " కూ " లిడుతూ
వచ్చి యజ్ఞగుండం లో పడి పోతున్నాయి.
ఏనుగు తొండాల వంటివి, ఏనుగు లంత శరీరం కలవి, పొట్లకాయల వంటి సన్నవి, యోజనాల వంటి పొడగైనవి కూడా మంత్రబద్ధాలై అనూహ్యమైన రీతిలో అగ్నిలో ఆహుతై పోతున్నాయి.
అవి కాలుతున్న చప్పుడు
వాటి వసా - , మెదడు కావడం వల్ల వస్తున్న వాసన,రంగులు మారుతున్న హోమ ధూమాలతో......ఆ ప్రాంత మంతా నిండి పోయింది.
తక్షకుని కి ఇంద్రుని అభయం
-------------------------------------
జనమేజయుని యజ్ఞం ఇక్కడి ఆరంభం అవుతుందని తెలియగానే - అందరి కన్నా ముందుగా ఉలిక్కిపడింది తక్షకుడే. సంగతి తెలిసిన తక్షణమే, అతగాడు సర్వదేవతా ధీశుడైన మహేంద్రుని ఆశ్రయించాడు. తనను ఎలాగైన కాపాడమని అర్థించాడు. ఇంద్రుడు కూడా ఆలోచించాడు ....అయితే ఈ యజ్ఞం గురించి గతంలో విధాత చెప్పిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే శేషుడు, వాసుకి మొదలైన దివ్య సర్పాలకు మరికొన్ని సర్పాలకు హాని వాటిల్లదని జ్ఞాపకం వచ్చింది.అందువలన యింద్రుడు అతనికి అభయం ఇచ్చాడు. అయినప్పటికీ తక్షకుని కి భయం పోక, అమరేంద్రుని వద్దనే చుట్టలు చుట్టుకొని పడుకొని పోయాడు.
కథ వింటున్న శౌనకులు " సర్వ రహస్య వేత్తవైన సూతా ! భయంకరాగ్ని జ్వాలల్లో... సృష్టిలో అనుపమాన బలపరాక్రమం కలిగిన నాగులు ఇలా దగ్ధం కావడానికి మరొక బలమైన కారణం ఏదైనా ఉందా మహాత్మా" అని కథ వింటూనే కుతూహలం తో అడిగారు ఋషులు.
తల్లి మాటకు ఎదురు చెప్పినందువల్ల నాగులు, తమ తల్లి అయినా కద్రువ శాపానికి గురి అయిపోయారు అని సమాధానం చెప్పాడు సూతమహర్షి.
ఏమిటీ విచిత్రం కన్న తల్లేనా తన బిడ్డలకు శాపం పెట్టింది అని ఆశ్చర్యపోయారు శౌన కాదులు.......
నాగులు కేవలం జనమేజయుని ఆగ్రహానికి గురియై పోయారు అని అనుకుంటాం ... కానీ దానికి తల్లి శాపం కారణమై ఉంది దానికి కూడా మరేదైనా కారణం ఉండవచ్చు ఏది ఏమైనా కారణ కారకుడు ఈశ్వరుడే 🌼🙏
కానీ అందరు నిమిత్తమాత్రమే... కారణానికి కారణమైన ఈశ్వరుడే అసలు కారణం 🌼🙏
అందరు నిమిత్తమాత్రులే కనుక ఈ లోకంలో తప్పు ఒప్పు అభిప్రాయాల నుండి మనం బయట పడవలసి ఉంది
సర్వేజనా సుఖినోభవంతు
మిత్రులందరికీ శుభరాత్రి నమస్కారాలతో
__(())_-
మహాభారతం ఆరవ భాగం ఆదిపర్వం సుపర్ణోపాక్యానం
"""""""""""""""'''"""""""""""""""""""""""""""""""""""""
తల్లి దాస్య సంకెళ్ళను తుంచిన మహోన్నత పుత్రుడగు సుపర్ణునకు.... వైనతేయునకు గరుత్మంతునకు నమస్కారం
ధర్మమును ప్రాణంగా భావించిన అనంతున కు వాసుకి మొదలైన దివ్య సర్ప రాజులకు నమస్కారం
నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలో ఏమి చేస్తే ఉన్నతంగా బ్రతకవచ్చు... ఏది చేస్తే నశించి పోతారో ....చాలా వివరంగా పురాణ రూపంలో ప్రకాశింప చేసి... నడవడి దిద్దిన వ్యాస భగవానునికి నమస్కారములు
🌼🙏🙏🙏🌼
నాగజాతి పతనానికి కారణమేమని శౌనకాది మునులు ప్రశ్నించగా నిఖిల పురాణ ద్రష్ట అయిన సూతుడు వివరంగా చెప్పడం మొదలు పెట్టాడు
కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా, కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కొన్ని వేల్లేళ్ళు భర్తను ఆరాధించారు. వారి సేవకు సంతృప్తి చెందిన కశ్యపుడు వారిని " మీకు ఎలాంటి పుత్రులు కావాలి " అని అడిగాడు. కద్రువ తనకు బలవంతులు ,ప్రకాశవంతులు అయిన వెయ్యి మంది సంతానం కావాలని కోరింది. వినత తనకు కద్రువ పిల్లల కంటే బలవంతులైన పుత్రులు ఇద్దరైన చాలు అని అన్నది.
