Thursday, 25 September 2025

*వందే మాతరం *

 

*వందే మాతరం -1*
💪

రచన : గొల్లపూడి మారుతీరావు

కనుచూపు మేరలో  ఈశాన్య సరిహద్దు ప్రాంతంలోని భారత సైనికస్థావరం. ఎడమ వైపు మహోన్నతమైన మంచు శిఖరాలు. శత్రు స్థావరాలు-చైనావి- కనిపిస్తున్నాయి. 40 కోట్ల ప్రజల నిశ్చయానికి ధైర్యసాహసా లకు ప్రతినిథులుగా నిలిచి పోరాడే కొన్ని పదుల సైనికులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ముందున్న భారత స్థావరం దగ్గర యుద్ధం జరుగుతోంది. అక్కడికి దాదాపు మైలు దూరంలో ఉంది ఆ మొదటి స్థావరం. అది కూలిపోతే రెండవస్థావరానికి శత్రు సైన్యాలు చేరుతాయి. అక్కడ పోరాటం జరుగుతోంది తీవ్రంగా. పరిస్థితి విషమంగా ఉంది. ఆశల నిరాశల మధ్య, రెండవ స్థావరంలో నిలిచిన వ్యక్తుల మనస్సులు రెపరెపలాడుతున్నాయి.

ఈ స్థావరంలో కుడివైపు ఆయుధాలను వుంచే చిన్న గది ఉంది. ఎడమవైపు హిమాలయశ్రేణి, శత్రుసైన్యాలు, మొదటి స్థావరం. ఎడమవైపు ఒక పక్కకి టేబులు ఉంది. ఏవో రెండు మూడు ఫైళ్ళు మాత్రం ఉన్నాయి. ఎదురుగా గోడకు ఈశాన్య సరిహద్దు ప్రాంతపు పటం ఉన్నది. టేబులు ముందు ఒక పాత కుర్చి. అక్కడక్కడా చెదిరిన రెండు బల్లలు-ఓ మూల ప్రథమ చికిత్సకు ఉపయోగపడే మందుల పెట్టె ఇంతే అక్కడి సామగ్రి. టేబులుకు ఆనించి రెండు తుపాకులు ఉన్నాయి. టేబులు మీద ఓ తుపాకీ పరిచివుంది. గోడకు ఆనుకుని మరొకటి ఉంది.

ప్రతిక్షణం మొదటిస్థావరం నుంచి వార్తలు తెలిసే ఏర్పాట్లు చేసుకున్నారు. అంచీలు మీద అక్కడికి వార్తలు అందుతున్నాయి. ఈ స్థావరంలోని సైనికులంతా మొదటి స్థావరానికి తరలిపోయారు. ఆయుధాలూ, మందుగుండు సామగ్రి కూడా అవసరాన్ని బట్టి ముందుకు పోతున్నాయి. ఇక్కడ మిగిలినవాళ్ళు నలుగురూ కమిషన్ ఆఫీసర్స్-కల్నల్ ఆర్. కె. రావ్, మేజర్ రాంసింగ్, కెప్టెన్ హిరెన్ రాయ్, లెఫ్టినెంట్ కృష్ణన్ నాయర్, దేశంలో నాలుగు ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నారు.
రావు వయస్సు నలభై పైన, దాదాపు 50
మేజర్ వయస్సు 40. కెప్టెక్ రాజ్ కి 35 ఉంటాయి. నాయర్ అందర్లోకి చిన్నవాడు వయస్సులోనూ, పదవిలోనూ. యువకుడు, ఉద్రేకి, అందర్లోకి కల్నల్ అనుభవంగల ఉన్నతోద్యోగి. మిగతా వారంతా అతని క్రింది ఉద్యోగులు. ఉత్తరవులు ఇవ్వడానికీ, ఆదేశాలు ఇవ్వడానికి అన్నిటికీ అతనే అధికారి, బాధ్యుడు.

ఆ స్థావరంలో టేబులు మీద ఓ పెట్రోమాక్స్ దీపం వెలుగుతోంది. అప్పుడు రాత్రి 8-30. మరొక దీపాన్ని కుడివైపుమీది నుంచి వేలాడ దీశారు. నాలుగు పెద్ద టార్చిలైట్లు టేబులుమీద ఉన్నాయి.

నలుగురూ పూర్తి యూనిఫారంలో ఉన్నారు. అంతకన్నా వాళ్ళకి మరో దుస్తులు లేవక్కడ. నిద్రపోవడం, భోజనం చేయడం, ఉద్యోగం అంతా వాటితోనే. అందుకని బాగా నలిగిపోయి ఉన్నాయి. కొన్ని రాత్రిళ్ళుగా వాళ్ళకి నిద్దర్లు లేవు. ఒక దేశపు పూర్తి బాధ్యతను వహించే అలసట, ఆతృత, ఆందోళన, నిశ్చయం, సాహసం అన్ని వారి ముఖాలలో ద్యోతకమవుతున్నాయి.

అక్కడికి రెండు మైళ్ళ దూరంలో చిన్న ఊరు వుంది. అక్కడి గ్రామీణుల కోలాహలం, ఎప్పుడన్నా ఇక్కడ నిశ్శబ్దం ఏర్పడినప్పుడు వినిపిస్తుంది. ఒక రెడ్ క్రాస్ యూనిట్ 24 గంటలూ పనిచేస్తోంది. రెడ్ క్రాస్ కార్యకర్తలు స్ట్రెచెర్లతో నిర్విరామంగా పనిచేస్తున్నారు, దేశం కోసం ప్రాణాలర్పించి న మృతవీరుల కళేబరాలను, క్షతగాత్రుల ను ఎప్పటికప్పుడు అంబులెన్స్‌లలో సమీప ప్రాంతాలకు, ఆసుపత్రులకు చేరుస్తున్నారు.
📖

దేశభక్తితో వణికే ఓ పెద్ద గొంతు గుర్తు చేస్తోంది ఇట్లా :

*జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’

మళ్ళీ నిశ్శబ్దం. దగ్గరలో ఉన్న పట్టణం వైపు నుంచి పెద్ద కోలాహలం. 'వందే మాతరం', 'భారత్ జవానొంకీ జై' అని నినాదాలు చేస్తున్నారు. అందరూ ఏక కంఠంతో 'వందేమాతరం' జాతీయ గీతాన్ని పాడుతున్నారు.

హఠాత్తుగా ఎడమవైపు పెద్ద తుపాకులు పేలిన శబ్దం - వెంటనే వరసగా గ్రెనేడ్లు ప్రేలాయి. శబ్దం దూరమయింది. ఏదో కంఠం ఇలా చెస్తోంది "భారతదేశపు ఈశాన్య సరిహద్దు. దూరాన మహెన్నత మయిన మంచు శిఖరాలు-ఎన్నో దశాబ్దాల క్రిందటి మాట అదీ. శబ్దం ఘనీభవించి, నీరుగా ప్రవహించే ఆ మంచు శిఖరాల మధ్య అప్పట్లో కొందరు పసుల కాపర్లు సంచరించేవారు. శిఖరాల పాదాల వద్ద పెరిగే పచ్చికలను పశువులకు మేపుకో డానికి అక్కడికి వచ్చేవారు. వ్యాపారులు ఆ మార్గాలలో సంచరించేవారు. మనస్సు లలో సరిహద్దులు నిర్ణయించుకోవడం తెలీని అమాయకులు వారు. కాని కాలం మారింది. రాజ్యాలు మారాయి. మంచికి చెడుకీ, మానవత్వానికీ అమానుషత్వానికీ కాక, మంచికీ మంచికీ కూడా అవధులు నిర్ణయించే వింత మానవులు వచ్చారు. 'పంచశీల'ను పరమార్ధంగా బోధించి, అంగీకరించిన దేశమే, 'హిందీ చీనీ భాయ్ భాయ్' అని నినాదాలు చేసిన దేశమే ఎదురు తిరిగింది. ఇప్పుడా ప్రాంతంలో పశుల కాపర్లు కనిపించరు. గొర్రెలు పశువులు తిరగవు. పచ్చికబయళ్ళు పెరగవు. హృదయాల్ని చీల్చే తుపాకుల ప్రేలుళ్ళు వినిపిస్తాయి. శాంతి, సహనం, అహింసా సిద్ధాంతాలను సవాలుచేసే వింత జంతువులు కనిపిస్తాయి.
📖

ఆ రోజు మొట్టమొదటిసారిగా శాంతిని కాంక్షించే భారతావని గుండెల్లోకి తుపాకులు పేలాయి. మానవులు నిర్మించిన సరిహద్దుల్ని మానవులే కాదన్నారు. 40 కోట్ల ప్రజ మేలుకొంది. శాంతం, కరుణను వర్ణించిన భారతీయుల నేత్రాలలొ ఆవేశం. ఆవేగం నిండింది. భారతదేశం కోసం అనేక దేశాలు వెనక నిలిచాయి. రాక్షసత్వాన్ని ఎదిరిస్తూ - సత్యం అహోరాత్రాలు పోరాటం సాగిస్తోంది”.

ఇటు తుపాకులు మళ్ళీ పేలుతున్నాయి. మళ్ళీ నిశ్శబ్దం. ప్రధానమంత్రి దేశానికేదో సందేశం ఇస్తున్నారు. గొంతు వినిపిస్తోంది. సైరన్ హఠాత్తుగా వినిపించింది. ప్రధాని గొంతు నిలిచిపోయింది. సైనిక వాద్యాలు మ్రోగుతున్నాయి. వందలాదిమంది సైనికులు దూరాన కదిలి వస్తున్నారు. ఎవరో ఆఫీసర్ల ఆర్డర్లు ఇక్కడికి చెవులు చిల్లులుపడేలాగు వినిపిస్తున్నాయి.
🇮🇳
*సశేషం*


*వందే మాతరం -2*

💪


రచన : గొల్లపూడి మారుతీరావు



(తెర ఇప్పుడు తొలిగింది. సైనికుల బూట్ల చప్పుడు యింకా వినిపిస్తోంది.)


నలుగురు ఆఫీసర్లూ అక్కడే ఉన్నారు. అంతా కుడివైపు మూడవ స్థావరం వైపు చూస్తున్నారు. అక్కడికి కనుచూపుమేరలో కనిపిస్తోంది స్థావరం. టేబిలుకు ఆనుకు నిలబడ్డాడు సింగ్, బల్లమీద కూర్చున్నాడు రాయ్. నాయర్ పచార్లు చేస్తున్నాడు. రావ్ అటు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఇప్పుడిక సైనికుల బూట్ల చప్పుడు ఆగింది


కల్నల్ రావ్:- (సైన్యాలను చూశాక తాత్కాలికమైన సంతోషం కనిపించింది.) 


వచ్చేసింది. ట్వంటీ టూ ఇన్ఫంట్రీ ప్లాటూన్ మూడో స్థావరానికి వచ్చేసింది. ఇక దానికేం బాధలేదు. 


(అటూ యిటు తిరుగుతున్నాడు. వాక్యం పూర్తయేలోగా అతనికో ఘోరమైన దృశ్యం కనిపించింది. ఇతని వైపు తిరిగి ఉండడం వల్ల మిగత ముగ్గురు ఆఫీసర్లు దానిని గుర్తించలేదు, ఇతను హఠాత్తుగా ఆగిపోవడం చూసి అంతా ఆటు తిరిగారు. చచ్చిపోయిన సైనికుణ్ణి స్ట్రెచర్‌లో ఉంచి ఇద్దరు రెడ్ క్రాస్ వర్కర్స్-(A., B.) తీసుకు వస్తున్నారు. కలల్న్ని చూసి ఆగారు)


A: నాయక్ 203506-ప్లాటూన్ 18, పేరు బలదేవ్-(రావ్ దగ్గరికి వచ్చాడు.)


రావ్. చచ్చిపోయాడా?


B. యస్ సార్.


ఒక్కసారి స్ట్రెచర్ మీద ఉన్న వ్యక్తి ముఖాన్ని కదిపాడు. అటు నుంచి యిటు తల వాలిపోయింది. దుప్పటి పూర్తిగా కప్పేశాడు. స్ట్రెచెర్ కుడివైపు వెళ్లిపోయింది. రావ్ మాపు దగ్గరికి వచ్చాడు. చచ్చి పోయిన సైనికుడిని చూశాక అందరిలో ఓ విధమైన Stiffness వచ్చింది. ఏమీ తోచనట్టు అటూ యిటూ కదుల్తున్నారు. నాయక్, రాయ్ ఆతృతగా రావ్‌ను చూస్తున్నారు.


నిశ్శబ్ధం.


సింగ్: ఎనిమిది నలభై అయింది.


నిశ్శబ్దం.


రాయ్: ఇంకా మొదటి స్థావరంలో షూటింగ్ జరుగుతుంది.


నిశ్శబ్దం.


నాయక్: (ఆ నిశ్శబ్దాన్ని భరించలేక పోయాడు) ఇప్పుడేం చేయాలి కల్నల్ సాబ్?


(అందరూ తలెత్తి రావ్ వైపు చూశారు ఏంచెప్తాడోనని)


రావ్: ఇప్పుడేకాదు, ఎప్పుడూ మనం చేసేదీ, చెయ్యవలసింది, చెయ్య గలిగేది ఒకటే. (అందరిలో ఆతృత)-యుద్ధం- అందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. మొదటి స్థావరం నుంచి యింకా వార్తలు రాలేదు. డిస్పాచ్ రైడర్ రావాలి...... మేజర్ ఒకసారి చూడండి-


మేజర్ ఎడమ వైపుకి వచ్చి చూస్తున్నాడు. (నిశ్శబ్దం )


రాయ్: మొదటి స్థావరానికి ప్రమాదం తప్పకపోతె ఏం చెయ్యాలి కల్నల్ సాబ్?


రావ్: దానికి ఆలోచించాలా? తుపాకులు (తుపాకులు చూపి) అవి మన కోసం ఎదురు చూస్తూన్నాయి. (టేబిలుమీద hand stick తీసుకొని) మొదటి స్థావరం...... (ఏమిటో చెప్పబోతే.)


సింగ్: (గుమ్మం దగ్గర రెండు చేతులూ నోటి దగ్గర పెట్టి) డిస్పాచ్ రైడర్ ... పోస్ట్ ... వన్, ... (అరిచాడు. దూరాన ఎవరో 'డిస్పాచ్ పోస్ట్...... వన్...... అని తిరిగి అరిచారు) సజ్జన్ సింగ్, (సంతోషంతో, ఆతృతతో వెనక్కి తిరిగాడు సింగ్) వస్తున్నాడు కల్నల్ సాబ్.


(అందరూ ఎడమ వైపుకు ఆతృతగా వచ్చి నిలబడ్డారు. నిశ్శబ్దం. వెనక నుంచి (కుడివైపు నుంచి) ఖాళీ స్ట్రెచర్లతో A, B లు వచ్చారు. 'సార్' అని A అనే సరికి అంతా తుళ్ళిపడి యిటు తిరిగారు. స్ట్రెచెర్ను చూసి పక్కకి తప్పుకొని తోవ యిచ్చారు. స్ట్రెచెర్ వెళ్లిపోయింది. డిస్పాచ్ రైడర్ (D. R.) లోపలికి వచ్చేశాడు. పరిగెత్తుకు వచ్చినట్టున్నాడు అలసట తెలుస్తోంది. వస్తూనే కల్నల్ కి సెల్యూట్ చేశాడు.


రావ్: యస్. ఏమయింది?


డి. ఆర్. సార్. మన వైపు అయిదుగురు పోయారు. శత్రువులు ముమ్మరంగా యుద్ధం ప్రారంభించారు. మరికొంత మందు గుండు కావాలట. మేజరు కుడి భుజం లోంచి గుండు దూసుకుపోయింది. పెద్ద బులెట్.


(అంతా ఒకరి ముఖం ఒకరు చూచుకొన్నారు)


రావ్: వేంటనే స్ట్రెచర్ అతనికి పంపించండి. అతన్ని ఆంబులెన్ కి స్ చేరవెయ్యాలి. క్విక్.


డి. ఆర్. కాని వెనక్కు రావడానికి మేజర్ ఇష్టపడడం లేదుసార్! ఎలాగో తుపాకీ పట్టుకుంటున్నారు. మందుగుండు త్వరగా వెళ్లాలి.


రావ్: మనుషుల్ని పంపాలా?


డి. ఆర్: ఆక్కర లేదన్నారు.


నాయక్: స్థావరం నిలుస్తుందా?


డి ఆర్. (అతన్ని చూసి నవ్వాడు ఆ నవ్వు అందరికీ అర్థమయింది.)


రాయ్: పొనీ, ఎంతసేపటివరకు నిలుస్తుంది?


డి. ఆర్: అర్థరాత్రి వరకూ నిలపగలమని మేజర్ చెప్పమన్నారు సార్.


సింగ్: అటు వైపు బలం ఎలా వుంది?


డి. ఆర్: అయిదువందలు పైన. మంచూరియన్ సోల్జర్స్ వచ్చారని తెలిసింది. ఒక చైనా సైనికుడి శవం దొరికింది దానిని బట్టి గుర్తించారు. అటు వైపు 100 మంది పైగా పడిపోయారు. రాత్రి ఆగేటట్టులేదు. వెన్నెల తోడుగా ఉంది.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

రాయ్: (పొడి పొడిగా చెప్పారు) మూడో స్థావరానికి ట్వెంటీటూ ఇన్ఫంట్రీ ప్లాటూన్ వచ్చింది. దాదాపు 500 మంది సైనికులు. మేజరు కి నా best wishes చెప్పు. అవసరమైనవన్ని వెంటనే పంపిస్తాం. (నిర్ధారణగా) ఇంకో స్థావరం సిద్ధంగా ఉందని చెప్పు.


రాయ్: (ఆశ్చర్యంతో) కాని కల్నల్ —


రావ్: షటప్! (మళ్ళి) రెండో స్థావరం సిద్ధంగా ఉందని చెప్పు. ప్రధాన మంత్రి దగ్గర్నుంచి ఓ పావుగంట క్రితం సందేశం అందింది. దేశం మన ధైర్య సాహసాలకు ప్రశంసల్ని యిస్తోందని చెప్పమన్నారు. దట్సాల్, టీ కావాలా?


డి. ఆర్. యస్ సార్. (తన వీపుకి ఉన్న సంచిలోనుంచి 'మగ్' తీసి పట్టుకున్నాడు')


రావ్: నాయక్! (పిలిచాడు)


నాయక్: (కుడివైపు నుంచి వచ్చి) యస్ సార్?


రావ్: టీ


నాయక్: యస్ సార్. (వెళ్ళి ఒక్కక్షణంలో టీ కెటిల్ తో వచ్చాడు.. డి. ఆర్. చేతిలోని మగ్ లో పోశాడు. రెండు కప్పుల టీ తాగి 'మగ్'ను బాగా దులిపి మళ్ళీ సంచిలో పడేసుకున్నాడు).


రావ్: త్వరగా వెళ్ళు. Good luck! (సెల్యూట్ అందుకున్నాడు. డి.ఆర్. వెళ్ళిపోయాడు).


నాయక్: (తిరిగివెళ్తూ కల్నల్ ) టీ సార్?


రావ్: Please! ఒక్కసారి ఆ మూగ షెర్పాను పిలువు. క్విక్ (నాయక్ వెళ్ళాడు, రావ్ మాప్ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తూ నిలబడ్డాడు. నిశ్శబ్దం).


రాయ్: పన్నెండు వరకూ మొదటి స్థావరం నిలబడుతుంది.


నాయర్: పన్నెండు-అంటే (వాచీ చూసుకొని) దాదాపు మూడు గంటలు.


సింగ్: (ముందుకు వచ్చి) కల్నల్ సాబ్- నేను మొదటి స్థావరానికి వెళ్తాను.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

రావ్: (మాపు చూస్తున్నవాడు యిటు తిరిగి) ఊఁ. వెళ్లనవసరం లేదు. సమయం వస్తే చెప్తాను.


నాయర్: మన ప్రోగ్రాం ఏమిటో చెప్పండి కల్నల్ సాబ్ !—ఈలోగా సిద్ధపడవచ్చు దేనికైనా?


రావ్: (కాస్సేపటికి మాప్ ని చూపుతూ చెప్పాడు) Now gentlemen, (చూపుతూ) ఇది మొదటి స్థావరం. ఇక్కడ రెండు, అంటే ఇది (తాము ఉన్న ప్రాంతం); మూడవది మరి రెండు ఫర్లాంగుల క్రింద. మొదటి రెండు స్థావరాల మథ్య దూరం మైలు. మొదటి స్థావరం పన్నెండు వరకూ నిలబడుతుందని మేజర్ చెప్పారు. (వాచీ చూచుకొని) అవును, మరి మూడు గంటల్లో శత్రుసైన్యాలు యిక్కడికి వస్తాయి.


నాయర్: (nervous గా) వస్తే—


రావ్: (నవ్వి, అతని పరిస్థితిని గమనించి దగ్గరికి వచ్చాడు) లెప్టనెంట్!


నాయర్: (attention కి వచ్చి) యస్సార్.


రావ్: వస్తే ఏంచెయ్యాలో మీరు నాలుగేళ్ల క్రిందటే నేర్చుకువుంటారు. మీరు ఏ బెటాలియన్?


నాయర్: సిక్స్-ఏ. కేప్టన్ రాయ్- బెటాలియన్ (రావ్ అతడివైపు చూస్తే అతనూ attention లోనికి వచ్చాడు).


రావ్: పెళ్లయిందా?


నాయర్: (నవ్వేడు)


రావ్: నవ్వుకి అర్థం మరచిపోయి చాలా రోజులయింది, లెప్టనెంట్! పెళ్లయిందా?


నాయర్: లేదు సార్.


రావ్: ఆల్ రైట్ (మళ్ళా అంతా పటము దగ్గరికి వచ్చారు) రెండేరెండు మార్గాలు ఉన్నాయి మనకు. ఒకటి:  ఇక్కడే, ఇక్కడే నిలిచి మనం నలుగురం శత్రు సైన్యాలను అర్ధరాత్రి ఎదిరించడం. రెండు: వెళ్ళి మూడో స్థావరం చేరుకోవడం.


రాయ్: (తొందరపడి) రెండవ స్థావరాన్ని నిలపడానికి వృధాగా ప్రయత్నించడం కంటే, వెళ్ళి మూడవ స్థావరం బలపరచడం మంచిదికాదా కల్నల్ సాబ్. రావ్ తనవైపు ఒక్కసారి తల తిప్పాడు, తన అసందర్భపు ప్రసంగాన్ని గుర్తించి) excuse me!


రావ్: That's alright


నిశ్శబ్దం

🇮🇳

*సశేషం*


꧁•━┅┉━━☆꧂

*వందే మాతరం - 3*

💪


రచన : గొల్లపూడి మారుతీరావు



సింగ్: కల్నల్ సాబ్! నేను మొదటి స్థావరానికి వెళ్తాను.


రావ్: (అతన్ని చూసి) ఊఁ. ( మళ్లి మాపు దగ్గర నిలిచి చెపుతున్నాడు). మనకున్న రెండు మార్గాల్లో దేన్ని అనుసరిస్తే ఏ ఫలితాలు ఉంటాయో తేల్చుకోవడం మంచిది. ఒకవేళ మొదటి స్థావరం పడిపోతే, ఇక్కడే మనం శత్రువుల్ని ఎదుర్కోవడం వల్ల ఒక లాభం ఉంది. ఈ వ్యవధిలో మూడవ స్థావరం బలం కూడదీసుకుంటుంది. అక్కడికి తెల్లవారే లోగా మన దళాలూ, మందుగుండు చేరుతుంది. రెండో స్థావరాన్ని మనం నలుగురం తెల్లవారేవరకు నిలిపితే మూడవ స్థావరంలోని ప్రయత్నాలకి కొంత వ్యవధి ఇచ్చినట్టవుతుంది. మనం నలుగురం ఎలాగూ శత్రువుల్ని ఓడించలేం. మనం చెయ్యగల్గినదల్లా వీలయినంత ఎక్కువసేపు ఇక్కడ వాళ్ళని ఆపగలగడం.


నాయర్: మూడో స్థావరానికి ఇప్పుడేవెళ్ళి చేరితే?


రావ్: చాలా నష్టాలున్నాయి. మనంతట మనం శత్రుబలానికి ఈ స్థావరాన్ని తొలగిస్తే అవకాశం ఇచ్చినట్టవుతుంది. తుపాకులు చంకన పెట్టుకొని నడిచివస్తారు మూడో స్థావరానికి. అక్కడి బలం కూడు కొనేలోగానే దాడి ప్రారంభమవుతుంది. వీటన్నిటికంటె మరో బలమైన కారణం ఉంది (ఆగాడు)


సింగ్: ఏమిటది?


నాయర్ ఏమిటది కల్నల్ సాబ్?


రావ్: మనంతట మనమే మన ధైర్యలోపం వల్ల శత్రువు చేతుల్లో ఈ మైలు భూ భాగాన్ని ఉంచినట్టవుతుంది. లెఫ్టనెంట్ అండ్ ఫ్రండ్స్ ! అక్కడ కనిపించేపర్వతాలు అడవుల వెనక ఒక దేశం తనని తాను పునర్నిర్మించుకొంటుంది. మరికొద్ది కాలం లో అక్కడొక కొత్త ప్రపంచం మనకు దర్శనమిస్తుంది. కాని ఆ మహెూజ్వల నిర్మాణాలకు పునాదులు ఈ మూల, ఈ మంచు శిఖరాల దగ్గర ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం వదులుకొనే ప్రతి అంగుళం భూభాగంతో పాటు కొద్ది కొద్దిగా మన స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, శ్రేయస్సును, సర్వస్వాన్ని వదులుకుంటు న్నామన్నమాట. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని జాతి ఎప్పటికి మేల్కొనదు. బానిసత్వం మనిషిని ఎట్లా నాశనం చేస్తుందో మనకు తెలుసు. ఫ్రెండ్స్- మనం రెండవ స్థావరాన్ని వదలి పోవడం వల్ల శత్రువులకి అనాయాసంగా ఇన్ని గజాల భూభాగం అధీనమవుతుంది. అంతే కాదు, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వాళ్ల అధీనమవుతాయి. మన దేశ సౌభాగ్య శ్రేయస్సులు వాళ్ల చేతుల పాలవుతాయి. మన ప్రాణాలు ముఖ్యమో, దేశ రక్షణ ముఖ్యమో ఈ క్షణంలోనే తేల్చుకోవాలి. వ్యక్తి ముఖ్యమో, దేశం ముఖ్యమో ఇప్పుడే ఇక్కడే నిర్ణయించుకోవాలి. ఇప్పటి మన నిర్ణయంమీద ఒక దేశపు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు చెప్పండి మనమేం చేయాలో ?


(వాళ్లు మాట్లాడే లోపున స్ట్రెచర్ లో మరొక వ్యక్తిని రెడ్ క్రాస్ వర్కర్స్ తీసుకువెళ్తున్నారు.)


హవల్దార్ 60672. కాలులోంచి రెండు బులెట్స్ దూసుకుపోయాయి.


కల్నల్ రావ్: ప్రాణం ఉందా ?


ఎ: యస్ సార్.


రావ్, (దగ్గరికి వచ్చి) మిస్టర్ రాం, (స్ట్రెచర్‌లో ఉన్న వ్యక్తి కదిలాడు) దెబ్బ బాగా తగిలిందా ? (లేదని తలూపాడు) భయపడకు. త్వరగా కోలుకుంటావు. కంగ్రాచ్యులేషన్స్- (A తో) Please take him (స్ట్రెచర్ వెళ్లిపోయింది. ఇటు తిరిగేసరికి ముగ్గురూ nervous గా అతని వైపు చూస్తున్నారు) ఏమంటారు?


సింగ్: ఇక ఇప్పుడు మనకి ముందు వెనకల ప్రసక్తి లేదు కల్నల్. ఇప్పుడూ, ఎప్పుడూ మేం సిద్ధమే, ముందుకు వెళ్లమన్నా మేం సిద్ధం.


రావ్: థాంక్స్. ఏమంటావు లెఫ్టనెంట్ ?


నాయర్: (నీళ్ళు మింగాడు. attention కి వచ్చాడు) నేను రెడీ సార్. మీ ఆర్డర్స్ కి సిద్ధంగా ఉన్నాను. (కాని గొంతులో సంశయం, ఓ విచిత్రమయిన సందిగ్ధత తెలుస్తోంది.)


రావ్: కేప్టెన్ రాయ్!


రాయ్: కల్నల్ సాబ్! మీ అభిప్రాయం అర్ధమయింది. ఎప్పుడు తుపాకీ ఎత్తమన్నా మేం సిద్ధమే. కాని మరొక్కసారి ఆలోచించండి. మనం నలుగురం. అటువైపు నాలుగు వందలో, ఎనిమిది వందలో తెలియదు. అటువైపు టాంకులు కూడా వచ్చాయని విన్నాం. మనం బలాలు కూడదీసుకునే వరకూ ఆగడం, సమయాన్ని చూసి ఎదుర్కోవడం మంచి ఎత్తుగడ అవుతుంది. ఇప్పట్లో మూడో స్థావరానికి తరలిపోతే— (సింగ్ బయటికి చూస్తున్నవాడల్లా ఇటు తిరిగాడు హఠాత్తుగా)


సింగ్: కల్నల్ సాబ్, మళ్లీ డిస్పాచ్ రైడర్.


డి.ఆర్: (ఊపిరి తిరగకుండా వచ్చాడు. సెల్యూట్ చేశాడు.) ఆరుగురు పోయారు సార్. (టోపీ తీసి చేత్తో పట్టుకొని) మేజర్ పోయారు. కుడివైపు బులెట్ బలంగా తగిలింది. (అందరూ టోపీలు తీశారు. నాయర్ ముఖంలో భావం చెప్పడం సాధ్యం కాదు. మొదట సింగ్ తేరుకున్నాడు)


సింగ్: ఇప్పుడెవరు నడుపుతున్నారు సైన్యాల్ని ?


డి.ఆర్: కేప్టెన్ దౌలత్య్రం, కేప్టెన్ శేఖర్.


రాయ్: అటువైపు పరిస్థితి ఏమిటి?


డి.ఆర్: మూక ఉమ్మడిగా మీదపడుతు న్నారు. అయితే మనవారి తాకిడికి చాలామంది కూలిపోతున్నారు. 


రావ్: మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు?


డి.ఆర్: 12


రావ్: మందుగుండు ఇంకా కావాలా?


డి.ఆర్: వద్దన్నారు సార్.


రావ్: ఎంతకాలం పోస్ట్ నిలుపుతామన్నారు?


డి.ఆర్: రెండు గంటలని కేప్టెన్ చెప్పమన్నారు. కాని ఇంకా దళాలు అటువైపు చేరుతున్నట్టు తెలుస్తోంది.


రావ్: That's alright. మరో రౌండు వెళ్లగలరా?


డి.ఆర్: (విరామం) యస్ సార్.


రావ్: Please.


డి.ఆర్: ఏమైనా చెప్పాలా సార్ ?


రావ్: (అందర్నీ చూసి ఏమిలేదు. (డి.ఆర్. వెళ్లబోయాడు) చూడు. (ఆగాడు) ఇది నీ చివరి Trip.


డి.ఆర్: థాంక్యూ సార్. (తొందరగా వెళ్ళాడు)


(దూరంగా తుపాకుల శబ్దం వినిపించింది ఒక్కక్షణం నిశ్శబ్ధం. నాయక్ వచ్చి అందరికీ టీ పోస్తున్నాడు. అక్కడున్న అందర్లోకీ అతనే ముసలివాడు)


రావ్: (తన దగ్గరికి వచ్చి టీ పోస్తూంటే) నాయక్ ! మా అందర్లోకీ నువ్వే పెద్దవాడివి. ఎన్ని యుద్ధాలు చూశావు నువ్వు?


నాయక్: (attention కి వచ్చి) ఇవి మూడవది సార్?


రావ్: దేశంకోసం చచ్చిపోయిన వాళ్లని చూశావా నాయక్ ? (అందరూ తుళ్లిపడి చూస్తున్నారు)


నాయక్: (నవ్వి) యస్ సార్.


రావ్: ఎలా వుంటుంది ఆ అవకాశం?


నాయక్: ఆ అదృష్టం అందరికీ వస్తుందా సార్-ఇక్కడికి వచ్చే ప్రతీ వ్యక్తి గర్వంతో, మహదానందంతో ఉంటాడు. నాకు 50. నా చేతుల్లో అయిదుగురు నవ్వుతూ ప్రాణం వదిలారు. టీ సార్!


రావ్: థాంక్స్. మేజర్ శివప్రసాద్ చచ్చిపోయారు.


నాయక్: (విని, టోపీ తీశాడు) చాలా అదృష్టవంతుడు సార్.


రావ్: ఇక మరో గంటలో శత్రువులు ఇక్కడ ఉంటారు. మాకింకా టీ ఇస్తావా నాయక్?


నాయక్: చివరి క్షణం వరకూ ఉండమన్నా సిద్ధం సార్.


రావ్: (నవ్వి, లేచి అతని భుజం తట్టాడు) వద్దులే. నువ్వు మూడో స్థావరానికి వెళ్ళు. ఈ కెటిల్ లో టీ చాలు మాకు. వెళ్లి రెండో స్థావరం తెల్లవారే వరకు నిలబడుతుందని అక్కడివాళ్లతో చెప్పు. బహుశా వస్తే కేప్టెన్ రాయ్ వాళ్లలో చేరుతారేమో.


రాయ్: (ఆ మాట వినడంతోటే ఉద్రిక్తుడై, చటుక్కున లేచి నిలబడ్డాడు) కల్నల్ సాబ్ ! క్షమించండి. నేనూ ఈ స్థావరంలోనే ఉంటాను. నేను వెళ్ళను.


రావ్: ఐసీ-మిష్టర్ నాయర్ !.మీరో-


నాయర్ : మీతో కలిసి పనిచేయడం నా అదృష్టం కల్నల్ సాబ్-నేనూ వెళ్ళడంలేదు.


రావ్ : వెళ్ళాలన్నా వెళ్ళలేరు మీరు- (నాయక్ వైపు తిరిగి) ఇది నువ్విచ్చిన చివరి టి నాయక్. వెళ్ళి మూడవ స్థావరములో చేరు. పగటి వెలుగును మళ్ళీ చూస్తే నిన్ను కలుస్తాం. ఇక్కడున్న నలుగురి శరీరాల్లో చివరి రక్తంబొట్టు నిలిచే వరకూ మూడో స్థావరం వైపు శత్రువు తలెత్తి చూడలేడని చెప్పు అక్కడి వాళ్ళతో..


నాయక్ : యన్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్.

🇮🇳

*సశేషం*


꧁┅┉━━☆꧂

*వందే మాతరం - 4*

💪


రచన : గొల్లపూడి మారుతీరావు



నాయక్ : యన్ సార్. ఐవిష్ యూ గుడ్ లక్.


(చెయ్యి జాస్తాడు. కల్నల్ తో కరస్పర్శ చేశాడు. సింగ్ దగరికి వెళ్ళి) ఐ విష్ యూ సక్సెస్ సార్. ( కెప్టెన్ దగ్గరికి వచ్చికరస్పర్శ) గుడ్ కెప్టెన్-(తరువాత నాయర్ చెయ్యి పుచ్చుకొని భుజం తట్టాడు. తరువాత కల్నల్ వైపు తిరిగాడు.)


నాయక్ : అందులో మరి నాలుగు కప్పుల టీ ఉంది సార్!


రావ్: థాంక్యూ-


(సెల్యూట్ చేసి కుడివైపు వెళ్ళిపోయాడు నాయక్. అటువైపు అందరూ చూస్తున్నారు. ఖాళీ స్ట్రెచర్ ఎడమవైపు వెళ్ళింది.)


సింగ్ : (ఉన్నట్టుండి) Excuse me, Sir, నేను మొదటి స్థావరానికి వెళ్తాను.


రావ్: (తలెత్తి) ఊఁ.


నిశ్శబ్దం.


రావ్: (సిగరెట్టు వెలిగించి మీకు పిల్లలా కెప్టెన్?


రాయ్: ముగ్గురు సార్. నిన్ననే కొడుకు పుట్టాడని తెలిసింది.


రావ్ : ఓహ్ ! కంగ్రాచ్యులేషన్స్.


రాయ్: థాంక్స్. నవ్వాడు. ఆ నవ్వులో అర్థం అందరికీ బోధపడింది.


రావ్: మీకు, మేజర్ ?


సింగ్: నాకెవ్వరూ లేరు సార్. దేశం తప్ప 'నాది' అని చెప్పుకోదగ్గది ఏమీ లేదు.


రావ్: ఐసీ.


సింగ్ : బ్రతకడానికి, చచ్చిపోవడానికీ నాకున్నంత స్వేచ్ఛ, అధికారం ఇక్కడ ఉన్న ఎవరికీ లేదనుకుంటాను. భార్యా, పిల్లలు, ప్రేమ, అభిమానం- ఇవన్నీ నాకు తెలీని కొత్త పదాలు.


రావ్ : నాయర్ ! మీరు ?


(అందరూ అతన్ని చూశారు.)


నాయర్: (నవ్వాడు)


రావ్ : (టేబులు దగ్గరికి వచ్చి, ఒక ఉత్తరం తీసి) ఈ ఉత్తరం మీదే కదూ ?


నాయర్ : (ముఖం ఎరుపెక్కింది) యస్ సార్.


రావ్ : ప్రేమ గురించి మాకేం తెలీదు- (నవ్వుకొని) యుద్ధం ముగిస్తే పెళ్ళి చేసుకుంటారా?


(నాయర్ : (నవ్వి) యుద్ధం ముగిస్తే కాదు సార్-ఈ రాత్రి గడిస్తే—


(అందరూ తుళ్ళిపడ్డారు ఆ మాటకి. రావ్ కి ఒక్కసారిగా ఆ మాటల్లో అర్థం తెలిసివచ్చింది.)


రావ్ : వెల్, థాంక్యూ ! (అన్నారు)



(మొదటిసారి డి ఆర్. వచ్చి వెళ్ళాక మూగ షెర్పా మందు మందుగుండు ఇచ్చేశానని సంజ్ఞ చేశాడు. 'యుద్ధం జరుగుతోందా?' గుండు పట్టుకు ఎడమవైపు కెళ్ళాడు. అతనిప్పుడు తిరిగివచ్చాడు అని కల్నల్ అడిగాడు. చైనా సైనికులు వందలాది మంది మీదపడుతున్నారని, మనవాళ్ళు తుపాకులు గురి చూసి కాలుస్తున్నారని సంజ్ఞలతో చెప్పాడు. అది చెప్పేటప్పుడు అక్కడ ఉన్న ఒక తుపాకీ ఎత్తి కల్నల్ వైపు గురి చూసి ఉంచాడు. అంతే. హఠాత్తుగా బయట ఎక్కడో గ్రెనెడ్ ప్రేలింది. ఆ శబ్దానికి అంతా ఉలికిపడ్డారు. కల్నల్ రావ్ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. మూగ షెర్పా నుంచి కోపంగా రాయ్ తుపాకీ లాగుకొన్నాడు. ఒక కప్పులో టీ పోసి రావ్ వాడికి అందించాడు. వాడు వంగి సలాంలు చేస్తూ కుడివైపుకి వెళ్ళాడు)


సింగు: (ఇదంతా గమనిస్తున్నాడు) ఈ షెర్పాను క్వార్టర్ మాస్టర్ పంపలేదు కల్నల్  సాబ్-అది మరిచిపోతున్నారు మీరు.


రాయ్: అవును కల్నల్ సాబ్. మన దగ్గరికి వచ్చి రెండు నెలలే అయింది.


నాయర్: కాని వాడి పట్టుదల, ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పాపం, ఎక్కడి వాడో తెలీదు. ఇక్కడ మనతో పాటు ఈ చలిలో, ఈ మూల ప్రాణాలకు తెగించి పాటుపడుతున్నాడు.


(రావ్ నవ్వి ఏదో చెప్పబోయేలోగా డి.ఆర్. పరిగెత్తుకు వచ్చాడు. అంతా లేచి నిలబడ్డారు. అతని నుదుటిమీంచి రక్తం కారుతోంది. ఆతను మాట్లాడే సమయానికి ఇటువైపు షెర్పా కూడా వచ్చి టీ తాగుతూ నిలబడ్డాడు. కల్నల్ కి సెల్యూట్ చేశాడు డి.ఆర్.)


రావ్: యస్.


డి.ఆర్: ఇక నలుగురు మాత్రం ఉన్నారు కల్నల్ సాబ్. కేప్టెన్, మరి నలుగురు హాండ్ గ్రెనేడ్ తాకిడికి కూలిపోయారు. వెనక నుంచి హఠాత్తుగా పేలింది.


నాయర్ మీతల కేమిటి ?