కశ్యపుడు వారి భావాలను అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వి అభయమిచ్చి మీరు మీ గర్భాలను జాగ్రత్తగా సంరక్షించుకోండి అని చెప్పాడు, వారు చాలా సంతోషపడ్డారు తరువాత కశ్యపుడు పుత్రుల కొరకు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువ గర్భిణి యై వెయ్యి గ్రుడ్లలను ....వినత రెండు గ్రుడ్లలను ప్రసవించారు. వా రా గ్రుడ్లను జాగ్రత్తగా నేతికుండలలో పెట్టి రక్షించు కుంటున్నారు.
కాలం నడుస్తోంది సుదీర్ఘంగా ....పదిహేను వందల ఏళ్ళ తర్వాత ముందుగా కద్రువ పెట్టిన అండాలు పక్వం చెంది అందుండి వెయ్యి మంది నాగ కుమారులు జన్మించారు.
పుత్రుల ఆలనాపాలన తో వారి ముద్దు ముచ్చట్లతో కద్రువ చాలా సంతోషంగా కాలం గడుపుతోంది. వినత కూడా చాలా సంతోషించింది రేపు మాపో తనకు కూడా పిల్లలు పుడతారని ఎదురు చూస్తూ ఉన్నది.... ఒక నెల రోజులు గడిచింది చాలా ఆశ్చర్యంగా " అరే తనకు ఏమిటి ఇంకా పిల్లలు కలగలేదు అక్క నేను ఒకేసారి గుడ్లను పొదగేశాము. ఆమెకు కలగడం ఏమిటి నాకు కలగకపోవడం ఏమిటి ?! "అని చాలా ఉద్విగ్నంగా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది...... రెండు మూడు మాసాల గడిచాయి అయినప్పటికీ తన గ్రుడ్లు పొదిగ లేదు. అందుకు వినత ఉక్రోష పడి అసహనంతో... అక్క పై కలిగిన అసూయతో ఓర్వలేక ఇంకనూ ఎదురు చూసే ఓపిక లేక తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి పరిపక్వము కానీ సగము దేహంతో ఊరువులు లేని వాడు అయినా అనూరుడు జన్మించాడు. అతడు పుట్టుకతోనే తండ్రి అంతటి జ్ఞానిగా ప్రకాశించాడు.... అతడు తల్లి వైపు జాలిగా చూస్తూ " ఎందుకు తల్లీ ! తొందరపడి అండాన్ని చిదిమావు. నీ తొందర, పొరపాటు , నీ సోదరిపై అసూయ చెంది చేసిన పని వల్ల , నేను సగం దేహంతో పుట్టాను. అమ్మ ఎప్పుడు కూడా మనం ఇతరుల పై అసూయ చెందకూడదు ఒకవేళ అసూయ పడితే ఉత్తర జన్మలలో వారికి మనం సేవకులమై పోవాల్సి వస్తుంది. ఘోరమైన పాపం నీ వెన్నంటి వస్నది. దాని ఫలితంగా రానున్న రోజులలో నీ సవతికి నీవు బానిస గా మారుతున్నావు. ఇక విచారించాల్సిన అవసరం లేదు .... నీ రెండవ గ్రుడ్లు నైనా కాస్త జాగ్రత్తగా రక్షించుకో...అందుఃడి జన్మించే వాడు అపురూప బల పరాక్రమ సంపన్నుడు అయిన తేజోవంతుడు. నీ పుత్రుడు నీకు దాస్యాన్ని విడిపిస్తాడు" అని పలికి.... తల్లికి నమస్కరించి అనూరుడు సూర్యభగవానుని సేవించుటకై వెళ్ళిపోయాడు.