రావ్ : షటప్... Proceed


డి.ఆర్: మరి అరగంటవరకూ స్థావరం నిలబడవచ్చునని కెప్టెన్ ప్రసాద్ చెప్పమన్నారు మిమ్మల్నింక సిద్ధం కమ్మన్నారు. రెండవ స్థావరానికి చైనా దళాలు బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాయి. రాత్రి యుద్ధం ఆగేటట్టు లేదు.


రావ్: ఎంతసేపు పడుతుంది సైన్యాలు రావడానికీ ?


డి.ఆర్: చాలా త్వరగా వస్తున్నారు. 20 నిముషాలు లేదా 30 మించదు.


రావ్ : ఆ నలుగురూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుస్తారా?


డి.ఆర్: వెనక్కి రామన్నారు.


రావ్: వెనక్కి వస్తే అక్కడి స్థావరాన్ని మొదట ధ్వంసం చెయ్యమని చెప్పావా?


డి.ఆర్: యస్ సార్.


రావ్: మందుగుండు అక్కడేం మిగల్లేదా ?


డి.ఆర్: లేదు సార్.


రావ్: ఇంకా ఓపిక ఉందా ?


డి.ఆర్: (నీరసంగా ఉన్నాడు. అయినా విధి నిర్వర్తింపు గుర్తుంది) యస్ సార్ (ముఖంమీద రక్తం ఇప్పుడు తుడుచుకొన్నాడు)


రావ్: (రాయ్ వైపు తిరిగి) aid please.


(ఇప్పుడొక చిన్న చీటీ కల్నల్ కి అందించాడు డి. ఆర్. రాయ్, నాయర్ కలిసి అతనికి first aid box తీసి కట్టు కడుతున్నారు. రామ్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. చురుకుగా ఉత్తరువులు చేస్తున్నాడు.)


రావ్: డిస్పాచ్ రైడర్ ! మొదటి స్థావరానికి వెళ్లే డ్యూటీ అయిపోయింది. శత్రువును ఎదుర్కోడానికి రెండవ స్థావరం ఇక సిద్దంగా ఉంది. ఈ రాత్రంతా రెండవ స్థావరం నిలుస్తుందని మూడో స్థావరానికి వెళ్లి చెప్పు. వెంటనే మొదటి స్థావరం వివరాలు హెడాక్వార్టర్స్ కి వెళ్ళాలి. 22 మంది చివరి క్షణం వరకూ పోరాడిన వర్తమానం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ కి తెలియపరచాలి. మాకు ఇక్కడ ఉన్న మందుగుండు చాలు. మూడో స్థావరం బలం మాకు ఎప్పటికప్పుడు తెలియాలి. (షెర్పాను ఇప్పుడు చూసి ఒక్క క్షణం ఆగాడు) ఈ షెర్పా మాతోటే ఉంటాడు. ఏదైనా అవసరమయితే ఇతని ద్వారా పంపవచ్చు.


డి.ఆర్: (కట్టు కట్టించుకుంటూనే) అతని నెంబరు ఎంత సార్ ?


సింగ్: రెగ్యులర్ సర్వీస్ మెన్ కాదు.


రావ్: రెండు నెలల కిందట చేరాడు. క్వార్టర్ మాస్టర్ జనరల్ లిస్టులో పేరుంటుందిలే. ప్రొసీడ్- (ఆ మాట వినగానే ఇంకా  పూర్తి కాకపోయినా, కట్టుని ఒక చేత్తో పట్టుకొని, సెల్యూట్ చేసి వెళ్లిపోయాడు డి. ఆర్.)


(సింగ్ లేచి తుపాకీ తీసి కల్నల్ కి ఇచ్చాడు. కల్నల్ దాన్ని నాయర్ వైపుకి విసిరాడు. సింగ్ రాజ్ కి తుపాకీ ఇచ్చాడు. కల్నల్ తనది తీసుకొన్నాడు. ఈ సమయం లో స్ట్రెచెర్ తో రెడ్ క్రాస్ వర్కర్స్ ఎడమ వైపు నుంచి వచ్చారు. దుప్పటి మీద రక్తం మరకలు కనిపిస్తున్నాయి. మనిషి ఆకారంలో కాక, చెదిరిన శరీరపు భాగాలు దుప్పటి మీద తెలుస్తున్నాయి. కల్నల్ ని చూసి ఆగారు.)


రావ్: యస్ ?


ఏ నెంబరో తెలియలేదు సార్ - గ్రెనేడ్ దెబ్బ తిన్న సోల్జర్ శరీరం తునాతునకలయింది. అక్కడక్కడ భాగాలు మాత్రం దొరికాయి. గుర్తింపుకు తీసుకువెళ్తూన్నాం.


(ఆ దృశ్యం చూడలేక అందరూ ముఖం కప్పుకున్నారు. నాయర్ ఏడ్చేస్తాడేమో నన్నంత పనిచేశాడు. కల్నల్ రావ్ వచ్చి వచ్చి భుజం తట్టాడు. తేరుకుని 'యస్ సార్' అన్నాడు. మాప్ దగ్గరికి రావ్ వచ్చి దాని అంచులు చించి జేబులో దోపుకున్నాడు. ఫైళ్లకు అగ్గిపుల్ల తీసి నిప్పంటించాడు. అక్కడ ఉత్తరాన్ని చూపి నాయర్‌ను చూశాడు. నాయర్ నిశ్శబ్ధంగా అక్కడికివచ్చి ఒక్కసారి ఉత్తరం విప్పి చూసుకొని ఫైళ్ల మంటలో పడేశాడు. దూరాన పట్టణంలో ఏవో నినాదాలు వినిపిస్తున్నాయి. పాట తెలుస్తోంది. 'వందే మాతరం' పాడుతున్నారు. అటువైపు ఫిరంగుల మోత గట్టిగా వినిపిస్తోంది. అంతా టోపీలు పెట్టుకొని, బెల్టులు సరిచేసుకున్నారు.) 

🇮🇳

*సశేషం*

*వందే మాతరం - 5*

💪


రచన : గొల్లపూడి మారుతీరావు



రావ్: వెల్? —(అనేసరికి అందరూ attention లో నిలబడ్డారు-సిద్ధంగా, మెల్లగా గొంతు కూడదీసుకొని మాట్లాడాడు) దేశంలో పుట్టిన కోట్లాది మందిలో ఏ కొద్దిమందికో లభించే అరుదైన అవకాశం మనకు లభిస్తుంది. కొన్ని సహస్రాబ్దాల సంస్కృతిని, ఔన్నత్యాన్నీ రక్షించే బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యతను మనం సరిగా నిర్వహించక పోతే, ఈ అశ్రద్ధకి ఏమీ ఎరగని ముందు తరాలు శిక్షను అనుభవించవలసివస్తుంది. మనం ఓడ్చే ప్రతి రక్తపు బొట్టూ మన శ్రేయస్సుకీ మన కుటుంబ శ్రేయస్సుకీ కాదు. ముందు తరాలవారి శ్రేయస్సుకి, అసమాన సమాజ భవిష్యత్తుకి. ఫ్రెండ్స్! మనం ఇక్కడ నలుగురం ఉన్నాం. కొన్ని సంవత్సరాల కర్తవ్య నిర్వహణ, దీక్ష ఫలితంగా ఈ స్థలము, ఈ పదవిలో నిలబడే అర్హత మనకు కలిగింది. ఈ అర్హతను మనం కాపాడుకోవాలి. ముందు తరాలవారు మన ధైర్య సాహసాలకు వారసులు కావాలిగాని, మన పిరికి తనానికి కాదు. మరొక క్షణంలో కొన్ని వందలమంది మనల్ని ఎదుర్కోబోతారు. కొన్ని వందల తుపాకులు మన ధైర్య సాహసాల్ని సవాలు చేస్తాయి. తెల్లవారే వరకూ ఈ స్థావరాన్ని నిలపడం మన బాధ్యత, మనకు తెలిసి, మన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఒక్క అంగుళం భూమి శత్రువుకు దక్కకూడదు. మనం వారినందరినీ జయించలేకపోవచ్చు. కాని మన శవాలమీది నుంచే వారికి ముందడుగు పడాలి. ఒక్క విషయం అందరూ రూఢి చేసుకోండి. ఏ క్షణాన్నయినా మృత్యువుకు సిద్ధపడి, విజయాన్ని దృష్టిలో వుంచుకుని తుపాకులు ఎత్తి వున్నాం మనం. అందుకు సిద్ధమేనా మీరంతా ?


సింగ్: యస్ సార్.


రాయ్: యస్ సార్.


నాయర్: యస్ సార్.


(బయట 'వందేమాతరం' నినాదాలు దగ్గరపడ్డాయి.)


రావ్: గుడ్, జాలీగుడ్!- Now. ఈ స్థావరాన్ని ఎదుర్కోటానికి శత్రువుకు రెండు మార్గాలున్నాయి. (ఎడమ చివరికి అందర్ని తీసుకువచ్చాడు) ఆ రెండు మంచు శిఖరాల మధ్య కనుమ నుంచి సైన్యాలు రావాలి, లేదా వాటిని చుట్టిరావాలి. కాని మధ్య నుంచే వస్తారని మన మ్యాప్ ల ద్వారా, డిస్పాచ్ రైడర్ ద్వారా తెలిసింది. అంటే కనుమ లోంచి ఒకరి తర్వాత ఒకరు రావాలి. అప్పుడు మనం నలుగురమే వాళ్లని ఎదుర్కోవడం సులభం అవుతుంది ఈ మార్గం వాళ్లకి సుగమం కాకుండా చేయ గలిగితే వాళ్లు చుట్టూ తిరిగి రావలసి ఉంటుంది. అందుకు కనీసం 48 గంటలు పడుతుంది. ఈలోగా రెండవ స్థావరాన్నే మనం బలం చేసుకోవచ్చు. రైట్? —


సింగ్: చాలా మంచి ప్రయత్నం కల్నల్ సాబ్!


రావ్: (విరామం. మెల్లగా) మొదట ఈ ప్రాంతానికి—


సింగ్: నేను వెళ్తాను సాబ్.


రావ్: (తలెత్తి) ఊ. మీరేమంటారు కెప్టెన్?


(కెప్టెన్ రాయ్ ఒక్కక్షణం మాట్లాడలేదు. రావ్ సిగరెట్ వెలిగించి కుడిమూల ఉన్న first aid box సర్దుతున్నాడు. షేర్పా ముందుకువచ్చి నిలబడ్డాడు.)


నాయర్:  పాపం, నిన్ననే ఆయనకు శుభ వార్త తెలిసింది. పిల్లల విషయం తెలియని వాడిని నేను. పిల్లలే లేనివారు మీరు. మనాలో ఎవరో ఒకరు వెళదాం.


సింగ్ : (నవ్వి) నిజమేనా కేప్టెన్?


(రాయ్ మాట్లాడలేదు. నాయర్ చెప్పింది నిజమేనని రాయ్ ముఖం చెప్తోంది. సింగ్ గ్రహించి దగ్గరికి వచ్చి భుజం తట్టాడు)


సింగ్ : ఎంత ప్రయత్నించినా జీవితంలో తియ్యదనం మరుపుకురాదు. ఆల్ రైట్. మరికొంతసేపు మీరు ఆ తృప్తిని అనుభవి స్తూండండి. మీకు బదులు నేను వెళ్తాను. 


(ఎడమవైపు తిరగబోయేసరికి, కల్నల్ తుపాకిని షెర్పాకు గురి చూసి పేల్చాడు. షెర్పా చనిపోయాడు చైనా భాషలో అరుస్తూ. ముగ్గురూ త్రుళ్లిపడి ఇటు తిరిగే సరికి నేలమీద కొట్టుకొంటున్నాడు షెర్పా. అందరూ దిగ్భ్రమతో కల్నల్ ని చూస్తున్నారు. కల్నల్ ప్రశాంతంగా మరొక గుండును తుపాకిలో ఉంచుతున్నాడు.)


రాయ్ : సాబ్ !


సింగ్ : ఏమిటిది కల్నల్ సాబ్ !


(నాయర్ కిందికి వంగి షెర్పా తల ఎత్తాడు. కాని తల వాలిపోయింది. లేచి నిలబడ్డాడు)


నాయర్ : చచ్చిపోయాడు !


రావ్ : (కొంతసేపటికి మెల్లగా మాట్లాడాడు) మనలాంటి కమిషన్ ఆఫీసర్లను ఇంత సుళువుగా ఇతనెలా మోసం చేశాడా అని నా ఆశ్చర్యం. ఇంత నమ్మకంగా మనల్ని అంటిపెట్టుకొని, 24 గంటలు పనిచేస్తున్న ఈ మూగ షెర్ఫా మనకంటే బాగా మాట్లాడ గలడని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పమంటారా ?


సింగ్ : చెప్పండి.


రావ్: ఇతను చైనా గూఢచారి. రెండు నిమిషాల క్రితమే ఆ విషయం రూఢిగా తెలిసింది. నిన్న తుపాకీలు మోసుకుని తీసుకువెళ్తుండగా ఈ విషయం తెలిసింది. ఒక తుపాకీ జారి కాలుమీద పడ్డప్పుడు చైనా భాషలో ఏదో గొణుక్కున్నాడు. ఇతను మాటలాడగానే నాకు దిగ్భ్రమ కలిగింది. వెంటనే హెడ్ క్వార్టర్స్ కి రిఫర్ చేశాను. ముందు స్థావరానికి కూడా చెప్పి ఉంచాను. ఈ రాస్కెల్ మన తుపాకుల తోనే మనల్ని చంపిస్తున్నాడు.


నాయర్ : అదెలా తెలిసింది ?


రావ్: తెలుసుకోవడం చాలా సుళువు.


మన బులెట్సును మన తుపాకులతోనే పేల్చాలి. చైనా తుపాకులలో మన బులెట్స్ సరిపోవు. ఇందాక చచ్చిపోయిన ఇద్దరు సైనికుల శరీరాల్లో మన బులెట్సు దొరికాయి. అంటే మన తుపాకులు చైనా వారి దగ్గర ఉన్నాయన్నమాట. అవి ఎలా వెళ్ళాయి? వెంటనే నిన్న పంపిన తుపాకీల విషయం వాకబు చేశాను. వాటిలో కొన్ని అందలేదని డిస్పాచ్ రైడర్ చీటీ తెచ్చాడు. ఇంతకన్న మంచి సాక్ష్యం అక్కర లేదు. మనం చాలా మెలకువతో ఉండడంవల్ల ఈ ఆపద సుళువుగానే తప్పిపోయింది. ఫ్రెండ్స్ ! ఇది చాలా చిన్న విషయం. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మేజర్! ఈ శవం ఇలా వుండడం మంచిది కాదు.


(సింగ్, రాయ్ పట్టుకొని శవాన్ని కుడివైపుకి  ఈడ్చుకుపోయారు. రావ్ సిగరేట్లు తీసి ఒకటి నాయర్ కి ఇచ్చాడు. బయట "వందే మాతరం" నినాదాలు దగ్గర పడుతున్నా యి. ఇటువైపు ఫిరంగుల మోత ఎక్కువ వుతుంది. హఠాత్తుగా సింగ్, రాయ్ లు తొందరగా లోపలికి వచ్చారు. )


సింగ్ : కల్నల్ సాబ్! ఏదో ఊరేగింపు దగ్గరికి వస్తోంది.


రావ్ : ఇక్కడికా?


నాయర్: ఈ సమయంలోనా?


రాయ్: చాలామంది ఉన్నారు. దాదాపు వందమందికి పైగా ఉంటారు.


(ఎక్కడో గ్రెనేడ్ ప్రేలింది)


రావ్: ఫ్రెండ్స్! ఇకమనం జాగ్రత్తపడపలసిన క్షణం దగ్గరపడుతుంది. 


(బయట 'వందే మాతరం', 'భారత జవాను లకీ జై అన్న నివాదాలు, ఉన్నట్టుండి దాదాపు వందమంది లోపలికి వచ్చారు. “భారతావని వరిల్లాలి" అనే పెద్ద అక్షరాలు వ్రాసిన అట్టను ఇద్దరు రెండు ప్రక్కలా పట్టుకున్నారు. ప్రతి వ్యక్తి పెద్ద ఉన్ని శాలువను కప్పుకున్నాడు. ఒకరి చేతిలో పెట్రోమాక్స్ లైటు ఉంది. వీళ్ళందరికి ముందున్న తలనెరిసిన వ్యక్తి నాయకుడు. అతను చేతులెత్తి వెనుక వస్తున్న గుంపును ఆపాడు).


నాయ: మిత్రులారా! ఆగండి. అక్కడే ఆగండి.


(వాళ్ళు ఇటు తిరిగేసరికి నలుగురు ఆఫీసర్లు నాలుగు వైపులా నిలబడ్డారు. వెనుక నుంచి పదిమంది “భారత జవాను లకీ జై" అని అరిచారు)


రావ్: (మిగతా ముగ్గురి ముఖాలు చూసి, వీలయినంత సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు). ఫ్రెండ్స్! ఎందుకోచ్చా రిక్కడికి?


నాయ: మీకు మా కృతజ్ఞతలు చెప్పడానికి. దేశంలో ఈ మూల ఈ చివర అహో రాత్రాలు దేశ రక్షణకు ఒంటరిగా నిలిచిన మీరు నిజంగా ఒంటరులు కారని నిరూపించడానికి. మిత్రులారా! మీ వెనుక ఎంత బలం, ఎందరి విశ్వాసం అండగా ఉన్నదో చూపడానికి బయలుదేరి వచ్చాం చూడండి.


రావ్: ఇది చాలా విషమ సమయం. ఇలా యుద్ధం జరిగే స్థలానికి మీరు రావడం ప్రమాదం.


నాయ: (నవ్వాడు) దేశానికే ప్రమాదం వచ్చింది. మీరు మీకు వచ్చే ప్రమాదాన్ని లక్ష్యం చేయకుండా పోరాడటానికి సిద్ధపడ్డారు. మాకు తుపాకీ పట్టుకోవటం రాదు. కాని మా సానుభూతి, సహకారాల్ని ఈ విధంగానయినా ప్రదర్శించుకోవడానికి రావడం తప్పా? — (వెనక్కి తిరిగి) బోలో భారత్ జవానోంకీ- (జై అన్నారంతా)


రావ్: ఫ్రెండ్స్! ఈ పరిస్థితి మీకర్థంకాదు. ఇట్లా మీరు రావడంవల్ల, చెడెకాని, మంచి జరగదు. అక్కడ మొదటి స్థావరం కూలి పోతోంది. శత్రువు ఏ క్షణాన్నయినా ఈ స్థావరం మీద పడవచ్చు. వాళ్ళు వేలకొద్దీ మనుషులున్నారు. మీకు ఆయుధం పట్టడం తెలీదు. వాళ్ళు మీదపడితే ఇంత వరకూ మా ప్రాణాలదే మా బాధ్యత' కాని ఇప్పుడు మీ అందరినీ రక్షించవలసిన బాధ్యత మామీద పడుతుంది. దయచేసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోండి.


నాయ: దోస్తో ! — ఒకటి రెండు వాక్యాలు చెప్పి పోవటానికి వచ్చాం. ఇక్కడ మీరు ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న విషయం ప్రతి క్షణం అక్కడ వింటున్నాం. మిమ్మల్ని దేశం ప్రజలూ ఎన్నటికీ మరిచిపోరు. అడ్కడ మీ కుటుంబాలు ఒంటరిగా ఉన్నాయనుకోకండి. కొన్ని కోట్లమంది ప్రజల కోసం మీరు ఇక్కడ పోట్లాడుతున్నారు. అన్ని కోట్లమంది అండ మీ కుటుంబాలకు ఉంటుంది. దేశానికి బానిసత్వం దాపురించకుండా చూసే బాధ్యత మీది. మీవంటి నాయకులు నాయకత్వంలో మనకు అపజయం లేదు. ఎప్పటికయినా విజయం మనదే. బోలో భారత్ మాతాకీ జై — (అంతా జై అన్నారు) — భారత్ జవానోంకీ—


(ఇటుపక్క తుపాకులు పేలాయి. అందరు ఉలిక్కిపడ్డారు. వీళ్ళు ఉంటున్నకొద్దీ అంతా nervous అవుతున్నారు).


రావ్: ఫ్రెండ్స్— మీరు ఇక్కడ ఉంటున్న కొద్దీ భయంతో మా గుండెలు కూడా రెపరెపలాడుతున్నాయి. మా విషయం కాదు, మిమ్మల్ని ఎలా రక్షించాలా అని. దయచేసి వెళ్ళిండి. మీకు నమస్కారం చేస్తాను. త్వరగా వెళ్ళండి.


(ఇంతలో అందరి మధ్య నుంచీ ఓ పదేళ్ళ అమ్మాయి పళ్లెం పట్టుకొని వచ్చింది, అందరి దృష్టి ఆమె వైపు తిరిగింది. ఆమె ఆ నలుగురి ముందూ నిలిచి, పళ్లెం క్రింద ఉంచి నాలుగు మల్లెపువ్వుల దండల్ని నలుగురికి వేసింది. రాయ్ దగ్గరికి వచ్చేసరికి అతనామెను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. 'నీపేరేమిటమ్మా' అనడిగాడు. 'మైధిలి' అంది అమ్మాయి. తరువాత అందరికీ మిఠాయిలు ఇచ్చింది. మళ్లీ అంతా 'భారత్ జవానోంకీ జై' అన్నారు).

🇮🇳

*సశేషం*

*వందే మాతరం -6*

మళ్లీ అంతా 'భారత్ జవానోంకీ జై' అన్నారు.


రావ్: (ఈ చర్యకు కదిలిపోయాడు. ఒక్కసారి కళ్ళు తుడుచుకున్నాడు). ఫ్రెండ్స్- ఈ మీ సహృదయాన్ని ఎప్పటికీ మరిచిపోం. మా చేతిలో ఆయుధాలు నిలిచేవరకు మన దేశం వైపు ఎవరూ తలెత్తి చూడలేరని మాత్రం హామీ ఇవ్వగలం. 


(తుపాకులు, గ్రెనేడ్స్ ప్రేలాయి. వెంటనే సింగ్ వైపు తిరిగాడు) మేజర్- It is time – మీరు కనుమ దగ్గరికి వెళ్ళండి. ఒక్కొక్క భారతీయుడు వందమంది చైనావారికి సమాధానం చెప్పగలడని నిరూపించండి. Wish you good luck-(కరస్పర్శ చేశాడు.)


సింగ్—Thanks, Sir (రాయ్, నాయర్ లు కూడ ముందుకువచ్చి అతని కరస్పర్శ చేశారు. పౌర బృందానికి అతను నమస్కారం చేశాడు. వారంతా ఒక్క పెట్టున నినాదాలు చేశారు. సింగ్ ఎడమవైపు వెళ్ళాడు).


రావ్: ఇక మీరు త్వరపడాలి. ప్లీజ్!


నాయ: అవును. మీ పనికి అడ్డురాము. (వెనకకు తిరిగి) మిత్రులారా! పదండి. (మెల్లగా బృందం వెనక్కి తిరిగింది. మళ్ళి దూరంగా పాట వినిపిస్తోంది. బృందం మెల్లగా దూరమవుతోంది. రావ్ ఇంకా వారి సౌహార్ధం, సౌజన్యం నుంచి తేరుకోలేక పోతున్నాడు. మెడలోని మల్లె పువ్వులను వాసన చూసుకున్నాడు).


రావ్: కెప్టెన్— మంచితనం, సౌహార్ధం, మనిషిని ఎంత పిరికివాణ్ణి చేస్తాయి!  ఒక్క క్షణంలోనే మామూలు మనిషినైపోయాను.


నాయర్ : (నవ్వి) ఎప్పుడన్నా నేను మీ అంత కఠినంగా, కర్తవ్య దీక్షతో ఉండగలనా అనిపిస్తుంది కల్నల్ సాబ్. ఉండడం కాదు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకు ముందుకు దూసుకుపోవడమే కష్టమనిపిస్తుంది.


రాయ్: నిజమే కల్నల్ సాబ్ ! లెఫ్టినెంట్ చెప్పింది చాలా నిజం.


(రావ్ ఇటు తిరిగేసరికి ఓ విచిత్రమయిన దృశ్యాన్ని గమనించాడు. అక్కడ కుడివైపు మూలను ఓ సన్నటి వ్యక్తి బిక్కుబిక్కు మంటూ చూస్తూ నిలబడ్డాడు. వీళ్ళ మాటలు వింటూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇప్పుడు రావు తనని చూశాక మరీ భయపడుతున్నాడు. అందరూ అతన్ని చూశారు. ఆశ్చర్యపోయారు.)


రావ్ : ఎవరు నువ్వు?


(మొదట అతను మాట్లాడలేదు. బైటకు చెయ్యి చూపాడు. ఎవరికీ అర్థం కాలేదు. కొందరికి అనుమానం కలిగింది.)


రాయ్: నిన్నే - ఎవరు నువ్వు?


యువ : వాళ్ళతో వచ్చాను.


రావ్ : నీ పేరేమిటి?


యువ : విశ్వనాధ్.


నాయర్ : ఎలా వచ్చావిక్కడికి?


విశ్వ : ఇందాక వచ్చిన ఊరేగింపుతో.


రాయ్ : మరి వాళ్ళతో వెళ్ళిపోలేదేం?


విశ్వ : వెళ్ళలేదు.


రాయ్: ఎందుకని?


విశ్వ : వెళ్ళాలనిపించలేదు.


నాయర్ : అంటే?


విశ్వ : మీతో కలిసి పనిచేయాలని ఉంది. (ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.)


నాయర్ : మాతోటి! ఏం చేస్తావు నువ్వు?


విశ్వ : ఏం చేయమన్నా చేస్తాను. యుద్ధం చేస్తాను. నేనూ తుపాకీ ఎత్తగల్ను. చదువు కొనే రోజుల్లో నేర్చాను. కావలిస్తే—


(చటుక్కున ఎవరిదో తుపాకీ తీసుకోబోయాడు.) 


(ఇద్దరూ దూరంగా జరిగారు. కల్నల్ రావ్ అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వాళ్ళు దూరంగా జరిగితే బెదిరిపోయి ఆగిపోయాడు విశ్వనాథ్.)


రావ్: యుద్ధం చేస్తావా ! నువ్వు !


(అతన్ని చూశాడు. సన్నగా వేరులా ఉన్నాడు. అతన్ని చూసి నవ్వాలనిపించి నా నవ్వు రావడంలేదు. ఎందుకంటే ఆ వాక్యాల్ని నమ్మి, విశ్వసించి, నిర్థారణతో అంటున్నాడు విశ్వనాథ్.)


విశ్వ : అవును. యుద్ధం చేస్తాను. చచ్చిపోయినా ఫరవాలేదు. నా కెవరూ లేరు.


రావ్ : ఎవరూ లేనంతమాత్రాన చచ్చిపోవడం అందులోనూ ఇక్కడ చచ్చిపోవడం సుళువుగా సాధ్యంకాదు.


విశ్వ : నేను బలహీనంగా ఉన్నాను. అంతేగా మీ భయం? నేనూ తుపాకీ పట్టుకోగలను.


రావ్ : ఇదిగో నేస్తం నీకి విషయాల్లో ఏమీ పరిచయం లేనట్టు కనిపిస్తోంది. యుద్ధం చేయడం, శత్రువుని ఎదుర్కోవడం ఇలా సులభంగా సాధ్యమయే పనికాదు.


విశ్వ : మరి ఏం చేయాలి?


నాయర్ : మొదట నువ్విక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చేయాలని ఉంటే ప్రభుత్వం శిక్షణ యుద్ధంలో పని ఇస్తుంది. నాలుగైదే ళ్ళకు తరిఫీదు పూర్తవుతుంది. వెళ్లు. 


(ఇటుపక్క తుపాకులు పేలుతున్న శబ్దం- ఇంకా దూరంగా నినాదాలు వినిపిస్తున్నాయి.)


విశ్వ: నాకు వెనక్కి వెళ్లాలని లేదు. ఏదో నాకు తోచినట్టుగానే పోరాడనివ్వండి. శత్రువును ఎదుర్కొంటాను.


(ఖాళీ స్ట్రెచెర్ తో రెడ్ క్రాస్ వర్కర్స్ ఎడమ వైపుకు వెళ్లిపోయారు.)


రావ్: ఫ్రాన్సిస్!


A: యస్సార్.


రావ్: ఇక మీరు ముందుకు వెళ్లనక్కర లేదు. మొదటి స్థావరంలో మీ పని అయిపోయింది. మూడవ స్థావరం దగ్గరికి వెళ్లండి. అవసరమయితే పిలుస్తా.


A. యస్సార్. (వెళ్లిపోయారు)


రావ్: ప్రాన్సిన్!


బి. సార్.


రావ్: ఇతన్ని నువ్వెప్పుడయినా చూశావా? (వ్యక్తిని చూపాడు)


A: (గమనించి) లేదు సార్.


రావ్: మీ అంబులెన్సులో ఇతన్ని ఊరికి చేర్చండి. ఇందాకటి ఊరేగింపుతో వచ్చాడు. ఇక్కడ ఉండిపోయాడు.


(ఆ మాటలు వినగానే విశ్యనాథ్ పెద్ద కేకలు పెట్టడం ప్రారంభించాడు.)


విశ: నేను వెళ్లను, నేను వెళ్లను, (కల్నల్ వెనక్కి వచ్చి నిలబడ్డాడు. అతన్ని వదలడు. రాయ్, నాయిర్ తెల్లబోయి ఒక్క ఉదుటున వెళ్లి అతని చేతులు పట్టుకున్నారు. అతనింకా గట్టిగా గుంజు కుంటున్నాడు.) నేను వెళ్లను, నేను వెళ్లను. ఇక్కడే వుంటాను, నన్ను పంపేయకండి. మీకు దండం పెడతాను. 


రావ్: (బోధపరచబోతాడు.) నే చెప్పే మాటలు వినిపించుకో ముందు. తుపాకులు పేలితే నిలవలేవు, నువ్విక్కడ ఉండకూడదు. నా మాట విను-(ఇక వినక పోయేసరికి విసుగెత్తి, కోపం వచ్చి బలంగా చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకు యువకుడికి కళ్లంట నీళ్లు తిరిగాయి)


విశ్వ: (అయినా ఆగలేదు) నేను వెళ్లను, నేను వెళ్లను.


రావ్: (ఇటు తిరిగి A.B.లతో) సరే. మీరు వెళ్లండి. (ఇద్దరూ వెళ్లారు. బయట పెద్ద Van కదిలిన శబ్దం. అతన్ని వదిలివేయ మని సంజ్ఞ చేయగానే, రాయ్, నాయర్ వదిలేశారు. వదలగానే విశ్వనాథ్ వచ్చి రావ్ బట్టలు పట్టుకున్నాడు.)

🇮🇳

*సశేషం*

*వందే మాతరం -7*

💪

విశ్వ: (తొందరగా మాట్లాడాడు) నన్ను పంపెయ్యకండి. నేను వెళ్లిపోవడానికి రాలేదు. వెనక్కి పొమ్మంటే ఆత్మహత్య చేసుకుంటాను. నేనూ మీతో కల్సి దేశ సేవ చెయ్యడానికి వచ్చాను, నాకూ ఓ తుపాకి ఇవ్వండి. నేనూ పోరాడుతాను. నేను చచ్చి పోయినా బాధలేదు, ఎవరికీ బాధ లేదు. (ముగ్గురు నిస్సహాయులైపోయారు. ఏం చేయాలో ఆలోచించే లోగా మేజర్ సింగ్ తూలూతూ ఓ మహా ప్రవాహం లాగ వచ్చి అక్కడ బల్లమీద పడ్డాడు. అందరూ అదిరిపడ్డారు. కల్నల్ రావు చటుక్కున వరిగాడు. అందరూ కిందికి చూశారు.)

రావ్: మేజర్ ! ! ఏమయింది మీకు ? (కిందపడి ఉండే రక్తంతో ఉన్న చేత్తో సెల్యూట్ చేశాడు సింగ్.)

సింగ్: నాకేం పరవాలేదు కల్నల్ సాబ్ !- మీరు త్వరపడాలి. మరి 50 గజాల దూరంలో ఉన్నారు వాళ్లు. బ్రెన్ గన్సు ఉన్నాయి వాళ్ల దగ్గర. జాగ్రత్తపడండి.

(వెంటనే అతన్ని వదిలేసి లేచాడు రావ్, ఇద్దరు ఆఫీసర్లకు క్షణంలో ఆర్డర్లు ఇచ్చాడు.)

రావ్: కెప్టెన్ ! ఎడమ వైపు బి-6 సాండ్ బారియర్ వైపు మీరుండండి. లెఫ్టినెంట్! కుడివైవు మీరు, నేను పోస్ట్ వెనక ఉంటాను. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రాణాల తో శత్రువుకి దొరకకూడదు. ప్రాణం పోయే వరకూ స్థానాన్ని వదలకూడదు. క్విక్ మార్చ్! విష్ యూ దిబెస్ట్-(తనూ త్వరగా తుపాకి తీసుకొని వెళ్లిపోతూండాగా, విశ్వనాథ్ కనిపించాడు. ఇప్పుడు కొంపం

ఎక్కువయింది.) Get out. you fool (అని అతన్ని కుడివైపు ఈడ్చేశాడు. ఎడమవైపు పరిగెత్తాడు. ఇప్పుడు ఆ సమీపంలో తుపాకులు పేలుతున్నాయి. ఏవో చైనాభాషలో ఆర్డర్స్ వినిపిస్తున్నాయి. బల్లమీద ఉన్న సింగ్ ఒక్క క్షణం కదిలి తల వేలాడేశాడు. దూరాన భారత జాతీయ గీతం వినిపించింది.

రెండు క్షణాలు నిశ్శబ్దం.. బయట తీవ్రంగా పోరాటం జరుగుతున్నట్టుంది. మళ్ళీ విశ్వనాధ్ లోపలికి వచ్చాడు. బెదురుగా చుట్టు పక్కల చూస్తున్నాడు. వచ్చి సింగ్ ని చూశాడు. నిర్జీవంగా బల్లమీద ఆతని తల వేలాడుతుంది. కిందికి వంగేలోగా ఎవరో బయట నుంచి త్రోసినట్టు వచ్చి అతని మీద పడ్డాడు. విశ్వనాధ్ గావుకేక పెట్టాడు. తనమీద పడ్డ వ్యక్తి గాయాలతో ఉన్నాడు. కేప్టెన్ రాయ్. అతను నేలకు ఒరిగిపోయే లాగ ఉన్నాడు. విశ్వనాధ్ ను చూడగానే లేచి ఓపిక తెచ్చుకొని నిటారుగా నిలబడ్డాడు. సెల్యూట్ చేశాడు. ఏదో మాట్లాడుతున్నాడు.

రాయ్ : చివరివరకూ...పోరాడుతూనే ఉన్నాను కల్నల్ సాబ్-ఇదిగో తుపాకీ, దీన్ని వదల్లేదు. నేను వెనక్కి పారిపోలేదు కల్నల్ సాబ్-నా పిల్లలకోసం పారిపోలేదు, ఇదిగో తుపాకి. ఇక మాట్లాడలేక నేలకి ఒరిగిపోయే సమయానికి యువకుడు ఆదుకొన్నాడు. అతని చేతుల్లోనే చచ్చిపోయాడు. తుపాకీని తొలగించడాని కి ప్రయత్నించాడు విశ్వనాధ్. అతని చేతుల్లోంచి రాలేదు. నేలమీద పడుకో బెట్టాడు. ఒక్క క్షణం ఆలోచించి అతన్ని మెల్లగా కుడివైపుకు ఈడ్చుకుపోయాడు. మళ్ళీ క్షణం నిశ్శబ్దం—త్వరగా స్ట్రెచర్ తో అంబులెన్సు వర్కర్స్ వచ్చారు. లోపలికి వచ్చి-సింగ్ ని చూచి-అతన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకుపోతుండగా-రాయ్ బట్టలు వేసుకొని విశ్వనాధ్ వచ్చాడు. ఆతన్ని సరిగా చూడకుండానే రెడ్ క్రాస్ వర్కర్స్ సెల్యూట్ చేశారు. అప్రయత్నంగా విశ్వనాధ్ సెల్యూట్ అందుకొన్నాడు. 

'మేజర్ రాంసింగ్ సార్' అని చెప్పి వెంటనే స్ట్రెచర్ తో వాళ్ళీద్దరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరిగా మిగిలాడు విశ్వనాధ్. వెనక ఏదో బరువుగా కనిపిస్తే వెదికాడు. రాయ్ బెల్టుకి ఉన్న రివాల్వరు చేతికి తీసుకున్నాడు. ట్రిగ్గర్ మీద చెయ్యివేసి దాన్ని పట్టుకొని ఉండగా కల్నల్ రావ్ వచ్చాడు. ఎదురుగ్గా ఉన్న విశ్వనాధ్ ని చూసి మొదట రాయ్ అనుకున్నాడు.

రావ్: (సంతోషంగా) కేప్టెన్! శత్రువులు ఇవ్వాళకి వెనక్కుపోయారు. సక్సెస్— (ఇప్పుడతన్ని గమనించి) నువ్వా!! —ఆ ఒంటికి రక్తమేమిటి? (రాయ్ శరీరానికి తగిలిన గాయాల రక్తం బట్టలకి ఉంది) కేప్టెన్ ఎక్కడ?

విశ్వ: చచ్చిపోతూ కూడా తుపాకీ వదల లేదని, పిల్లలకోసం పారిపోలేదని చెప్పమన్నారు. ఒక్క క్షణం క్రిందటే... (మాట చెప్తూండగానే రెండు తుపాకులు ఎడమవైపు నుంచి లోపలికి వచ్చాయి. వాటి చివర చైనావారి జెండాలు వేలాడు తున్నాయి. ఇటు తిరిగి ఉండడం వల్ల కల్నల్ కి అవి కనిపించలేదు. కాని విశ్వనాధ్ గుర్తించాడు. పై మాటలంటూ చటుక్కున ఆగి, అసంకల్పితంగా చేతుల్లో ఉన్న పిస్తోలు పేల్చాడు 'ఆగు. ఎవరక్కడ' అంటూ. పిస్తాలు పేల్చిన మరుక్షణంలో కల్నల్ ఒక్కసారి కిందికి వంగి పక్కక దూకాడు. రెండో తుపాకీ పేలి యువకుడికి తగిలింది. కాని మరుక్షణంలో కల్నల్ ఆ తుపాకి పట్టుకున్న చైనా సైనికుడిని కొట్టేశాడు. ఒక్క క్షణంలో రెండు చైనా తుపాకులూ కూలాయి. విశ్వనాధ్ కూలాడు. కల్నల్ నిర్ఘాంతపోయి ఒక్క ఉదుటున వచ్చి యువకుణ్ణి ఒళ్లోకి తీసుకున్నాడు.

రావ్: నేస్తం !(జేబులోంచి విజిల్ తీసి ఊది) ఆంబులెన్స్, ఆంబులెన్స్ ! (అరిచాడు)

విశ్వ : (కొంతసేపటికి కళ్ళిప్పాడు. కల్నల్ ని చూసి నవ్వాడు) చూశారా కల్నల్— నేనూ ఒక్కణ్ణి చంపగలిగాను—

రావ్: ఒకర్ని చంపడంకాదు నేస్తం - ఒకర్ని రక్షించావు. ఎలా వుందిప్పుడు? (విశ్వనాధ్ అసలే అల్పం. తుపాకీ గుండు సూటిగా తగిలింది. వెంటనే ప్రాణం వదిలాడు. అప్పుడు నిజంగా కల్నల్ రావ్ కి బాగా ఏడుపొచ్చింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. బయట తుపాకులు, కాల్పులు పూర్తిగా తగ్గిపోయాయి. ఉన్నట్టుండి ఎడమవైపు నుంచి నాయర్ హఠాత్తుగా పరుగెత్తుకు వచ్చాడు. ఇంకా నేలమీద కూర్చున కల్నల్ కి సెల్యూట్ చేసి—)

నాయర్: కల్నల్ సాబ్ !— సక్సెస్-మన స్థావరం నిలబడింది కల్నల్ సాబ్ ! మరి 48 గంటలవరకూ మనకేం బాధలేదు. 

కల్నల్!  (ఇప్పుడు అతని చేతుల్లో ఉన్న వ్యక్తిని చూసి) కేప్టెన్ !— పోయారా కల్మల్ సాబ్!

రావ్: (లేచి) కేప్టెన్ కాదు. ఇందాక ఇక్కడ నిలబడ్డ యువకుడు విశ్వనాధ్.

(నాటకం లో విశ్వనాధ్ పాత్రధారి మా మావయ్య నండూరి పార్ధసారధి గారు)

నాయర్: విశ్వనాధ్! (ఇప్పుడు చూశాడు).

రావ్: అవును లెప్టనెంట్. అతను లేకపోతే ఈ స్థావరంలో ఈనాటికి మీరొక్కరే బ్రతికి ఉండేవారు. తుపాకీ పట్టుకోవడం మాత్రం తెలిసిన విశ్వనాధ్ ఓ ఆఫీసర్‌ను రక్షించాడు. ఓ సైనికుడిని చంపాడు.