ఇంద్రుని ఉచ్ఛైశ్వం సముద్రతీరంలో తిరగటం చూసిన కద్రువ వినతతో " సోదరి ! ఈ అశ్వం చాలా అందంగా చాలా తెల్లగా ఉన్నది మరి ఎందుకు దాని తోక మాత్రం నల్లగా ఉన్నది " అని అడిగింది . అందుకు వినత ఏమిటి అక్క అలా మాట్లాడతావు దాని తోక తెల్లగా ఉంది కదా అని చెప్పింది. తన కంటే చిన్నది తన చెల్లెలు అయిన వినుత అలా పలకడం కద్రువకు నచ్చలేదు " ఎప్పుడు చూసినా నీవు నా మాటకు ఎదురు చెబుతుంటావు నేనేమైనా గుడ్డిదానినా?! ఆ గుర్రానికి తోక నల్లగా ఉన్నది కావాలంటే పందెం వేసుకుందాం ' అని కోపంతో పలికింది కద్రువ..... దీనితో సవతులకు పంతం పెరిగి పందెం కాచారు. ఆ పందెం ప్రకారం గెలిచిన వారు ఓడిన వారికి దాస్యం చేయాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. వినత అన్నది...ఇప్పుడే కావాలంటే దగ్గరకి వెళ్ళి చూద్దామని చెప్పింది. కద్రువ వినతను వారించి ఈ రాత్రి పూట చూడడం అంత అవసరమా ఈ గుర్రం ఎక్కడికి పోదు రేపు పొద్దున వచ్చి చూద్దామ్ లే" అని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులను పిలిచి ఆగుర్రం తోక నల్లగా మార్చి తల్లిని దాస్య బాధ నుండి కాపాడమని అడుగింది.
తల్లి మాటలు విన్న అనంతుడు ధనంజయుడు వాసుకి మొదలైన వారు ఆ పనిని నిరాకరించి తల్లికి హితవు చెప్పారు. కద్రువకు ఒక లక్ష్యం ఉన్నది తన మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు కానీ చిత్రంగా తనను అందరూ ఎదురిస్తూ ఉంటారు ఇది తన జ్ఞానం ఫలితం అని ఆమెకు తెలియదు . తన పనులు అధర్మమని తన కడుపున పుట్టిన పిల్లలే తనకు ఎదురు చెబుతుంటే సహించలేకపోయింది కద్రువ. ఆమె తన కొడుకు ల వైపు చూస్తూ " మీరంతా నా సొత్తు .... నేను చెప్పినట్లు నడుచుకోవడమే మీ బాధ్యత.... అంతే కానీ నాకు ఎదురు చెప్పడం నాకే ధర్మాన్ని చెప్పడం మీ పని కాదు ...తప్పు ఒప్పు ఆ పాప మేధో ... నేను అనుభవిస్తాను మీకెందుకు ?!. విశ్వాసఘాతకులు అయిన, ఆ విధేయులై ప్రవర్తించే మీరు భవిషత్ లో జరుగు జనమేజయుని సర్పయాగంలో పడి మరణించమని శపించింది. ఇది చూసి భయపడిన కర్కోటకుడు మరికొందరు నాగులు తల్లిని క్షమాపణ అడిగి ఆమెను శాంతింపజేసి ఆ పనికి ఒప్పుకున్నారు .
మరునాడు కద్రువ వినత ను తీసుకొని పోయి దూరం నుండి గుర్రం యొక్క తోకనుచూపించింది ...చూడవే అది నల్లగా ఉందా ! తెల్లగా ఉందా ? చూడు అని పలికింది. అశ్వం తోకకు కాల సర్పాలు చుట్టుకొని ఉన్నందు వలన ఆ తోక నల్లగా నిగనిగలాడుతున్నది. నిజమే గుఱ్ఱం తోక నల్లగా ఉంది. ఆ విధంగా ఉందని భ్రమపడిన వినత తన ఓటమిని అంగీకరించి కద్రువకు దాస్యం చేయటం మొదలుపెట్టింది.