(తలమీంచి టోపీ తీశాడు. నిర్ఘాంతపోయి నాయర్ కూడా తన తలమీద టోపీ తీసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఊరేగింపు వెనుకకు వచ్చింది. మళ్లీ ఇందాకటి నాయకుడు, మరి కొంతమంది లోపలికి వచ్చారు. అందరి ముఖంలో సంతోషం స్పష్టంగా తెలుస్తోంది).

నాయర్: (ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు) మిత్రులారా! మీకు విజయం లభిస్తుందని మాకు ముందే తెలుసు. అల్లంత దూరంలోనే గ్రహించి వచ్చాం. మీవంటి గొప్ప పుత్రుల్ని కన్నందుకు భారతమాత గర్విస్తుంది. దేశం మీకు జోహార్లర్పిస్తుంది — బోలో భారత్ జవానోంకీ — 

(ఇప్పుడు కల్నల్ ఇటు తిరిగాడు. అతని ముఖం చూసి నాయకుడు నిర్ఘాంత పోయాడు. అతని కళ్ళవెంట నీళ్లు కారుతున్నాయి) కల్నల్! మీరు ఏడుస్తున్నారు!

రావ్: విజయం మా వల్ల కాదు లభించింది — ఇదిగో, ఇతని వల్ల (యువకుడి వైపు చూపాడు).

(అంతా చూసారు, 'కేప్టెన్' అన్నారు)

రావ్: కేప్టెన్ కాడు. ఇందాక మీతో వచ్చిన యువకుడు.

నాయర్: మాతో వచ్చాడా?

1 వ్యక్తి: అవును. నాకు గుర్తుంది.

2 : మనతోనే వచ్చాడు.

3 : నాకు ఇతను తెలుసు.

రావ్ : (కిందికి వంగి, అతన్ని చేతుల్లోకి ఎత్తుకొంటూ మాట్లాడాడు) ఒంట్లో ప్రాణం లేకుండా, నీరసంగా ఉన్న ఈ వ్యక్తి వల్ల ఉపయోగం ఏమిటా అని ఇందాక ఇతన్ని వెళ్లిపొమ్మన్నాను. కాని ఇప్పుడు ఇక్కడి విజయానికి సాక్ష్యంగా నేను బతకడానికి కారణం ఇలా ఒక ఇతనే. ప్రతి చిన్న వ్యక్తికీ, ప్రతి బలహీనుడికీ, ప్రతి నిస్సహాయుడికీ దేశ రక్షణ కార్యక్రమంలో పాత్ర ఉందని నిరూపించాడితను. ఇతన్ని తీసుకు వెళ్ళండి. బలహీనుడు సరిహద్దుల్లో తన శాయ శక్తులా పోరాడిన విషయం అందరికీ చెప్పండి. మాకేం బాధలేదు. ఇట్లాంటి వ్యక్తులున్న భారతదేశానికి ఎప్పుడూ అపజయం లేదు-వెళ్ళండి.

నాయకుడు : (అతన్ని నిశ్చేష్టతతో చేతుల్లోకి తీసుకొన్నాడు) బోలో భారత్ జవానోంకీ —అజ్ఞాత వీరునికి— ('జై' అని నినాదాలు చేశారు.)

( మళ్ళీ ఊరేగింపు వెనుకకు మరలింది. నాయర్ భుజంమీద చెయ్యివేసి కల్నల్ వాళ్లని చూస్తున్నాడు. "వందేమాతరం" గీతాన్ని వెయ్యి గొంతులు ఆలాపిస్తున్నా యి. దూరాన సైనికుల బూట్ల చప్పుడు వినిపిస్తోంది. ఎవరో ఆఫీసరు ఆర్డర్లిస్తున్నాడు. )

నాయర్: అదిగో—కొత్త ప్లాటూన్ ఇక్కడికి వస్తున్నట్టుంది కల్నల్ సాబ్ !— (సంతోషంగా అన్నాడు.)

రావ్: (కొంచెం పరాకుగా ఉన్నాడు) వస్తుంది - ఇక విజయం మనదే.

( ఒక పక్క “జనగణమన" గీతం - మరొక పక్క బూట్ల చప్పుడూ, ఆర్డర్లూ వినిపిస్తున్నాయి. )

🇮🇳

        *-:జైహింద్:-*

꧁☆•┉┅━•••❀❀•••━•┉┅━┉•☆꧂

*

Friday, 5 September 2025

 *కన్యాసుల్కము -1*

రచన :  గురజాడ అప్పారావు

*ప్రథమాంకము*

*౧-వ స్థలము, విజయనగరములో బొంకుల దిబ్బ.*

[గిరీశము ప్రవేశించును]

గిరీశ— సాయంకాలమైంది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చుపెట్టాను. ఈవాళ ఉదయం పూట కూళ్ళమ్మకీ, నాకూ యుద్దవైఁపోయింది. బుర్ర బద్దలుకొడదామా అన్నంత కోపం వచ్చింది గాని, పూర్రిచర్డు చెప్పినట్లు, పేషన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం. ఈలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు వూర్కుంది కాదు. ఇప్పుడేదో కొంచం డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ ఎవడైనా చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపైని తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు.

Can love be controlled by advice?

Will cupid our mothers obey?

శీఘ్రంగా యిక్కణ్ణింకి బిచాణా యెత్తి వెయ్యడమే బుద్ధికి లక్షణం గాని మధురవాణిని వదలడమంటే యేమీ మనస్కరించకుండా వున్నది.

మానవాళి మొత్తాన్ని మోహింపజేసేది స్త్రీలే.

నేను యేమో ఉద్యోగాలూ ఊళ్ళూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో వుంది. పూర్ క్రీచర్!

యెవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవాళ కిస్మిస్ శలవులు యిచ్చివుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనపడుతుంది. వీణ్ణి కొంచెం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పేమిషమీద వీడితో వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వదుల్తాయి అటుంచి నరుక్కురమ్మన్నాడు.

(వెంకటేశం ప్రవేశించును)

యేమివాయ్ మైడియర్ షేక్స్పియర్, ముఖం వేలవేసినావ్ ?

వెంక—యిక మీర్నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం చెయడం చేత నా పరీక్ష పోయిందని అన్నారు..

గిరీశ—నాన్సెన్స్. మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మాష్టరుకి నన్ను చూస్తే కిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు గాని, లేకుంటే నువ్వేవిఁటి ఫెయిల్ కావడవేఁవిటి! అతనికీ నాకూ యెందుకు విరోధం వొచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పాపర్లో యేకేశాను. అప్పట్నుంచీ నేనంటే వాడిక్కడుపుడుకు.

వెంక—మీవల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁ కాని, ఒక మారయినా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ?

గిరీశ—డామిట్. ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్రాటిట్యూడ్, నాతో మాట్లాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్. ఆ మాట కొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ? విడో మ్యారేజీ విషయవై, నాచ్చి కొశ్చన్ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కణ్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్ కాజెస్ ఫర్ది డిజెనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్చరిచ్చే సరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారు. మొన్న బెంగాళీవాడు ఈ వూళ్ళో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్ళు వుట్టి వెధవాయ లోయ్ చుట్ట నేర్పినందుకు థాంక్ చెయక, తప్పు పట్టుతున్నావ్ ? చుట్టకాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడక పోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్ళయి నారు. చుట్ట కాల్చని యింగ్లీషు వాణ్ణి చూశావూ? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడునా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే."

సూత ఉవాచ -

ఖగపతి యమృతముతేగా

భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్!

పొగచెట్టయి జన్మించెన్

పొగతాగనివాడు దున్నపోతై బుట్టున్ ॥

ఇది బృహన్నారదియం నాలుగో ఆశ్వాసంలో వున్నది. అది అలావుణ్ణిగాని ని అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాష్టరు మీద నావళ్ళు మహా మండుతోంది. ఈ మాటు వంటరిగా చూసి వక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా, వూరికి వెళతావా?

వెంక — వెళ్ళాల్నుందిగాని, పాసుకాలేదంటే మా తండ్రి చావకొడతాడు.

గిరీశ—ఆ గండం తప్పే వుపాయం నే చెబుతాను, నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చాస్తావూ?

వెంక —మీ శలవు యెప్పుడు తప్పాను? మా తండ్రికి మా చడ్డ కోపం. పాసు కాలేదంటే యెవిఁకలు విరక్కొడతాడు (కన్నీరు చేత తుడుచుకొనును).

గిరీశ —దటీజ్ టిరనీ :యిదే బెంగాళీ కుర్రవాడవుతే యేంజేస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రయేది కర్ర పట్టుకుని చట్టాలెక్కగొడతాడు; మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరి యవళ్ళయినా యీ వూళ్ళో చదువుకుంటున్నారా?

వెంక —మరి యెవళ్ళూ లేరు.

గిరీశ —ఐతే నేను వుపాయం చెపుతాను విను. నే కూడా నీతో మీవూరొచ్చి పరీక్ష పాసయినావని మీ వాళ్ళతో చెబుతాను అక్కడ నీకు చదువు చెప్పడానికి వొచ్చానని మీ వాళ్ళతో చెప్పు. శెలవులాఖర్ని నిన్ను టవును స్కూల్లో పై క్లాసులో ప్రవేశ పెడతాను.

వెంక —మీరే వస్తే బతికాను మరేవిఁటి; కిందటి మాటు శలవులికే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది.

గిరీశ — ఆల్రైట్ గాని నాకిక్కడ వ్యవహారములలో నష్టం వస్తుందే — మునసబుగారి పిల్లల్కి శలవుల్లో పాఠాల్చెపితే ఫిఫ్టీ రుపీజ్ యిస్తావఁన్నారు; అయినా నీ విషయవైఁ యంత లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్ళు బార్బరస్ పీపిల్ గదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో, నీవు నన్ను గురించి మీ మదర్ తో గట్టిగా రికమెండ్ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలకి వక జాబితా రాయి కొంచం డబ్బు చేతిలో వుంటేనేగాని సిగర్సుకి యిబ్బంది కలుగుతుంది. నోటు బుక్కు తీసి రాయి. 1. రోయల్ రీడర్ . 2. మాన్యూల్ గ్రామర్, 3. గోష్ జియామెట్రీ, 4. బాస్ ఆల్జీబ్రా, 5. శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్, 6. నలచరిత్ర, 7. రాజశేఖర చరిత్ర, 8. షెపర్డు జనరల్ ఇంగ్లీష్, 9. వెంకట సుబ్బారావు మేడీజీ, యెన్ని పుస్తకాలయినాయి?

వెంక — తొమ్మిది

గిరీశ - మరొక్కటి రాయి. అక్కడికి పది అవుతాయి. కుప్పుసామయ్యర్ మెడ్ డిఫికల్ట్. అక్కడికి చాల్ను. మీ వాళ్ళుగాని యింగ్లీషు మాట్లాడ మన్నట్టాయినా తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నంత వరకు యాకరు పెట్టు. నీదగ్గర కాపర్పు యేవైఁనా వున్నవా? నా దగ్గర కరన్సీ నోట్లు వున్నవి గాని మార్చలేదు. పదణాలు పెట్టి ఓశేరు కాశీ మిఠాయికొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కట్టుకి వేళ్ళి బండీ కుదిర్చి దానిమీద నా ట్రావెలింగ్ ట్రంక్కు వేసి మెట్టుదగ్గిర బండీ నిలబెట్టివుంచు. యిక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని యంత రాత్రికైనా వొచ్చి కల్పుకుంటాను. గోయెట్వంస్, మైగుడ్ బోయ్. నువ్ బుద్ధిగా వుండి చెప్పిన మాటల్లా వింటూంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత్త. (వెంకటేశం నిష్క్రమించును.)

ఈ వ్యవహారమొహటి ఫైసలైంది. ఈరాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ యివ్వందీ పోకూడదు.

[రాగ వరసతో పాడును]

నీ సైటు నాడి లైటు

నిన్ను మిన్నకాన కున్న

మూనులేని నైటు.

[ఒక బంట్రోతు ప్రవేశించును]

బంట్రోతు —నేను పొటిగరాప్పంతులుగారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి, పొటిగరావుల కరీదు యెంటనే యిప్పించమన్నారండి.

గిరీశ : (విననట్టు నటించుతూ)

ఫుల్లుమూను నైటటా.

జాసమిన్ను వైటటా

మూను కన్న

మొల్ల కన్న 

నీదు మోము బ్రైటటా 

టా! టా! టా!

బంట్రోతు -యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ళలాగూరు కుండే వాణ్ణి కానండి.

గిరీశ -అయ్యకోనేటికి తోపయిదే;

బంట్రోతు — యక్కడి శెవిఁటిమాలోకం వచ్చిందయ్యా.

గిరీశ —కోవఁటి దుకాణవాఁ? కస్పా బజార్లోగాని యిటివేపులేదు.

బంట్రోతు — (గట్టిగా చెవిదగ్గర నోరు పెట్టి) పోటిగరావులు కరీదిస్తారా యివ్వరా?

గిరీశ —బస, రాథారీ బంగళాలో చెయ్యొచ్చును.

బంట్రోతు —యాడాది కిందట మీరూ సానిదీ కలిసి యేసుకున్న పోటిగరావుల కరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు.

గిరీశ — ఓహో నీవటోయ్, యవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు. నింపాదిగా మాట్లాడు. రేపు వుదయం యెనిమిది ఘంటలకి పూటకూళ్ళమ్మ యింటికి వస్తే అణా పైసల్తో సామ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ?

బంట్రోతు — మాటల్తో కార్యం లేదు. మొల్లో శెయ్యెట్టి నిల్చున్న పాట్ని పుచ్చుకొమ్మన్నారండి.

గిరీశ - పెద్ద మనిషివి గదా నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్ద మనిషి. యీ చుట్ట చూడు యంత మజాగా కాల్తుందో. హవానా అంటారు దొర్లు దీన్ని. రేప్పొద్దున్న రా రెండు కట్టలిస్తాను.

బంట్రోతు —శిత్తం. సొమ్ము మాటేం శలవండి.

గిరీశ — చెప్పాను కానా? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు.

బంట్రోతు - మాలడికొడుకు శండాలుడు కాకుంటే మరేటండి.

గిరీశ - నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీ పట్టుకు ప్రమాణం చేస్తాను.

బంట్రోతు - శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యక పోతే నా ఆబోరుండదండి.

గిరీశ -ఆహాఁ. నీ అబోరు ఒహటీ. నా ఆబోరు ఒహటినా? 

(బంట్రోతు నిష్క్రమించును.) 

ఇన్నాళ్ళకి జంఝంప్సోన వినియోగంలోకి వచ్చింది. థియాసాఫిస్టుసు చెప్పినట్లు మన ఓల్డు కస్టంసు అన్నిటికి యెదో ఒహ ప్రయోజనం ఆలొచించె మనవాళ్ళు యార్పరిచారు. ఆత్మానుభవం అయితేనే గాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదుల్చుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్రబుద్దేః పలాయనం. పెందరాళే యీ వూర్నించి వుడాయిస్తేనే కాని ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి వెళదాం. మేక్ 'హే వైల్దీ సన్ షైన్స్ అన్నాడు.

💰

*సశేషం*


కన్యాశుల్కము - 2

స్థలము. మధురవాణి యింట్లో గది

[రామప్పంతులు కుర్చీమీద కూర్చుండును, మధురవాణి యెదుట నిలుచుండును]

రామ— (జేబులో నుంచి చుట్ట తీసి పంటకొన కొరికి) పిల్లా, అగ్గిపుల్ల.

మధుర— (అగ్గి పుల్ల వెలిగించి చుట్టకందించుచుండగా రామప్పంతులు మధురవాణి బుగ్గను గిల్లును. 

"మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి యెడంగా నిలబడి కోపం కనపర్చుతూ) మొగవాడికయినా ఆడదానికైనా నీతి వుండాలి తాకవద్దంటే చెవిని పెట్టరు ?"

రామ-నిన్ను వుంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా వూరు లేవతీసుకు వెళ్ళడానికి సిద్ధవఁయ్యుంటే ఇంకా ఎవడో కోన్కిస్కాహే గాడి ఆడాలో వున్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి?

మధుర—వేశ్య అనగానే అంత చులకనా పంతులుగారూ? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా? మా పంతులుగార్ని పిలిచి 'అయ్యా యిటు పైని మీ తోవ మీది నా తోవ నాది' అని తెగతెంపులు చేసుకున్న దాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైదీకయితేనేమి, కిరస్తానం మనిషైతేనేమి, పూటకూళ్ళమ్మను ఉంచుకుంటేనేమి నన్ను యిన్నాళ్ళూ ఆ మహారాజు పోషించాడు కాడా? మీరంతకన్న రసికులయినా, నా మనసు యెంత జూరగొన్నా, ఆయన యెడల విశ్వాసం నాకు మట్టుకు వుండొద్దా?

రామ — పెద్ద పెద్ద మాటాలు ప్రయోగిస్తున్నావు! వాడి బ్రతుక్కి వాడు పూటకూళ్ళమ్మని వుంచుకోవడం కూడానా! పూటకూళ్ళమ్మే వాణ్ణి వుంచుకొని యింత గంజి బోస్తుంది.

మధుర— అన్యాయం మాటలు ఆడకండి. ఆయన యెంత చదువుకున్నాడు, ఆయనకి యెంత ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది.

రామ—అహహ (నవ్వుతూ) యెం వెర్రి నమ్మకం! నీవు సానివాళ్ళలొ తప్ప పుట్టావు. గిరీశంగారు గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేవిఁటి. మా వూళ్ళోవున్న లుబ్రావుధాన్లు పింతల్లికొడుక్కాడూ వీడూ! గిర్రడని మేం పిలిచే వాళ్ళం. బొట్లేరు ముక్కలు నేర్చుకోగానే ఉద్యోగాలే! వాడికల్లా ఒక్కటే వుద్యోగం దేవుఁడు రాశాడు. యేవిఁటో తెలిసిందా? పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ చాకిరీ చెయ్యడం.

మధుర—యీ మాటలు ఆయన్ని అడుగుదునా?

రామ—తప్పకుండా. కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు.

మధుర—అయినా ఆయన గుణ యోగ్యత లతో నాకేం పని? యేవఁయినా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనపడవ్.

రామ—అయితే అతడికి విడాకులు యెప్పుడిస్తావు?

మధుర—యిక్కడి రుణాలూ పణాలూ తీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వందలూ యిప్పిస్తే యీ క్షణం తెగతెంపులు చేసుకుంటాను.

రామ— అయితే యింద (జేబులో నుండి నోట్లు తీసి యిచ్చును. మధురవాణి అందుకొంటుండగా రామప్పంతులు చెయ్యి పట్టి లాగును. మధురవాణి కోపంతో చెయి విడిపించుకొని నోట్లు పారవేసి దూరముగా నిలుచును.)

మధుర—మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషి యేవఁన్నమ్మను?

రామ— (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం, (నోట్లు చేతికిచ్చును) లెక్కపెట్టి చూసుకో.

మధుర—ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండి నా మనస్సు కనిపెట్ట జాలినారుకారు గదా? మీ నోట్లు మీ వద్దనే వుంచండి. నేను డబ్బు కక్కూర్తి మనిషిని కాను. (నోట్లు యివ్వబోవును.)

రామ—వద్దు! వద్దు!వద్దు! నీ మనసు కనుక్కుందావఁని అన్నమాటగాని మరొకటి కాదు. గాని, యీ గిరీశం గుంట వెధవ వీడెవడో మా గొప్పవాడనుకుంటున్నా వేవిఁటి?

మధుర—ఆయన్ని నా యదట తూల్నాడితే యిదుగో తలుపు తీశాను విజయం చెయ్యండి. (తలుపు తీసి వొక చేత పట్టుకుని రెండవ చేతి వేలుతో పైకి తోవ చూపును), అదుగో గిరీశంగారే వస్తున్నారు. ఆ మాటేదో ఆయన్తోటే చెప్పండి.

రామ—వెళాకోళం ఆడుతున్నావూ?

గిరీశం—(వాకట్లో నుంచి) మై డియర్.

రామ—(ఆత్మగతం) అన్న. వేళగాని వేళ్లొచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు, యేవిఁటి సాధనం, యీ మంచం కింద దూరదాం. (మంచంకింద దూరును.)

[గిరీశం ప్రవేశించును]

గిరీశం—వెల్, మై డియర్ ఎంప్రెస్. (భుజము మీద తట్టబోవును.)