వినత వినయవిధేయతలతో అక్కని గౌరవిస్తూ దాసిగా జీవించ సాగింది . ఇలా ఐదు వందల సంవత్సరాలు గడిచాయి తరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు. పుట్టీ పుట్టకముందే ఆ వైనతేయుడు ఒక్కసారిగా గగనంలోకి ఎగిరి వెళ్లాడు. స్వేచ్ఛగా మహా వేగంతో అటు ఇటు తిరిగి వచ్చాడు తల్లికి నమస్కరించాడు. వినత చాలా ఆనందించింది తనకు పుట్టిన వాడి బలపరాక్రమాలు చూసి మురిసిపోయింది త్వరలో తన దాస్యాన్ని నిర్మూలించ గలడు అని ఆనంద పడింది .. పసివాడైన గరుడుడు. అమాయకంగా తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు. కాలం కొద్దికొద్దిగా వినతకు సాయం చేయడానికి మారుతూ ఉన్నది.
ఒక రోజు కద్రువ గరుడునితో..గరుడా ! నీ తల్లి నాకు దాసి నీవు దాసీ పుత్రుడవు. కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని తీసుకొని వెళ్ళు" అన్నది.
పెద్దమ్మ చెప్పిన ఆ మాటలు గరుడునికి నచ్చలేదు తన పట్ల తన జనని పట్ల ఆమె చూపిస్తున్న నిరాధరణ
అతనికి నచ్చడం లేదు సరే ఈ పిల్లలను సూర్యమండలం వైపు తీసుకువెళ్లి నా ప్రతాపం చూపిస్తాను అని భావించాడు గరుడుడు...
ఒక రోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు. ఇ వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయారు..
పుత్రుల అవస్థకు తల్లడిల్లిన కద్రువ తన సోదరి అయిన అదితి ని ప్రార్ధించినది. అదితి తన కుమారుడైన దేవేంద్రుని ఆజ్ఞాపించి వర్షం కురిపించినది. ఇలా కద్రువ తన పుత్రులు సేద తీరగానే...తాను... పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని గరుత్మంతుడు .. పెద్దమ్మ నేను చేసిన పని మూర్ఖమైనదే... కానీ నువ్వు పెద్ద దానివి మా అమ్మకు అక్కవు. నాలో కోపం పెరగడానికి కారణము అధర్మబద్ధమైన నీ ప్రవర్తన. అది నీ చెల్లెల్ని నీ చెల్లెలు కొడుకు నైన నన్ను చాలా బాధ పెడుతున్నది .... అని పలికి నమస్కరించి తన తల్లి దగ్గరికి వెళ్లి పోయాడు
తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు. గరుత్మంతుడు
పెద్దమ్మ దగ్గరికి వెళ్లాడు గరుత్మంతుడు _ అమ్మ ! నీ చెల్లెల్ని నువ్వు బానిస గా చూడడం ...బానిస గా మార్చడం నీకు గౌరవప్రదమేనా ?! దీనికి పరిష్కారం ఏమిటి నేను ఏమి చేస్తే మీరు సంతోషిస్తారు మాకు ఈ చెర తొలుగుతుంది దయచేసి సెలవు ఇవ్వండి అని ప్రార్థించాడు. తమను దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు. అందుకు ఆమె గరుడా ! పెద్దలకు చిన్న వారు ఎప్పుడు బానిసలే" ముందుగా ఇది తెలుసుకో ....సరే మీరు బానిసలుగా భావించి బాధ పడుతున్నారు కనుక మీరు విముక్తి పొందాలి అంటే ఒక పని చెయ్. నీవు మహావీరుడవని నీ తల్లి తెగ మురిసిపోతున్నది. మహేంద్రుని ఓడించి నీ పరాక్రమాన్ని ఋజువు చేసుకో ...అతని సంరక్షణ లో ఉన్నా అమృతాన్ని తెచ్చి నీ సోదరులకు తెచ్చి ఇస్తే... మీరు దాస్య విముక్తులు కాగలరని చెప్పింది.
గరుత్మంతుడు అమృతం తీసుకు రావడానికి బయలు దేరాడు.