మధుర— (ఒసిలి తప్పించుకొని) ముట్టబోకండి.

గిరీశం—(నిర్ఘాంతపోయి) అదేమిటి ఆ వికారం.

మధుర— ఆఖరు వికారం.

గిరీశం—(ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా! సాని వాళ్ళకి కర్ణ పిశాచి వుంటుంది కాబోలు (పైకి) మైల బడితే స్థానం చేసి వేగిరం రా.

మధుర—ఇప్పుడేం తొందర, తలంటుకుంటాను.

రామ—(ఆత్మగతం) చబాష్, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకో నివ్వకుండా యెత్తు యెత్తింది!

గిరీశం—మైలా గియిలా మా యింగ్లీషు వారికి లక్ష్యం లేదు. యిలా రా (దగ్గరికి చేరును.)

మధుర— (వేలు చూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం యింకా కాలేదే ? మీరు కిరస్తానం అన్న మాట ఇప్పుడే ఒహరు చప్పగా విన్నాను.

రామ -(తనలో) నే చెప్పానంటుందా యేమిటి!

గిరీశం —ఒకరు చప్పగా విన్నావూ? యెవరా జెప్పింది? యెవడికిక్కడికి రావడానికి మగుదూర్ వుంది? యిలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి యెవడికి గుండె వుంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీ కెక్కడ గుండుంది ? చెప్పు!

రామ— (తనలో) తంతాడు కాబోలు, యెరక్క చిక్కడ్డాను.

మధుర—మొగాడే చెప్పాలా యెవిఁటి? ఆడవాళ్ళకి దేవుఁడు నొరివ్వలేదా?

గిరీశం— (తనలో) పూటకూళ్ళముండే చెప్పింది కాబోలు (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరుబెట్టుకు బతకమనే దేవుఁడు చేశాడు. పరువైన ఆడది నీ యింటికెందుకొస్తుంది?

మధుర—పరువైన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకురాకూడదు? ముందు కూచోండి, తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకొండి, అదుగో అగ్గిపెట్టి.

గిరీశం — ముట్టుకోడానికి వల్లలేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టాను కానా? యీవాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని ఉత్సాహ భంగం చేశావ్.

మధుర—యెవిఁటా వుత్సాహం?

గిరీశం — యిదిగో జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గిరించి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదరదలాత్ బావురల్లీఖాన్ ఇస్పహన్ జంగ్ బహద్దూర్ వారు సిఫార్స్ చేసి వెయ్యి సిక్కా రూపాయలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షావారి హుజూర్న వుండడం.

రామ— (తనలో) యెవిఁట్రా వీడి గోతాలు!

గిరీశం—యింత శుభవార్త తెచ్చినా, దగ్గిరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్ వస్తావా?

మధుర— (తల తిప్పుతూ) నే యెందుకు? పూటకూళ్ళమ్మని తీసికెళ్ళండి.

గిరీశం—(నిర్ఘాంతపోయి) పూటకూళ్ళమ్మ యేవఁయినా పెంట పెడుతుందా యేవిఁటి?

మధుర—మీకే తెలియాలి.

గిరీశం—నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వొస్తుంది. యెవడేమాటన్నా నామీద నమ్మడవేఁనా? యీ ఘోరవైఁన అబద్ధాలు నీతో యవడు చెబుతున్నాడో కనుక్కోలేన నుకున్నావా యేవిఁటి? సప్తసముద్రాల్దా టినా వాడి పిలకట్టుకుని పిస్తోల్‌తో వళ్ళు తూట్లు పడేటట్టు ఢాఢామని కొట్టకపోతి నట్టయినా నా పేరు గిరీశమే నినదభీషణ శంఖము దేవదత్తమే! కబడ్దార్!

మధుర—సముద్రాలవతలకెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యెదటే చెబుతాడు.

రామ— (తనలో) యీ ముండ నన్ను బయలుబెడుతుంది కాబోల్రా దేవుడా!

గిరిశం (తనలొ) థాంక్ గాడ్, అయితే పూటకూళ్ళ దాన్దేబ్బతగల్లేదు. (పైకి) యిలాంటి దుర్మార్గపుకూతలు ఆ యిల్లాలు చెవిని పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపవఁంతా దీన్ని చుట్టుకుంటుంది. ఆమె యెంత పతివ్రత! యెంత యోగ్యురాలు!

మధుర— విధవముండకి పాతివ్రత్యం అన్న మాట యీనాటికి విన్నాను.

గిరీశం—దానికి.... కాదు ఆమెకి మొగుళ్ళేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు.

మధుర—మీరుండగా వెధవేలా అవుతుంది?

గిరీశం — నాన్సెన్స్ (దీనికో ఠస్సా చెప్పి రంజింపచేదాం) యిదుగో విను. దాని నిజం యేవిఁటంటే: పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునుష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్టబోతుంటేనో కట్టిన ఉత్తర క్షణంలోన్నూ ఆ ముసలాడు పెళ్ళి పీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్ళి అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తెకట్టాడన్నారు. కొందరు కట్టాలేదన్నారు. పిల్ల తండ్రి, పెళ్ళి కొడుకు వారసులు మీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గిర లంచం పుచ్చుకొని పుస్తె కట్టలేదని సాక్షవిఁచ్చాడు. దాంతో కేసుపోయింది మరి దాన్నెవరూ పెళ్ళాడారుకారు.

మధుర—అయితే మరి మీకు తప్పులేదే?

గిరీశం —యేవిఁటి యీ కొత్త మాటలూ! నాకు ఆదీ అంతూ తెలియకుండావుంది! ఆహాఁ సరసం విరసంలో దిగుతూందే! హాస్యానికంటే నివ్వేవఁవన్నా ఆనందవేఁ. నిజవఁనిగానీ అంటివా, చూడు నా తడాఖా. యెవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా?

మధుర— రామ.

రామ— (తనలో) చచ్చాన్రా, పేరు చెప్పేసింది!

మధుర-రామ! రామ! ఒహరు చెప్పేదేవిఁటి లోకవంతా కోడై కూస్తూంటేను? 

(వీధిలో నుంచి తలుపు తలుపు అని ధ్వని)

గిరీశం—(తెల్లపోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు ఆ పిలిచే మనిషి వెఱ్ఱిముండ. మనుషుల్ని కరుస్తుంది.

మధుర— తలుపు తీసేవుంది.

గిరిశం — చంగున వెళ్ళి గడియ వేసెయ్.

మధుర— అదుగో తలుపు తోసుకు వొస్తుంది.

గిరీశం—గెంటెయ్ గెంటెయ్.

మధుర—ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (మధురవాణి వాకిట్లోకి వెళ్ళును)

గిరీశం—మంచం కింద దూరదాం. 

(గిరీశం మంచం కింద దూరును.) (తనలో) దొంగలంజ సరసుణ్ణి దాచిందోయ్ మంచం కింద. యిదేవిఁటో మంచి మనిషి అని భ్రమించాను. దీన్తస్సా గొయ్యా. సిగపాయి దీసి తందునుగాని యిది సమయం కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రొష్టు, (రామప్పంతులుతో మెల్లిగా) యవరన్నా మీరు, మహానుభావులు?

రామ— నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ.

గిరీశం—తమరా, ఈ మాత్రానికి మంచం కింద దాగోవాలా, మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవై మందిని మీకు కన్యాదానం చేతునే.

రామ— (తనలో) బతికాన్రా దేవుఁడా (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! అలా తెలిస్తే నేరాకపోదును సుమా.

గిరీశం—మాట వినపళ్ళేదు. కొంచం యిసుంటా రండి. 

(రామప్పంతులు ముందుకు జరుగును, గిరీశం అతన్ని తప్పించుకుని గోడ వైపు చేరును.) 

గిరీశం అన్నా, యీ లంజని యన్నడూ నమ్మకండి. యిలా యిరవైమందిని దాచగల శక్తుంది దీనికి.

రామ— రెండు వందలు దొబ్బిందిరా బాబూ.

గిరీశం - నువ్వులేం జాగర్త చేశారా?

రామ—అంతేనా?

గిరీశం —- మరేవిఁటీ?

(మధురవాణి, పూటకూళ్లమ్మ వల్లెవాటు లో చీపురుగట్ట దాచిన్ని ప్రవేశింతురు]

మధుర—మీరన్న వ్యక్తి యిక్కడలేరంటే చెవినిబెట్టరు గదా!

పూట—ని యింట్లో జొరబడ్డాడని విధులొ వాళ్ళు చెబితే నీ మాట నమ్ముతానా యెవిఁటి? ఆ వెధవ వుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్.

మధుర—యెవడికిచ్చావో వాణ్ణే అడగవమ్మా.

పూట — వెధవ కనబడితే సిగపాయిదీసి చీపురుగట్టతో మొత్తుదును, యెక్కడ దాచావేవిఁటి?

మధుర—నాకు దాచడం ఖర్మవేఁమిఁ నేను మొగనాల్నికాను. వెధవముండనీ కాను. నాయింటికొచ్చేవాడు మహరాజులాగ పబ్లిగ్గావస్తాడు. 

(కంటితో మంచము కిందికి చూపును.)

పూట— మంచంకింద దాగాడేమో ? (మంచము కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే వుంది లేచిరా. 

(చీపురుగట్ట తిరగేసి రామప్పంతులును కొట్టును)

రామ—ఓర్నాయనా, నన్నెందుక్కొడతావే దండుముండా? 

(మంచంకింది నించి పైకి వచ్చి వీపు తడుముకొనును).

మధుర—ఆయన్నెందుకు కొట్టావు? నాయింటికొచ్చి యేవిఁటీ రవ్వ?

పూట— అయితె మంచం కిందెందుకు దూరాడూ?

మధుర-నీకెందుకా ఘోష? ఆదో సరసం.

పూట—ఇదో చీపురుగట్ట సరసం.

రామ— (వీపు తడువుఁకొంటూ) నీ సిగతరగా, ఆడదానివైపోయినావే, లేకుంటే చంపేసి పోదును. నీ రంకు మొగుణ్ణి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకి తోసి తాను గోడవైపు దాగున్నాడు.

పూట—ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద! కుక్కా పైకిరా.

గిరిశ - వెర్రప్పా! మంచం కిందికిరా. వెఱివొదల గొడతాను.

పూట—అప్పనిట్రా వెధవా నీకు? నీకు భయపడతా ననుకున్నావా యేవిఁటి? నీ సానిముండ యెలా అడ్డుకుంటుందో చూస్తాను. 

(పూటకూళ్ళమ్మ ఒకవైపు నుంచి మంచం కిందికి దూరును. మరొక వైపు నుండి గిరీశం పైకివచ్చి రామప్పంతులు నెత్తి చరిచి లఘువేసి పెరటివైపు పరిగెత్తిపోవును.)

రామ—సచ్చాన్రా నాయనా (రెండు చేతులు తలపట్టుకొని) మధురవాణి యెవిఁ బెహద్బి! కనిష్టీబు క్కబురంపించూ.

మధుర —యెందుకు పబ్లికున అల్లరీ అవమానవుఁన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందురు గాని. (మధురవాణి రామప్పంతుల్ని కౌగలించుకొని తల ముద్దెట్టుకుని చేత రాసి) యేవిఁ దుష్టు! మొగవాడయినవాడు యెదుట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బ కొడతాడు? వాడి పొంకం అణుతురుగాని లెండి.

రామ—గవురనుమెంటు జీతమిచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం? యీ వెధవని పజ్యండు కోర్ట్లంటా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని కాను చూడు నా తమాషా!

మధుర—( రామప్పంతుల్ని ముద్దుబెట్టుకుని) మాటాడక వూరుకొండి. ( మంచం కింది వేపు చూపించి నోరు మూసి) దొంగ దెబ్బ కొట్టిన వాడిదే అవమానం మీది కాదు.

రామ— నొప్పెవడిదనుకున్నావు? ఆ ముండ మంచం కిందనించి రాదేం? చీపురుకట్ట లాక్కో.

పూట—ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టే వుంది. (పైకి వచ్చును)

(అంతా నిష్క్రమింతురు

💰

సశేషం

న్యాశుల్కము - 3

ద్వితీయాంకము

స్థలము, కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు

(అగ్నిహోత్రావధాన్లు జంఝాలు వడుకు చుండును. కరటకశాస్తుల్లు శిష్యుడిచేత లేని పేలు నొక్కించుకొనుచుండును. వెంకమ్మ కూర తరుగుచుండును.)

వెంకమ్మ— నిన్నట్నించి కిశిమీశ్శలవులని కుఱ్ఱవాడు వుత్తరం రాశాడు. యెన్నాళ్లో ఐంది వాణ్ణిచూసి, కళ్లు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి.

అగ్నిహోత్రావధాన్లు —ఎందుకు వొట్టినే వగచడం? వొద్దు వొద్దంటూంటే యీ యింగిలీషు చదువులోపెట్టా'వ్. మెరక పొలం సిస్తంతా వాడి కిందయిపోతూంది. కిందటి యేడు పరిక్ష ఫేలయి పోయినాడు గదా? యీయేడు యెలాతగలేశాడో తెలియదు. మనకీ యింగిలీషు చదువు అచ్చిరాదని పోరిపోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావుధాన్లు కొడుకు ని యింగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం వొచ్చి మూడ్రోజుల్లో కొట్టేశింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావఁనుకుంటూండగానే చచ్చినంత ఖాయలా చేసింది.

వెంకమ్మ— మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంచూవుంఛారు. డబ్బు కర్చయిపోతుందని మీకు బెంగ. మొన్నమొన్న మనకళ్లెదుట మనవాకట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుఱ్ఱాడికి మునసబీ ఐంది కాదూ?

అగ్ని— మన వెధవాయకి చదువొచ్చేదేం కనపడదుగాని పుస్తకాలకిందా జీతంకిందా యిహ నాలుగేళ్లయేసరికి మన భూమి కడతేరిపోతుంది. ఆపైని చిప్పా దొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా యింటి దగ్గిరుంటే యీపాటికి నాలుగష్టాలు చెప్పేదును. వొద్దంటూంటే యీవెధ వింగిలీషు చదువులో పెట్టావు.

వెంకమ్మ —మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అఘురారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూఱూపాయలు కర్చు పెట్టడాని కింత ముందూ వెనకా చూస్తున్నారు. మీలాగేవాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని వుందా యేవిఁషి? మీకంత భారవఁంతోస్తే మావాళ్లు నాకు పసుపూకుంకానికీ యిచ్చిన భూవఁమ్మేసి కుఱ్ఱాడికి చదువు చెప్పిస్తాను.

కరటకశాస్త్రి —నిభూవెఁందు కమ్మాలమ్మా? మన సొమ్ము చడతిని కొవ్వున్నాడు. అతడె పెట్టుకుంటాడు.

అగ్ని— ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీ మారంటే నీ అన్నవున్నాడని వూరుకునేదిలేదు.

[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]

వెంక— మావాబ్బా బాబు వచ్చావషాయ్! (వెంకటేశమును కౌగలించుకొనును.)

అగ్నిహో— వెధవాయా యీమారైనా పా`సయినావా? (వెంకటేశం తెల్లబోయి చూచును.)

గిరీశం— పాసయినాడండి. ఫస్టుగా పాసయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి.

అగ్ని— యీతుర కెవడోయ్!

గిరీశం— టర్క్! డామిట్, టెల్ మాన్.

అగ్ని— మానా? మానులావుంచా నంఛావూ? గుబ్బగలగొడతాను.

వెంకటేశం— (వణుకుతూ తల్లివేపు చూసి) అమ్మా యీయ్నే నాకు చదువు చెప్పే మేష్టరు.

కరట—ఇంటికి పెద్దమనిషొస్తే అపృచ్ఛపు మాటలాడతావేవిఁటి బావా? ఆయనేదో కుఱ్ఱవాడితో యింగిలీషు మాటంటే పుచ్చ కాయల దొంగంటే బుజాల్తడువుకున్నట్టు నీమీద పెట్టుకుంటావేం?

(బండివాడు సామానుదించును.)

గిరీశం—(కరటకశాస్త్రితో) తమ బావగారా అగ్నిహోత్రావఁధాన్లుగారు? నన్ను తమరు యరక్కపోవచ్చునుగాని డిప్టీకలక్టరు గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలికి చదువుచెబుతూవుండేవాణ్ణి. డిప్టీకలక్టరుగారు తమర్ని యేమ్మెచ్చుకునే వారనుకుంటారు!

కరట — అవును మీమొఖం చూచిన జ్ఞాపకవుఁంది. డిప్టీకలక్టరుగారు మహదొడ్డప్రభువ్.

గిరీశం— మీలాంటి చప్పన్నభాషలూ వచ్చిన మనిషి యక్కడా లేడనీ, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ డిప్టీకలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం ఆయన్‌ల గ్రహించేవారేరీ? నా కవిత్వవంటే అయన చెవికోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చేయించారండి."

అగ్ని— (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరి చూస్తే యిక్కడే బసవేసేటట్టు కనపడుతూంది. మా యింట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు.

వెంక—ఆయన మాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీదయవల్ల మావాడికో ముక్కబ్బితే మీమేలు మరిచిపోం.

గిరీశం—అందు కభ్యంతర వేఁవిఁటమ్మా, మీవాడు శలవుల్లో చదువుచెప్పమని బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుఱ్ఱవాడు గదా అని వొచ్చానుగాని పట్ణంలో మునసబుగారింట భోజనం లేదని వొచ్చానా, వారిచ్చే డబ్బు చేదని వొచ్చానా అమ్మా?

వెంకమ్మ—యీ చదువులకోసవఁని పిల్లణ్ణి వొదులుకునివుండడం, వాడు పరాయి వూళ్లో శ్రమదమాలు పడుతూండ్డం నా ప్రాణాలు యెప్పుడూ అక్కణే వుంచాయి. డబ్బంటి యెన్నడూ వెనక చూళ్లేదుగదా. మేం కనడంమట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రిని. యలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం.

గిరీశం— తమరు యింత దూరం శలవియ్యాలమ్మా? నా మంచిచెడ్డలు మీ కుఱ్ఱవాణ్ణడిగితే తెలుస్తుంది. మునసబు గారూ, డిప్టీకలక్టరుగారూ యెన్నికచేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా, ఇంతెందుకూ యిక మూడేళ్లు నా తరిఫీదు లో వుంచితే క్రిమినల్లో వరసగా పోలీసు పరిక్ష పాసుచేయిస్తాను.

అగ్ని—మూడేళ్లే! యీ సంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ?

వెంకటేశం—పదిహేన్రూపాయ లవుతుంది.

అగ్ని— ఒక్కదమ్మిడీ యివ్వను. వీళ్లిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకుతినేటట్టు కనపడుచూంది. నేను వేదం యనబైరెండు పన్నాలూ ఒహదమ్మిడీ పుస్తకాలఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది.

కరట— (నవ్వుతూ) కోట్లకి విలవైనమాట అన్నావు బావా!

గిరీశం—(కరటకశాస్త్రితో) దిసీజ్ బార్బరస్, చూచారండీ, జెంటిల్‌మేన్ అనగా పెద్దమనిషిని యలా అంటున్నారో! నేను యిక యిక్కడ వుండడం భావ్యం కాదు. శలవు పుచ్చుకుంటాను.

వెంకమ్మ—చాల్చాలు బాగానేవుంది! యింటి కెవరొచ్చినా నాకిదే భయం. ఆయన మాటల కెక్కడికి బాబూ, వెళ్లిపోకండి.

కరటక —అగ్నిహోత్రావుధాన్లూ! కుఱ్ఱవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూవెనకా చూస్తున్నావ్. బుచ్చమ్మ నమ్మిన పదిహేను వొందల రూపాయిలేంజేశావ్?

గిరీశం— సెల్లింగర్ల్స్! డామిట్!

అగ్ని— ప్రతీగాడిదె కొడుకూ అమ్మావమ్మా వంచూంఛాడు. కూరగాయల్షోయ్ అమ్మడానికీ? ఆ రూపాయలు పుచ్చుకోక పోతే మొగుడు చచ్చాడుగదా, దాని గతి యావైఁయ్యుండును?

కరట — చచ్చాడంటే వాడిదా తప్పు, మంచంమీంచి దించెయడానికి సిద్ధంగా వున్న వాడిక్కట్టావ్!

గిరీశం— తమరేనా నులక అగ్నిహోత్రావుధాన్లుగారు? యీ పట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్ర వరంలో మావాళ్లనుకునేవారు.

అగ్ని—మీది రాజమహేంద్రంషండీ? ఆ మాట చెప్పారుకారేం? రామావుధాన్లుగారు బాగున్నారా?

గిరీశం —బాగున్నారండి. ఆయన మా మేనమావఁగారండి.

అగ్ని— ఆ మాట చెప్పా'రుకారూ?

గిరీశం —మామావఁ యీ దేశబ్భోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి.

అగ్ని—నాకూ వారికి చాలా స్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమకోపం. యవరో తెలియకుండా అన్నమాటలు, గణించకండేం.

గిరీశం — దానికేవఁండి. తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుఱ్ఱవాళ్లు పడడం విధాయకవేఁగదండీ?

కరట— (తనలో) యిన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు.

అగ్ని— చూశారండీ, మీపేరేవిఁటండీ?

గిరీశం —గిరీశం అంటారండి.

అగ్ని — చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్తుల్లు వట్టి అవకతవక మనిషి. మంచీ చెడ్డా యేమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంతలాభం కలిగింది. భూవుఁలకి దావా తెచ్చావాఁలేదా? నేను యీమధ్య దాఖల్చెయించిన పిటిషను మీద ఆర్డరు చదివిపెట్టండి (గదిలోకి వెళ్లి కాకితం తెచ్చి గిరీశం చేతికి యిచ్చును.)

గిరీశం— (చూసి) ఎవడో తెలివితక్కువ గుమాస్తా వ్రాసినట్లుంది. అక్షరపొలికే లేదండి.

అగ్ని—మావకీలు గడగడ చదివేశాడండి.

గిరీశం—నేను మాత్రం చదవలేకనా. అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. లెక్చరిచ్చేపండితుణ్ణి నాకిది పేలపిండీ కాదు; అయితే రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరిటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చెయ్యమని శలవా?

అగ్ని- అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చులేకుండా వీడిచాత కాగితమ్ముక్క లన్నీ తర్జుమా చేయించేస్తాను.

గిరీశం —యింకా యింగ్లీషు కాయితాలు యేవుఁన్నా నామీద పారయ్యండి. తర్జుమా చేసిపెడతాను.

అగ్ని —అష్లాగే.

వెంకమ్మ—మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ.

గిరీశం— అలాగేనమ్మా.

సశేషం

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

కన్యాశుల్కము - 4

ద్వితీయాంకము

వెంకమ్మ—మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ.

గిరీశం— అలాగేనమ్మా.

My dear Venkatesam-

Twinkle! Twinkle! little star, 

How I wonder what you are!

వెంకటేశం — There is a white man in the tent.

గిరీశం — The boy stood on the burning deck Whence all but he had fled.

వెంకటేశం — Upon the same base and on the same side of it the sides of a trepezium are equal to one another.

గిరీశం — Of man's first disobedience and the fruit of that mango tree, sing. Venkatesa, my very good boy.

వెంకటేశం — Nouns ending in f or fe change their f or fe into ves.

అగ్ని— యీ ఆడుతూన్న మాటలకి అర్థంయేవిఁషండి?

గిరీశం — ఈ శలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావఁండి.

కరట — అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా?

వెంకటేశం— పొగచుట్టకు సతిమోవికి—

కరట— చబాష్!

గిరీశం —డా'మిట్! డోంట్రీడ్ దట్, (మెల్లగా) "నలదమయంతులిద్దరు" చదువ్.

వెంకటేశం —నలదమయంతు లిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘ వాసర నిశల్.

కరట— అట్టే అట్టే, మనః ప్రభవానలవఁంటే యేవిఁట్రా?

వెంకటేశం- (యింటికప్పు వైపు చూసి వూరుకుండును.)

గిరీశం —పసిపిల్లలకి అలాంటి కఠినవైఁన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి?

అగ్ని — పద్యాలికి అర్థం చెప్పరూ?

గిరీశం— యిప్పటిమట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మాథమాటిక్స్ యివన్ని హడలేసి చెప్తారండి.

కరటక —(తనలో) తర్పీదు మాచక్కగా వుంది. వీణ్ణి పెందరాళె తోవ పెట్టకపోతే మోసంవొఁస్తుంది.

అగ్ని— ఇన్నోటి చెప్తారండీ?

గిరీశం —మరేవఁనుకున్నారు? మీ కుఱ్ఱవాళ్లాగా చదువుకునే వాడికి ఒక నిమిషవైఁనా తెరిపుండదు.

అగ్ని— అదుగో చదువంటే అష్టాగే చదువుకొవాలి. గొట్టికాయలాడకుండా మావాణ్ణి ఖాయిదాచేస్తే యంత చదువైనా వొస్తుంది.

గిరీశం— నాదగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకు పోవాలి, అలా చదివిస్తానండి.

అగ్ని— అలాగే చేస్తే మావాడికి చదువొచ్చి అన్ని పరిక్షలూ పాసవుతాడండి. మావాడికి డబ్బు ఖర్చులేకుండా పెళ్లయె సాధనం కూడా తటస్థించిందండి.

వెంకమ్మ — మీ నైజంకొద్దీ ఛిఱు కొఱు మంఛారుగాని మీకు మాత్రం అబ్బిమీద ప్రేవఁలేదా యేవిఁషి? పట్టంలో గొట్టాలమ్మొ చ్చినప్పుడు యంతో బెంగబెట్టుకుని అబ్బిని శలవర్జీరాసి వెళ్లిపోయిరమ్మన్నారు కారా? చదువూ చెప్పించక పెళ్లిచెయ్యక తీరుతుందా యేమిషి?'

కరట— డబ్బు ఖర్చులేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా యేవిఁటి? పదిహేను వొందలైనా పోస్తేనేగాని అబ్బికి పిల్లనివ్వరు.

అగ్ని —డబ్బు ఖర్చులేకుండా వెంకడికి యలా పెళ్లిచేస్తానో నువ్వేచూతువుగాని. రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లుగార్ని యెరుగుదువా?

కరట — యరగను.

అగ్ని — అయ్న లక్షాధికారి. పద్దెనిమిది వందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులూ పెడతారష. పెళ్లి మావైభవంగా చేస్తారష, మనం పిల్లని తీసికెళ్లి వాళ్లింటే పెళ్లిచెయ్యడం, మనకి తట్టుబడి అట్టే వుండదు. ఆపద్దెనిమిది వొందలూపెట్టి వెంకడికి పెళ్లిచేస్తాను.

వెంకమ్మ — పెళ్లికొడుక్కెన్నేళ్లు?

అగ్ని— యెన్నేళ్లైతేనేవిఁ? నలభైయ్యయిదు.

గిరీశం —లుబ్ధావదాన్లుగారు మాపెత్తల్లి కొడుకండి, తమతో సమ్మంధవంటే నాకు సంతోషవేఁగానండి. ఆయనకి అరవ య్యేళ్లు దాటాయండి, యీడేవఁయినా సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం, డామిట్! యంత మాత్రమూ కూడదండి. నేను పూనాలో వున్నప్పుడు అందు విషయమై ఒహనాడు నాలుగంటలు ఒక్కబిగిని లెక్చరిచ్చానండి. సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పననీ తమచేతనే వొప్పిస్తాను."

కరట —బావా యీ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగెట్టేస్తాను.

అగ్ని — విళ్లమ్మా శిఖాతరగ, ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగ నాయింటజెరి నన్ననెవాళ్లె. తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకుచావండి.

వెంకమ్మ — నాతో చప్పకుండానే?

అగ్ని — ఆడముండల్తోనా ఆలోచన? యీ సమ్మంధం చైకపోతే నేను బారికరావుఁణ్ణే! (లేచివెళ్లును.)

కరట — యెంమార్ధవం.

వెంక — అన్నయ్యా! యీ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనే వున్నాం. ఆయనికి యంత యీడొచ్చినా కష్టంసుఖం వొళ్లునాటక యీ దౌర్భాగ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు. నే బతికి బాగుండాలంటే యీ సమ్మంధం తప్పించు.

కరట — గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే, వొట్టి మూర్జప గాడిదకొడుకు. యెదురు చెప్పిన కొద్దీ మరింత కొఱ్ఱెక్కుతాడు. యేం చేయగల్గుదునని నీకు భరువసా చెప్పను? యేమీ పాలుపోకుండా వుంది.

గిరీశం — అమ్మా మీరు యెందుకలా విచారిస్తారు? అవుఁధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు ఒక్కగంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లిచెయ్యడం దౌర్జన్యవఁని లెక్చరిచ్చి మనసు మళ్లిస్తాను.

వెంకమ్మ — బాబూ, అతడు మీ మానత్తకొడుకైతే మీకాళ్లు పట్టుకుంటాను, మీరువెళ్లి ఆయ్న మనస్సు మళ్లిస్తురూ. నా చర్మం చెప్పులు కుట్టియిస్తాను.

గిరీశం — అమ్మా యేం చెప్పను! వాడో త్వాష్ట్రం. పిల్లదొరకడవేఁ చాలువాడికి. యీ సమ్మంధం వొదులుకుంటే వాడికి పెళ్లేకాదు. వాడని వాడొదిలే ఘటంకాడు.

కరట — అమ్మీ నేనో ఉపాయం చెబుతాను యిలారా. (కరటకశాస్త్రి శిష్యుడు వెంకమ్మ నిష్క్రమింతురు.)

గిరీశం —మైడియర్ షేక్స్పియర్! నీ తండ్రి అగ్గిరావుఁడోయి మీ యింట్లో యవళ్లకీ అతణ్ణి లొంగదీశే యలోక్వెన్సు లేదు. నా దెబ్బ చూడు యివాళేం జేస్తానో. వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయవైఁరాసిన ఉపన్యాసం పైకితీయ్. మావఁగారికి లెక్చరివ్వడాని కత్తీ కఠారీనూరాలి.

వెంకటేశం — మిలెక్చరుమాట అలావుణ్ణిండిగాని యీవాళ నాగండం గడిచిందిగదా అని సంతోషిస్తున్నాను. మీఱ్ఱాకపోతే పరీక్ష ఫేలయినందుకు మా నాన్న పెయ్యకట్టుతాడుతో చన్ద లెక్కగొట్టును.

గిరీశం — యిలాంటి ప్రమాదాల్తప్పించు కోవడవేఁ ప్రజ్ఞ. యేవైఁనా డిఫికల్టీ వొచ్చినప్పుడు ఒక ఠస్సావేశావంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పోలిటిషనంటే మరేవిఁటనుకున్నావ్? పూజా నమస్కారాల్లేక బూజెక్కున్నాను గాని మనకంట్రీయే ఇండిపెండెంట్ అయితే గ్లాడ్సన్ లాగ దివాన్‌గిరి చలాయిస్తును. యేమి వాయ్! మీ తండ్రివైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్మిచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్నం నించి అరకట్టేతెచ్చాంగదా, యేమి సాధనం?

వెంక — నాన్నివ్వకపోతే అమ్మనడిగి డబ్బుతెస్తాను.

గిరీశం — నీబుద్ధియలా వికసిస్తూందో చూశావా? యిలా తర్ఫీదవుతుంటే నువ్వు కూడా పెద్దపోలిటిషను వవుతావు.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చమ్మ— తమ్ముడూ అమ్మ కాళ్లు కడుక్కోమంచూందిరా.

గిరీశం— (తనలో) హౌ బ్యూటిపుల్! క్వైటనెక్ స్పెక్టెడ్!

బుచ్చమ్మ— అయ్యా మీరు చల్దివణ్ణం తించారా?

గిరీశం —నాట్ది స్లెటెస్టబ్జక్షన్, అనగా యంతమాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండిదుగో వస్తున్నాను. తోవలో యేటి దగ్గిర సంధ్యావందనం అదీ చేసుకున్నాను.

(బుచ్చమ్మ వెళ్లును.)

గిరీశం— వాట్, యీమె నీ సిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే?

వెంక—మా అక్కే. జుత్తుకి చవుఁర్రాసుకోదు.

గిరీశం —తల చెడ్డం అంటే, విడో అన్నమాట. చవుఁరు గివుఁరూ జాంతే నయ్. గాని యిన్నాళ్లాయి. నీకు విడో మారేజి విషయవైఁ లెక్చరిస్తూవుంటే యీ కథ యెప్పుడూ చెప్పావుకావు? మీ యింట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో వుందటోయ్! యేమి దురవస్థ! మైహార్ట్' మెల్ట్స్. నేనే తండ్రినైతే యీ పిల్లకి విడోమారియెజేసి శాశ్వితమైఁన కీర్తి సంపాదిస్తును. (తనలో) యేమి చక్కదనం, యీసొంపు యక్కడా  చూళ్లేదే! పల్లిటూరు వూసు పోదనుకున్నానుగాని పెద్ద కాంపెనుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం.

వెంక— మా నాన్న నాక్కూడా పెళ్లి చాస్తాడు.

గిరీశం — యీ వాళో పెద్ద పెళ్లినీకు తలవెంట్రుకంత వాసి తప్పిపోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే, యిహ నిజవైఁన పెళ్లా? యింతచదువూ చదువుకుని నీతండ్రి కుదిర్చిన యేవీఁ యరగని చిన్న పిల్లకా పుస్తె కడతావ్? మాంచి యెఱ్ఱగా బుజ్జిగా వున్న యంగ్విడోని నువ్ పెళ్లాడకపోతే ఐషుడ్బి యషేమ్డ్ ఆఫ్‌యూ!

💰

సశేషం

కన్యాశుల్కము - 5

ద్వితీయాంకము

స్థలము. దేవాలయం

[పువ్వుల తోటలో మండపంమీద కూచుని, శిష్యుడు ప్రవేశించును.]

శిష్యుడు — ఆర్నెల్లకోమాటు పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు పాత శ్లోకాలు ఒక్కలా గ్కనపడతాయి. యిప్పుడు కొత్త శ్లోకం కనుక్కొమ్మంటే నాశక్యవాఁ? సిద్ధాంతి నెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కొవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పియె శ్లోకం కనపడితే అ శ్లోకం చదువుతాను.

“మృగాః ప్రియాళు ద్రుమమంజరీణాం”

యిదేదో చదివిన జ్ఞాపకం లీలగా వుంది. లేళ్లు పరిగెత్తాయని కాదూ? యేం గొప్ప మాట చెప్పాడోయి కవి! లేళ్లు పరిగెత్తితే యవడిక్కావాలి. పరిగెత్తకపొతే యవడి క్కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయ్ కావా, నక్కలు పరిగెత్తుతున్నాయ్ కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశీ కట్టడం కాళిదాసుకే తెలుసును? తెల్లవాడిదా మహిమ! యెపట్నం యెక్కడుందో, యెకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని; నిలుచున్న పాట్‌ను చెబుతాడు.

"ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ"

ముద్దెట్టు కున్నాడటోయి ముండాకొడుకు. ముక్కట్టు కున్నాడు కాడూ?

[కరటకశాస్త్రి శిష్యుడికి కనపడకుండా వెనుకనుంచి ప్రవేశించును.]

“వర్ణ ప్రకర్షే సతి కర్ణికారం । 

ధునోతి నిర్గం ధతయాస్మచేతః" ॥

యిదికూడా చదివినట్టె వుందొయి, ఆపువ్వెదొ కవికిష్టంలెదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు! మా గురువుగారికి దొండకాయ కూర యిష్టం లేదు, గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరే వొండుతుంది. బతికున్నవాళ్ల యిష్ఠవేఁ యిలా యేడుస్తూంటే చచ్చినవాడి యిష్టాయిష్టాల్తో యేంపని? యీ చదువిక్కడితో చాలించి గిరీశంగారి దగ్గిర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. వెంకడికి యింగిలీషొచ్చునని యేం గర్రాగా వుంది?

కరట — యెవిఁట్రా అబ్బీ అంటున్నావు?

శిష్యు— యెదో నాస్వంత ఘోష.

కరట— గురువునిగదా, అదేదో నాకూ కొంచెం చెబుదూ.

శిష్యు— చప్పడానికేవుఁందండి? నాటకంలో నాచాత వేషం కట్టించి పెద్దచాంతాళ్లలాంటి హిందూస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని నాకు నాల్రోజులి కోశ్లోకం చెప్పడానికి శ్రద్ధలేదు గదా? పట్నంవొదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వొచ్చినప్పుడు మరేం వూసుపోక "పుస్తకం తియ్యంటే" సంస్కృతం యెంవఁచ్చేని?

కరట— యిటుపైన్చూడు యలా చెబుతానో, రోజుకి నాలుగేసి శ్లోకాలు చెబుతాను. కొత్త శ్లోకం చదువు.

శిష్యు —

“అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా ! హిమాలయో నామ నగాధిరాజః॥

కరట — మొదటి కొచ్చావేం?

శిష్యు— మొదలూకొసా వొక్కలాగే కనపడుతూంది.

కరట— (నవ్వి) పోనియ్, మొదణ్ణించే చదువుదాం.

శిష్యు— చదివినా యేంలాభవుఁంది. యీ శ్లోకం శుద్ధ అబద్ధంట.

కరట— యవరుచెప్పారు?

శిష్యుడు —గిరీశంగారు.

కరట— యెంచెప్పాడు?

శిష్యు— హిమాలయం రెండు సముద్రాలకీ దాసి, రూళ్ల గఱ్ఱలాగలేదట. మాపులో చూపించాడు.

కరట — హిమాలయం శిగగోశిరిగాని. ఆ పుస్తకం ముణిచి నామాట విను.

శిష్యు— చిత్తం (పుస్తకం మూయును.)

కరట— చదువన్న దెందుకు, పొట్ట పోషించుకోడానిగ్గదా?

శిష్యుడు— అవును.

కరట— యీ రోజుల్లో నీ సంస్కృత చదువెవడి క్కావాలి?

శిష్యు— దరిద్రుల క్కావాలి.

కరట— బాగా చెప్పావు. నీకు యింగ్లీషు చదువుకోవాల్నుందో?

శిష్యు— చెప్పించే దాతేడీ?

కరట —నేను చెప్పిస్తాన్రా.

శిష్యుడు — నిజంగాను?

కరట —నిజంగాన్రా, గాని ఒక షరతుంది.

శిష్యు— యెవిఁటండి?

కరట— నాకో కష్టసాధ్యమైన రాచకార్యం తటస్థించింది. అది నిర్వహించి నువ్ చేసుకురావాలి.

శిష్యు— నావల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా?

కరట— యీ రాచకార్యం నీవల్లే కావాలి. మరెవడివల్లా కాదు. అదేవిఁటంటె, ఓ పది రోజులు నువ్వు ఆడపిల్లవైపోవాలి.

శిష్యు— గణియం పట్ణంలోవుండి పోయిందే?

కరట — అట్టే గణియం అవసరంలేదు. నీకు తలదువ్వి, కోకకడితే పజ్యండేళ్ల కన్నెపిల్లలా వుంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావుధానికి పెళ్లి చేస్తాను. నాలుగు పూటలు వాళ్లింట నిపుణతగా మెసిలి, వేషం విప్పెశి పారిపోయిరా. నిజవైఁన పెళ్లి ముహర్తం చాలా వ్యవధుంది.

శిష్యు —యిదెంతపని.

కరట —అలా అనుకోకు. అతి చేస్తి వట్టాయనా, అనుమాన పడతారు. పట్టుబడ్డావంటే పీక తెగిపోతుంది.

శిష్యు— మీకా భయంవొద్దు.

కరట— నువ్వునెగ్గుకొస్తే, మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను.

శిష్యు— అలా ప్రమాణం చెయ్యండి.

కరట— యిదుగో యీ పుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను.

శిష్యుడు — యీ పుస్తకంమీద నాకు నమ్మకం పోయింది. మరోగట్టి ప్రమాణం చెయ్యండి. గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం పట్టుకురానా?

కరట— తప్పితే భూమితోడ్రా.

శిష్యు— మీరు యగేస్తే భూవేఁం జేస్తుంది? మీ మాటేచాలును కానీండి.

📖

స్థలము. అగ్నిహోత్రావధాన్లు యింటి యదటివీధి

(గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]

వెంక— రాత్రి కన్యాశుల్కం మీద లెక్చరిచ్చారా?

గిరీశం— లెక్చరేవిఁటోయ్. ధణుతెగిరిపోయింది. మీతండ్రి మైరావణ చరిత్రోయ్. మీ అంకుల్ కరటకశాస్త్రి స్కౌండ్రల్లా క్కనపడుతున్నాడు.

వెంక— యేం జరిగిందేం జరిగిందేవిఁటి?