మిత్రులందరికీ శుభ శుభోదయం
మహాభారతం ఆదిపర్వం ఏడో భాగం
-------------------------------------------------
అమృతం కోసం స్వర్గలోకానికి వెళ్లేముందు గరుడుడు తన తల్లి అయిన వినత దగ్గరికి వచ్చి నమస్కరించి నేను అక్కడికి వెళ్లడానికి నాకు చాలా శక్తి కావాలి నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఏ ఆహారం స్వీకరించాలి అని అడిగాడు అప్పుడు ఆమె సముద్రంలో నిషాదులు అనే లోక కంటకులు చాలా మంది ఉన్నారు వారిని ఆరగించి మీ ఆకలి తీర్చుకో ...అటు నీ ఆకలి తీరుతుంది ఇటు లోకానికి క్షేమం చేకూరుతుంది అని చెప్పింది వినుత. కానీ వారిలో ఒక వేళ ఆ బ్రాహ్మణుడు కనుక ఉంటే భుజింపవద్దు అంది .గరుడుడు " అమ్మా ! బ్రాహ్మణుని గుర్తించడం ఎలా అని అడిగాడు తండ్రి ! బ్రాహ్మణుడైన వాడు నీకు మింగుడుపడడు. ఇది ఒకటే నీకు గుర్తు అని చెప్పింది. వెంటనే ఆ వైనతేయుడు తల్లికి నమస్కరించి నిషాదులు ఉండే సముద్రం లోని ఆ తావు కి వెళ్ళాడు .. పరమ కిరాతక లైన నిషాదులను దొరికిన వారిని దొరికినట్లు మ్రింగుతున్నాడు.... కొంతసేపటికి ఏదో గొంతుకు అడ్డం తగినట్లుగా తెలిసింది .తల్లి మాట గుర్తుకు వచ్చి మహానుభావా మీరు ఎవరో ఉన్నారు బయటికి రండి అని పలికాడు
అతని నోటిలో నుండి ఒక నిషాదుడు బయటికి వచ్చి వినతా సుతా ! నేను ఇదివరలో బ్రాహ్మణుని నా కార్యాల వల్ల భ్రష్టత్వం చెందాను. ఇదిగో ఈవిడ నా అర్ధాంగి ఈమె ఒక నిషాది. మమ్మల్ని విడిచి పెడితే మేము వెళ్ళిపోతాము అని నమస్కరించాడు. ఆ దంపతుల్ని విడిచి మిగతావారిని భక్షించాడు. అంతమంది విషాదాలను తిన్నప్పటికి కూడా వైనతేయుని కి ఆకలి తీరలేదు . ఆకలి తీరే మార్గం తెలియక వైనతేయుడు తండ్రి దగ్గరికి వచ్చాడు ఇలా పలుకుతున్నాడు తండ్రి ! నా తల్లి దాస్య విముక్తి కోసం నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను నాకు ఆకలి తీరలేదు నాకు ఆహారం పెట్టు అన్నాడు . కుమారుని ప్రయత్నానికి సంతసించి కశ్యపుడు ఇలా చెప్పాడు " కుమార ! నిభావసుడు ,సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తి పంచుకోవడంలో తగువులాడుకుంటూ ...అన్నగారు తమ్ముడిని ఏనుగు కమ్మని.. తమ్ముడు అన్నను తాబేలు కమ్మని శపించుకున్నారు . వారలా గజకచ్చపాలై ఉండి కూడా పూర్వ జన్మ వైరం తో పోరాడుతూనే ఉన్నారు. వారిని నీవు తిని నీ ఆకలి తీర్చుకో. వారిద్దరికీ శాపాలు తీరిపోతాయి అని పలికాడు కశ్యపుడు.
ఆ వెంటనే వెళ్లి వనతేయుడు రెండు కాళ్ళతో ఆ గజకచ్చపాలను పట్టుకుని తినడానికి చోటు వెతుక్కుంటూ ఉండగా.....రౌహిణమనే చెట్టు గరుత్మంతుని తో " నాయనా ! నేను నూరు యోజనాలు విస్తరించిన గొప్ప వృక్షాన్ని. నా కొమ్మపై నీవు, వాటిని పెట్టుకుని ఆరగించు అని పలికింది ఆ వృక్షము.. గరుడుడు ఆ వృక్షానికి నమస్కరించి తన ఆహారాన్ని ఆ చెట్టు లోని ఒక బలమైన కొమ్మపై కూర్చుని ఆరగించాలని చూడగా... ఆయన బరువు భరించ లేక ఆ చెట్టు కొమ్మ విరిగి పోయింది.
ఆ కొమ్మను ఆధారంగా చేసుకుని తలకిందులుగా వేలాడుతూ... తపస్సు చేసుకుంటున్న వైఖానస మునులను చూసి ఈ కొమ్మ నేల మీద పడితే ఏమవుతుందో అని భయపడి... వెంటనే గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో కరుచుకుని తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. కశ్యపుడు మహర్షులకు నమస్కరించి మీరు హిమవంత్ పర్వతానికి వెళ్ళండి అని వారిని అర్థించాడు.. అలాగే అని ఆ ఋషులు సమ్మతించి వెళ్లారు.
తండ్రి ఆజ్ఞ మీద అతడు మనుషులు లేని చోట ఆ కొమ్మను విడిచి. హిమవంతం మీద నే వీలైన ఒక చోటు చూసుకుని భోజనం ప్రారంభించాడు. అప్పుడు అతని ఆకలి తీరింది.
అటు తర్వాత వైనతేయుడు అమృతం సంపాదించడానికి స్వర్గలోకానికి పయనమయ్యాడు. స్వర్గం లో ఎన్నో ఉత్పాతాలు కలిగాయి. గురువైన బృహస్పతి ద్వారా వాటి కారణం తెలుసుకున్న ఇంద్రుడు అమృత రక్షకులను పెంచి... కాపలా ఇంకా కట్టుదిట్టం చేశాడు. ఇప్పుడు గరుడుడు తన రెక్కల గాలి తో అక్కడి కావలి వాళ్ళను ఎగుర కొట్టాడు. ఆ కాపలాదారులు సామాన్య మైన వాళ్ళు కాదు ఎందరో రాక్షసులను జయించిన వారు కూడా... అనప్పటికి వారు ఆయన ముందు నిలువలేక పోయారు.
మహేందృడు గరుడుడి పరాక్రమానికి ఆశ్చర్య పోయి... అతనిని ఆపవలసిందిగా అగ్ని ని, వాయువు ను ఆజ్ఞాపించాడు. మహాత్ములైన ఆ మహనీయులు గరుడుడి ని చూసి సంతసించి...పరీక్ష కోసమై ఆయనను చుట్టు ముట్టారు. .
తనకు రకరకాల విజ్ఞులు ఎదురుకావడంతో వైనతేయునికి ఉన్న ఆవేశం వాయువు కన్నా అధికంగాను... ఆయన కోపం అగ్ని కన్నా తీవ్రంగా ఉండటం చేత ఒక్కసారిగా వారిద్దరిని
పీల్చే వాడు..... అగ్ని వాయువులు అతనిలో విలీనం కావడం చేత ఆయన స్వరూపం మరో సూర్యుడిలా ప్రకాశిస్తూ వుంది.
స్వర్గ భటులు అతనిని చూసి భయపడి ఇంద్రుని శరణువేడారు. ఇంద్రుడు వజ్రాయుధంతో గరుత్మంతుని పై దాడి చేయడానికి వెళ్ళాడు.
గరుత్మంతుడు ఇంద్రునితో " స్వర్గ రాజా ! నీ వజ్రాయుధము నన్ను ఏమీ చేయలేదు. నా శరీరంలోని ప్రతి ఈక నీ వజ్రాయుధంతో సమానమైనవి కావాలంటే పరీక్షించుకో" అని పలికాడు.
ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి మొదలుపెట్టగానే బృహస్పతి అతన్ని వారించి వైనతేయుడు చెప్పింది నిజమే. అనవసరంగా దధీచి మహర్షి యొక్క పరువు తీయకు అదితి పుత్రా ! బలవంతుని తో విరోధం తగదు. అతనితో సంధి చేసుకో " అని సలహా ఇచ్చాడు.
గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు" సోదరా వినతా సుత ! నీవు చేసే కార్యం వలన లోకానికి గొప్ప ఆపద వస్తుంది . అసలే కద్రువ కుమారులు మంచివారు కాదు. నీవు వారికి అమృతాన్ని ఇస్తే లోకానికి గొప్ప ఉపద్రవం వస్తుంది . కనుక అమృతానికి తీసుకెళ్లడం సమంజసం కాదు" అని విన్నపం చేశాడు.
శాంతించిన వైనతేయుని నుండి అగ్ని వాయువు లు బయటకు వచ్చి " మహేంద్రుడు చెప్పింది సత్యం. నాయనా ! అమృతం తీసుకవెళ్ళ వద్దు, బుద్ధిమంతుడైన నీవు అమృతాన్ని తాగిన నష్టం లేదు కానీ ఇది వారికి చెందకూడదు. నీకు అవసరమైతే అమృతాన్ని త్రాగు "అని చెప్పారు. అప్పుడు గరుత్మంతుడు వారితో " మహాత్ములారా ! నాకు అమృతం సేవించాలని ఎటువంటి కోరిక లేదు నా తల్లి దాస్యవిముక్తి ఒక్కటే నాకు ముఖ్యం అందుకోసం కోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను. నేను అమృతాన్ని తీసుకుని వెళ్లడం అన్నది తప్పనిసరి . మీరు ఒక పని చేయండి నేను ఈ అమృతకలశాన్ని వారికి ఇస్తాను ఆ తర్వాత మీరు దానిని యుక్తి తో తిరిగి స్వర్గానికి తెచ్చుకోండి " అని వినయంగా నమస్కరించి పలికాడు.