గిరీశం— విను. రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టాడోయి మీ మావఁ. సబ్జెక్టు నేను కొంచం యెత్తగానే తనుకూడా గట్టిగా సపోర్టు చేస్తా నని ప్రోమిస్కూడా చేశాడు. నీ తండ్రి వైఖరీ చూస్తే మాత్రం కొంచం ధైర్యం వెనకాడి నాలిక్కొన కొచ్చిన మాట మళ్లీమణిగి పోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే వేళకి యిక టైమ్మించి పోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్షన్ రెండు సెంటెన్సులు యింకా చెప్పనే లేదు నాలుగు యింగ్లీషు మాటలు దొల్లాయోయ్ దాంతో నీ తండ్రి కళ్లెఱ్ఱజేశి "యీ వెధవ యింగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం చెడిపోతూంది; దేవభాషలాగ భోజనాల దగ్గిరకూడా ఆ మాటలే కూస్తారు; సంధ్యావందనం శ్రీసూక్త పురుషసూక్తాలూ తగలబడిపోయినాయి సరేగదా?" అని గట్టిగాకేకవేసి చెప్పేసరికి నేను కొంచంపస్తాయించి "థ్రోయింగ్ పెర్ల్స్ బిఫోర్ స్వెన్" అనుకొని కరటక శాస్త్రుల్లు వైపు చూసేసరికి యెంచేస్తూన్నాడనుకు న్నావ్? రాస్కేల్ వులకలేదు పలకలేదు సరేకదా మొహం పక్కకి తిప్పి కడుప్పగిలే టట్టు నవ్వుతున్నాడు. యిక లెక్చరు వెళ్లిందికాదు సరేకదా, నోట్లోకి ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింత యిన్సల్టు జరిగింతరవాత తక్షణం బయలుదేరి వెళ్లిపోదావఁనుకున్నాను.

వెంక— అయ్యో వెళ్లిపోతారా యేవిఁటి?

గిరీశం —నాటింది లీష్టు. కొసాకీవిను, నీ తండ్రిని పోకెట్లో వేశాను.

వెంక —నా తండ్రికి లెక్చరిచ్చి పెళ్లి తప్పిస్తావఁన్నారే?

గిరీశం —పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాద్ బానర్జీ వచ్చి చెప్పినా నీ తండ్రి యీ పెళ్లిమానడు. లెక్చర్లు యంతసేపూ సిటీల్లోనేగాని పల్లెటూళ్లలో యంతమాత్రం పనికిరావు. పూనాలాంటిసిటీలో లెక్చర్ యిచ్చావఁంటే టెంథౌజండు పీపుల్ విండానికి వొస్తారు. మన టౌన్లోనో, పెద్ద మీటింగులు చెయ్యాలంటే, డప్పులు బజాయించి, నోటీసులు కట్టి, బజార్లు కాసి, తోవంట పోయేవాళ్లని యీడ్చుకు వొచ్చినా, యాభై మందికారు. పల్లెటూరి పీపుల్ లెక్చర్లకి అన్ ఫిట్. మొన్న మనం వొచ్చిన బండీవాడికి నాషనల్ కాంగ్రెస్ విషయవైఁ రెండు ఘంటలు లెక్చరు యిచ్చేసరికి ఆగాడిద కొడుకు, వాళ్లవూరు హెడ్ కానిస్టేబుల్ ని కాంగ్రెసువారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు! విలేజస్‌లో లెక్చర్లు యంత మాత్రం కార్యంలేదు. నీ తండ్రి దగ్గిర మాత్రం లెక్చరన్నమాట కూడా అనకూడదు.

వెంక— అయితే, నాన్నని యలాగ జేబులో వేశారేవిఁటి?

గిరీశం— అది పోలిటిక్సు దెబ్బోయ్! ఆ తరవాత కథవిను. నామీద కాకలేసిన తరవాత కోపవఁణక్క, ధుమధుమ లాడుకుంటూ, పెరుగూ అన్నం కుమ్మడం ఆరంభించాడు. ఇంతలో మీ అప్ప వొచ్చి గుమ్మం దగ్గిర నిలబడి కోకిలకంఠంతో “నాన్నా తమ్ముడికి పెళ్లిచెయ్యాలంటే నా సొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండిగాని దాని కొంప ముంచి లుబ్ధావుఁధాల్లుఁకి యివ్వొద్దని" చెప్పింది. దాంతో నీ తండ్రికి వెఱికోపం వొచ్చి వుత్తరాపోసనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నంతో విస్తరితీసికెళ్లి దాన్నెత్తిని రుద్దేశాడు! కరటక శాస్తుల్లు అడ్డుపడబోతే  చెంబుతొ నీళ్లు వాడినెత్తిం దిమ్మరించాడు. కరటక శాస్త్రుల్లుకి కోపంవొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ్లవూరెళ్లిపోయినాడు.

వెంక— దీనిపేరెనా యేవిఁటి మా నాన్నంజేబులో వేసుకోవడం?

గిరీశం —పేషన్స్! కొసాకీవిను. స్కౌండ్రల్ కరటక శాస్తుల్లు వెళ్లిపోయినాడని సంతోషించానుగాని, నీ సిస్టర్ ఫేట్ విషయవైఁ మహా విచారవైఁంది. నేనే దాని హజ్బెండ్నెవుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్‌తో షూట్ చేశివుందును. మీ అమ్మ యేడుస్తూ ఒకమూలకూచుంది. అప్పుణ్ణే వెళ్లి, నీళ్లపొయిలో నిప్పేసి, నీళ్లు తోడి, నీ సిస్టర్ని స్తానం చెయమన్నాను. సిగర్సు కాల్చుకుందావఁని అరుగుమీద నేను బిచాణావేసేసరికి, నీ తండ్రికి పశ్యాత్తాపం వొచ్చి, తానూ ఆ అరుగుమీదే బిచాణా వేసి, ఒక్క సిగరయినా కాల్చనియ్యకుండా రాత్రల్లా కబుర్లలో పెట్టి చంపాడొయ్. మొత్తానికి కత్తు కలిపేశాను.

వెంక — యాలాక్కలిపారేవిఁటి?

గిరీ — ఒక పొలిటికల్ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను.

వెంక — యెవిఁటండా అస్త్రం?

గిరీ — ఒకడు చెప్పిందల్లా మహా బాగుందండవేఁ. సమ్మోహనాస్త్రవఁంటే అదేకదా?

వెంక — లెక్చరిచ్చి మా తండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే వొప్పుకున్నారూ?

గిరీ — కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మారియేజి కూడుననే తోస్తూంది.

వెంక— యిన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి?

గిరీ — ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చెస్తూంటేనేగాని పోలిటిషను కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు విన్నావా? యిన్ఫెంటు మారేజీలు అయితేనేగాని, యంగ్ విడోజ్ వుండరు. యంగ్ విడోజ్ వుంటేనేగాని, విడో మారియేజ్ రిఫారమ్ కి అవకాశం వుండదుగదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మారియేజ్ అయినప్పుడు, యిన్ఫెంటు మారేజీల్లేకపోతే, సివిలిజేషన్ హాల్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంటు మారేజి చెయ్యవలసిందే. యిదివొహ కొత్త డిస్కవరీ; నంబర్ టూ, చిన్నపిల్లల్ని ముసలాళ్లకిచ్చి పెళ్లిచెయ్యడం కూడా మంచిదే అనినేను వాదిస్తాను.

🪙

సశేషం

*కన్యాశుల్కము - 6*

*ద్వితీయాంకము*

వెంక— సుబ్బిని లుబ్ధావుఁధాన్లకి యివ్వడం మంచిదంటారా యెవిఁటి? అమ్మ ఆ సమ్మంధం చేస్తే నూతులో పడతానంటూందే?

గిరీ— ఫెమినైస్స్ ఫూల్స్ అన్నాడు. "పడుపడు అన్న నా సవితేగాని పడ్డనాసవితి లేదంది" టెవర్తోను. నూతులో పడడం గీతులోపడడం నాన్సన్స్, ఓ రెండు తులాల సరుకోటి మీనాన్నచేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆ మాట మానేస్తుంది. గాని నా ఆర్గ్యుమెంటు విను.

వెంక— యేవిఁటండి?

గిరీశం — పెళ్ల`నే వస్తువ, శుభవాఁ అశుభవాఁ? మంచిదా చెడ్డదా? చెప్పు.

వెంక— మంచిదే.

గిరీశం — వెరిగుడ్! పెళ్లనేది మంచి పదార్థవైఁతే "అధికస్య అధికం ఫలం" అన్నాడు గనక చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లిచేసి, వాడుచస్తే మరోడికి, మరోడు చస్తే మరోడికి, యిలాగ పెళ్లిమీది పెళ్లి, పెళ్లిమీద పెళ్లి అయి, వీడి దగ్గిరో వెయ్యి, వాడిదగ్గిరో వెయ్యి, మరోడి దగ్గిర మరో వెయ్యి, రొట్టెమీద నెయ్యి, నేతిమీద రొట్టె లాగ యేకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధివఁంతుణ్ని చూసి పెళ్లాడితే చెప్పావ్ మజా? ఇహ సౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహ సౌఖ్యం వుంటే పరసౌఖ్యం కూడా సాధించావేఁ అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజ్ మెంటు హక్కు యష్టాబ్లిష్ అవుతుంది.

వెంక— కన్యాశుల్కం కూడా మంచిదంటున్నా రేవిఁటి?

గిరీశం — మరేవిఁటనుకున్నావ్? నెవ్వర్డూ బైహావ్స్ అన్నాడు చేస్తే శుద్ధక్షవరవేఁగాని తిరపతి మంగలాడి క్షవరం చెయ్య కూడదు. యీ అస్త్రంతోటే మీతండ్రి వశ్యం అయినాడు. యింగ్లీషువాడు "థింక్" అన్నాడోయి. ఆలోచిస్తేగాని నిజం బోధ పడదు. బాగా ఆలోచించగా, కన్యాశుల్కం లేని మారేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా?

వెంక— యెలాగండి?

గిరీశం — అలా అడగవోయి. యేం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్కవఁయిందేం? యిన్ని తులాలు బంగారం పెట్టాలి. యింత వెండిపెట్టాలి అని రూపాయిలకి బదులుగా వెండి బంగారాల కింద దానం లాగితే, కన్యాశుల్కం అయిందికాదేం? యీ పెద్ద పెద్ద పంతుళ్ళవారంతా యిలా చేస్తున్నవారేనా?

వెంక—అవును

గిరీశం — ఇక దొర్లలోనో? వాళ్లతస్సా గొయ్యా, యిల్లుగుల్ల చెస్తారొయి; అవి గుడ్డలుకావు, అవి శెంట్లు కావు, అవి జూయల్సు కావు, మారేజి సెటిలుమెంటని బోలెడు ఆస్తి కూడా లాగుతారు. యీ ఆర్గ్యుమెంటు నేను చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానందభరితుడైనాడు. లుబ్ధావుఁధాన్లు పెళ్లికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు చెప్తాను విను.

వెంక— యెవిఁటండి.

గిరీ— లుబ్ధావుఁధాన్లు ముసలాడూ, బంగారప్పిచికానున్ను. రెండేళ్లకో మూడేళ్లకో అమాంతంగా బాల్చీ తన్నేస్తాడు. అనగా "కిక్స్ ది బకెట్." దాంతో నీ చెల్లెలు రిచ్చి విడో అవుతుంది. నువ్వు పెద్దవాడివైన తరవాత దానికి విడో మారియేజి చేసి శాశ్వతవైఁన కీర్తి అతిసులభంగా సంపాదించవచ్చును. యెవఁంటావ్?

వెంక— అవును.

గిరీశం — మరో గొప్పమాట యీ సంబంధం అయితే నీకూనాకూ సంబంధం కలుస్తుందోయి.

వెంక— అదినాకిష్ట వేఁ.

గిరీశం — రాత్రి నీ తండ్రి నీకు హైకోర్టు వకాల్తీదాకా చదువు చెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాలమాట కదిపాను గాని, పెళ్లి నుంచి వచ్చింతరవాత యిస్తానన్నాడు. యీలోగా చుట్టముక్కల్లే కపోతే గుడ్లెక్కొస్తాయి. సిగర్సు కోసం కాపర్సేవఁయినా సంపాదించావాలేదా?

వెంక— లేదు. యీ వుదయవఁల్లా అమ్మ ధుమధుమలాడుతూనే వుంది. మా నాన్న పొడుం కోసం కొట్లో నిలవచేసిన పొగాకు లోది వోకట్ట వోణీలో దాచి తీసుకొచ్చాను.

గిరీ— దటీజ్పోలిటిక్స్! మరియింతసేపూ చెప్పావుకావేం? చుట్టల్చుట్టుకుని యీ కోవిల గోపురంలో కూచుని కాల్చుకుందాం రా!

వెంక— కోవిల్లో చుట్టకాల్చవొచ్చునా?

గిరీ— కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీని పొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల? యేదీ కట్ట యిలాతే (కట్ట అందుకొని వాసనచూసి) ఆహా! యేవిఁ పొగాకోయి! నిజంగా కంట్రీలైఫులో చాలా చమత్కారంవుంది. బెస్టు టోబాకో, బెస్టు గేదె పెరుగు, మాంచి ఘీ. అంచేతనేనోయ్ పోయట్సు కంట్రీలైఫ్ కంట్రీలైఫ్" అని దేవులాడుతారు.

వెంక— మీరూ పోయట్సేగదా?

గిరీ— అందుకభ్యంతరవెఁవిఁటి? నాకూ కంట్రీలైఫు యిష్టవెఁగాని సివఁలొలాగ బ్యూటిఫుల్ షెపర్డెస్లూ, లవ్ మేకింగూ వుండదోయ్. గ్రాస్ గర్ల్స్ తగుమాత్రంగా వుంటారుగాని, మా డర్టీ స్మెల్? అదొహటిన్నీ మనదేశంలో మెయిడన్సు వుండరోయి. యంతసేపూ లవ్మేకింగ్ విడోజ్కి చెయ్యాలిగాని మరి సాధనాంతరంలేదు.

వెంక— మీరు విడోమీద చేసిన పోయిట్రీ రాసియిస్తానని యిచ్చారుకారు గదా?

గిరీ— అడగ్గానే యిస్తే వస్తువ విలవ తగ్గిపోతుంది. అదోహటిన్నీ, మజ్జెండేళ్లు పోతేనేగాని దాని రసం నీకు బాగా బోధపడదు. అయినా స్పెషల్కేసుగా నీకు ఉపదేశం చేస్తాను. నోటుబుక్కు తీసిరాయి.

(గిరీశం చుట్ట కాలుస్తూ, మధ్య మధ్య చుట్టచేత పట్టి, ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం వ్రాసును.)

THE WIDOW.

She leaves her bed at A.M. four, And sweeps the dust from off the floor. And heaps it all behind the door,

The Widow!

Of wondrous size she makes the cake. And takes much pains to boil and bake, And eats it all without mistake,

The Widow!

Through fasts and feasts she keeps her health. And pie on pie, she stores by stealth, Till all the town talk of her wealth,

The Widow!

And now and then she takes a mate, And lets the hair grow on her pate, And cares a hang what people prate.

The Widow!

I love the widow however she be, Married again or single free.
Bathing and praying
Or frisking and playing.

A model of saintliness,
Or model of comeliness,
What were the earth,
But for her birth?

The Widow!

యిది నేను రిఫార్మర్లో అచ్చువేసేటప్పటికి టెన్నిసన్ చూసి గుండెకొట్టుకున్నాడు. చుట్టతాగడం సమాప్తంచేశి యింటికి పొదాంరా చాలాసేపైంది.

(నాలుగడుగులు యిద్దరూ నడిచేసరికి అగ్నిహోత్రావుఁధాన్లు కలియును.)

అగ్ని— ఏవఁండీ -హనుమాన్లు గారూ- మీపేరేవిఁటండీ!

గిరీ— గిరీశం అంటారండి.

అగ్ని— అదుగో, గిరీశంగారూ రాత్రి మనవఁనుకున్న ప్రకారం మనదావాలు గెలుస్తాయనే మీ అభిప్రాయవాఁ?

గిరీ— గెలవకపొతే నేను చెవి కదపాయించుకు వెళ్లిపోతాను. మీ వూహపోహలు సామాన్యవైఁనవా? అందులో "యతోధర్మ స్తతోజయః" అన్నట్టు న్యాయం మీ పక్షం వుంది. బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్పూర్ హైకోర్టు తీర్పొహటి మనకి మహా బలంగావుంది. మా పెత్తండ్రిగారు యిలాంటి కేసే ఒహటి యీ మధ్య గెలిచారండి.

అగ్ని— దీని కల్లా అసాధ్యం యీకేసు కాకినాళ్ళో తేవల సొచ్చింది. మా కరటక శాస్తులని పంపిస్తే యవడో చవటవకీల్ని కుదిర్చాడు. వొడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడవేఁగాని కేసుభోగట్టా యేవీఁ రాయడు. గడియ గడియకీ వెళదావఁంటె దూరాభారం గదా?

గిరీ— మీశలవైతే స్టీమరుమీద నేను వెళ్లి ఆ వ్యవహారవఁంతా చక్కబెట్టుకువస్తాను. మాపెత్తండ్రిగారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడరు, ఆయనపట్టిన కేసు యన్నడూ పోయిందన్నమాట లేదండి.

అగ్ని— మీరు వెళితే నేను వెళ్లినట్టే. యంత ఫీజయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీ యిద్దాం. యావఁంటారు?

గిరీ—మీదగ్గిర ఫీజు పుచ్చుకోవడం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే, ఫీజ క్కర్లేకుండానే పని చేయిస్తానండి..

అగ్ని— మిరలా అంటార న్నెనెరుగుదును. గాని గెలిచింతరవాత మనకితొచిన బహుమతి యిద్దాం.

గిరీ — యిచ్చినాసరె యివ్వకపోయినా సరేనండి.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చమ్మ — నాన్నా! అమ్మ స్తానానికి లెమ్మంచూంది.

అగ్ని— అలాగే. (బుచ్చమ్మ వెళ్లిపోతూండ గా గిరీశం కేగంట చూసును.) భోజనం చేశిన తరవాత కాయితాలు మీ చేతికిస్తాను; అవన్నీ సావకాశంగా చూడండి, మాయింటితూరు ప్పొరుగు రావాఁవుధాన్లుమీద మందడిగోడ విషయమై మనంతెచ్చినదావా, లంచం పుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జీ కోర్టులో అప్పీలుచేశాం, మా వకీలు అవతల పార్టీ దగ్గిర కతికి మనకేసు ధంసంచేశాడు. మీవంటివారు నాకు చెయ్యాసరావుంటే రావాఁవుధాన్లు పిలకూడదీసేదును—కానిండిగాని తూర్పు మందడిగోడ రావాఁవుధానిదయితే, పడవఁటి మందడి గోడ మందవాల్నా లేదా? న్యాయం చెప్పండి. చూడండీ దానిమీద యలా కొంజాయెత్తాడో! క్రిమినల్నడిపించమని భుక్తసలహాచెప్పాడు.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చ— నాన్నా! అమ్మ స్తానం చెయ్యమంచూంది.

అగ్ని— వెధవముండా సాద! పెద్దమనుష్యుల్తో వ్యవహారం మాట్లాడుతూంటే రామాయణంలో పిడకల వేట్లాటలాగ అదే పిలవడవాఁ!

గిరీ — తప్పకుండా క్రిమినెల్కేసు తావలశిందే, క్రిమినల్ ప్రొశిజ్యూర్ కోడు 171 శక్షన్ ప్రకారం తెద్దావాఁ? 172డో శక్షన్ ప్రకారం తెద్దావాఁ?

అగ్ని— రెండు శక్షన్లూ తాలేవేఁం?

గిరీ- నేరంగలప్రవేశం, ఆక్రమణ రెండు శక్షన్లుకూడా ఉపచరిస్తాయి సరేగదా కళ్లతో చూశాను గనుక యీగోడ మీదయినట్టు జల్లిలైగబొడిచి సాక్ష్యంకూడా పలగ్గలను. యీగోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది.

అగ్ని- అందుకు సందేహవుందండీ. యేమరిచి యిన్నాళ్లు వూరుకున్నాను. పెరటిగోడ కూడా చూతురుగానండి. అక్కాబత్తుడిముక్కు నులిపి గెల్చుకున్నా ను. కాని యీదావాల కింద  సిరిపురం భూవిఁ అమ్మెయ్యవలసి వొచ్చిందండి, రావాఁవధాన్లుకేసు కూడా గెలిస్తే, ఆ విచారం నాకు లేకపోవును.

(అందరు నిష్క్రమింతురు.)
🪙
*సశేషం*