ఇదంతా శ్రీ మహాలక్ష్మీ తో కూడిన మహావిష్ణువు గమనిస్తూ.... వైనతేయుని మాతృ భక్తికి.... అతని త్యాగనిరతి కీ ఆనందిస్తున్నాడు.
తర్వాత మహేంద్రుడు చేయునది లేక గరుత్మంతుని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు ఆ అమృతకలశాన్ని కద్రువ సమీపంలో ఉన్న ఆమె పుత్రులకు ఇచ్చి " అమ్మా ! ఇదిగో అమృతకలశం ఇస్తున్నాను ఇక నేను నా తల్లి దాస్య విముక్తులం అవుతున్నాము" అని పలికి నమస్కరించి తన తల్లి అయిన వినత చెంతకు వెళ్ళిపోయాడు.
కశ్యప ప్రజాపతి మరియు వినతా దేవి చెంతలో ఉన్న గరుత్మంతునికి మహావిష్ణువు దర్శనమిచ్చి నాయనా నీ త్యాగనిరతికి నేను సంతోషించాను నీ సేవ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వైకుంఠానికి వచ్చేయి అని వరం ఇచ్చాడు. తల్లిదండ్రులు గరుత్మంతుని ఆశీర్వదించి వైకుంఠానికి పంపారు
అటు తర్వాత కద్రువ తన కుమారులను అమృతాన్ని దర్భల పై ఉంచండి తర్వాత మీరు స్నానాదికాలు పూర్తిచేసుకుని వచ్చి అమృతాన్ని సేవించండి అని చెప్పి తన పతి అయిన కశ్యపుని చెంతకు ఆమె వెళ్ళిపోయింది.
నాగులు తమ తల్లి చెప్పినట్లే ఆ కలశాన్ని దర్భల పైనుంచి స్నానం చేయడానికి వెళ్లిపోయారు
నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది శేషునకు అప్పగించాడు.
ఆది శేషుడు వెళ్ళగానే కద్రువ కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది. అందు వలన కలత చెందిన వాసుకి ... నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవత్వం లభించేలా చేసారు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. అది విని " ఏలా " పుత్రుడు అనే పాము ఇలా చెప్పింది " అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా " బ్రహ్మదేవా ఏ మాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా " అన్నారు. బ్రహ్మ దేవుడు దేవతలతో " పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే. అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడు " అని దేవతలు చెప్పగా విన్నాను.
ఆ తరువాత వాసుకి తన సోదరి జరత్కారువును వివాహమాడటానికి వరుడైన జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. అతడొక రోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను చూసాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి " మహాత్ములారా ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు. ఇదేమి తపస్సు" అని అడిగాడు. అందుకు వారు " మా వంశంలో పుట్టిన జరత్కారువు అనే పాప కర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేయలేదు. అందువలన అతని పితృ దేవతలమైన మాకు ఉత్తమ గతులు కలుగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలుగచేయమని చెప్పు " అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తనపేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్ళాడు. వాసుకి జరత్కారునితో " మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ...ఈమెను వివాహం చేసుకోండి " అన్నాడు. అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో "నీవు నా మాటను ఎప్పుడూ మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది.
కొన్ని రోజులకు జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యా వందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తల పెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్ర లేపి చెప్పింది. అందుకు జరత్కారుడు కోపించి " నన్ను నిద్ర లేపి అవమానించావు. కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను. నీవు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు అన్నాడు.
జరత్కారువు ్న అన్నగారన వాసుకి ఇంటికి వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తీకునికి జన్మ ఇచ్చింది. ఆస్తీకుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేసాడు.
సర్పయాగం జరుగుతూ ఉన్నదని తెలిసి తన తల్లి అయినా జగత్కారువు " నాయనా ! నీవు వెళ్లి జనమేజయుని ప్రసన్నం చేసుకుని నీ మేనమామలను రక్షించు " అని ఆదేశించగా ఆస్తికుడు హస్తినాపురం వచ్చాడు అక్కడ జనమేజయుని కలుసుకుని
" మహా రాజ ! శ్రీ రాముడు...ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి అయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది. సర్వ శాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించ పడుతుంది. వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు. ఆ స్తుతికి సంతోష పడి జనమేజయుడు ఆస్తీకునితో " మహాత్మా ఏమి వరం కావాలో కోరుకో " అన్నాడు....ఆస్తీకుడు " జనమేజయా ! ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు " అన్నాడు. జనమేజయ మహారాజు " ఈ సర్పయాగం... తన తండ్రిని తక్షకుడు చంపాడని అందుకు ప్రతీకారంగా ఈ యాగాన్ని చేస్తున్నానని ఇది కాకుండా మరి ఏదైనా కోరామని ప్రార్ధిస్తున్నాడు. ఆ సమయంలో తక్షకుడిని లక్ష్యంగా పెట్టుకుని ఋత్విక్కులు మంత్ర పూర్వకంగా ఒకటికి రెండు సార్లు ఆహ్వానిస్తున్నా తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు దివ్య ద్రుష్టి ద్వార తెలుసుకుని జనమేజయ మహారాజుకు తెలుపగా ఆ రాజు ఇంద్రునితో సహా తక్షకుని అగ్నిగుండంలో పదవేయమని ఆజ్ఞాపించగా ఆ యజ్ఞ హోత ఏకాగ్రచిత్హుడై ఇంద్రుడితో సహా తక్షుకుడిని ఆహ్వానించగా ఇంద్రుడు మంత్ర ప్రభావంచేత తక్షకుడి తో సహా ఆకాశంలో నుండి జారుతూ యజ్ఞగుండం వైపు రావడం మొదలు పెట్టాడు.... అనుకోని ఈ ఉపద్రవానికి ఇంద్రుడు భీతిల్లి తక్షకుని తో " తక్షకా ! నీవు నీ దారిన వెళ్ళు. ఇక నేను నిన్ను రక్షించ లేను " అని తక్షకుడిని అక్కడే వదిలి తన భవనమునకు వెళ్ళాడు.
అంతటా తక్షకుడు భయంకరంగా భయంతో అరుస్తూ మంత్రశక్తికి ఆధీనుడై యజ్ఞగుండం లో పడబోతూ వుండగా ఆస్తికుడు"తక్షకా! ఆగు అగు అగు" అని మూడుసార్లు అనగా తక్షకుడు అక్కడే ఆగిపోయి ఆకాశంలో వ్రేలాడుతున్నాడు. అప్పుడు యజ్ఞమునకు ఆహ్వనించ బడిన సదస్యులందరూ తపస్వి అయిన ఆస్తికుడి కోరికను మన్నింప వలసినదిగా కోరాగా... జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు.తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు. ఆస్తీకుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. జనమేజయ మహారాజు ఋత్విక్కులకు, సభాసదులందరికి వేలకోలాది ధనాన్ని ఇచ్చి సత్కరించాడు. జనమేజయ మహారాజు ఆస్తికుడిని మెచ్చుకుని "ఆస్తిక మహాశయా! భావిష్యత్తు లో నేను అశ్వమేధయాగం చేస్తాను. అందులో మీరు సదస్యులుగా ఉండా"లని కోరగా .... అందుకు ఆస్తికుడు "అలాగే" అని చెప్పి సన్మానములను స్వీకరించి ఇంటికి వచ్చి తల్లికి, మేనమామకు నమస్కరించి యజ్ఞసభలో జరిగినదంతా చెప్పగా వారు సంతోశించి "నీ కోరిక చెప్పు తీరుస్తామని కోరాగా ఆస్తికుడు "ఈ కథను స్మరించిన వారికి సర్పభయం లేకుండా చేయ"మని కోరాడు. వారు సంతసించి అలాగేనని వరమిస్తారు. ఇలా నాగుల్ని ఉద్ధరించి ఆస్తికుడు వివాహం చేసుకుని పుత్ర పౌత్రులతో ఆనందగా జీవితాంతం గడిపి చివరికి మోక్షమును పొందాడు.
ఈ కథను విన్నవారు మరియు చదివినవారు నాగ దోషాల నుండి నాగ బంధాలనుండి విడుదలవుతారు అన్నది అక్షర సత్యం అని వ్యాస భగవానుడు మహాభారతం లో తెలియజేశాడు
మిత్రులందరికీ శుభోదయం